రహస్య యుద్ధం

 చదువరి

రహస్య యుద్ధం
-శృంగవరపు రచన


రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన సంఘటనలకు కల్పనా స్వేచ్చను పాత్రలకు పరిమితం చేసి ఆంగ్ల రచయిత కెన్ ఫోలెట్ రాసిన నవలే ‘Jackdaws.’30 దేశాలకు పైగా ఈ ప్రపంచ యుద్ధాల్లో రెండు వర్గాలుగా విడిపోయి ప్రపంచ రూపురేఖలనే మార్చేశాయి.జర్మనీ,జపాన్,ఇటలీ యాక్సిస్ పవర్స్ గా ఆవిర్భవిస్తే,వాటికి ప్రత్యర్ధి వర్గంగా అమెరికా,బ్రిటన్ లాంటి దేశాలు యాలిడ్ పవర్స్ గా మారాయి.తమ అధికారాన్ని,బలాన్ని నిరూపించుకోవడానికి తమ ప్రత్యర్ధి వర్గానికి అనుకూలంగా ఉన్న దేశాలను తమ అధీనంలోకి తెచ్చుకుని,అక్కడ దేశస్థులను బానిసలుగా చూసే సంస్కృతి అప్పట్లో సర్వసాధారణంగా మారింది.
1940 అలా ఫ్రాన్స్ జర్మనీ అధీనంలోకి వచ్చింది. హిట్లర్ సీక్రెట్ సర్వీస్ ‘గెస్టాపో’ అక్కడి ముఖ్యమైన ప్రదేశాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది.ఆ సమయంలో జర్మనీ నుండి యాలిడ్ పవర్స్ తమను రక్షిస్తాయని ఫ్రాన్స్ ప్రజలు ఆశతో ఉన్నారు.అదే సమయంలో ఫ్రాన్స్ లోని కొందరు ఉద్యమకారులు జర్మన్లను అడ్డుకోవడానికి బ్రిటన్ సహకారంతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితులే ఈ నవలకు నేపథ్యం.
ఈ నవలలో ముఖ్య పాత్ర ఫ్లిక్ క్లారియట్. ఈ పాత్రకు స్పూర్తి పెర్ల్ విదరింగ్టన్. బ్రిటన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ లో పని చేసిన ఆమె ప్రదర్శించిన ధైర్యమే ఈ నవలలో ఫ్లిక్ లో పాఠకులకు కనిపిస్తుంది.’స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ ను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ స్థాపించిన ఈ సంస్థ ద్వారా శత్రు వర్గానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం,శత్రువులు ఆక్రమించిన దేశాల్లో ఉన్న ఉద్యమకారులకు సహకారాన్ని అందించడం,గూఢచారులుగా వ్యవహరించడం,అవసరమైతే ఏమైనా చేసి శత్రు వర్గాన్ని మట్టు పెట్టే ప్రయత్నం చేయడం దీని ఉద్దేశ్యం.
ఫ్రాన్స్ లోని సెయింట్ సేసిల్ అనే కోటను జర్మనీ ఆక్రమించుకుని దానిని తన కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా మార్చుకుంది. ఆ సమయంలో అక్కడ నుండి జర్మనీకి సమాచారాన్ని సరైన సమయంలో అందించడానికి అనువైన టెలిఫోన్ లైన్ ఎక్స్ఛేంజ్ అందులోనే ఉంది.దానిని పేల్చి వారి పనులకు అంతరాయం కలిగించాలని బ్రిటన్ ‘స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ కు చెందిన ఫ్లిక్ అక్కడ ఫ్రాన్స్ లో ఉన్న ఉద్యమకారుల్లో ఓ పది మందితో తమకున్న పరిమితమైన ఆయుధాలతో ఆ ప్రయత్నం చేస్తుంది.ఆ భవనంలో ఉన్న జర్మన్ ఆఫీసర్స్ సంఖ్య గురించి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ‘ఎమ్ ఐ 6’ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల,అక్కడ అంతకు మించి ఎక్కువ మంది ఆఫీసర్స్ ఉండటం వల్ల ఆ ఆపరేషన్ విఫలమవుతుంది.ఆ ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో ఫ్లిక్ భర్త మైకేల్ ను ఫ్లిక్ కాపాడగలుగుతుంది. మిగిలిన వారిలో కొందరు మరణించగా ఇంకొందరు గెస్టాపో ఆఫీసర్స్ కు దొరికిపోతారు.
ఆ సమయంలో ఆ సెయింట్ సేసిల్ లో పని చేసే యాంటోని అనే స్త్రీ మైకేల్ కు బంధువు అవడంతో తాత్కాలికంగా ఆమె దగ్గర ఫస్ట్ అయిడ్ చేసి ఆ తర్వాత ఆ ఉద్యమంలో భాగమైన గిల్బర్ట్ ఇంటిలో తన భర్తను ఉంచుతుంది.అప్పటికే తన భర్తకు,ఆమెకు సంబంధమున్నట్టు ఆమె గ్రహిస్తుంది.ఏ ఆపరేషన్ చేసినా ఆ తర్వాత బ్రిటన్ కు వెళ్ళి దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఫ్లిక్ ది. ఆమెను తీసుకువెళ్ళడానికి ఓ నిర్దేశిత ప్రదేశంలోకి ఓ ప్లేన్ వస్తుంది.అలా అక్కడి నుండి బ్రిటన్ కు వెళ్తుంది ఫ్లిక్.
