అపసవ్య హత్యలు

 చదువరి

అపసవ్య హత్యలు
-శృంగవరపు రచన


సిడ్నీ షెల్డన్ కు ఆంగ్ల సాహిత్యంలో ఓ ప్రత్యేక స్థానముంది.దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సిడ్నీ షెల్డన్ ను నేడు సీరియస్ రచయితగా పరిగణించని వారు ఉన్నారు. కానీ ఏ స్థాయి పాఠకులనైనా ఆకర్షించే శైలి,ఉత్కంఠ,అవసరమైన మేరకే 'Human Emotional Drama' ను కథలో భాగం చేయటం ఆయన నవలలను టీనేజర్స్ నుండి వృద్ధుల వరకు చదివేలా చేస్తాయి.క్రైమ్ థ్రిల్లర్ నవలలకు ఓ శైలి, ఇంకో కోవకు చెందిన 'మానవ భావోద్వేగాలు-పరిస్థితులు' వంటి వాటిని చిత్రీకరించేటప్పుడు పాత్ర చిత్రణ-పాత్ర అవసరాలు-అవకాశాలు-ఈ క్రమంలో పాత్ర మారే సందర్భాలు (A Stranger In The Mirror నవలలో ఈ శైలి గమనించవచ్చు)వంటి వాటిని చిత్రీకరించేటప్పుడు కూడా ఊహకన్నా వాస్తవ మానవ ఆలోచనల ప్రభావాలకే ప్రాధాన్యత ఉండేలా చూసుకోవడం వంటివి ఆయనను ఎంతో మంది ఆంగ్ల నవలలు చదివే క్రమంలో మొదటి రచయితగా లేదా ప్రారంభ రచయితగా నిలబెడతాయి.నేరానికి మోటివ్ 'సంపద-కక్ష-అధికారం'వంటి వాటితో పాటు సాంకేతికతను,మారే కాలంలో వచ్చే మార్పులు తన రచనల్లో ఉండేలా చూసుకోవడం,తనను తాను నిరూపించుకునే దశలో నుండి స్త్రీల పాత్రల కేంద్రంగా కూడా ఆయన రాసిన నవలలు ఆకర్షిస్తాయి.ఏ మూడ్ లో ఉన్నా సరే చదవగలిగే రచనా శైలి షెల్డన్ ది.అటు మరి సీరియస్ గా కాకుండా,ఇటు మరి కొట్టిపారేసేలా కాకుండా మధ్యస్థ శైలిలో ఉండే సిడ్నీ షెల్డన్ శైలి పాఠక లోకాన్ని ఎప్పటికి సమ్మోహనపరుస్తూనే ఉంది.ఆయన తర్వాత,ఆయనతో పాటు ఎంతో మంది సమకాలికులు థ్రిల్లర్స్ రాసినా,అందుకు విభిన్న అంశాలు ఎన్నుకున్నా సరే సిడ్నీ షెల్డన్ శైలి లో కథలో మలుపుల వేగాన్ని అనుకరించగలిగారే కానీ కథ చిత్రీకరణలో గాఢతను ఎవరు అలా అనుకరించలేకపోయారు అన్నది సత్యం. సిడ్నీ షెల్డన్ 2007 లో మరణించాక ఆయన పేరుతో టిల్లి బాగ్షా అనే బ్రిటన్ రచయిత్రి ఆయన పేరు మీద నవలలు కొనసాగిస్తూ ఉంది.ఆమె దాదాపుగా సిడ్నీ షెల్డన్ శైలిలోనే రాయడం వల్ల ఆమెకు అలా రాయడానికి షెల్డన్ కుటుంబ సభ్యుల నుండి అనుమతి లభించింది. ఆమె దాదాపు షెల్డన్ పేరు మీద ఇప్పటికే పది పుస్తకాల దాకా రాసింది. అందులో ఈ మధ్య నేను చదివిన పుస్తకమే 'Angel Of The Dark.'