మలుపుల్లో జీవితం

 చదువరి

మలుపుల్లో జీవితం
-శృంగవరపు రచన
(శీలా వీర్రాజు గారి 'మైనా' నవలా సమీక్ష)



సాహిత్యంలోని ప్రక్రియలు ఏ స్థాయిలో అయినా ఒక రకమే అయినా అవి రచయితల ఆలోచనా స్థాయి,ప్రపంచాన్ని,తన చుట్టూ ఉన్న మనుషులని,వారి జీవితాలను అర్ధం చేసుకున్న పరిధి విస్తృతిని అనుసరించి ఆ రచనాకృతి,ధ్వనిని అనుసరించి వినూత్న స్థాయిని చేరుకుంటాయి.మనుషుల జీవితాల్లో ఎన్నో మలుపులు,మార్పులు వయసు వేగంతో పయనిస్తూ ఉంటాయి.వాటిని సహజంగా భావించడానికి,వాటిని ఓ సినిమా చూసే ప్రేక్షకుడిలా,కథ చదివే పాఠకుడిలా చూడడానికి లేదా ఆ కథ రాసే రచయితలా గమనించడానికి మధ్య ఎన్నో రకాల ఆలోచనలు,అభిప్రాయాలు,విశ్లేషణలు ఆ జీవితాలనే ఎన్నో కోణాల నుండి ఆవిష్కరింపజేసేలా చేస్తుంది.శీలా వీర్రాజు గారి నవల 'మైనా' కూడా ఓ మనిషి జీవితంలోని మలుపులను ఆసక్తిగా గమనిస్తూనే, ఆ మలుపులోకి ప్రవేశించే వ్యక్తి ఆలోచనలు ఆ మనిషి మనస్తత్వానికి ఎలా విరుద్ధంగా ప్రవర్తిస్తాయో,మనుషులు-వాతావరణాలు కూడా ఎలా విభిన్న స్థాయిలో అతన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తాయో వంటి మానసిక సంఘర్షణ అంశాలను ఓ పాత్ర ద్వారా,అతని జీవితంలో అతనికి తారసపడ్డ వ్యక్తుల ద్వారా అతని సంపూర్ణ జీవన చిత్రాన్ని ఆవిష్కరించారు.ఆ నాయకుడి పాత్ర ద్వారానే పాఠకులు అతని జీవితంలోని వ్యక్తులను కూడా కొంతమేరకు అర్ధం చేసుకునేలా ఆ పాత్రలను అవసరం మేరకు మాత్రమే చిత్రీకరించారు.చిత్రకారుడు కూడా అయిన శీలా వీర్రాజు గారు ప్రతి స్త్రీ పాత్రను ఈ నవలలో మానసిక,భౌతిక స్థాయిలో సౌందర్య శిల్పాలుగా మలిచారు.
ఈ కథలో ముఖ్య పాత్ర సాయి బాబా. అతని బాల్యం నుండి అతని మధ్య జీవితంలోని మలుపుల వరపు ఈ కథ సాగుతుంది.తిరుపతయ్య సాయి బాబా తండ్రి. సంపాదన మీద ధ్యాస ఎక్కువ. ఆ రోజుల్లో తెలుగు ప్రాంతం నుండి బర్మాకు కొబ్బరి కురుడి,పీచు,అలానే మగ్గం మీద నేసిన బట్టలు వంటివి దిగుమతి చేసి,అక్కడ వాటితో వ్యాపారం చేసి,తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నుండి బియ్యం,పంచదార వంటివి దిగుమతి చేసుకునేవారు.అటువంటి వ్యాపారే తిరుపతయ్య.రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన హింసాకాండ బర్మాను భయంలో ముంచెత్తుతున్న రోజులవి.వ్యాపారంలో లాభాలను పెంచుకోవచ్చనే ఆశతో అక్కడే ఉండిపోయిన తిరుపతయ్య చివరకు అక్కడి పరిస్థితులు విషమించడంతో తాను సంపాదించినది అంతా ఎలా అయినా తిరిగి తన ఇంటికి తీసుకుపోవాలన్న కోరికతో బయలుదేరతాడు.అతని లాంటి వారు,బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు ఇంకొందరు,వివిధ కారణాల వల్ల అక్కడకి వచ్చిన భారతీయుల ఆలోచన అప్పుడు ఆ దేశం నుండి బయటపడటమే.