మనసు తడి

 మనసు తడి

-శృంగవరపు రచన
(పెద్దింటి అశోక్ కుమార్ గారి ‘గుండెలో వాన కతలు’ సమీక్ష)



కథలు రాయడంలో రచయిత ఉద్దేశ్యాలు ఏవైనా సరే,పాఠకుడిని అవి ఏ స్థాయిలో ప్రభావితం చేయగలిగాయి అన్నది మాత్రమే ఆ కథల ప్రయోజనాన్ని సామాజిక కోణంలో ఆవిష్కరిస్తుంది.పెద్దింటి అశోక్ కుమార్ గారి కథల్లో మనుషుల మనసుల్లో ఉండే ప్రేమ- దాని సామాజిక పరిధి,అది ఆర్థిక కోణంగా ఇంకో రూపం తీసుకుంటున్న తీరు మనసుకు దగ్గరగా పరిచయం చేస్తాయి. ఆయన ఇరవై కథల సంకలనమైన ‘గుండెలో వాన కతలు’ ఆయనకున్న సామాజిక దృష్టిని,మానవ సంబంధాల పట్ల ఆయనకున్న అనురక్తిని,విద్యా విధానాలు సమాజాన్ని కుటుంబ,సమాజ స్థాయిలో ప్రభావితం చేస్తున్న తీరును స్పష్టం చేస్తాయి.
మనుషుల మనసుల్లో ఎప్పుడు విలువైనది కొంత మూల్యం చెల్లిస్తేనే దొరుకుతుందన్న సమిష్టి నమ్మకం బలపడిపోయింది.ఆ నమ్మకమే వారిని అనేక అంశాలకు శాస్త్రీయత లేకపోయినా నమ్మేలా చేస్తుంది.ఓ ఆయుర్వేద వైద్యుడు ఓ పల్లెలో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ గ్రామంలో ప్రజలు పడుతున్న బాధ చూసి,వారిని ఆ బాధల నుండి కాపాడాలన్న లక్ష్యంతో ఆ ఊరిలోని ఔషద మొక్కలనే మందుగా మార్చి వారికి ఇచ్చినా,వారి నమ్మకం కోసం దాన్ని మంత్రంగా మార్చేవాడు.కానీ అతను బ్రతికించిన ప్రాణాల ప్రాధాన్యతను గుర్తించుకోని ఆ ప్రజలు అతనిలో వైద్యుడిని కాకుండా మంత్రగాడిని మాత్రమే చూశారు.చివరకు అతన్ని చంపేశారు,అతని కుటుంబాన్ని తరిమేశారు.తరువాతి తరంలో అతని కొడుకు వైద్యుడై ఆ ఊరిలో తండ్రి మార్గాన్ని అనుసరించినా ప్రజల్లో మారే గుణం ఉందని నమ్మినా,వారు మాత్రం అతన్ని కొత్త మంత్రగాడిగా,మంత్రగాడి కొడుకుగానే చూస్తారు.మనుషుల్లో నమ్మకాలు ప్రగతి ద్వారా పోవని,కాలం మారిన మనుషుల మనసుల్లో ఎదుటి వ్యక్తి మీద తమకున్న అభిప్రాయాలూ తప్పని ఒప్పుకునే మనసు తేలికగా రాదని,తమ నమ్మకాలే సరైనవని నమ్మడంలో వారికో సంతృప్తి ఉంటుందని ‘నింద’ కథ స్పష్టం చేస్తుంది.
ప్రతి మనిషికి తన బాధను పంచుకోవడానికి ఇంకో మనిషి కావాలి.ఆ మనిషి లేకపోతే ఆ బాధ ఎలా మనసును దహించి వేసి,బాధ అనే ఉప్పెనలో కొట్టుకుపోతుందో స్పష్టం చేసే కథే ‘గుండెలో వాన.’ఈ కథను రచయిత రాసిన శైలి పాఠకులను ఆకర్షిస్తుంది.ఓ టెయిలర్ కు బతుకమ్మ పండుగకు మంచి చీరను కుట్టించుకోవాలని ఖరీదు ఎక్కువైన కొంత డబ్బు ఇచ్చి కుట్టమన్న ఓ స్త్రీ ఆ రోజు తీసుకోవడానికి రాకపోయేసరికి ఆమె దగ్గరకు వెళ్ళిన అతనికి ఆమె తనకు తన అక్కకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ,ఆమె ఇంటి వద్ద దింపమని అడుగుతుంది.ఆ ప్రయాణంలో అంతా అక్కకు తనకు మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు,అందులో ఉన్న ప్రేమలు,అక్క అప్పుల పాలవ్వడం వంటివి అతనికి విసుగు కలిగి ఆపమన్నా ఆపకుండా చెప్తూనే ఉంటుంది.ఆ అక్క అంతకు క్రితం రోజే ఆత్మహత్య చేసుకుని మరణిస్తే ఆ బాధ చెప్పుకునే మనిషి లేక ఆమె తనకు చెప్పుకుందని అతనికి అక్కడికి వెళ్ళాకే అర్ధమవుతుంది.ఈ కథ నిజంగానే హృదయాన్ని కదిలిస్తుంది.