దాదాపు 400 పేజీలు ఉన్న ఈ నవల నేను ఆసక్తిగా చదవడానికి కారణం ఓ రచయితలా రాయడం అన్నది ఇంకో రచయితకు సాధ్యం కాదు.ఈ సందర్భంలో వ్యక్తిత్వ శైలిని పక్కన పెట్టవలసి వస్తుంది. టిల్లి బాగ్షా శైలిలో షెల్డన్ రేకెత్తించే ఉత్కంఠ ఉన్నప్పటికి షెల్డన్ రాసే శైలి లోపించినట్టు పలు చోట్లా అనిపించింది. షెల్డన్ తరువాత నేను చదివిన రచయితల్లో అంతే అర్ధమయ్యే ఆంగ్లంలో అంతే వేగంగా రాయగల రచయిత జేమ్స్ పాటర్సన్.టిల్లి బాగ్షా ను వ్యక్తిగత రచయితగా చూస్తే బాగా రాసినట్టే అనిపించినా, షెల్డన్ ను అనుకరించే ప్రయత్నంలో తనను తాను పూర్తిగా బాషా పరంగా,ఆడ-మగ మధ్య సంబంధాల చిత్రణలో తన శైలికి ప్రాధాన్యత ఇచ్చినట్టు నాకు అనిపించింది.
ఈ నవలలో పాత్ర చిత్రణల్లోనే షెల్డన్ శైలిని దాటినట్టు అనిపిస్తుంది.ఒక్క కథల మలుపుల్లో మాత్రమే షెల్డన్ ఉనికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే నవల రచయిత్రి తన శైలిలో రాసి ఉన్నా లేకపోతే షెల్డన్ పాత్రలను మరింత క్షుణ్ణంగా పరిశీలించి,దానికి తగ్గట్టు మార్పులు చేసినా శైలి ఇంకా బావుండేది.కానీ షెల్డన్ ను చదవకుండా ఇది చదివితే ఈ భావాలు ఏమి కలగవు. కనుక మీరు ఆ ప్రభావం లేకుండా చదవగలిగితే ఇది మంచి నవలే.
ఈ నవల ఓ క్రైమ్ థ్రిల్లర్. అమెరికా,లండన్,హాంగ్ కాంగ్,చైనాల్లో ధనవంతులై,మొదటి భార్యా పిల్లలను వదిలేసి,యవ్వనంలో ఉన్న యువతులను పెళ్లి చేసుకున్న మగవారిని హత్య చేసి,వారి భార్యలను క్రూరంగా రేప్ చేసి చంపుతున్న సీరియల్ కిల్లింగ్స్ ఈ నాలుగు దేశాల్లో సంభవిస్తాయి. ఒక్కో నేరానికి మధ్య రెండు,మూడేళ్ళ నుండి ఐదేళ్ల వరకు కాల వ్యత్యాసం ఉంటుంది. ఇందులో మొదటిగా మరణించింది యాండ్రు జేక్స్.అతని రెండో భార్య యెంజెలా మానభంగానికి గురి అవుతుంది.ఆ తర్వాత యెంజెలా తన పేరు మీద భర్త రాసిన ఆస్తులన్నింటిని ఓ ఛారిటీకి రాసి అదృశ్యమైపోతుంది.ఆ తర్వాత యాండ్రు మొదటి భార్య కొడుకు మ్యాట్ ఓ సినీ రచయిత,దర్శకుడు. తన తండ్రి మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి బయల్దేరతాడు.ఇదే కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న డాని యెంజెలాను ఇష్టపడతాడు.ఆమె మాయమైపోవడం,ఆ తర్వాత ఆ కేసుకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అతను అమెరికాను,ఆ ఉద్యోగాన్ని వదిలేసి,పారిస్ లో ఇంటర్ పోల్ లో పని చేస్తూ ఉంటాడు.