అలా అందరూ కలిసి కాలి నడక తప్ప వేరే దారి లేకపోవడంతో రోజుల తరబడి,ఒకరి గురించి మరొకరు పట్టించుకోకుండా అడవుల గుండా ప్రయాణం చేస్తున్న సమయంలో లక్ష్మణ్ గౌడ్ అనే అతను తిరుపతయ్యకు పరిచయమవుతాడు.మొదట అతన్ని తిరుపతయ్య పట్టించుకోకపోయినా,డబ్బున్నా తిండి లేని సమయంలో అతని ఆకలి తీర్చడం వల్ల అతని పట్ల కృతజ్ఞత స్నేహంగా మారుతుంది.ఆ దారిలో విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల మరణిస్తున్న వారు ఎంతోమంది.అలా చనిపోతున్న వారి గురించి బాధ పడేవారే లేరు.ప్రతి ఒక్కరూ తాము తమ చోటుకు చేరుకోవాలన్న తపనే. లక్ష్మణ్ గౌడ్ కు ఆరోగ్యం క్షీణిస్తుంది.తిరుపతయ్య ఆ సమయంలోనే పోయిన తన డబ్బు పెట్టెను గమనిస్తాడు.ఆ సమయంలోనే అతనిలో మానవత్వం లక్ష్మణ్ కోసం తపించేలా చేస్తుంది.లక్ష్మణ్ మరణించినా అతను పెంచుకున్న మైనా మాత్రం తిరుపతయ్య దగ్గరే ఉండిపోతుంది. ఈ నవలలో ఈ మైనా పరోక్షంగా చాలా ముఖ్యమైన పాత్ర. డబ్బు తప్ప వేరే ధ్యాస లేని తిరుపతయ్య తనను పంజరం నుండి విడిపించినా సరే యజమాని కోసం తిరిగి రావడం ఆ పక్షి పట్ల,మనుషుల పట్ల అతని ఆలోచనల్లో మార్పు వచ్చేలా చేస్తుంది.ఆ మైనాను ఇంటికి తీసుకువస్తాడు.అలా పంజరం నుండి విడిపించినా మరలా పంజరంలోనే ఉండిపోవడానికే ఇష్టపడిన ప్రాణి ఈ నవలలో మైనా. యజమాని పట్ల దానికున్న కృతజ్ఞత బహుశా మైనాను బానిసత్వం గురించి ఆలోచించకుండా చేసి ఉండవచ్చు.నాటి నుండి ఆ మైనా తిరుపతయ్య ఇంట్లో పంజరంలో ఉంటుంది.
తిరుపతయ్యకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. సాయిబాబా మధ్యలోని కొడుకు.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ధరలు పెరిగిపోవడం వల్ల ఏ వ్యాపారం కూడా చేయకుండా,వ్యవసాయంలో కూడా నష్టాలు చవిచూస్తూ ఉన్నాడు తిరుపతయ్య. సాయి బాబా ఆ సమయంలో చదువుకుంటున్నాడు. ఆ సంవత్సరం ఆగస్ట్ 15 వ తేదీ. ఆ రోజు స్కూల్ కి వెడదామని బయలుదేరబోతున్న సాయిబాబా పంజరంలో ఉన్న మైనాకు తిండి గింజలు పెట్టాక,దానిని పంజరంలో పెట్టడం మర్చిపోయాడు,ఆ రోజు అది కూడా స్వేచ్చగా ఉంటుందని భావించాడు. కానీ అదే రోజు ఆ మైనాను ఓ పిల్లి పట్టడం వల్ల దానిని కాపాడే ప్రయత్నం చేసినా సరే అది మరణిస్తుంది. అది తెలిసిన తిరుపతయ్య కొడుకును,భార్యను చితకా బాదుతాడు.నాటి నుండి తిరుపతయ్య ఇంటి గురించి అసలు పట్టించుకోవడం మానేసి ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. సాయి బాబా చదువు ఆగిపోతుంది.మైనా మరణించడం,సాయి బాబా జీవితంలో అతి పెద్ద మలుపు.