మనుషుల అవసరాలను,వారికే వ్యతిరేకంగా మార్చి,వారి మనసుల్లో తోటి వారి పట్ల,తమతో తమ స్థాయిలోనే జీవిస్తున్న వారి పట్ల భేధాలు సృష్టించి తాము బ్రతికే ప్రిడేటర్లకు,వారికి ఆహారమై వారిని ఏమి అనలేక ‘ప్రే’ గా మిగిలిపోయి తమలాంటి ఆహారంగా మారే వారిపైనే తమ అసహనం వెళ్లగక్కే చిన్న చేపల కథే ‘కొన్ని చేపలు-ఒక గాలం’ కథ. తన కొడుకు స్కూల్ లో ఓ పిల్లవాడిని కొట్టినందుకు ఐదు వేలు ఆ పిల్లవాడి తల్లి అయిన దేవకికి గంగవ్వ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఆ సమయంలో అంత డబ్బు లేక సేటు దగ్గర అప్పు చేసి తీరుస్తుంది. అదే సమయంలో ఆమె అప్పు తీర్చడానికి మార్గంగా కంకులు కౌలుకు తీసుకున్న అతన్ని పరిచయం చేసి,అతని దగ్గర కంకులు తీసుకుని వాటిని కాల్చి అమ్మి తన అప్పు తీర్చమంటాడు.దారి చూపాడని సంతోషించి అలా అమ్మడానికి బయల్దేరుతుంది పొద్దున్నే కొనుక్కుని.కానీ ఆమె కాల్చి అమ్మే చోటులోనే దేవకి కూడా కంకులు కాల్చి అమ్ముతూ ఉంటుంది.వారిద్దరు పొట్ట కూటి కోసం పోటీ పడుతూ ఉంటారు,ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు.ఎండలో స్పృహ తప్పిన గంగవ్వను దేవకి సపర్యలు చేసి ఆమెను స్పృహలోకి తెప్పిస్తుంది. ఈ సంఘటనతో ఇద్దరి మనసుల్లో మార్పు వచ్చినా,అది తాత్కాలికమై మరలా తర్వాత గంగవ్వ దోసకాయలు అమ్ముతూ,దేవకి కంకులు అమ్మడం మరలా అదే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.ఇలా ఒకరి మీదకి ఒకరిని ఉసిగొల్పి పోటీ వారిద్దరి మధ్య ఉంచి,ఎవరిని పూర్తిగా లాభపడనివ్వకుండా,మనుషులను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి పెద్ద స్థాయిలో వారు చిన్న స్థాయి వారిని ఎలా ఆడిస్తారో,ఆ ఆటలో ఎలా వీరు అభద్రతతో నలిగిపోతూనే,జీవనం కొనసాగిస్తారో స్పష్టం చేసే కథ ఇది.
వ్యవస్థ స్థాయిలో తప్పులు జరిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకుని,సరిదిద్దే ప్రయత్నం కన్నా కూడా ఆ తప్పును ఆ వ్యవస్థలోని మిగిలిన వారి మీదకు నెడుతూ ‘బ్లేమ్ గేమ్’ఆడే సామాజిక మనస్తత్వానికి రూపమే ‘చీమా చీమా ఎందుకు పుట్టావ్?’కథ.ఓ స్త్రీ కలుషిత నీటిని తాగడం వల్ల మరణిస్తుంది.ఆ సమస్యను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఆమె భర్త చేసినప్పుడు అధికార వర్గమంతా కూడా ఆ తప్పును తమపై అధికారుల పైకి నెట్టడం,చివరకు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను నిర్లక్ష్యంగా నడపటం వల్ల ఆ తప్పు జరిగిందని,అలా జరగడానికి కారణం అతన్ని ఆ సమయంలో ఓ చీమ కుట్టడమే అని,కనుక ఆ చావుకు కారణం ఆ చీమ అని ఓ మీడియా ఛానల్ ఆపాదిస్తుంది.