ఆ తర్వాత ఈ కేసు విషయమై మ్యాట్ ఆరేళ్ళ తర్వాత డానిను కలుస్తాడు. తన తండ్రి మరణం తర్వాత అదే రీతిలో ఇంకో హత్య జరిగిందని,అతని భార్యను అదే శైలిలో మానభంగం చేశారని చెప్తాడు.అలాగే అతని భార్య కూడా ఆస్తి ఛారిటీకు రాసి అదృశ్యమైందని స్పష్టం చేస్తాడు. ఆ సమయంలోనే వారికి అప్పటికే జరిగిన ఇంకో రెండు హత్యల గురించి తెలుస్తుంది,వారి భార్యలు కూడా అదృశ్యమవుతారు. వీరిద్దరు కలిశాక సంభవించిన ఇంకో మరణం హాంగ్ కాంగ్ కు చెందిన బేరింగ్ అనే ధనవంతుడు మరణించడం,అతని భార్య లిసా మానభంగానికి గురి కావడం జరుగుతుంది. ఈ సారి ఎలా అయినా హంతకుణ్ణి పట్టుకోవాలంటే లిసా అదృశ్యం కాకుండా చూసుకోవాలని భావిస్తాడు డాని.అప్పటికే లిసా అక్కడి నుండి బాలి లోని విల్లాకు వెళ్ళిపోతుంది.అక్కడకు వెళ్తాడు మ్యాట్.అక్కడకు వెళ్ళి జరిగింది చెప్తాడు.మిగిలిన నేరాల్లో జరిగినట్టే ఆ భార్యాలకు ఆ హంతకుడి నుండి ముప్పు ఉండవచ్చని చెప్తాడు. ఆ క్రమంలో కొంతకాలం ఆమె దగ్గరే ఉండిపోతాడు.ఆమెతో ప్రేమలో పడతాడు.డాని అక్కడికి వచ్చేసరికే అతని భార్య అతనికి విడాకులు ఇవ్వడానికి నిరానయించుకోవడం,ఆ ప్రక్రియ అయిపోవడం జరుగుతుంది.లిసా ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మ్యాట్ డానిను,కేసును మర్చిపోతాడు.
అప్పటికే హాంగ్ కాంగ్ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో లిసాను కలవడానికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చేవాడని ఆ ఇంట్లో పని చేసే పనిమనిషి స్పష్టం చేస్తుంది.ఆ సమయంలో లిసా మీద అనుమానం కలగటంతో ఆమె మీద నిఘా వేయడం,ఆ సమయంలో ఆమెతో ఉన్న మ్యాట్ నే ఆమె లవర్ గా భావించడం,వారిద్దరిని అరెస్ట్ చేయటం,కానీ ఆధారాలు లేకపోవడం వల్ల వదిలేయడం జరుగుతుంది.అక్కడి నుండి లిసాతో కలిసి పారిపోతే వారిద్దరు సంతోషంగా ఉండవచ్చని భావిస్తాడు మ్యాట్.దానికి లిసాను కూడా ఒప్పిస్తాడు.ఆ రాత్రి పారిపోదామనుకున్న సమయంలో మ్యాట్ కు మత్తు మందు ఇచ్చి లిసా మాయమైపోతుంది.
ఎలాగో ఇంటికి తిరిగి వస్తాడు మ్యాట్.మ్యాట్ అక్క క్లారీస్ అతన్ని చూసుకుంటూ ఉంటుంది.అప్పటికే మొదటి భార్య అతన్ని వదిలేయడం,లిసా వదిలేయడం అతనిలో ఎంతో దిగులును నింపుతుంది.లిసాను అతను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు.లిసా హంతకుడి వల్ల ప్రమాదంలో ఉందని ఆమెను కాపాడాలని భావిస్తాడు అప్పటికి కూడా.ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఇంకో విషయం తెలుస్తుంది.ఆ నాలుగు హత్యల్లో ఉన్న భార్యలు ఒక్కరే అని,ఆమె తన లవర్ తో కలిసి వీరి హత్యలు చేస్తుందని స్పష్టమవుతుంది.ఆ తర్వాత వారిద్దరి కలిసి భారత దేశంలో ఇంకో హత్య అలానే చేయబోతున్నారని తెలియడం,వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది.
