విడాకుల కథ

 విడాకుల కథ

-శృంగవరపు రచన


జీవితంలో వివాహం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ కొన్నాళ్ళకు వివాహమే జీవితం అయిపోతుంది కొందరికి. ఆ బంధంలో తమ జీవితాన్ని మర్చిపోయి, వివాహమే జీవితం అనుకుంటూ బ్రతకడమే జీవించడం అనుకునేవారు అధికం. ఈ వివాహంలో ప్రేమ ఉంటుంది కానీ అది వ్యక్తి మీద ఉన్న ప్రేమ లేక ఆ బంధం వల్ల వచ్చిన ప్రేమో చెప్పడం కష్టం.ఆ ప్రేమ జీవితం అనుకోవాలా ఇంకా దేనికోసమైనా ప్రయత్నించాలా అన్నది ఆ వ్యక్తి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి ఊగిసలాటలో ఉన్న ఓ జంట కథే 'Marriage story.'
నికొలి, చార్లీ భార్యభర్తలు. నికొలి ఓ నటి. చార్లీ రంగస్థల దర్శకుడు. నికొలి ఓ సినిమా చేసాక నికొలి ప్లే చూడటానికి వచ్చినప్పుడు ఆమె అతని ప్లేలలో నటించడం, క్రమేపి ఇద్దరూ ప్రేమలో పడి పెళ్ళి చేసుకోవడం, ఓ కొడుకు పుట్టడం జరుగుతుంది. ఆ కొడుకు పేరు హెన్రి.
నటిగా చార్లీ నాటకాల్లోనే నికొలి నటిస్తూ ఉంది పెళ్లయిన తర్వాత కూడా. ఆమెకు వచ్చే డబ్బు కూడా చార్లీ తన రంగస్థల కంపెనీ మీద పెట్టేవాడు.చార్లీ ప్లేలు చేసేది తాను స్థాపించిన 'ఎగ్జిట్ ఘోస్ట్' కంపెనీ తరపున. నీకొలికి ఇంకో ఆఫర్ బయటి నుండి వస్తుంది. అప్పటి నుండి ఆమె తన ఉనికి, తనకు వ్యక్తిగా ఉన్న ప్రాధాన్యత గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
తనను చార్లీ నటిగా గుర్తించి, గౌరవించడం లేదని భావించిన ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మొదట వీరిద్దరూ లాయర్లు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నా సరే అది తప్పదు.ఆ తర్వాత చార్లీ తన అసిస్టెంట్ తో సంబంధం కలిగి ఉన్నాడన్నా విషయాన్ని నికొలి అతని మెయిల్ హ్యాక్ చేసి తెలుసుకుంటుంది.
ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకునే ప్రక్రియలో హెన్రి కస్టడీ కోసం ఇద్దరూ చేసే ప్రయత్నాలు,చివరికి జాయింట్ కస్టడీ మీద విడాకులు రావడం, నికొలి డైరెక్టర్ గా మారి ఎమ్మి అవార్డు పొందడం, చార్లీ కూడా విజయం సాధించడం, నికొలి కొత్త బాయ్ ఫ్రెండ్ ఉండటంతో సినిమా ముగుస్తుంది.
ఇది కథ అయినా ఈ కథ మొత్తంలో వివాహం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడే ప్రేమ అంతర్లీనంగా ఎలా ఉండిపోతుందో ఈ సినిమా స్పష్టం చేస్తుంది.సినిమా ఓపెనింగ్ సీన్ లో చార్లీలో నచ్చే వాటి గురించి నికొలి రాయడం, నికొలి లో నచ్చే వాటి గురించి చార్లీ రాయడం అలా చేయమని మీడియేటర్ చెప్పడంతో చేసినా ఇద్దరిలోనూ చెడ్డతనం లేకపోయినా అది వ్యక్తిత్వ ఉనికికి మాత్రమే సంబంధించింది కావడం వల్ల వారు విడిపోతున్నారని స్పష్టం అవుతుంది. అతని నుండి విడిపోవాలి అనుకున్నాకే నికొలి అతని అకౌంట్ హ్యాక్ చేస్తుంది.సినిమా క్లోజింగ్ సీన్ లో నికొలి చార్లీ గురించి రాసింది హెన్రి చదువుతూ ఉండటం, ఆ సమయంలో చార్లీ రావడం, నికొలి వెనుక నుండి గమనించడం జరుగుతుంది.
విడిపోవడం మనుషుల చెడ్డతనం వల్ల కాదు వ్యక్తిగత ప్రాధాన్యతలు, విలువలకు కూడా సంబంధించినదే అన్న కోణాన్ని స్పష్టం చేసే సినిమా ఇది. ఫ్యామిలీ డ్రామాలో ఓ కొత్త ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!