ఈ సీరియస్ సమస్యను తేలికైన అంశంగా మార్చడంలో సమాజంలో అధికారులు,మీడియా కొన్ని సందర్భాల్లో ఎలా ప్రయత్నిస్తుందో స్పష్టం చేసే కథ ఇది. విధేయతను నేర్పించడం అంటే భయపడటం, ప్రశ్నించకుండా, తమదైన అభిప్రాయాలను ఏర్పర్చుకోలేని బలహీనమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడమా? అదే విద్య లక్ష్యమా? ఏది, ఏ వయసుకు ఎంతమేరకు విద్యార్థులకు అవసరమో తెలియని స్థితిలో తమ పిల్లలను గొప్ప వారిని చేస్తున్నామన్న భ్రమలో వారిని రోజంతా భయపెట్టి బోలెడు పుస్తకాలు మోయించి, బండెడు హోమ్ వర్కులు చేయించి అదే వారి జీవితానికి రాచబాటగా భావించే తల్లిదండ్రులు తమ పిల్లలు స్వతంత్రంగా ఆలోచించడాన్ని ఎలా విధేయత లేకపోవడంగా భావించి వారిని ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రయివేట్ స్కూల్లలోకి మార్చి ఎలా వారిలో భయాన్ని ప్రవేశపెడుతున్నారో రచయిత 'చుక్కలు రాని ఆకాశం'కథలో స్పష్టం చేశారు. ఈ కోణంతో పాటు ప్రభుత్వ విద్యను ఎందుకు ప్రజలు నమ్మలేకపోతున్నారు? ఆ నమ్మకం అక్కడి ఉపాధ్యాయుల్లో ఉంటే ఎందుకు తమ పిల్లలను అక్కడ జేర్పించడం లేదు? వంటి అంశాలను కూడా అశోక్ గారు ఈ కథలో స్పష్టం చేసారు.స్వయంగా రచయిత ఉపాధ్యాయుడు కావడం వల్ల ఈ కథలో ఆ సాన్నిహిత్యం స్పష్టమవుతుంది.
2001 లో ‘తొమ్మిది నెలలు’ సినిమా వచ్చింది.’సీతారామయ్య గారి మనవరాలు’ దర్శకులు క్రాంతి కుమార్ గారు ఈ సినిమా దర్శకులు.భర్తకు ఆపరేషన్ చేయించడానికి గర్భదానం చేయడానికి సిద్ధ పడిన భార్యను తన కష్టం తీరగానే చెడిపోయిన స్త్రీగా భావిస్తాడు భర్త ఆ సినిమాలో.అశోక్ కుమార్ గారి కథ ‘ఈ పాపం ఎవరిది?’ ఈ సరోగేట్ అమ్మలోని ఇంకో కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది.తనకు తెలియని బిడ్డను తన కడుపులో తన మాతృత్వానికి కాకుండా ఇంకొకరిని అమ్మగా మార్చడానికి తాను శారీరక బాధను పొందే ఈ ప్రక్రియలో స్త్రీ పడే శారీరక-మానసిక వ్యథలను ఎందరో రాసినా సరే,అదే స్త్రీ తాను ఏ పురుషుడి బిడ్డను మోస్తుందో ఆ పురుషుడు ఎదురైనప్పుడు ఎదుర్కునే భావసంచలనాన్ని రచయిత స్త్రీ కోణం నుండే రాశారు.ఆ స్త్రీని తన బిడ్డకు తల్లిగా మాత్రమే భావించిన ఆ పురుషుడు ఆమెను చూడగానే తనకు పుట్టబోయే బిడ్డ ఆ సరోగేట్ మదర్ అందాన్ని పుణికిపుచ్చుకుంటే బావుండునని అనుకుంటాడు.తన భార్య మరణించడంతో ఆమె ప్రతిరూపంగా ఆ బిడ్డను పెంచుకోవాలని అనుకుంటున్నానని ఆమెతో చెప్తాడు.ఆమె కడుపును స్పృశించి ఓ కాబోయే తండ్రి అనుభూతిని పొందుతాడు.కానీ అంత ప్రేమ చూపించిన ఆ తండ్రి ఆ పుట్టిన బిడ్డకు అంధత్వం ఉందని తెలియగానే తప్పుకుంటాడు.అప్పటికే తన భర్తను అప్పుల నుండి కాపాడటానికి ఆ పనికి ఒప్పుకుని ఆ అప్పులు తీరగానే భర్తకు.కుటుంబానికి దూరమైనా ఆమె మనఃస్థితి ఏమై ఉంటుంది అన్న ప్రశ్న రచయిత పాఠకులకే వదిలివేశారు.