ఆమె అసలు పేరు సోఫియా స్మిత్.ఓ అనాథ.ఆమె ఉంటున్న హోమ్ లో బాల్యం నుండే ఒంటరిగా ఉండే సోఫియా లైంగిక వేధింపులకు గురయ్యేది.ఒంటరితనం ఆమెలోని ఊహలకు,ఫ్యాంటసీలకు రూపాన్ని ఇచ్చింది. యవ్వనంలో ఉన్న సోఫియా అదే హోమ్ కు వచ్చిన ఫ్రాంకిని ప్రేమించింది.అతను కూడా ఆమెను అపురూపంగా చూసుకునేవాడు.అదే సమయంలో వారిద్దరు కలిసి ఓ ఫ్యాంటసీ నవల చదువుతారు.అందులోని మొరోకో లో ఓ రాణి వంశంలోని వారసురాలు సోఫియా అని ఆమెకు చెప్తాడు ఫ్రాంకి.ఆమెకు ఓ సోదరి కూడా ఉందని చెప్తాడు.అప్పటి నుండి ఆ పాత్రలోనే జీవిస్తూ ఉంటుంది సోఫియా. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకుంటారు.
ఇకపోతే ఫ్రాంకి బాల్యంలో తండ్రి యవ్వనంలో ఉన్న ఇంకో స్త్రీని వివాహం చేసుకుని ఆ తర్వాత తన తల్లిని వేధించడం చూశాక తన తండ్రిని హత్య చేస్తాడు.ఆ నేరం మీదే జువినైల్ హోమ్స్ లో గడుపుతూ అది పూర్తయ్యాక అనాధగా మిగిలి సోఫియా ఉన్న హోమ్ కు చేరుకుంటాడు.ఫ్రాంకి చాలా తెలివైన వాడు. వివిధ బాషలు నేర్చుకున్నాడు.మనుషులను తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన వాడు.అతను గే. ఆ తర్వాత సోఫియాను ఆ ఊహాలోకంలో నివసించేలా చేసి,ఆ తర్వాత ఆమె ద్వారా తన తండ్రిలా ప్రవర్తించిన వారిని హత్య చేయడంలో సోఫియాను భాగం చేస్తాడు.అందుకోసం ఆ బాష సోఫియా నేర్చుకోవడం,అందుకు తగ్గట్టు సర్జరీలు చేయించుకోవడం,వివిధ మనస్తత్వాలను కలిగి ఉండటం వల్ల ఆమెలో అంతర్లీనంగా ఉన్న ఊహాశక్తి అందులో భాగమై ఆమె ఆ పాత్రల్లో జీవిస్తూ ఉంటుంది.ఇది చేస్తేనే ఆమె సోదరిని కాపాడతానని ఆమె కష్టాల్లో ఉందని చెప్తూ ఉంటాడు ఫ్రాంకి.వివిధ వ్యక్తులను చంపాక మాత్రమే అతనికి అరౌజల్ రావడం,ఆ మీదట క్రూరంగా ఆమెను రేప్ చేయడం కూడా అతనిలో ఉన్న క్రూరత్వాన్ని స్పష్టం చేస్తుంది. ఇది కోర్టులో ఇన్వెస్టిగేషన్ లో తెలిసే విషయాలు.అంతా చేయించింది ఫ్రాంకి అని,సోఫియా మానసిక అస్వస్థత వల్ల చేసిందని కోర్టు తేల్చి,ఫ్రాంకికి మరణ శిక్ష,సోఫియాకు సైకియాట్రిక్ ట్రీట్ మెంటుకు మెంటల్ అసైలంకు అప్పగించడం జరుగుతుంది.అక్కడ ఉన్నవారిలో కూడా సోఫియా తన అందం వల్ల ఓ సెలబ్రిటీగానే మారుతుంది.
