సామాన్యుని ఆలోచనలు-స్వేచ్చా ఉద్యమం

 సామాన్యుని ఆలోచనలు-స్వేచ్చా ఉద్యమం

-శృంగవరపు రచన


జరిగిపోయిన చరిత్ర మనకు విజయ స్ఫూర్తిని అందిస్తుంది. అవే పరిస్థితుల్లో మనం జీవించి ఉంటే అదే స్ఫూర్తికి ఎన్నో కోణాలను దర్శించవచ్చు.వీక్షకుడికి, అనుభవించేవాడికి మధ్య ఉన్న వైవిధ్యత ఆలోచనల్లో,సిద్ధాంతాల్లో ఇమిడి వారి కార్యాచరణలో ప్రతిఫలిస్తుంది. తెలుగు వెబ్ సిరీస్ లో కొత్త శైలిలో సామాన్యుని ఆలోచనల్లో, సిద్ధాంతాల్లో ఉన్న వ్యత్యాసాలను చర్చల ద్వారా స్పష్టం చేసిన వెబ్ సిరీస్ 'Unheard.'ఆరు పాత్రల మధ్య జరిగే సంభాషణలే ఈ సిరీస్.
1920-1947 వరకు భారతీయ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న సామాన్య జనులు-అదే సమయంలో ప్రపంచ యుద్ధాలు, వివిధ సిద్ధాంతాలు-నాయకులు వారిని ప్రభావితం చేసిన తీరును ఈ సిరీస్ స్పష్టం చేస్తుంది.
1920 నాటికి మొదటి ప్రపంచం యుద్ధం పూర్తి అయ్యింది. ఆ యుద్ధంలో భారతీయులు దాదాపు రెండు లక్షలపైనే పాల్గొన్నారు. అది కూడా గాంధీజీ ఆదేశం మేరకు. దీని ద్వారా గాంధీజీ బ్రిటిష్ వారితో మనము సమానమే అన్న భావనను స్పష్టం చేయాలనుకున్నారని కొందరు భావిస్తే, ఆ యుద్ధంలో బ్రిటిష్ కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడినా అదే బానిసత్వం భారతీయులను విడిచిపెట్టలేదు కనుక అది చేయకుండా ఉండాల్సింది అని ఇంకొందరి భావన. మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు దాటుకుంటూ మన దేశానికి వచ్చిన స్పానిష్ ఫ్లూ కోట్ల భారతీయుల ప్రాణాలను బలిగొంది. గాంధీజీ అహింస కొందరిని ఆకర్షిస్తే, భగత్ సింగ్ విప్లవ బాట ఇంకొందరిని ఆకర్షిoచింది.
యుద్ధంలో పాల్గొన్న భారతీయులు హింస పట్ల విముఖత ఏర్పడి గాంధీజీ మార్గాన్ని అనుసరిస్తే, ఎంతో మంది భగత్ సింగ్ ను అనుసరించారు. భగత్ సింగ్ మరణించినప్పుడు గాంధీజీ క్షమాభిక్ష అడిగితే భగత్ సింగ్ బ్రతికేవాడని ఇప్పటికి కొందరు భావిస్తారు. కానీ భగత్ సింగ్ దానిని నిరాకరించేవాడన్నది నిర్వాదాంశం.
బెంగాల్ లో కరువు దేశాన్ని అల్లకల్లోలం చేసింది.భగత్ సింగ్ తరువాత బోస్ 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' ఎంతోమందిని ఆకర్షించింది. భారత పౌరులు ఒకే లక్ష్యం కోసం పోరాడినా మార్గాలు వేరు.
ఇకపోతే నిజాం అత్యంత ధనవంతుడు కావడం వల్ల తన అధికారాన్ని మొదటి నుండి డబ్బు ద్వారానే నిలుపుకోగాలిగాడు. భారతదేశంలో విలీనం అయ్యే పరిస్థితి వస్తుందని రజాకార్ల సైన్యాన్ని ఏర్పరిచి, హింసను భాగం చేసినా అది కూడా సాగలేదు.
విభిన్న సిద్ధాంతాలు, ఎన్నో స్వార్ధాలు ఎన్ని ఉన్నా మొత్తానికి స్వేచ్చ వచ్చింది. కానీ కాలంతో పాటు ఎన్నో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.వివిధ స్థాయిల్లో ఇది ఎప్పటికి జరిగే, జరుగుతున్న పోరాటమే. ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, అజయ్ తదితరులు చక్కగా నటించారు. ఈ సిరీస్ లో డైలాగ్స్ ఎన్నో అంశాల గురించి వీక్షకులను ఆలోచించేలా చేస్తాయి.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