చదువు ఆగిపోవడం,ఆకలితో పస్తులు ఉండటం,చిన్న పనులు చేయడం,ఆకలి భరించలేక ఆఖరికి కొబ్బరికాయలు దొంగతనం చేసి,వాటిని అమ్మి,ఆ విషయం బయటపడటంతో మరలా తండ్రి చేతుల్లో చావు దెబ్బలు తింటాడు.అదే సమయంలో పాటలు,పద్యాలు బాగా పాడుతున్న సాయిబాబు నాటకాల్లో నటించడం,దాని ద్వారా సంపాదించడం జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ఉద్యమాలు ముమ్మరంగా జరుగుతున్నా రోజులవి. సాయి బాబా నటిస్తున్న నాటకం కమ్యూనిస్టు భావాలు కలిగిందని అందరిని అరెస్ట్ చేయడం,సాయిబాబా అప్పటికి బాలుడు కావడం వల్ల తరువాత విడుదల చేయడం జరుగుతుంది.ఇది జరగకముందు సాయిబాబా తన స్నేహితులతో ఆడుకుంటూ,నవ్వుతూ,తుళ్ళుతూ తిరిగే వాడు.అతని స్నేహితుడు నీలకంఠం.ఓ సారి స్నేహితులు రెండు జట్టులుగా విడిపోయి సాయిబాబా,నీలకంఠం రెండు జట్టులుగా ఏర్పడి ఆడుకుంటున్న సమయంలో ఏర్పడిన గొడవలో నీలకంఠం మిగిలిన మిత్రులు నిమ్మకాయలు శ్మశానంలో పెడితే వాటిని అతను తీసుకువచ్చేలా పందెం వేసుకుంటారు.ఆ మిగిలిన స్నేహితులు ఆ సమయంలో నీలకంఠాన్ని భయపెట్టడంతో అతను అక్కడే భయంతో మరణిస్తాడు.(ప్రముఖ సినీ రచయిత, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు నచ్చిన పుస్తకాల్లో ఒకటిగా చెప్పుకున్న 'మైనా'లోని ఈ సంఘటన ఆయన 'అతడు' సినిమాలో ఉంది.)
ఇంటి నుండి పారిపోయిన సాయిబాబా తమ ఊరి వాడైన ఒకతను మిలిటరిలో ఉండటంతో అతని ద్వారా అక్కడి 'ఆర్మీ బాయ్స్ స్కూల్' లో చేరతాడు.కానీ కొంతకాలం ఉన్నాక ఇంటి మీద బెంగతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఆ తరువాత అతను అనుకోకుండా శరీర కొలతలు అన్నయ్యతో కలిసి ఇవ్వడం,అతను కూడా పోలీసుగా నియమించబడటం జరుగుతుంది.మొదట శిక్షణ. ఆ తరువాత ఓ డి యస్ పి కి బాడీ గార్డుగా నియమించబడతాడు. ఆ సమయంలో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు ఆ అధికారి.సాయి బాబా చేత పాటలు పాడించుకుని వినే ఆ అధికారి అతని పాటల్లో కమ్యూనిస్టు భావజాలం ఉందని అతని మీద పై అధికారికి ఫిర్యాదు చేస్తాడు.ఆ తర్వాత ఎన్నో బదిలీలు,సాయి బాబా జీవితంలో అతని ఎదురుతిరిగేతత్వం వల్ల ప్రమోషన్లు రాకపోవడం జరుగుతుంది.
