జ్ఞాపక చిత్రం

 చదువరి

జ్ఞాపక చిత్రం
-శృంగవరపు రచన
(భూతం ముత్యాలు గారి 'మాలచ్చువమ్మ' నవలా సమీక్ష)





జ్ఞాపకాలు లేని జీవితం ఏ జీవికి ఉండదు. మనుషుల జీవితాన్ని ఒక చిత్రంగా చేసేవి జ్ఞాపకాలే.ఆ జ్ఞాపకాలు అస్తిత్వానికి,మనుషుల జీవితాల్లోని సంఘర్షణలకు సాక్ష్యం. ఓ మనిషి జీవితంలో పుట్టుక నుండి మరణించేవరకు ఎన్నో అనుభవాలు,ఎన్నో వ్యథలు,ఎన్నో ఆకస్మిక ఘటనల సమాహారాలు.అటువంటి జ్ఞాపకాల జీవిత చిత్రణే భూతం ముత్యాలు గారి 'మాలచ్చువమ్మ' నవల.
ఈ నవలలో ఓ స్త్రీ జీవితం ఆమె పుట్టినప్పటి నుండి మొదలై ఆమె మరణంతో ముగుస్తుంది. ఆమె పుట్టినప్పుడు ఉన్న అస్థిరత్వం,ఆమె పెరుగుతున్నప్పుడు నేస్తాలు,పెళ్ళి-పిల్లలు,చివరకు ఆమె ప్రశాంతంగా మరణించడం వరకు ఈ నవల సాగుతుంది.ఈ నవలలో ఆమె పుట్టి,పెరిగిన కుల ఆచారాలు,సాంప్రదాయాలను కూడా కథతో పాటు తీర్చిదిద్దుతూ నవలలో ఓ సజీవత్వం నింపారు రచయిత.
మాలచ్చువమ్మ తండ్రి లచ్చుమయ్య.అతనికి,అతని భార్యకు మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి.అప్పటికే మాలచ్చువమ్మ సంవత్సరం బిడ్డ. లచ్చుమయ్య తల్లిదండ్రులు దుర్గమ్మ,పెందులు.రజాకార్లు సాయుధ పోరాటాలు చేస్తున్న వారి కోసం వెతుకుతున్న సమయంలో లచ్చుమయ్యను అనుమానించి, కొట్టిన దెబ్బలకు అతను మరణిస్తాడు. అతని భార్య అతని మరణం తర్వాత తన బిడ్డను లచ్చుమయ్య తల్లిదండ్రులకు వదిలేసి,మారుమనువు చేసుకుంటుంది.
నాటి నుండి ఆమె బాధ్యతను దుర్గమ్మ,పెందులు తీసుకుంటారు.దుర్గమ్మ కూతురు లచ్చుమవ్వను తన బిడ్డతో పాటు సాకుతుంది.అలా అక్కడ పెరుగుతూ ఉంటుంది ఆమె. తర్వాత మాలచ్చువమ్మకు పదేళ్ళు వచ్చే సమయానికి ఆమెను చూడాలని ఆమె తల్లి కోరుకోవడం వల్ల ఆమె మేనమామలు ఆమెను ఆమె తల్లి దగ్గరకు తీసుకువెళ్ళడం,ఆ తర్వాత ఆమె పెద్ద మనిషి అవ్వడం,దానికి అన్నీ పంపినా ముఖం చెల్లక ఆమె తల్లి రాదు.
తర్వాత మాలచ్చువమ్మను అదే ఊరిలోని షావుకారు దగ్గర జీతానికి పని చేస్తున్న మల్లయ్యకి ఇచ్చి ఇస్తారు.అతను రెండో పెళ్ళి వాడు.ఆ తర్వాత కాలక్రమంలో వారికి ఓ కొడుకు జోగులు పుడతాడు.అతనికి సరోజతో పెళ్ళవుతుంది. సంతృప్తికరంగా ఉన్న తన జీవితంలో తన పూర్వీకుల సమాధుల దగ్గరకు తనను తీసుకువెళ్లమని కొడుకును అడిగి అక్కడికి వెళ్ళి అక్కడే తన ప్రాణాలు విడుస్తుంది మాలచ్చువమ్మ.
