చెల్లని కాసులు

 చెల్లని కాసులు

-శృంగవరపు రచన


కష్టం-సుఖం, బలం-బలహీనత, నిజాయితీ -ప్రలోభం,శ్రమ-ఫలితం మనుషుల జీవితాల్లో భాగమైన అంశాలు. స్థిరపడిపోయిన ఆచారవ్యవహారాలు, ధనవంతుల పరోక్ష రాచరికం,విధేయతతో జీవితాన్ని బానిసత్వంలో నెట్టే పరిస్థితులు, వివక్షలు ఈ సమాజంలో కొందరికి అన్నింటిని తమకు అనుకూలంగా తప్పు-ఒప్పులకు సమాధానం చెప్పనవసరం లేనటువంటి దర్జా-హోదాను ఇస్తే మరికొందరిని దోపిడి ఉత్పత్తుల్లా మార్చి వారి జీవితాలను చెల్లని కాసులుగా మారుస్తుంది.ఈ సందర్భాన్ని పరిస్థితులు-అవసరాలు-పేదరికం-సామాజిక స్థాయి కోణాల నుండి విశ్లేషించి రాయలసీమ పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు రాసాని గారు రాసిన నవలే 'చీకటి ముడులు.'
ఈ నవలలో ప్రధాన పాత్ర కుశాలన్న. అతను కథ ప్రారంభం నాటికి మలి దశలో ఉన్నాడు. మధ్య వయసులో ఉండగానే వృద్దాప్య ఛాయలు ఉన్న వ్యక్తిలా మారిపోయాడు, నడుము పడిపోయి దేకుతూ నెల్లూరు నుండి తన స్వగ్రామం చేరుకోవడంతో కథ మొదలవుతుంది.
ఈ నవలలో ప్రారంభ సన్నివేశమే రచయిత చెప్పాలనుకున్న వాస్తవిక కోణాన్ని పాఠకులకు పరిచయం చేస్తుంది. పల్లెటూర్లకు వెళ్లే బస్సులు తక్కువ. ఈ కథ చిత్తూరు జిల్లాలోని పులిచర్ల దగ్గరలో ఉన్న 'బండారోళ్ళ పల్లె'నేపథ్యంతో సాగుతుంది. ఆ పల్లె కుశాలన్న స్వగ్రామం. కుశాలన్న ఆ పల్లె వెళ్లే బస్సులో నిలుచుని వేలాడుతూ ఉన్న ప్రయాణికుల కాళ్ళ మధ్య బస్సు మధ్యలోనే కూర్చుండిపోయాడు. అతను ఉన్నాడనే ఎవరూ గమనించలేదని రచయిత రాస్తారు. అంటే నాయకుడి ఉనికికి ప్రత్యేక గుర్తింపు సమాజంలో లేదని పరోక్షంగా చెప్పడమే. దానికి కారణాలు కుశాలన్నతో పాటు అతని కథను మనం తెలుసుకున్నప్పుడే మనకు అర్ధమవుతుంది.
కుశాలన్న ఆయిల్ మిల్లు యజమాని దగ్గర వంటవాడిగా పని చేస్తున్న సమయంలో యజమాని చనిపోవడంతో యాజమాన్యం మారడంతో అతని పని పోవడంతో అతను కంపెనీలో కూలీ పనికి, అతని భార్య వ్యవసాయ పనులకు వెళ్తూ ఉండేది.
కుశాలన్నకు కూతురు గౌరి, కొడుకు పాలేటి. ఆ కంపెనీలో దయ్యం ఉందనే పుకారు ఉంది. రాత్రి కుశాలన్న పని చేస్తూ ఉన్న సమయంలో కరెంటు పోవడంతో ఆ దయ్యాంలా వచ్చి భయపెడుతుంది కంపెనీకి చెందిన మనిషేనని, కంపెనీలో ఇనప సామాను విలువైంది ఉంటుంది కనుక దానిని ఎవరూ దొంగతనం చేయకుండా ఉండటానికి ఓ వ్యక్తిని అలా పంపి భయపెడుతున్నారని అర్ధం చేసుకుంటాడు. దయ్యం రహస్యం తెలిసిపోయిన కుశాలన్నను ఎలా అయినా పని నుండి తప్పించాలని యాజమాన్యం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కంపెనీలో ఎంతోమంది ఆదాయం కోసం గోనెసంచులను దొంగతనంగా తీసుకువెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. అలా మొదటి సారి చేయబోయి దొంగ అనే ముద్ర వేయించుకుని ఉద్యోగం కోల్పోతాడు. ఆ తర్వాత అతనికి ఆ చుట్టూపక్కల పని దొరకడమే కష్టమై పోతుంది.