అశోక్ గారి కథల్లో మానవ సంబంధాలకు,ఆర్థిక కోణాలకు మధ్య ఉన్న దూరం,దగ్గరితనం రెండు పాఠకులకు గోచరిస్తాయి.ప్రతి కథలోనూ ఎక్కడో ఓ చోట ఆర్థిక,భావోద్వేగ స్పర్శలు తడుముతూనే ఉంటాయి.అవసరం మనిషిని తప్పు-ఒప్పు-సమాజం దేని గురించి ఆలోచించనివ్వదు. కానీ అది దాటిపోయాక ప్రతి ఒక్కరూ మరలా ఆ పరిధి నీడలోనే జీవిస్తారు.ఎదుటి వ్యక్తుల మనసులను,మెదడులను అంచనా వేయలేకుండా ఎమోషనల్ ట్రౌమాకు గురయ్యే బాధితురాళ్ళ రూపమే ‘ఈ పాపం ఎవరిది?’కథలో వెన్నెల పాత్ర.ఆమె వల్ల కష్టం దాటిపోయిన భర్త,ఆమె నుండి ఆశించిన బిడ్డను పొందనందుకు మొహం చాటేసిన సలీం పాత్రలు రెండు కూడా ఒకే వర్గానికి చెందినవి.తమ అవసరాలు,వాటిని తీర్చుకునే మార్గాలు అన్వేషిస్తూనే,అవి తాము ఆశించిన దానికి విరుద్ధంగా ఉంటే ఆ ఫలితాన్ని నిందాస్తుతిగా పక్క వారికి బదిలీ చేయగల నేర్పు కలిగినవి ఈ పాత్రలు రెండు.
మనుషుల్లో ఉండే నీతి,నిజాయితీలను డబ్బు ఏ పరిస్థితుల్లో ప్రభావితం చేస్తుందో స్పష్టం చేసే కథే ‘దారి చూపినవాడు.’మనుషులకు తమ అవసరాలు తీర్చుకోగలిగినంత డబ్బు ఉండాలి.ఆ మేరకు డబ్బు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.వాస్తవానికి మనుషులు పాటించే విలువలను డబ్బు పట్ల మనుషులు ప్రవర్తించే పద్ధతిని బట్టే అంచనా వేస్తారు.తాను పేదరికంలో మగ్గుతున్నా సరే తాను ఓ స్కూల్ టీచర్ దగ్గర తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చిన పాత్ర సాయులుది. కాకపోతే మర్నాడుకు ఇస్తానన్న వ్యక్తి ఓ వారానికి ఇస్తాడు. ఆ ఐదు వేలు తన దగ్గర ఉండటం చూసిన తన కూతురు తనను బంగారం అడిగిందని,ఇంకో కూతురు డబ్బు దొంగతనం చేసే ప్రయత్నం చేసిందని,భార్య ఆపరేషన్ చేయించమని అడిగిందని,తల్లి దుప్పటి అడిగిందని,డబ్బు చెడ్డదని,దాని వల్లే మనుషులు మారిపోతారని,దానిని కాపాడి ఇవ్వడానికి తనకు ఆ వారం పట్టిందని ఆ స్కూల్ మాస్టర్ కు సంజాయిషీ ఇస్తాడు.అదే సాయిలు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు గమనించిన ఆ మాస్టారు సాయిలుకు ఫ్లాట్స్ అమ్మే వెంచర్ లు తీసుకుని బాగుపడమని సలహా ఇచ్చి అందులో చేరేలా చేస్తాడు. ఓ సారి ఓ వెయ్యి రూపాయలు తాను హామీ ఉండి సాయిలుకు ఇప్పిస్తాడు.కానీ సంవత్సరం అయిన సరే ఆ అప్పు తిరిగి కట్టక పోవడం వల్ల ఆ మాస్టారిని అడగటం,సాయిలుకు ఏమైందో అని వెళ్తే అప్పటికే వెంచర్ల ద్వారా ధనవంతుడైన అతను కావాలనే ఆ అప్పు కట్టలేదని,మాటలు కేవలం చెప్పడానికే అని చెప్తాడు.డబ్బు మీద అభిప్రాయం డబ్బు సంపాదన లేనంతవరకు విలువల ఆధారితంగా ఉన్నప్పటికీ,అదే సంపాదన అతనిలో ఆత్మస్థైర్యంతో పాటు గర్వాన్ని కూడా పెంచడం డబ్బు మనుషులను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అన్నది రచయిత స్పష్టం చేశారు.డబ్బు అవసరానికి మించి ఉన్నప్పుడూ కూడా మనిషి డబ్బు మీద,జీవితం మీద అభిప్రాయాలూ మార్చుకోలేకుండా ఉండటం అయితే సాధారణ పరిస్థితుల్లో జరగవని,మనిషి తనను తాను తన అసంతృప్తులను సమర్ధించుకోవడానికి మంచితనపు చట్రాన్ని నిర్మించుకుని అందులో బ్రతికుతాడని,ఇది పరిస్థితులు-డబ్బు మనిషిని మార్చే ప్రేరకాలని రచయిత అంతర్లీనంగా చెప్పారు.