ఈ కథలో ఆడపిల్లలకు బాల్యంలో ఉండే మంచి అనుభూతులు.ఆర్థిక మరియు ఏ ఇతర కారణాలు ప్రభావితం చేయలేని స్వచ్చమైన స్నేహ జాడలు,నాయనమ్మ-తాతయ్యలు తమ మనవళ్ళు,మనవరాళ్ళపై చూపే ప్రేమ,ఆపేక్ష వంటి వాటితో కూడా కలిసి పాఠకులు ఈ నవలతో పాటు ప్రయాణం చేస్తారు.
ఇది సాధారణ జీవిత కథే అయినా,సాధారణత్వంలో ఉన్న ఎన్నో సాధారణ అనుభూతులలో,అనుభవాలలో ఉన్న జీవిత సహజత్వాన్ని రచయిత చక్కగా చిత్రీకరించారు.కథాంశంలో ఉన్నది ఓ అమ్మాయి కథే అయినా ఆమె చుట్టూ ఉన్న కుటుంబ,సమాజ పోకడలను కూడా రచయిత నిర్మిస్తూ,వాటిల్లో నాయికను భాగం చేశారు.దీని వల్ల ఓ కథ చదువుతున్న భావనా కన్నా కూడా ఆ పరిస్థితుల్లో ఉన్న భావనే పాఠకులకు కలుగుతుంది.
ఈ నవలలోని బాషా నైపుణ్యం రచయితకు వివిధ మాండలికాల మీద ఉన్న పట్టును స్పష్టం చేస్తుంది. మనుషులు తాము పుట్టిన పరిసరాల్లో తమను తాము ఇముడ్చుకుంటారు. అలానే రచయిత కూడా తాను ఎన్నుకున్న కథావస్తువులోనే కాకుండా,కథా వాతావరణంలో కూడా పాఠకులను పట్టి ఉంచగలగాలి. దానికి ఆ కథా పాత్రల బాషలోని సహజత్వం,వారి ప్రవర్తనలో వివిధ దశల్లో ఉండాల్సిన లక్షణాలు కూడా సహజంగానే ఉండాలి.ఆ సహజత్వాన్ని సాధించి ఈ నవలను కథా ప్రాధాన్యత తో పాటు,నేపథ్య ప్రాధాన్యత ఉన్న నవలగా కూడా ఉండేలా రచయిత జాగ్రత్త తీసుకున్నారు.
ఈ నవలలో ముఖ్యంగా మాలచ్చువమ్మ తండ్రి మరణించినప్పుడు,అతని కూతురైన మాలచ్చువమ్మను అతని శరీరం చుట్టూ తిప్పి బ్రతికించే ప్రయత్నం చేయడం లాంటివి ఆ ప్రాంతంలో ఉన్న ఆచార వ్యవహారాలను కూడా రచయిత పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. దీనితో పాటు మాలచ్చువమ్మ పెద్ద మనిషి అయినప్పుడు,ఆమె పెళ్లి సందర్భంలోనూ కూడా అక్కడి ప్రజలు వాటిని ఎలా జరుపుకుంటారో స్పష్టంగా రాశారు.చావు-పెళ్ళి,దుఃఖమైనా-సుఖమైనా ఆ వాతావరణంలో అక్కడి మనుషుల స్పందనను,దుఃఖాన్ని మర్చిపోవడానికి,సంతోషాన్ని పంచుకోవడానికి మనుషులు పాటించే వివిధ సాంప్రదాయాలను రచయిత చక్కగా రాశారు. మనుషుల మనస్తత్వాలు ఏవైనా సరే,మనుషులకు మధ్య ఉండాల్సిన మానవ తడి ఈ నవలలో స్పష్టమవుతుంది.నవల వాతావరణానికి తగ్గట్టు రచయిత వాడిన సామెతలు,పాటలు వంటివి కథానుభూతికి బలాన్ని చేకూర్చాయి.
పఠనీయతకు మూలం కథను ఆస్వాదించగలగడం.అంటే అర్ధం ఆ వాతావరణంలో పాత్రలు పాఠకులకు కనిపించడం.దానితో పాటు వారి మనసుల్లో ఉండే బాధ,సంతోషాలు పాఠకుల హృదయాలను తాకగలగడం.ఇవే కథకు సహజత్వాన్ని,సజీవత్వాన్ని చేకూరుస్తాయి.ఆ ప్రయత్నంలో సఫలీకృతమైన రచయితకు
అభినందనలు
.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