విదూషకురాలు

 చదువరి

విదూషకురాలు
-శృంగవరపు రచన


తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో విశ్వప్రసాద్ గారిది విశిష్ట స్థానం.దానికి కారణం ఆయన నవలల్లో సాంకేతిక పరిజ్ఞానం,ఓ సరైన మోటివ్ ను ఎన్నుకోవడం,సమాజంలో సంభవించే ప్రగతిని వెనువెంటనే తన రచనల్లో భాగం చేయగలగడం వంటివి ఆయన సాహిత్యానికి ఓ ప్రత్యేకతను ఆపాదిస్తాయి.విశ్వప్రసాద్ గారి 'మాయలాడి' నవల 1989 లో నవలగా వచ్చి,అంతకుముందు సీరియల్ గా వచ్చింది. ఇప్పుడు కొన్ని కోణాల నుండి చదివితే సాధారణంగా అనిపించవచ్చు,కానీ ఆ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే సాంకేతికను మొదటి నుండి ఎన్నో సార్లు స్పష్టం చేయడం రచయితగా ఆయనకు ఉన్న దూరదృష్టిని స్పష్టం చేస్తుంది. ఈ నవల మీద దాదాపు సినీ,సాహితీ మేధావులు దాదాపు వంద మంది దాకా పుస్తకం తెరవగానే ఎంతో బావుందని అభిప్రాయం రాశారు. ఆ అభిప్రాయాలూ మినహాయిస్తే 400 పేజీలు ఉన్న ఈ నవలను చదివింపజేసేలా రాశారు.డిటెక్టివ్ నవలను అన్నీ పేజీలు రాయడం కష్టమే,అందులోనూ సూటిగా కథే పయనిస్తూ ఉండటం డిటెక్టివ్ సాహిత్య ప్రక్రియలో ప్రధానమైనది.ఈ నవలలో ఆ ధారను ఆసక్తి కలిగించేలా కొనసాగించారు రచయిత.
నూజివీడు జమీందారు రాజారావుగారు అస్వస్థతతో ఉండటం,ఆయన తన కూతురు వాణి కోసం ఎదురు చూస్తూ ఉండటం,ఆయనకు కావల్సిన మందులు కొన్ని డాక్టర్ ఇంటి దగ్గరకు వెళ్ళి తీసుకు రావడానికి ఆయన ఎస్టేట్ మేనేజర్ ఉపేంద్ర వెళ్ళడం,ఆ తర్వాత పరిస్థితి విషమించి ఆయన మరణించడం,ఆయన మరణించాక వాణి రావడం,కానీ మృతదేహం బదులు మట్టి బొమ్మ ఉండటం,ఆయన మరణించాడని డాక్టర్ కొంత సేపు కళ్ళు మూసుకుని ప్రార్ధన చేయడం,ఆ సమయంలోనే ఆయన మృతదేహం మాయమవ్వడం వింతగా ఉండటంతో డిటెక్టివ్ భగవాన్ ను ఈ మిస్టరీ పరిష్కరించడానికి పిలవడం జరుగుతుంది. విశ్వప్రసాద్ గారి రచనల్లో భగవాన్ ముఖ్య డిటెక్టివ్ గా,ఆయన భార్య మణి,బావమరిది రాంబాబు కూడా ఆయన పరిశోధనలో సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కేసును పరిష్కరిస్తున్న సందర్భంలో రాజారావు తనకు తనకు వంశపారంపర్యంగా గుప్తధనం వచ్చిందని,ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కానీ తన తరువాత తన కూతురు దాని గురించి తెలుసుకోవడానికి అనువుగా ఆయన ఓ కలం,ఉంగరం,ఉత్తరం తన కూతురికి ఇవ్వమని తన అడ్వకేట్ సుందరానికి ఇస్తాడు.కానీ ఒక్క ఉత్తరం తప్ప మిగిలినవి కనిపించవు.ఆ గుప్త ధనం కోసం రెండు వర్గాలు ప్రయత్నిస్తూ ఉండటం,అందులో భీమరాజు వర్గం ఉపేంద్రను లోబర్చుకుని ఆ రెండు వస్తువులు దక్కించుకోవడం,ఉపేంద్ర నుండి ఉంగరాన్ని మాత్రం రెండో వర్గం అయిన వీరేంద్ర సింగ్ చేజిక్కించుకోవటం జరుగుతుంది. భగవాన్,రాంబాబు,మణి ముగ్గురు కలిసి ఈ కేసు ఛేదిస్తారు. భీమరాజు వర్గంలో ముఖ్య సభ్యురాలు చండీరాణి వీరేంద్ర సింగ్ నుండి మాయ చేసి ఉంగరం తీసుకోవడం,ఆ తర్వాత భగవాన్ ఆమె ఎత్తులను చిత్తు చేసి ఆమె నుండి మిగిలిన రెండు వస్తువులను దక్కించుకుని,అదే సమయంలో బంధించబడిన రాజారావును కాపాడటం,ఆ సమయంలో రత్నాల వ్యాపారి వేషంలో వచ్చి,మణి పట్టుకునే లోపు చండీ రాణి గాలిలోకి ఎగిరి పోవటం జరుగుతుంది.ఆ కేసు పరిష్కరించిన తర్వాత కూడా మద్రాస్,హైదరబాద్,ఢిల్లీలలో ధనికుల నుండి డబ్బు దోపిడీలు చండీ రాణి చెప్పే చేస్తూ ఉంటుంది.ఆమెను కొంతమేరకు భగవాన్ అడ్డుకుంటూ ఉన్నా సరే ఆమె తప్పించుకుంటూ ఉంటుంది.