శ్యాండ్ మాఫియా సాధారణ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో,వారిని ఎలా పేదరికంలోకి ఎలా నెడుతుందో ఓ వైపు చెప్తూనే,సహజ వనరులు కృత్రిమమైతే అవి సాధారణ వర్గ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలా అల్లకల్లోలం సృష్టిస్తుందో ‘బిందెడు నీళ్ళు’ కథ ద్వారా స్పష్టం చేశారు.ఆ గ్రామంలో ఒకప్పుడు నీరు వరదలుగా ప్రవహించింది,ఊరిలో అందరికీ ఉపాధి కల్పించింది.ఆ ఊరిలో క్వారి విస్తృతమై అది నీళ్ళు కూడా పడని చోటుగా మారిపోయింది. ఓ తల్లి తన బిడ్డలకు మంచి నీళ్ళ కోసం అలమటిస్తుంటే వారి బాధను చూడలేక ఎంత ప్రయత్నించినా ఇవ్వలేకపోతుంది.ఈ సమస్యను రాజకీయంగా మార్చుకున్న ప్రతిపక్ష నాయకులు కూడా తమ అవసరానికి మాత్రమే అనుగుణంగా ప్రవర్తించారు.ఆ తర్వాత ఆ ఊరిని ఆ మంచి నీటి కరువు నుండి కాపాడటానికి నీటిని జలాభిషేకం చేయించడానికి నీళ్ళు తెప్పిస్తారు.కానీ వాటిని సామాన్య జనులు ముట్టుకోవడానికి వీల్లేదంటారు. కానీ బిడ్డల కోసం తార ఆ రాత్రి అందరూ నిద్రపోయాక గుడి నుండి నీరు దొంగిలించడానికి బయలుదేరుతుంది.పూజారికి దొరకకుండా తప్పించుకున్నా,అతను ఆమెను గాయపర్చడానికి రాళ్ళు విసురుతాడు.అయినా ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరుతుంది ఆమె.బిడ్డలకు చివరకు మంచి నీళ్ళు ఇవ్వగలిగానన్న అన్న సంతోషం కాస్త ఆ నీళ్ళ బదులు రక్తం ఉండటం వల్ల ఆవిరైపోతుంది.ఆమె మంచి నీళ్ళను తెచ్చే ప్రయత్నంలో తాను గాయపడిన రక్తం ఆ నీతిలోకి ప్రవహించడం కూడా ఆమె గమనించకపోవడం ఈ కథకు ముగింపు కావడం కథకుడికి ఓ సమస్య తీవ్రతను పాఠకులలో చలనం కలిగించేలా రాయడంలో ఉన్న పట్టును స్పష్టం చేస్తుంది.
మనిషికి ఆర్థిక భద్రత,భావోద్వేగ స్పర్శలను దాటుతున్న కోణాన్ని,దానిని ప్రగతిగా సమాజం భావిస్తున్న పయనాన్ని రచయిత స్పష్టం చేసిన కథే ‘ప్లాసెంటా.’ కన్నబిడ్డకు,కన్న తల్లికి మధ్య అనుబంధం గొప్పది.కానీ ఆ బిడ్డ భవిష్యత్తులో బావుండాలంటే తాను ఆర్థికంగా బలపడాలి,దానితో పాటు తాను భవిష్యత్తును పణంగా పెట్టుకోకూడదు,ఆ బిడ్డను ఆ మాతృ స్పర్శతో అనుబంధం లేకుండా ఉండేలా శిక్షణ ఇవ్వగలగాలి అనే ఆలోచనను కార్యాచరణలో చూపిన ఓ యువతి కోణమే ఈ కథ.ఆమె ఆలోచనను ఎందరో సమర్ధించారు.దానికి కారణం ఆ ‘మోరల్ డైలమా’ఎందరిలోనో నెలకొని ఉండటం.అది తనకు లాభించేలా చేస్తే సమాజం తనను స్వార్ధపరురాలిగా భావిస్తుందన్న భావనతో ఆ ఆలోచనను పక్కన పెట్టినా,ఆ దారిలో పయనించిన వారిని సమర్ధించి,తాను చేయలేని పనిని వారు చేశారు కనుక దానిని ఆమోదించడం సమాజంలో ఎప్పటి నుండో ఉన్న ప్రక్రియే.స్వార్ధం లో మంచితనాన్ని ఎలా సమర్ధించుకోవచ్చో,దానికి తర్కం ఎలా జోడించాలో నేర్చుకోగలిగితే ఏదైనా మనిషి తనకు దేనినైనా అనుకూలంగా మార్చుకోగలడని స్పష్టం చేసే కథ ఇది.