సాయి బాబా జీవితంలో నలుగురు స్త్రీలు ఉన్నారు.అతను పుట్టిన వెంటనే అతని మేనమామ కూతురు కమల.పుట్టినప్పటి నుండి ఆమెను అతని భార్యగానే భావించేవారు. ఆమెను బాల్యంలో చూసినా అతను ఆమెను ఇంకో ఇద్దరు స్త్రీలు అతని జీవితంలోకి ప్రవేశించి,వెళ్ళిపోయేవరకు కమల అతని భార్య కాలేదు. సాయిబాబా జీవితంలో మొదటి స్త్రీ ముసియా.ఆమె భర్త వ్యాపారి.వయసులో భార్యాభర్తలకు ఎంతో వ్యత్యాసం ఉంది.వారి ఇంట్లోని వాటాలో అద్దెకు ఉంటున్న సమయంలో ముసియా అతని ఆహారం విషయంలో జాగ్రత్తగా చూసుకునేది.క్రమక్రమంగా ఆపేక్ష,స్నేహం శారీరక బంధంగా మారింది.ఆ విషయం ఆమె భర్తకు కూడా తెలుసని సాయి బాబాకు తర్వాత అర్ధమవుతుంది.అక్కడి నుండి 'ప్రిజన్ గార్డు'గా నియమించబడిన సమయంలో కూడా ఆమె కోసం ప్రాణాలకు తెగించి వెళ్తాడు సాయి బాబా.ఆమెలో అవసరాలను తీర్చే స్త్రీగా,ప్రేమ పంచే స్త్రీగానే భావిస్తాడు సాయి బాబా. ఆ తర్వాత ఆమె మీద అతనికి ఆసక్తి తగ్గిపోతుంది.దగ్గరయ్యే కొద్ది ఆమెకు దూరమవుతూ చివరకు వేరే చోటుకు బదిలీ అవ్వడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాయిబాబా .ఆ సమయానికి ఆమె గర్భవతి. ఆ తర్వాత కొంత కాలం వరకు ఆమె భర్త ఆమెకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నా,అపరాధ భావంతో దూరంలోనే ఉండిపోతాడు అతను. ముసియా కొడుకును కంటుంది. ఆ బిడ్డ తన బిడ్డ అన్న సంతోషం ఉంటుంది. ఏడేళ్ళ తర్వాత ఆ బిడ్డను చూడటానికి ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు అప్పటికే ఆ వ్యాపారి కొడుకు మెట్ల మీద నుండి పడి మరణించడంతో అక్కడి వ్యాపారాలు,ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోయాడని తెలియడంతో ఎంతో బాధ పడతాడు సాయిబాబా. ముసియాతో అతని సంబంధంలో ఆ బిడ్డ జననంలో తన ఉనికిని ఇంకా ఆమె దగ్గరే ఉందన్న భావనతో దూరంగా ఉండిపోయిన అతను ఆ బిడ్డ లేదని తెలియడంతో ఎంతో బాధపడతాడు.
సాయి బాబా జీవితంలో రెండో స్త్రీ హఫీజా. అతను అద్దెకు ఉంటున్న వాటాకు పూలు కోసుకోవడానికి వచ్చేది. ఆమె సౌందర్యం అసామాన్యమైనదని,ఆమె అందరి స్త్రీలలా ఉండటానికి పుట్టలేదని,ఆమె ఓ కళాఖండం అని భావించేవాడు సాయిబాబా.ఆమె రోజు పూలు కోసుకునే మిష మీద అక్కడికి వచ్చి సాయి బాబాతో సరదాగా ఉండేది.వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఆ తర్వాత సాయిబాబాకు కమలతో వివాహమైంది. కమలకు ఇంటి పనులు చేయడం రాకపోయినా ఆమెను ఎంతో .అపురూపంగా చూసుకునేవాడు.కమలకు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తుంది. అప్పుడప్పుడు హఫీజా సరదాగా అతనితో ఉండటానికి వస్తుంది.సాయిబాబాతో ఆమెకు సంబంధం ఉన్న అనుమానంతో ఆమె తల్లిదండ్రులు గొడవ చేస్తారు.ఆ తర్వాత ఆమెను పాకిస్తాన్ కు తీసుకు వెళ్తారు. ఆ సమయంలో ఆమె ఆ రైలు లో నుండి మాయమవుతుంది.ఆ సమయంలో ఆమె గర్భవతి అని తెలుస్తుంది.అప్పటివరకూ ఆమె మీద ఉన్న ఆరాధనా భావం సాయిబాబాలో మాయమవుతుంది. దానికి కారణం ఆమె మామూలు స్త్రీలా ఉండటమే. ఆమె మీద ఉన్న ఆరాధన భావం కాస్త ఆమె మీద అసహ్యంగా మారుతుంది.