చండీ రాణి దేశంలోని ధనికులను దోచుకుని,పేదలకు పంచడం తన ఉద్దేశ్యమని,అందుకోసమే తాను ఇదంతా చేస్తున్నానని ప్రకటిస్తుంది.ఆమె మద్రాస్,బెంగుళూరు మరియు దాదాపు భారతదేశమంతా ఎన్నో ముఠాలు కలిగి ఉంది.ఆమె చదువుకోకపోయినా పది బాషల్లో నిపుణురాలు.ఆమె వేషం మారిస్తే ఎవరూ గుర్తుపట్టలేరు.సర్జరీలు చేయగలదు,యంత్రాలు నిర్మించగలదు.ఆమె ముఠాల్లోని వ్యక్తులకు నంబర్లు ఉంటాయి. ప్రతి సారి దోపిడి చేసినప్పుడు ఆమె మత్తు మందు ఇవ్వడం,వెంటనే శాస్త్రీయ పరిజ్ఞాన సహకారంతో తప్పించుకోగలగడం జరుగుతూ ఉంటుంది.ఈ ప్రక్రియలో భాగంగా ఆమె ముఠాలోని సభ్యులు ఇందుకు అడ్డు వస్తున్న భగవాన్,రాంబాబు,మణిలను చంపాలనుకుంటే వారిని బంధించి ఆమె రక్షిస్తుంది.ఆమె కిరణ్మయిగా వేషం వేసి రాంబాబును మనఃస్పూర్తిగా ప్రేమిస్తుంది.
భగవాన్ కు చండీరాణి తెలివి తేటలంటే అభిమానం.కానీ వాటిని దుర్వినియోగపరుస్తుందన్న కోపం.అలాగే భగవాన్ ను ఆమె గురువుగా భావిస్తూ ఉంటుంది.కానీ ప్రత్యర్ధులుగా తలపడినప్పుడు మాత్రం యుద్ధం.చివరకు తేలేది ఏమిటంటే ఆమె అసలు పేరు అరుణ.భీమరాజు గజదొంగ. బ్రిటిష్ వారి కాలం నుండే కర్కశంగా దొంగతనాలు చేసేవాడు.అరుణ తల్లిదండ్రులను దోచుకుందామని వచ్చి ఏమి లేకపోయేసరికి వారిని చిత్రవధ చేశాడు.అప్పుడే మనసులో ఎలా అయినా అతన్ని,అతని ముఠాలను ప్రభుత్వానికి పట్టించాలని భావించిన ఆమె అతని దగ్గర ఉండే అన్ని విద్యలు నేర్చుకుంది.భీమరాజును,అతని ముఠాలను నమ్మించడానికి దోపిడీలు చేసేది. అంతకుముందే ఆమె హోమ్ మినిస్టర్ కు జరిగింది తెలియజేసి,సి.బి.ఐ ట్రెయినింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ కార్యక్రమాలు చేసింది.అంతకు ముందు ఉన్న డిటెక్టివులకు కూడా తన ముఠాలను పట్టించే ప్రయత్నం పరోక్షంగా చేసినా ఆ తావుకు వచ్చే ధైర్యం కూడా వారికి లేకపోవడంతో ఏమి చేయలేకపోయింది. చివరకు ఆమె అలా పట్టించి,చండీరాణిగా మరణించి,ప్రమాదంలో ఆమె-భీమరాజుతో పాటు మరణించానని నమ్మించి కిరణ్మయిగా అవతారం ఎత్తి పూర్తిగా రాంబాబు భార్య అయిపోతుంది.
డిటెక్టివ్ నవలగా ఇది బాగానే ఉందనిపించినా,క్రైమ్ థ్రిల్లర్ లో ఉండే మలుపులు పాఠకులు డిటెక్టివ్ సాహిత్యంలో ఆశించలేరు.కానీ అన్ని పేజీల నవలగా రాయడం,మోటివ్ ను దేశ ప్రయోజనం కోసం మళ్ళించడం,మొదటి నుండి విలన్ గా ఉన్న చండీ రాణిని నాయికగా ఓ కారణంతో బలపరచడం వంటివి ఈ నవలకు ప్లస్ పాయింట్స్.మీకు డిటెక్టివ్ సాహిత్యం ఇష్టమైతేనే ఈ నవల చదవండి.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