గిల్టీ

   గిల్టీ 

-శృంగవరపు రచన



చాలా సినిమాలు మనం చూశాక కూడా మనల్ని వెంటాడతాయి.దానికి కారణం ఆ సినిమాలో ఉండే ప్రత్యేకతలతో ప్రేక్షకులు కనక్ట్ అవ్వడమే.అలాంటి ఓ జర్మన్ సినిమానే 2014 లో వచ్చిన ‘Stereo.’మొదట ఈ సినిమా అర్ధం కాలేదు.సెకండ్ హాఫ్ చివరి వరకు కూడా పూర్తిగా అర్ధం కాదు.కానీ అర్ధం అయ్యాక సినిమాను పారా నార్మల్,సూపర్ న్యాచురల్,సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ గా కొంత Alternate Reality ని కూడా కలిపి ఎలా ఓ అద్భుతంగా మార్చారో అని కచ్చితంగా అనిపిస్తుంది.         

          ఈ సినిమాలో ముఖ్య పాత్ర పేరు ఎరిక్ కెప్లర్.అతనికి ఓ గ్యారేజ్ ఉంది,మోటార్ బైకులను బాగు చేస్తూ ఉంటాడు.అతనికి ఓ లవర్ ఉంది.ఆమె పేరు జూలియా.ఆమెకు ఓ పాప కూడా ఉంది.ఎరిక్ కు ఓ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు.అతను ఎవరికి కనిపించడు.ఎరిక్ తో మాట్లాడుతూ కూడా ఉంటాడు. ఈ లోపు ఒకతను కెప్లర్ దగ్గరకు వచ్చి కెప్లర్ బ్రతికి ఉన్నట్టు కైటేల్ కు తెలిసిపోయిందని,హత్య చేసినందుకు ఫలితం అనుభవించాలని బెదిరించి వెళ్తాడు.ఆ వచ్చిందో ఎవరో కెప్లర్ కు అర్ధం కాదు.దీనితో పాటు తనకు మాత్రమే కనిపిస్తున్న వ్యక్తి తన భ్రమ వల్ల వచ్చి ఉంటాడని,వదిలించుకుందామని అనుకుంటాడు.

          ఓ సైక్రియాటిస్ట్ సజెస్ట్ చేస్తే ఓ ఫెయిత్ హీలర్ మరియు ఆక్యుపంచర్ చేసే ఓ స్త్రీని కలవడానికి వెళ్తాడు.ఆమె అతనికి కనిపించే వ్యక్తి ఓ సూపర్ నేచురల్ శక్తి లేదా ఆత్మ అన్నట్టు ప్రేక్షకులకు అనిపించేలా చేస్తుంది.ఆ తర్వాత కైటేల్ బలవంతంగా కెప్లర్ ను తీసుకువెళ్తాడు.జూలియాను,ఆమె కూతురిని,తండ్రిని కూడా కిడ్నాప్ చేస్తాడు కైటేల్.ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక  కెప్లర్ గతంలో జరిగింది ప్రేక్షకులకు స్పష్టం చేస్తాడు దర్శకుడు కెప్లర్ కు ఆ స్మృతులు వచ్చేలా చేసి.

          కెప్లర్ అసలు పేరు కూడా అది కాదు.అతను గ్యాంగ్ స్టర్ కైటేల్ తో కలిసి పని చేసేవాడు.ఓ హత్య అనుకోకుండా ఓ పని తప్పి చేస్తాడు. అతనికి ఓ అన్న,వదిన ఉంటారు. వదిన గర్భవతి.తన తప్పుకు ప్రతీకారంగా తన కుటుంబాన్ని చంపుతారని భావించిన అతను అన్న దగ్గరకు వెళ్ళి తనతో వచ్చెయ్యమని అడుగుతాడు. ఈ లోపే ఆ ఇంటిని కాల్చేసి ఆ అన్నా,వదినలను హతమారుస్తాడు కైటేల్.అక్కడి నుండి తప్పించుకున్న అతను తన గతాన్ని మర్చిపోయి కెప్లర్ గా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నాడు.

          ఇకపోతే అతనికి కనిపించేది చనిపోయిన అతని అన్న అని మనకు ఈ గతం తెలిసాక అర్ధమవుతుంది. చివరకు జూలియాను,ఆమె కుటుంబాన్ని కైటేల్ బృందాన్ని చంపి కాపాడతాడు.వారు బయటపడినా కెప్లర్ మాత్రం అక్కడే మిగిలిపోతాడు ద్వారం మూసుకుపోవడం వల్ల.అప్పటికే అతన్ని షూట్ చేయడం వల్ల అతను చనిపోతూ ఉన్నప్పుడూ అతన్ని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి మాయమైపోతాడు.అలాగే కెప్లర్ జూలియా వచ్చి తనను కాపాడి తీసుకువెళ్లినట్టు ఊహించుకుంటూ మరణిస్తాడు.

          ఈ సినిమా నిజంగానే మైండ్ బ్లోయింగ్. కెప్లర్ తన గతాన్ని మర్చిపోయినా,అతని సబ్ కాన్షియస్ లో ఉన్న గిల్టీ భావనా అతని అన్న హత్యకు బాధ పడుతూ ఉంది.ఆ బాధకు,అపరాధ భావానికి ప్రతి రూపమే అతని అన్న రూపంగా అతనికి కనపడటం.ఆ రూపం అతనితో ఇది నువ్వు కాదు అని పదే పదే చెప్తూ ఉంటుంది.అతను మంచివాడు కాదని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ భావనకు హీరో పాత్ర ద్వారా కాకుండా అతని మంసులోని భావనకు అతని వల్ల మరణించిన అన్న రూపం ద్వారా అంటే ఇంకొకరి కోణం నుండి అతని మనసును స్పష్టం చేయడం ఈ సినిమాలో నిజంగా అల్టిమేట్ ఫీలింగ్ కలిగించే అంశం. మిక్సెడ్ జోనర్స్ లో ఉన్న ఈ సినిమా ఆలోచింపజేసే సినిమా.

   *    *    *  

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!