మనిషి మెదడులో ఎన్నో ఆలోచనలు ఎప్పుడూ పురుగులా తొలుస్తూనే ఉంటాయి.అతను ఏ పని చేస్తున్నా సరే, ఓ వైపు అతని మెదడు తన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తూ,వారు తనకు నచ్చని వారైతే వారి గురించి మనసులో అనుకునేవి,తనకు లాభించే వారి గురించి ఆలోచనలు,తనకు నచ్చని వారిని మనసులో విమర్శించే తీరు ఎప్పుడు మనిషి మెదడులో తిరుగుతూనే ఉంటాయి.అలా ఓ స్కూల్ మాస్టర్ మెదడులో తిరిగే ఆలోచనల సమాహారమే ‘పురుగు’ కథ. మనిషి ఆగకుండా తిరిగే ఆలోచనల ఉద్రేక వేగమే ఈ కథ.ఆ వేగాన్ని మనం అందుకుంటున్నప్పుడే మన మెదడులో ఇంకొన్ని ఆలోచనలు అదే వేగంతో పరిగెడుతూ ఉంటాయి.
మనిషి ఏ సమస్యను అయినా తాను స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ సమస్యను సరైన కోణంలో అర్ధం చేసుకోలేడన్న వాస్తవాన్ని అశోక్ గారు తన అనుభవంతో సమన్వయపరుస్తూ రాసిన కథే ‘ఆకలి.’ రచయిత ఇంటి పక్కన ఉండే వజ్రమ్మ రచయిత ఇంట్లో మంచి వంటకం వండిన ప్రతిసారి ఆ ఇంటి ముందే తచ్చాడుతూ,ఆ ఇంట్లో వారితో మంచిగా ఉంటూ ఉండేది.ఆమె ఏనాడూ తనకు ఏదైనా కావాలని అడగలేదు.ఆమె బాధను అర్ధం చేసుకునే ప్రయత్నమూ ఎవరు చేయలేదు.కానీ రచయిత ఆ తరువాత ఓ సాహితీ సమావేశం కోసం ఉత్తర భారతదేశం వెళ్ళాల్సి రావడం,అక్కడ అన్నం దొరక్కపోవడం,డబ్బు ఉన్నా అన్నం దొరకని పరిస్థితులు రచయిత మనసులో వజ్రమ్మ గురించి ఆలోచించేలా చేస్తాయి.ఇంటికి వచ్చాక చికెన్ వండించి ఆమె కోసం తీసుకువెళ్ళినా ఆ తరువాతి రోజే ఆమె ఆకలితో మరణించడం,ఆ క్యారియర్ ఆమె విప్పకపోవడం రచయితను కదిలిస్తాయి.మనిషి ఏ బాధను అయినా తప్పుగా కాకుండా సాటి వ్యక్తి జీవితంలోని బాధగా చూడగలగాలంటే అతను కూడా ఆ సమస్యను అనుభవించి ఉండాలి అని ఈ కథ స్పష్టం చేస్తుంది.
విద్య లక్ష్యం అర్ధం చేసుకోకుండా పిల్లలను మర మనుషుల్లా మారుస్తున్న ఈ నిర్బంధ విద్య దేశ భవిష్యత్తుకు ఎటువంటి పౌరులను బహుమతిగా ఇస్తుందో స్పష్టం చేసే కథే ‘మర మనిషి.’స్పందనను నియంత్రించే యాంత్రికత విద్యలా పరిణమిస్తే అది మానవత్వం లేని మనుషులు ఎలా అధికారులుగా మారి ప్రజల పట్ల సానుభూతి,దయ,కరుణ లేని మనుషులుగా మారతారో స్పష్టం చేసే కథ ఇది.భార్యను,కుటుంబాన్ని,సమాజాన్ని,దేశాన్ని దేన్ని కూడా ఓ భావోద్వేగ పరిధిలో వీక్షించలేని మనుషులను సృష్టించే విద్యా వ్యాపారాన్ని అతి దగ్గరగా చూపే కథ ఇది.
రక్త సంబంధాల్లో ఉండే గాఢతను స్పష్టం చేసే కథే ‘దగడు.’ మేనరికాన్ని కాదని బయటి సంబంధం చేస్తున్న సమయంలో ఆ పెళ్లి కొడుకు మాయమైపోతాడు. పెళ్ళికొడుకును మేనమామే కోపం కొద్ది ఏదో చేశాడని అనుకున్న అతని తల్లిదండ్రులు అతని ఇంటికి వెళ్ళేసరికి అతన్ని పెళ్ళికొడుకుగా చేస్తున్న మేనమామ దంపతులను చూసి ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన చిన్నదే అయినా ఈ కథలో అప్పటి వరకు నెలకొని ఉన్న ‘Relationship Dilemma’ కు చక్కటి ముగింపుతో హృదయానికి దగ్గరగా ఉండేలా రాశారు.