కమల మొదటి బిడ్డ ప్రసవంలోనే మరణిస్తాడు. ఆ తర్వాత ఓ బాబు పుడతాడు. ఆ తర్వాత జీవితంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కుంటూ ఉంటారు. ఆ సమయంలో కమలా మరలా గర్భవతి అవుతుంది.అదే సమయంలో సాయిబాబాకు క్షయ ఉన్న విషయం బయట పడుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు నెలలు అతను ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఆ సమయంలో అతనికి పరిచయమైన స్త్రీయే నర్సయిన థెరిజా. ఆమె అందగత్తె కాకపోయినా ఆమె తన మీద చూపే ఆపేక్షకు ఆకర్షితుడవుతాడు సాయిబాబా. ఆ సమయంలోనే అతనికి ఓ రోగి పరిచయమవుతాడు.అతను ఓ రచయిత.కొన్నాళ్ళకి అతనికి నయమై వెళ్ళిపోతాడు. థెరిజా పట్ల మొదట్లో ఆకర్షితుడైన సాయిబాబా ఆమె ఆహ్వానించినా సరే తిరస్కరిస్తాడు.సాయిబాబాకు నయమవుతుంది.అదే సమయంలో అతనికి కూతురు పుడుతుంది.ఆ పాప వల్లే తనకు పునర్జన్మ లభించినట్టు భావిస్తాడు సాయిబాబా. నాటి మైనా అతని జీవితాన్ని తిప్పిన మలుపు గుర్తుకు వచ్చి తన కూతురికి 'మైనా కుమారి'అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటాడు.
ఈ నవలలో సాయిబాబా జీవితమే ప్రధానం అయినా, సాయిబాబా పాత్ర మనిషి మనస్తత్వంలోని వైరుద్ధ విచిత్రాలను స్పష్టం చేస్తుంది. మనుషులు ఏదైతే తనకు లభ్యమవుతుందో దాని పట్ల ఓ రకమైన చులకన భావం కలిగి ఉంటాడు. దక్కని వాటి మీద ఆరాధన భావం కలిగి ఉంటాడు.సులభంగా లభ్యమయ్యే వాటిని ఖాతరు చేయడు. ఈ మూడు రకాల భావాలను రచయిత సాయిబాబా జీవితంలోని స్త్రీల పట్ల అతని ప్రవర్తన ద్వారా స్పష్టం చేశాడు.
మంచిగా ఉన్నంతమాత్రాన మనుషులను మంచివారని అనుకోవడానికి లేదు. అధికారం,సమాజంలో హోదా,ఆర్థిక వ్యత్యాసాలు వంటివి మనుషుల మనసుల్లో ఎప్పుడు మానవ సంబంధాలను అంతర్లీనంగా ప్రభావితం చేసే అంశాలు.అవసరాలకు మంచితనం వినియోగించడం మనుషులు సాధారణంగా ప్రయోగించే అంశమే.స్త్రీల పట్ల మగవారిలో ఉండే అభిప్రాయాలూ వారి ప్రవృత్తిని,వారి మీద ఉండే ప్రభావాలను కూడా స్పష్టం చేస్తుంది.
జీవితంలో సంభవించే ప్రతి మలుపును గమనిస్తే మన జీవితం కూడా మనకు ఓ కొత్త కథలా కనిపిస్తుంది, ఆ చూడడంలోనే మనం కొత్తదనాన్ని అలవర్చుకోవాలని రచయిత చెప్పి చెప్పకుండానే చెప్పినట్టు అనిపిస్తుంది.
పాత్రల చిత్రీకరణలో పాత్రల పరిస్థితులు-మనస్తత్వాలను మానసిక సంఘర్షణల నుండి ఉద్భవించేలా చేస్తూ,ఆ ముఖ్య పాత్రలకు ప్రాణం పోశారు రచయిత.కథను కథలా కాకుండా మనిషి మనసులో కాలంతో,మనుషులతో మారే ఎదుగుదలగా చెప్పారు.అందుకే ఈ నవల నేటికి తెలుగు సాహిత్యంలో తన కీర్తిని శాశ్వతం చేసుకుంది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