మానవ హంతకుల వేట

 మానవ హంతకుల వేట

-శృంగవరపు రచన


చరిత్రలో హిట్లర్, స్టాలిన్ ల క్రూరత్వం నిక్షిప్తమై ఉంది. ఇద్దరూ నియంతలుగా వ్యవహరించడం, యూధులను, తనకు వ్యతిరేకులని హిట్లర్ ఎలా దారుణంగా చంపాడో, అదే రీతిలో ఉక్రెయిన్ లో కరువు సృష్టించి మిలియన్ల మందిని చంపి, అంతే పైశాచికంగా ప్రవర్తించి స్టాలిన్ కూడా తన ముద్రను చరిత్రలో రక్తంతో రాసుకున్నాడు.
డేవిడ్ బల్డాసి కొన్ని రచనల్లో షా హీరోగా ఉంటాడు. చరిత్రలో హిట్లర్, స్టాలిన్ లాంటి మానవ హంతకులు, వారి దగ్గర పని చేసిన చాలా మందిని పట్టుకుని శిక్షించినప్పటికి కూడా కొందరు ముందే ఈ పరిణామాన్ని ఊహించి వేరే దేశాలకు పారిపోయి తమ ఉనికిని మార్చుకుని జీవనం కొనసాగించారు. అటువంటి వారిని గాలించి పట్టుకుని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ బృందాన్ని, షా ను కలిపి రచయిత 'Deliver Us from evil' నవలను థ్రిల్లర్ గా రాసారు.
ఈ నవలలో నాయిక రెజ్జి. ఆమె మాలరీ అనే ప్రొఫెసర్ మరియు ఇంకొందరితో కలిసి ఓ బృందంగా ఏర్పడి ఎవరైతే హిట్లర్, స్టాలిన్ లతో కలిసి మారణ హోమాలు చేసి తప్పించుకుని బ్రతుకుతున్నారో వారిని వేటాడి చంపడం. ఈ నవల మొదటి అంకంలో రెజ్జి హిట్లర్ దగ్గర పని చేసి ఎంతో మందిని చంపి తప్పించుకుని రహస్యంగా బ్రతుకుతున్న హుబర్ అనే కోటీశ్వరుడి దగ్గర బార్బరా అనే మారుపేరుతో చేరి అతన్ని హతమార్చడంతో మొదలవుతుంది. ఆ బృందానికి నాయకుడు మాలరీ. వారి తరువాతి టార్గెట్ స్టాలిన్ దగ్గర కెజిబి లో పని చేసి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఫెడిర్ కుచిన్.
ఫెడర్ ప్రస్తుతం ఓ వ్యాపారవేత్తగా ఉన్నాడు.అమ్మాయిలను అమ్మడం, డ్రగ్స్ లాంటి వాటిల్లో ఉన్నాడు. అతను ప్రొవిన్స్ కు వెళ్తున్నాడన్నా సమాచారం తెలుసుకున్న రెజ్జి బృందం అక్కడ అతన్ని హతమార్చాలనుకుంటుంది. అందుకు రెజ్జి అతను ఉండబోయే విల్లా పక్కన ఇంకో విల్లా తీసుకుంటుంది. ఆమెకు సాయంగా దూరంగా విట్, డామినిక్ ఉంటారు. ఇవాన్ వాలర్ గా ప్రస్తుతం పేరు మార్చుకున్న ఫెడర్ నూక్లియర్ వెపన్స్ కు కావాల్సిన యురానియంను ముస్లిం దేశాలకు అందించాబోతున్నాడన్న విషయం తెలుసుకున్న షా దానిని అడ్డుకోవడానికి అదే ప్రాంతంలోకి దగ్గరగా ఉన్న ఓ హోటల్ లో దిగుతాడు. అతనికి, రెజ్జికి పరిచయం అవుతుంది. క్రమక్రమంగా రెజ్జి ఫెడర్ ను ఆకర్షిస్తూ ఉంటుంది. షాతో సన్నిహితంగా ఉంటూ ఫెడర్ ను రెచ్చగొట్టి తనకు త్వరగా దగ్గర అయ్యేలా చేసి అతన్ని చంపాలనుకున్న ఆమె షాను ఇష్టపడుతుంది.షా వల్ల రెజ్జి చేయవలసిన పని సరిగ్గా చేయడం లేదని భావించిన మాలరీ అతన్ని కిడ్నాప్ చేయమని చెప్తాడు. షాను కిడ్నాప్ చేస్తారు. అంతే కాకుండా షాకు తాము చేయబోయేది తెలుసు కనుక అతన్ని చంపమని చెప్తాడు. కానీ తప్పించుకుంటాడు షా.