సామాజిక సమస్యలకు,మనుషుల నమ్మకాలకు ఉండే సమన్వయాన్ని స్పష్టం చేసే కథే ‘జలగండం.’ఓ రచయిత దగ్గరకు జలగండంతో తన కుటుంబంలో మగవారు మరణించిన ఉదంతం చెప్పడానికి వచ్చిన ఓ స్త్రీ తన మనవడికి ఆ గండం ఏ రూపంలో వస్తుందో చెప్పమని అడుగుతుంది.తన మామయ్య బావిలో పడి మరణిస్తే,తన భర్తకు అదే గండం ఉందని భర్తకు ఈత కూడా నేర్పించినా,అప్పుల పాలై నీళ్ళు పడక ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఆ తరువాత అతని కొడుకుని వ్యవసాయం నుండి దూరంగా ఉంచినా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఫ్యాక్టరీ వ్యర్ధాలు తాగు నీటిలో కలవడం వల్ల అవి తాగి మరణిస్తాడు.ఇక తన మనవడు ఎలా మరణిస్తాడో చెప్పమని అడుగుతుంది ఆమె.సమాజంలో వ్యర్ధాలు,కాలుష్య సమస్యలు,నీరు దొరకని పరిస్థితుల మధ్య సామాన్యుడు వ్యక్తిగతంగా ప్రాణాలు కోల్పోతున్న వైనాన్ని రచయిత ఓ వినూత్న కోణంలో స్పష్టం చేసిన తీరు అభినందనీయం.
తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం ప్రైవేట్ బడుల్లో చదువు మాత్రమే మేలు చేస్తుందన్న నమ్మకంతో ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఎవరు పంపకపోవడం వల్ల ఇరవై మంది కూడా లేని ఆ పాఠశాల మూత పడే పరిస్థితుల్లో ఓ టీచర్ దాని కోసం చేసిన పోరాటం,దానికి పరిష్కారం లభించడం కోసం ఆమె ఎన్నుకున్న వినూత్న మార్గాన్ని స్పష్టం చేసే కథే ‘ఆనాటి వాన చినుకులు.’
నాకు వ్యక్తిగతంగా ఎంతగానో నచ్చిన కథ ‘స్కావెంజర్.’ కుల సమస్యకు పరిష్కారం రిజర్వేషన్లని కొందరు భావిస్తే,దాని వల్ల ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు లభించడం లేదని ఇంకొందరి వాదన. కులానికి ఆర్థిక కోణం రిజర్వేషన్లు కల్పిస్తే,దానికి ఉన్న సామాజిక కోణం వల్ల ఆవిర్భవించే సమస్యలకు ఏ ప్రభుత్వం కూడా పరిష్కారం చూపించలేదు,ఎందుకంటే అది మనుషుల మనసుల్లో ఉండే నమ్మకాల నుండి పుట్టింది కనుక. ప్రదీప్ ఓ అగ్రకులస్థుడు. తెలివైన విద్యార్ధి. కానీ ప్రతి స్థాయిలో రిజర్వేషన్ కారణంగా రవికి తక్కువ ప్రతిభ ఉన్నప్పటికి కూడా రిజర్వేషన్ కారణంగా అవకాశాలు వస్తూ ఉంటాయి.అదే వారి ఉద్యోగాల్లో కూడా జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.తనను ప్రతిభతో గెలవమని,ఇప్పుడు సమాజంలో ఆర్థికంగా బాగు పడి కూడా తమ అవకాశాన్ని లాక్కుంటున్నారని,ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడింది తాను అని గట్టిగా రవితో వాదిస్తాడు ప్రదీప్.ఆ తరువాతి రోజు ప్రదీప్ ను,అతని కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు రవి.వారు రవిని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి,ఇల్లు మొత్తం తిప్పుతారు.తరువాతి రోజు రవి తన తండ్రితో ప్రదీప్ ఇంటికి వెళ్తాడు.అక్కడ మాత్రం వారిని ఇంటి బయటే కూర్చోపెట్టి, ఓ సత్తు గ్లాసులో టీ ఇచ్చి మాట్లాడతారు.అదే సమయంలో అక్కడికి వచ్చిన అగ్రకులస్తులకు ఇచ్చిన కనీస మర్యాద రవికి,అతని తండ్రికి ఇవ్వరు.అప్పుడు రవి తమ మనసుల్లో లేకపోయినా ప్రదీప్ లాంటి అగ్రకులస్థుల మనసుల్లో నాటుకుపోయిన సామాజిక కుల భావన గురించి స్పష్టం చేస్తాడు,ఎవరు ఇంకా అదే భావనలో ఉండిపోయారో ఆలోచించుకొమంటాడు.సమానత్వం అంటే సమాజంలో మనిషిగా సమ గౌరవం ఏ కులం అన్న ముద్ర లేకుండా పొందగలగడం,అది సాధించని సమాజం డబ్బుతో,అవకాశాలతో దానిని ఎప్పటికి భర్తీ చేయలేదని ఈ కథ స్పష్టం చేస్తుంది.