ఫ్లిక్ ఆ ఆపరేషన్ చేస్తున్న సమయంలో అక్కడికి ఫీల్డ్ మార్షల్ రొమేల్ దగ్గర పని చేస్తున్న మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన డైటర్ వస్తాడు.అతను నిరాయుధుడై ఉండటం వల్ల ఏమి చేయలేకపోతాడు.అతనితో పాటు స్టేఫైన్ అనే స్త్రీ కూడా ఉంటుంది.ఆమె భార్య కాకపోయినప్పటికి అతని జీవితంలో అంతే ప్రాధాన్యత ఉన్న స్త్రీ.డైటర్ ముఖ్యంగా ఇంటరాగేషన్ ఆఫీసర్. ఎటువంటి ఖైదీ దగ్గరి నుండి అయినా సరే వారి బలహీనతలను అనుసరించి సమాచారం రాబట్టడంలో నేర్పు ఉన్నవాడు.
తన ఇంటరాగేషన్ ద్వారా లేమాస్ అనే మధ్య వయసు స్త్రీ ఆ ఉద్యమకారులకు ఆశ్రయమిస్తుందని డైటర్ తెలుసుకుంటాడు.ఆమెను కష్టడిలోకి తీసుకుంటాడు.ఆమె ద్వారా ఆమె ఏజంట్లకు ఆశ్రయమిస్తుందని,ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చర్చుకు వెళ్తుందని,తాను ఒక కాలికి బ్లాక్,ఇంకో కాలికి బ్రౌన్ షూ ధరించడం వల్ల తనను వారు గుర్తు పట్టి కోడ్ చెప్తే,తాను ఆశ్రయమిస్తానని చెప్తుంది.ఆమె స్థానంలో స్టేఫైన్ ను ఆమె ఇంట్లో ఉంచుతాడు డైటర్. ఆమె ద్వారా ఏజంట్లను పట్టుకోవాలనుకుంటాడు.
ఫ్లిక్ బ్రిటన్ వెళ్ళాక జరిగింది చెప్పాక,ఆ ఆపరేషన్ తర్వాత మిగిలిన వారు ఏమయ్యారో,తర్వాత ఆపరేషన్ చేయడానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికి బ్రైయాన్ అనే రేడియో ఆపరేటర్ ను అక్కడికి పంపిస్తారు. బ్రియాన్ అన్న ఫ్లిక్ కళాశాలలో చదువుకుంటున్న సమయంలో ఆమె క్లాస్ మేట్. ఓ సారి అతని ఇంటికి వెళ్తుంది ఆమె.అప్పటి నుండి ఆమె పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు బ్రియాన్.బ్రియాన్ స్టేఫైన్ ను కలుస్తాడు.స్టేఫైన్ ద్వారా బ్రియాన్ రేడియో ఆపరేట్ చేసే సమయం,కోడింగ్-డికోడింగ్ తెలుసుకుంటాడు డైటర్ అతనికి నమ్మకం కలిగించి.తర్వాత బ్రియాన్ మైకేల్ దగ్గరకు వెళ్తాడు.వారిద్దరని పట్టుకుంటాడు డైటర్.
ఫ్లిక్ తన పై అధికారులను ఒప్పించి ఆపరేషన్ జాక్ డాస్ కు సన్నద్ధమవుతుంది.ఫ్రాన్స్ లోని సెయింట్ సేసిల్ లోని టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ ధ్వంసం చేసి వారి కమ్యూనికేషన్ కు ఆటంకం కలిగించాలని నిర్ణయించుకుంటుంది.దాని కోసం ఫ్రాన్స్ లోని సెయింట్ సేసిల్ లోకి క్లీనర్స్ గా తన బృందం ప్రవేశించి ఆ పని చేయాలని నిర్ణయించుకుని దానికోసం ఆరుగురిని ఎన్నుకుంటుంది. వారికి శిక్షణ ఇస్తుంది.
డైటర్ బ్రియాన్ రేడియో నుండి తానే సమాధానం ఇస్తాడు.ఈ అంశాన్ని ఫ్లిక్ అనుమానిస్తుంది. మైకేల్ ను హింసించి ఫ్లిక్ బృందం ల్యాండ్ అయ్యే ప్రదేశం కనుక్కున్న డైటర్ తన బృందంతో అక్కడికి వెళ్తాడు.కానీ అనుమానంతో అక్కడ ల్యాండ్ అవ్వదు ఫ్లిక్. మొత్తానికి ఆమె తన బృందంలో నలుగురిని కోల్పోయినా మిగిలినా వారితో ఆ ఆపరేషన్ పూర్తి చేస్తుంది. ఆపరేషన్ పూర్తయ్యేసరికి మిగిలింది ఫ్లిక్ మరియు ఇంకో స్త్రీ మాత్రమే.