ఆ సమయంలో అతని భార్య దేవకి ఆ కంపెనీ ఎదురుగుండా తినుబండారాలు అమ్మే ప్రయత్నం చేస్తుంది.దేవకి లాగే అక్కడ అదే పని చేసుకుంటుంన్న సిద్ధమ్మకు కన్ను కుట్టి తెలివిగా దేవకికి ఆ పని కూడా లేకుండా చేస్తుంది.ఈ సంఘటన వల్ల ఓకే స్థాయి జీవితమైనా సిద్ధమ్మ ప్రదర్శించిన తెలివి, గడుసుతనం, తెగువ దేవకి చూపలేకపోయింది. స్థాయి ఏదైనా అవి లేకపోవడం వల్లే ఆమె అక్కడ పని కోల్పోయింది.
ఆ తర్వాత దాసన్న కుటుంబం దగ్గర పెద్ద జీతగాడిగా కుశాలన్న కుదురుతాడు.దేవకి కూడా అక్కడే పని చేస్తూ ఉంటుంది. మంగయ్య దాసన్న రెండో కొడుకు. అతనే కుటుంబవ్యవహారాలు చూస్తూ ఉంటాడు. స్త్రీ వ్యామోహం అధికం. దేవకిని లోబర్చుకుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జీవన ఉపాధి పోతుందన్న భయం, పెద్దవారిని ఎదిరించి బ్రతకలేమన్న బెదురుతో ఆమె లొంగిపోతుంది. ఇక్కడే ఆమె నైతిక పతనం మొదలవుతుంది. అక్కడ పని చేస్తున్న సమయంలో మంగయ్య భార్య గొలుసు పోతే ఆ దొంగతనం కుశాలన్న చేసాడని చావగొడతాడు మంగయ్య. ఆ దొంగతనం మంగయ్య తమ్ముడు కేశవయ్య కొడుకు చేసాడని తెలియడంతో వదిలిపెట్టినా ఆ అవమానం కుశాలన్నను దహించివేస్తూ ఉంటుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అవుతాడు. అదే సమయంలో ఆ ప్రాంతమంతా కరువు. ఆ సమయంలోనే వ్యభిచారం జోరందుకుంటుంది.
దేవకి కుటుంబానికి తెలియకుండా రహస్యంగా ఆకలి తీర్చడం కోసం వ్యభిచారం చేస్తుంది. ఆ కరువు సమయంలో తమ కొడుకుకు ఎక్కడన్నా కడుపు నిండితే చాలని కుశాలన్న పాలేటిని బెంగుళూరులో ఓ హోటల్ లో పనికి కుదురుస్తాడు. ఆ తర్వాత దేవకి ఓ సారి భర్తకు దొరికిపోవడం ఆమెను ఇంటి నుండి గెంటేయ్యడం జరుగుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు.