తన ఉద్యోగం శాశ్వతం కావడం కోసం జీవితాంతం పొరాడి ఇంకా మూడు నెలల్లో ఆ ఉద్యోగ కాలం అయిపోతున్న సందర్భంలో తన కొడుకుకు ఆ ఉద్యోగం దక్కి తనలా కాకుండా సుఖపడాలని ఆత్మహత్య వినూత్న పద్ధతిలో చేసుకున్న ఓ అటెండర్ కథే ‘తీపి చావు.’ మనుషులు పోరాటాలకు విలువ ఇవ్వరని,ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారని,ఆ ఫలితం లాభించనప్పుడు ఆ పోరాటానికి చులకనత్వం తప్ప గౌరవం ఉండదని స్పష్టం చేస్తుంది ఈ కథ.
మనుషుల వ్యక్తిగత జీవితాలు గోప్యంగా ఉండని సాంకేతిక యుగంలో జీవిస్తున్నాము మనం. ఓ ఒంటరి స్త్రీ భర్త మస్కట్ లో ఉండటం,ఆమె మీద నిఘాగా 24 గంటలు ఆమెను చెక్ చేయడానికి ఓ ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టడం,ఆమె ఒంటరి స్త్రీ అవ్వడం వల్ల ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని మగవాళ్ళు ప్రయత్నించడం,ఆమెను నిందించడానికి సాకుల కోసం తోటి ఆడవారు ఎదురు చూస్తూ ఉండటం, ఇటువంటి పరిస్థితుల్లో మీడియా అతి ఉత్సాహంతో ఆమె గురించి వార్త ప్రచురించడం,ఆమెలో పుట్టిన కల్లోల్లాన్ని మనని కూడా ఆమె పక్కనే పట్టి నిలుపుతుంది.మనిషి జీవితంలో స్వేచ్చను సాంకేతికత మింగేస్తున్న వైనాన్ని స్పష్టం చేసే కథ ‘మూడో కన్ను.’
పొట్ట కూటి కోసం ఓ జర్నలిస్టుతో అబద్ధాలు చెప్పి సాయం పొందుదామనుకున్న ఓ వృద్ధుడి అబద్ధాలు బయటి పడి అతని చావు వరకు రావడమే ‘ఇప్పుడే అందిన వార్త’ కథ.మనిషిలో ఒంటరితనం,నిస్సహాయత,ఎవరూ లేకపోవడం అతనిలో విలువలను,అనుబంధాలను హత్య చేసే తీరును ఈ కథ స్పష్టం చేస్తుంది.
సహజంగా బలవంతులు గెలవడం సాధారణమైన అంశం అయినప్పటికి,బలం లేకపోయినా ఎన్నో ఏళ్లుగా నిశ్చలంగా ఉండిపోయిన నిస్సహాయత ఎలా ఒక్కసారి ఉప్పెనై ప్రకృతి రీతిని సైతం తిరగబడేలా చేస్తుందో స్పష్టం చేసే కథే ‘ఆట.’ పాములు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులు ఓ పాములు పట్టే స్త్రీని తమ భవనంలో పాములు పట్టడానికి రమ్మని పిలుస్తారు.తాము అడవిలో వదలడానికే ఆ పని చేస్తున్నామని ఆమెను నమ్మిస్తారు.ఆ భవనంలో పాములు లేకపోవడం వల్ల దగ్గరలోని అడవిలో పాములు పట్టి డబ్బు సంపాదించుకోవాలనుకోవడం ఏ పాములు పట్టే వ్యక్తి అయినా చేసే పనే.ఆ బలహీనతనే అడ్డు పెట్టుకుని పాములను వారు సంపాదిస్తూ ఉంటారు.ఆ విషయం గమనించిన ఆ పాములతోనే వారికి మరణం సంభవించేలా చేస్తుంది.
ఈ 20 కథల్లో నేటి విద్యా రంగంలో ఇటు తల్లిదండ్రులు,అటు విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు,సామాజిక సమస్యలైన కాలుష్యం,శ్యాండ్ మాఫియా,నీటి సమస్యలు,మనుషుల అనుబంధాల్లో ఉండే ఆర్థిక కోణ పరిధికి విస్తరించిన సమస్యలు ఇలా పాఠకులని అనేక అంశాల పట్ల ఆలోచించేలా చేసే ఎన్నో విషయాలు మిళితమై ఉన్నాయి.అశోక్ గారి కథలు కథలు మాత్రమే కాదు,నేటి సమాజం-అందులోని మనుషులు,వారు చెప్పుకోవడానికి ఇష్టపడని వారి మనసుల్లో దాగి ఉన్న ఎందరో వ్యక్తుల రూపాలు,మనిషిలో ప్రగతితో పాటు లోపిస్తున్న మానవీయ కోణాలు కూడా.
* * *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