సమాజానికి ఉన్న హక్కు

 సమాజానికి ఉన్న హక్కు

-శృంగవరపు రచన



మనుషులకు సమాజంలో ఉండే స్థానాన్ని అనుసరించి వారి జీవితాన్ని చిత్రికరిస్తుంది సమాజం. హోదా, ఆర్ధిక పలుకుబడి ఉన్న వారు చేసే ఆ పనైనా సరే వారిని అనడానికి జంకుతుంది. కానీ పేద, మధ్యతరగతి వారు చేసే పనులను వేలెత్తి చూపడానికి ఆలోచించదు. కారణం మనిషికి బ్రతకడానికి అవసరాలు తీరాలి. ఆర్ధిక రక్షణ ఉన్నవారికి ఏ పరిస్థితి ఉన్నా వారి జీవితం సాఫీగా గడుస్తూనే ఉంటుంది. పేద, మధ్యతరగతి జీవితాలు అలా కాదు. సమాజంతో సహజీవనం చేస్తూ బ్రతకాల్సిన వర్గాలు కనుక వారి జీవితాల మీద, వారి మీద వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఏర్పరచుకుని,సందర్భానికి తగ్గట్టు వ్యాఖ్యానాలు చేసే హక్కును సమాజం సంపాదించుకుంది.
వి. ఆర్. రాసాని గారు తన జీవితంలో స్వయంగా చూసిన జీవితాలను ఓకే పాత్ర అయిన 'తిమ్మక్క'జీవితంగా రాసిన నవలే 'వక్రగీత.'
ఈ నవలలో తిమ్మక్క ప్రాధాన పాత్ర
జాండ్రపేటలో ఎరికల కులంలో పుట్టిన స్త్రీ. సాలె కులానికి చెందిన వెంకట్రావును వివాహం చేసుకుంది.వెంకట్రావు కులం కన్నా తక్కువ కులమైనా పెళ్ళికి ముందే తొందర పడటం, వెంకట్రావుకు పెళ్ళి సంబంధాలు కుదరకపోవడం వల్ల వారి వివాహాన్ని అంగీకరించారు ఇరువైపుల కుటుంబాల వారు. ఆ తర్వాత వెంకట్రావు వల్ల ఆమెకు రత్తమ్మ జన్మించింది. పెళ్లయిన కొంతకాలానికి పనులు లేకపోవడంతో సుంకన్న ఇప్పించిన కూలికి వెళ్తుంది తిమ్మక్క. అక్కడ అతనితో సంబంధం పెట్టుకుంటుంది. ఆ తర్వాత అతనితో లేచిపోతుంది. అతనితో బుడ్డమ్మను కంటుంది. సుంకడు తిమ్మక్క కన్నా తక్కువ కులమైన వడ్రోళ్ళు. అక్కడ ఆమెను బాగానే ఆదరించారు.
ఆ తర్వాత బుడ్డమ్మకు పెళ్ళి చేస్తుంది. ఇంట్లో జరుగుబాటు లేకపోవడంతో సుంకడు మేనత్త కూతుర్ని చేసుకున్న కదిరిప్ప దగ్గరకు వెళ్తుంది. అతని వల్ల లేటు వయసులో గర్భవతి అయ్యి చిట్టిని కంటుంది. కొంతకాలానికి అనారోగ్యంతో ఆ పాప మరణిస్తుంది.
చివరకు ఆమె నడి వయసు దాటిన సమయంలో పని చేసే సత్తువ లేనప్పుడు ఆమె దిక్కు లేని చావు చనిపోబోతున్న సమయంలో ఆసుపత్రిలో చేర్పిస్తారు. ఆమె కూతురు బుడ్డమ్మకు వివాహమైన ఆమె భర్త ఆమె తల్లి శీలాన్ని బట్టి ఆమెను చేసే చిత్రావధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. రత్తమ్మకు బంధువైన మునిస్వామితో వివాహమవుతుంది. అతను విశాల భావాలు కలవాడు. రత్తమ్మ తన తల్లి ఆఖరి క్షణాల్లో ఉందని భార్య చెప్పినప్పుడు ఆమెను అర్ధం చేసుకుని తిమ్మక్కను చూడటానికి భార్యతో బయలుదేరడంతో నవల ముగుస్తుంది.
