జీవించలేని చోట!

 జీవించలేని చోట!

-శృంగవరపు రచన


యర్రమిల్లి విజయలక్ష్మి గారి 'కౌముది'నవల ఆసక్తితో చదివింపజేసే నవల కాదు.పెద్ద కథ కూడా కాదు. కథ మొత్తాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే మానసికంగా ఎదగని కూతురుతో తల్లిదండ్రులు పడిన వేదన, అంతే. కానీ ఈ నవలలో నన్ను కదిలించిన ఎన్నో అంశాల గురించి మాత్రమే చెప్పదలచుకున్నాను.
మనలోని లోపాలు ఎవరికి తెలియనంత వరకు మనం సమాజంలో భాగంగానే భావిస్తాము. మనకో, మనతో ఉన్నవారికో ఈ సమాజం ఎదురుచూసే సహజత్వం లేనప్పుడు సమాజానికి దూరంగా తప్పుకుని కొంతకాలం తిరుగుతాము. సమాజపు నిరసన భరించిన తర్వాత సమాజాన్ని లెక్కచేయని తెగింపు వస్తుంది. ఆ తెగింపే సమాజాన్ని మార్చే గొప్ప మనిషిని లేదా ఆలోచనను తయారు చేస్తుంది.
ఈ నవలలో అరవింద, సుహాస్ దంపతులు. ఆర్ధికంగా ఇబ్బందులు లేని కుటుంబం. ఆరేళ్ళు సమాజంలో స్నేహితులతో, ఉత్సవాలతో సందడిగా సంతోషంగా గడిపిన జీవితం వారిది. వారికి కౌముది జన్మించిన తర్వాత కొన్నాళ్ళకు ఆ పాపకు మానసిక వికాసం లేదని, మాటలు కూడా స్పష్టంగా రావని, తన అవసరాలు కూడా గుర్తించలేని స్థితిలో ఉందని వారికి అర్ధమవుతుంది.అరవింద అప్పటి నుండి సమాజానికి దూరంగా తనను తాను పాపకే అంకితం అయ్యేలా చేసుకుంటుంది.
ఆ తర్వాత కొంత కాలానికి తాము లేకపోతే కౌముది ఎలా జీవిస్తుంది అన్న ఆలోచన వారిని వెంటాడుతూ ఉంటుంది.అందుకని అలాంటి పిల్లలను చూసుకునే వారికి ఉన్న శిక్షణాలయాలకు వెళ్ళి చూసినా సరే ఎవరు అంత ప్రేమగా చూస్తారు అన్న భరోసా వారికి కలగదు. ఆ తర్వాత సుఖంతపు ముగింపే. కౌముది పేరుతో అటువంటి శిక్షణాలయాన్ని ఆ దంపతులే ప్రారంభించడo, అది విజయవంతం అవ్వడంతో ఈ నవల ముగుస్తుంది.
మనిషి తాను సహజంగా మిగిలిన వారితో కలిసిపోగలను అనుకుంటేనే సమాజంలో ఒక్కడై ఇమిడిపోతాడు. ఆ పరిస్థితి తారుమారు అయినప్పుడు ఒంటరిగా జీవించడం ఒక్కటే మార్గం కాదు. మనకు నచ్చింది ఓ స్థాయిలోకి మార్చి మన ఉనికికి మనమే సంతృప్తి పడేలా జీవితాన్ని సాగించాలి.
ఈ నవల నన్ను ఎంతో ఆలోచింపజేసింది.మనం సన్నిహితులుగా భావించేవారిలో ఎంత మందికి మనలో లోపాలు తెలుసు? తెలిసి మనల్ని వ్యక్తిగా గౌరవించే వారు ఎంత మంది? ముఖస్తుతికి మనల్ని చూసి చూడనట్టు వ్యవహరించేవారు ఎంతమంది? మనం నచ్చని వారి కోసం మనం మారాల్సిన పని లేదు. వారికి ప్రాధాన్యతను ఇచ్చే మన ఆలోచనలను మార్చుకుంటే చాలు. మన ప్రాధాన్యతలే మన ఆలోచనల్లో ప్రవహించి మనల్ని జీవించలేకుండా చేస్తాయి. మనం జీవించడంలో మనకే సంతృప్తి, సంతోషం ఉండాలి.నిజంగా మన జీవితం మనదేనా? మనది కాకపోతే మనదే అయ్యేలా చూడాలి. దానికి కూడా కొన్ని తిరస్కరణలు అవసరమే.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!