డబ్బు ఉన్న(లేని) జీవితం

 చదువరి

డబ్బు ఉన్న(లేని) జీవితం
-శృంగవరపు రచన


మనుషుల అవసరాలకు కావలసింది డబ్బు. డబ్బు కోసం మనిషి ఏదైనా చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు, ఏదైనా పొందవచ్చు అనే అహంకారం కూడా మనిషిలో బలపడవచ్చు. ఈ రెండు సందర్భాల్లో మనుషుల మనస్తత్వాలను, బలహీనతలను, ఆశలను స్పష్టం చేసే నవలే చతురలో ప్రచురించబడిన వి. నాగరత్న గారి 'సఖి.'
కోటీశ్వరుడు,'అలకనంద జూవెలర్స్' అధినేత రామ్మోహన్ హత్యకు గురవుతాడు. అతను చాలా సౌమ్యుడు, ఎవరితోనూ గొడవ పడడు, లౌక్యం ఉన్న వ్యక్తి అన్న పేరు ఉన్న వ్యక్తి.అలాంటి వ్యక్తిని ఎవరు హత్య చేశారో కనుక్కోవడానికి పోలీస్ ఆఫీసర్ బోస్ రంగంలోకి దిగుతాడు.
మొదట రామ్మోహన్ భార్య సునందకు, అతనికి సత్సంబంధాలు లేవనే విషయం తెలియడంతో మొదట ఆమెను అనుమానిస్తారు. తన భర్తకు వివాహిత మరియు అతని మరదలు అయిన మమతతో సంబంధం ఉండటం, అది ఓ సారి తన కళ్ళపడ్డప్పటి నుండి ఇద్దరూ శారీరకంగా, మానసికంగా ఉంటున్నారని సునంద స్పష్టం చేస్తుంది.
రామ్మోహన్ మరదలు మమత నుండి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి బోసుకు.మమత మొదటి నుండి రామ్మోహన్ ను పెళ్ళి చేసుకోవాలని ఆశ పడ్డప్పటికి కూడా అతను అప్పటికి జీవితంలో స్థిరపడకపోవడం వల్ల ఆ పెళ్ళికి మమత తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ తరువాత మమత వివాహం ఆంజనేయులుతో జరిగిపోవడం, విశాఖలో స్థిరపడిపోవడం జరిగిపోతుంది. ఈ లోపే రామ్మోహన్ వ్యాపార రంగంలో అడుగుపెట్టి కన్ స్ట్రక్షన్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ లో అడిగి పెట్టి కోటీశ్వరుడు అవుతాడు. దానితో తాను అతన్ని వివాహం చేసుకుని ఉంటే బావుండేది అని మమత అనుకుంటుంది. ఆ తర్వాత ఆమెకు, అతనికి మధ్య సంబంధం ఏర్పడుతుంది.
రామ్మోహన్ ద్వారా తాను బాగుపడాలని ఆశిస్తుంది మమత. ఆమె కుటుంబానికి అనుమానం రాకుండా ఆమె భర్త ద్వారానే రెండు నెలలు ఇంస్టాల్మెంట్ కట్టించి ఆ తరువాత లక్కీ డ్రాలో వారికి ఆ ఫ్లాట్ వచ్చేలా చేస్తాడు. దానితో పాటు ఆమె భర్తకు హైదరాబాద్ బదిలీ అయ్యేలా చేస్తాడు. ఆమె ఓ ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవడానికి ఆర్ధిక సహకారం అందిస్తాడు. ఆ తర్వాత ఆమె క్రమంగా ఎదిగి డిజైనర్ క్లోతింగ్ ఉత్పత్తులను కూడా అమ్ముతూ ఉంటుంది. ఆ సమయంలో పండరి అనే అమ్మాయిని అసిస్టెంట్ గా పెట్టుకుంటుంది. అక్కడికి వచ్చిన రామ్మోహన్ ఆమె మీద తన దృష్టి మరల్చి ఎక్కువ జీతం ఇచ్చి తన ఆఫీసులో పనికి పెట్టుకుంటాడు.దానితో మమత అతనితో సంబంధం తెంచుకుంటుంది. ఆ తర్వాత అతని గురించి తనకు తెలియదని చెప్తుంది మమత.