మ్యాట్ ఇంకో స్త్రీని వివాహం చేసుకుంటాడు.ఆమె గర్భవతి అవుతుంది.ఆ తర్వాత ఫ్రాంకి జైలులోనే ఆత్మహత్య చేసుకుంటాడు.ఆ తర్వాత సోఫియా ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉంటున్న గార్డ్ కార్లోస్ సాయంతో అక్కడి నుండి తప్పించుకుని దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆ తర్వాత ఇంకో సర్జరీ చేయించుకుని తన రూపు రేఖలు మార్చుకుంటుంది. ఆ తర్వాత మ్యాట్ ను కలుస్తుంది.ఆమె కోసం తన భార్యను వదిలేసి ఆమెతో కలిసి మొరోకో వెళ్తాడు మ్యాట్. కొన్నాళ్ళకి పోలీసులకు కార్లోస్ శవం కనిపించడం జరుగుతుంది.ఆ హత్య చేసింది సోఫియా అని పాఠకులకు అర్ధమవుతుంది.
ఇక్కడ ముగింపు గందరగోళంగా ఉంటుంది.అసలు ఫ్రాంకి కూడా మరణించాడా? లేకా సోఫియా లానే ఆ ఆత్మహత్యను సృష్టించాడా? లేక సోఫియా ఈ హత్యల పరంపరను కొనసాగిస్తుందా? ఫ్రాంకి తెలివైన వాడు కనుక ఆమెను మానిప్యులేట్ చేయగలిగినా సోఫియాలోనే హింస నిండి ఉందా? సిడ్నీ షెల్డన్ శైలిలో ఈ గందరగోళం ఎప్పుడు ఉండదు.మానసిక చిత్రణ,కథలో కొన్ని అంశాలు చెప్పకుండా ఉండటం వంటివి అసంపూర్ణత్వాన్ని ఇచ్చినా, నేటి నవలల్లో మానసిక లోతుల్లో ఈ గందరగోళం కూడా ఓ శైలిగానే మారిపోయింది. ఈ ముగింపును పాఠకులు ఎలా అయినా అన్వయించుకోవచ్చు.
ఈ నవలలో క్రైమ్ ను,మానసిక రుగ్మతలను కలపడం వల్ల,ఆ రెండింటికి మధ్య సమన్వయం ముగింపులో కూడా స్పష్టంగా చేయకపోవడం వల్ల కథలో ఉన్న మలుపులు ముగింపుకు ఊతాన్ని ఇవ్వలేకపోయాయి.మానసిక రుగ్మతలు మోటివ్ అయ్యినప్పుడు రచయిత పాఠకులకు వివిధ దశల్లో ఆ విషయాన్ని స్పష్టం చేయాలి.సీరియల్ కిల్లింగ్స్ లో ఆ క్లులు కూడా ఇన్వెస్టిగేషన్ ద్వారా స్పష్టమయ్యేలా చూడాలి.కానీ కోర్టు ట్రయల్ లోనే ఈ మోటివ్ స్పష్టమవ్వడం ఈ పాత్రల మీద పాఠకులకు పూర్తి స్పష్టత ఇవ్వదు. ఎందుకంటే కోర్టులోని డాక్టర్లు,సైక్రియాటిస్టులు వారిని హత్యలు చేయకముందు గమనించిన వారు కానీ,హత్యలు చేశాక ఏ మాత్రం కనక్షన్ లేని వారు.కొంత మేరకు అది ప్రేరణ గురించి స్పష్టం చేసినా పూర్తి స్పష్టతను ఇవ్వదు. కానీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు తప్పక చదవాల్సిన నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