ఆ తర్వాత కుశాలన్న ఓ సారి గయ్యాళి నల్ల ఆవును కాస్తున్న సమయంలో అది ఉలవచేను మీద పడటం, యజమాని మీద దాడి చేయబోవటం, కుదరకపోవటం వల్ల కుశాలన్నను పొడవబోవటంతో అతను దానిని కొట్టడం, ఆ తర్వాత అది అనారోగ్యానికి గురై మరణించడంతో వెయ్యి నష్టపరిహారం కుశాలన్న మీద పడటం అక్కడి నుండి పనిలో నుండి తీసేయ్యడం కూడా జరుగుతుంది. తర్వాత ఇంకో పని కూతురితో పాటు చేసుకుంటున్న సమయంలో గౌరిని కూడా ఆ యజమాని పాడు చేసే ప్రయత్నం చేయబోవడంతో ఆ పని మానేస్తారు. ఆ సమయంలో ఆవులను మేపే పని కుదుర్చుకుంటాడు కుశాలన్న. అదే సమయంలో గౌరి మీద మంగయ్య అత్యాచారం చేయబోతున్న సందర్భంలో ఆమె బావిలో పడి మరణించడం, మంగయ్య పాము కరిచి మరణించడం జరుగుతుంది. ఇక అక్కడ చేసేది లేక నెల్లూరు వెళ్ళిపోతాడు కుశాలన్న. అక్కడ నిమ్మ తోటకు కాపలా కాసే శ్రమ తక్కువ పనైనా కొబ్బరి చెట్టు నుండి పడి నడుము విరగ్గొట్టుకుని ఇక ఆఖరి రోజుల్లో కొడుకును చూద్దామని సొంత ఊరు వస్తాడు. అక్కడ కొడుకు కొంతకాలం దాసన్న కుటుంబం దగ్గర పని చేసినా తన కాలం నాటి అప్పు తిరలేదని తెలియడంతో మండిపడతాడు కుశాలన్న. అతను కొడుకును ఎదురు తిరగమని ప్రోత్సహిస్తాడు. అతను తాను ఇక పనిలోకి రానని గట్టిగా చెప్తాడు. దీనితో నవల ముగుస్తుంది.
ఈ నవలలో పేదరికం, కరువు లాంటివే సమస్యలు కాదు మనుషులు తాము పని చేసేవారికి బానిసలమని భావించడం, ఆ భావన వారిలో పెంచేలా పెద్దలు ప్రవర్తించడం, లేని అప్పులు బనాయించడం, మగ వారి శ్రమను, స్త్రీల శీలాన్ని దోచుకోవడం సహజమన్న భావన ఇరు మనస్తత్వల్లో బలపడిపోవటం కూడా ప్రధాన సమస్యే. ఆ భావనలే నిజాయితీ, విశ్వాసం ఉన్న వ్యక్తులను బానిసలుగా, డబ్బు-అన్నింటి మీద యజమాని తత్త్వం ఉన్న మనిషులను అనాదికార రాజులుగా రూపొందేలా చేస్తుంది.
మనిషి ఉనికికి గుర్తింపు తనను తాను 'Superior'గా నిరూపించుకోవడంలోనే ఉంటుందన్న మనస్తత్వం పైకి చెప్పకపోయినా ఎక్కడో సమాజ స్వరూపంలో బలపడిపోయింది. అదే నేటికి బాసిజం,పురుషాదిక్యత, కుల వివక్ష రూపాల్లో స్థిరపడిపోయింది.నాటి బానిసత్వం నేడు అధికారంలో ఉన్న వారితో ఉండే మంచితనం-లౌక్యంగా వ్యవహరించడంగా మారిపోయింది.
రూపాలు ఏవైనా ఇది అన్ని స్థాయిల్లో పరోక్షంగా ఉండే సమస్యే. ఇది ఆర్ధిక వ్యత్యాసాలు, వర్గ వ్యత్యాసాల వల్లే కాదు కుటుంబంలో ఒకరికి ఒకరికి మధ్య కూడా అనేక అవ్యక్త కారణాల వల్ల కూడా బలపడి ఉంటుంది.సమానత్వం అంటే హోదాకు, డబ్బుకు, గ్లామర్ కు, తెలివికి కాకుండా మనిషిగా సమ గౌరవాన్ని అన్ని స్థాయిల్లో పొండగలగడమే. ఇంత సాధారణ అంశం క్లిష్టంగా మారడానికి కారణం సమానత్వం అన్ని స్థాయిల్లో ఇలా ఉంటే కొందరు ఆ ఆధిపత్య ఉనికిని కోల్పోయి న్యూనతకు గురై, ఆ తర్వాత పైశాచిక తత్వాన్ని అలవర్చుకునే ప్రమాదము ఉంది. అదే అత్యాచారం కావచ్చు, హత్య కావచ్చు ఏదైనా సరే ఆ మనస్తత్వాన్ని వేరేలా భర్తీ చేసుకోవాలనే కోరిక వారిని నేరస్థులుగాను మార్చవచ్చు.
ఎటువంటి సామాజిక అంశాన్ని అయినా సరే క్షుణ్ణంగా పరిశీలించి, ఆ ప్రాంతపు మాండలికాన్ని కూడా జోడించి ఆ పాత్రలో లీనమై, ఆ వ్యథలో భాగమై రాసే రాసాని గారి శైలి చదివింపజేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!