పండరి నుండి దానికి కొనసాగింపు కథ తెలుస్తుంది బోసుకు.పండరితో సంబంధం ఉన్న రామ్మోహన్ ఆమెకు భరద్వాజ గురించి చెప్పాడని చెప్తుంది.అతను విదేశాలలో నుండి వచ్చి ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం కోసం రామ్మోహన్ ని కలిస్తే ఓ స్థలంకు బయానా ఇప్పించి తర్వాత దానిలో గ్రానైట్ ఉందని తెలిసి దానిని తన భార్య పేరు మీద అనుమానం రాకుండా కొని ఇంకో స్థలం ఇప్పించాడని చెప్తుంది పండరి.
ఆ తర్వాత రామ్మోహన్ చనిపోయే రోజు ఆశయ హోటల్ కు వెళ్ళినప్పుడు కలిసిన వ్యక్తి అయిన పాండును పట్టుకుంటారు. అతని ద్వారా ఓ న్యూస్ ఛానల్ లో కెమెరా మ్యాన్ అయిన మహేష్ ను పట్టుకుంటారు. అతని ద్వారా అసలు విషయం తెలుస్తుంది.మహేష్ పండరి ఫ్లాట్ కు ఎదురు ఫ్లాట్ లో ఉండేవాడు. ఆ ఫ్లాట్ పండరికి ఇచ్చింది రామ్మోహన్.మహేష్ కు దగ్గగర అవుతుంది పండరి. రామ్మోహన్ పిల్లలను కననివ్వడని, తనకు అవసరం ఉంటేనే వస్తాడని లేకపోతే పట్టించుకోడని చెప్తుంది. భార్య పురిటి నుండి తిరిగి వచ్చాక ఆమెను ఒప్పించి రెండో పెళ్ళి చేసుకుంటానని ఆమెకు చెప్తాడు.
రామ్మోహన్ కు వీరి సంబంధం తెలియడం, ఆమెను కొట్టడం చేస్తాడు. ఆ తర్వాత మహేష్ అతన్ని అడ్డు తొలగించుకుంటే పండరికి ఇచ్చిన ఫ్లాట్, నగలు దక్కుతాయని, నలభైలో ఉన్న ఆమెకు పిల్లలు పుట్టే వకాశం ఉండదు కనుక తన భార్యను ఒప్పించి ఆ ఆస్తిని ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు. దాని కోసం రామ్మోహన్ ను అడ్డు తొలగించాలనుకుంటాడు
పండరికి మాత్రం భరద్వాజ లాంటి రామ్మోహన్ మోసం చేసిన వారిని రెచ్చగొట్టి వారే చంపేటట్లు చేస్తున్నానని చెప్తాడు. భరద్వాజ అందుకు ఒప్పుకోడు. ఆ హత్య చేయించడానికి అయ్యే ఖర్చు పాండు అనే అతనికి విరాళం ద్వారా భరద్వాజ నుండే సంపాదిస్తాడు మహేష్. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేయడంతో నవల ముగుస్తుంది.
తనకున్న డబ్బుతో స్త్రీలను పొందుతూ, వారి బలహీనతలను ఆసరా చేసుకుని జల్సాగా గడిపే రామ్మోహన్ ను ఆ డబ్బు బలహీనత హత్యకు గురయ్యేలా చేసింది.మనుషుల మనస్తత్వాలు డబ్బు లేమి నుండి డబ్బు పొందే మార్గంలో ఎలా మారతాయో స్పష్టం చేస్తూనే, చదివింపజేసే నవల 'సఖి.'

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