ఇకపోతే ఫెడర్ అక్కడికి యురేనియం విషయం మీద వచ్చి ఓ ముస్లింను కలుస్తాడు. ఫెడర్ మీద నమ్మకం లేక అతన్ని చంపే ప్రయత్నం చేయడంతో ఫెడర్ అతన్ని చిత్రవధ చేసి చంపుతాడు. దానితో అతను యురేనియం మిషన్ నుండి తప్పుకుంటాడు. అతను యురేనియం నుండి తప్పుకోవడంతో దాని కోసమే అతన్ని టార్గెట్ చేసిన షాకు పై అధికారుల నుండి ఇక ఆ మిషన్ లేదని తెలుస్తుంది. కానీ అప్పటికే రెజ్జి అతన్ని చంపడానికి ప్రయత్నస్తుందని గ్రహించిన షా ఆమెను కాపాడాలనుకుంటాడు.
ఈ నవలలో షా దగ్గర ఉండే రెండు పాత్రలు ముఖ్యమైనవి. ఒకరు రైస్. రైస్ తెలివైనవాడు, అతనే ఫెడర్ వ్యాపార వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. ఇకపోతే రెండో వ్యక్తి పాస్కల్. పాస్కల్ ఫెడర్ సెక్యూరిటీ లో టాప్ గా ఉన్నాడు. ఫెడర్ ఓ గ్రీకు స్త్రీతో కలిగి ఉన్న సంబంధం వల్ల పుట్టినవాడు పాస్కల్. ఆ తర్వాత ఆమె మరణించాక అనాధగా ఉన్న పాస్కల్ ను తన దగ్గరే ఉంచుకుని అన్ని నేర్పించి తన ముఖ్యమైన రక్షకుడిగా ఉంచుకుంటాడు.
రెజ్జి ఫెడర్ ను చంపాలనుకున్న ప్రయత్నంలో విఫలం అవ్వడం, షా వారిని కాపాడటం జరుగుతుంది. ఈ చంపే ప్రయత్నం గురించి చక్కగా రాసారు రచయిత. ఫెడర్ ను మార్కెట్ నుండి దారి మళ్ళించి వేరే చోటుకు తీసుకువెళ్లిన ఆ సమయంలోనే రైస్ పాస్కల్ మరియు మిగిలిన వారిని వెంటబెట్టుకుని వస్తాడు.ఆ సమయంలో ఫెడర్ ను కాపాడే ప్రయత్నంలో ఫైర్ చేస్తాడు రైస్. అతను నిజానికి ఫెడర్ నే షూట్ చేయాలనుకున్న అది గురి తప్పిన విషయాన్ని షా, ఫెడర్ ఇద్దరూ గుర్తిస్తారు. తన తర్వాత తన బిజినెస్ తీసుకోవడం కోసం అలా రైస్ చేసాడని అప్పుడే గుర్తించిన ఫెడర్ బయట పడడు.
ఆ తర్వాత షాను, రెజ్జిని పట్టుకోవడానికి షాకి సన్నిహితురాలైన కేటీని కిడ్నాప్ చేస్తాడు ఫెడర్. ఆమె కావాలంటే షా, రెజ్జి ఇద్దరూ రావాలని చెప్తాడు. మొత్తానికి వారు వెళ్లడం రైస్ ను కూడా వారితో కలిపి అందరిని హంట్ పేరుతో వదిలి ఒక్కొక్కరిని చంపే ప్రయత్నం చేస్తాడు ఫెడర్. రైస్ ను చంపుతాడు. ఆ తర్వాత పాస్కల్ వారికి గన్, ఫోన్ ఇస్తాడు. తానే రెజ్జి బృందానికి ఫెడర్ గురించి సమాచారం ఇచ్చానని, తన తల్లి విషయంలో తాను ఎప్పటికి అతన్ని క్షమించనని చెప్తాడు. అలా వాటి సాయంతో ఫెడర్ ను అంతం చేసి అక్కడ నుండి బయటపడతారు.
క్రైమ్ థ్రిల్లర్ కు చరిత్రను కూడా ఎలా కల్పనగా మార్చుకోవచ్చో ఈ నవల స్పష్టం చేస్తుంది. కొన్ని చోట్ల బోర్ కొట్టిన బల్డాసి అభిమాని అయితే తప్పక చదవండి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!