ఆ ఆపరేషన్ పూర్తయ్యాక ఆమె తిరిగి బ్రిటన్ కు వెళ్ళేటప్పుడు డైటర్ తో జరిగిన దాడిలో అతన్ని గాయపరుస్తుంది.అతని కన్ను పోతుంది మరియు మతిస్థిమితం కోల్పోతాడు.ఆ తర్వాత ఏలిడ్ ఫోర్సెస్ రావడం జర్మనీ ఓడిపోవడం జరుగుతుంది.
ఈ నవలలో కేవలం దేశాలు,యుద్ధాలు మాత్రమే కాదు మనుషులు వారి మనసులు కూడా ఉన్నాయి. ఈ నవలలోని పాత్రల వ్యక్తిగత జీవితాలు,వారి బలహీనతలు,వారి లక్ష్యాలను అవి అడ్డగించిన తీరు అన్ని ఈ నవలలో అంతర్లీనంగా ఉన్నాయి. ఈ నవల జరిగేది కేవలం పది రోజులే.
ఫ్లిక్ ను మగవారిలో తెలివి మాత్రమే ఆకర్షిస్తుంది.మైకేల్ ఆమె చదువుకుంటున్న రోజుల్లో ఆమె లెక్చరర్.అతన్ని ఇష్టపడి అతని భార్య అవుతుంది.కానీ యుద్ధ కాలం అవ్వడం వల్ల వారిద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది.ఆ సమయంలో ఫ్రాన్స్ లో ఉంటున్న మైకేల్ అక్కడి ఆడవారితో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు.అతనికి విధేయంగా ఫ్లిక్ ఉన్నప్పటికి పాల్ (జాక్ డాస్ ఆపరేషన్ హెడ్ )తో ప్రేమలో పడిన ఫ్లిక్ అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.యుద్ధాలు మనుషుల మనసుల్లో సృష్టించే ఒంటరితనం,భయం నుండి కూడా ఎన్నో తాత్కాలిక ప్రేమలు జన్మిస్తాయి.
టార్చర్ చేసి తాను కావాలనుకున్న సమాచారం సాధించే డైటర్ ఒక ఖైదీగా పట్టుబడిన స్టేఫైన్ ను ఆదరించి అక్కున చేర్చుకుని,ఆమె మరణించినప్పుడు ఎంతో వ్యథను అనుభవిస్తాడు డైటర్. మనుషులను దేశ భక్తి,అధికారం ఎంత క్రూరంగా మార్చిన,వారిలో నిగూఢంగా ఉన్న ప్రేమ మాత్రం ఎవరో ఒకరిని ఆకర్షిస్తుంది.డైటర్ ఖైదీల బలహీనతలను కనిపెట్టి వారిని బ్రేక్ చేసే పాయింట్ ను పట్టుకుని దానికనుగుణంగా ఇంటరాగేషన్ చేయడం అతనిలోని సిన్సియారిటీని స్పష్టం చేస్తుంది. ఇకపోతే విల్లి అనే ఆఫీసర్ కేవలం ఇంటరాగేషన్ లో టార్చర్ పెట్టడం ద్వారా తన ఇగోను సంతృప్తి పరచుకోవడం విల్లికి,డైటర్ కు ఉన్న వ్యత్యాసాన్ని రచయిత స్పష్టం చేస్తాడు.
ఈ నవలలో ఓ స్పై థ్రిల్లర్ కు ఉండాల్సిన అన్ని కోణాలు ఉన్నాయి.దాదాపు 500 పేజీలు ఉన్న ఈ నవల దేశాల మధ్య ఉండే తెలివైన ఎత్తులను,సమయానికి తగ్గట్టు ప్రవర్తించే తెలివి ఉండాల్సిన లక్షణాలను ఫ్లిక్ ద్వారా స్పష్టం చేస్తాడు రచయిత.స్పై కు ఎమోషనల్ దృక్కోణం ఎప్పుడు ప్రమాదంలోనే పడేస్తుంది అని డయానా,మాడి పాత్రలు స్పష్టం చేస్తాయి.దృష్టిని ఆకర్షించకుండా,వీలైనంత తక్కువలో ఉంటూ,ఉన్న దేశంలో వేషధారణలో,భాషలో కలిసిపోయి,ఆ దేశం గురించి అన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ నవలలోని పాత్రలు తమ తప్పుల ద్వారా స్పష్టం చేస్తాయి. పారనోయిక్ గా ఉండగలిగిన వారే గూఢాచారులు కాగలరని కూడా రచయిత ఒక్కో చోట పరోక్షంగా చెప్తాడు.మంచి నవల,వీలైతే తప్పక చదవండి.
* * *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