కథ మామూలు కథే. కానీ సందర్భం పేదరికం-మధ్య తరగతి మధ్య ఊగిసలాడే జీవితానికి సంబంధించిన స్త్రీ కనుక తిమ్మక్క నైతిక పతనం చెందిన స్త్రీ. అదే నాగరిక సంస్కృతుల్లో డేటింగ్ అంటారు. సెలబ్రిటీలు అలా చేస్తే సహజం అంటారు.మనుషులపై అభిప్రాయాలు,శీల హత్యలు అన్నీ ఆర్ధిక వ్యత్యాసాల ని బట్టి మారిపోతాయి.
నైతిక విలువలు ఎలా మనుషులకు వర్తిస్తాయి? మారుతున్న కాలంలో, పెరుగుతున్న అవసరాలు, సమస్యల దృక్కోణంలో బాధ్యతలు, కోరికల వలయంలో నైతికత స్త్రీ-పురుషుల మధ్య ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు స్థిరమైన సమాధానం లేదు.
పెళ్ళి, వృత్తి, పిల్లలు, లైంగిక అనుబంధం వీటన్నింటిని జీవితంలో పెళ్లితో భాగం చేసుకునే భార్యాభర్తలు మధ్య ఎటువంటి సంబంధం ఉండాలి? ఎలా ఉంటే అది ప్రేమను సూచిస్తుంది? వంటి వాటికి సమాధానాలు ఎవరూ చెప్పలేరు.
కానీ జీవితంలో ఈ భార్యాభర్తల్లో ఎవరైనా ఇతరేతర సంబంధాలు కలిగి ఉంటే కేవలం ఆ విషయాన్ని మాత్రం ప్రస్థావించేది ఎందుకు? అది కాలక్షేపం కోసం కావచ్చు, పైశాచిక సంతోషం కోసం కావచ్చు. ఏదైనా భార్యాభర్తల మధ్య ఉండే ఇటువంటి వ్యక్తిగత అంశాల పట్ల మాత్రమే ఆసక్తి చూపే కూతుహలం సమాజం తప్పు అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే వ్యక్తి కంటే సమాజం పెద్దది కనుక. మెజారిటీ నిర్ణయానికే విలువ ఉంటుంది కనుక.
నేడు సెలబ్రిటీలైన నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో వారేదో తమ కుటుంబ సభ్యులు అయినట్టు లేదా మిత్రులు అయినట్టు కొందరు యూట్యూబ్ ఛానల్స్ లో, వెబ్ సైట్లలో సమంతను ఆమె పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని, ఆమె సరోగెట్ మదర్ అవ్వలనుకుందని, ఆమె హెయిర్ డ్రస్సర్ తో సన్నిహితంగా ఉంటుందని ఇలా ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నారు. ఇదో తప్పో, ఒప్పో పక్కన పెడదాము.కానీ సమంత గతంలో సిద్ధార్థను ప్రేమించి అది విఫలమయ్యాక చైతన్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు, అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ముందు ప్రేమలను గుర్తు చేయలేదు. ఎందుకంటే పెద్ద కుటుంబం కనుక. ఈ రోజు సమంత విడిపోయాక ఆ పెద్ద కుటుంబంలో భాగం కాదు, కానీ సెలబ్రిటీ అయినప్పటికీ ఆ పెద్ద కుటుంబం స్థాయి వ్యక్తి కాదు. ఇక్కడ స్థాయిని బట్టి 'Character Glory'ఉంటుంది తప్ప వ్యక్తులకు కాదు.
పరోక్షంగా ఇది వ్యక్తులను కాదు వారి ఆర్ధిక, ఇతర నేపథ్యాల ప్రభావం ఈ అభిప్రాయాలు, జడ్జిమెంట్ల పైన ఉంటుంది.డబ్బున్న వారంటే గౌరవానికి అర్హులు అనే భావం కూడా బలపడిపోయిందే. అందుకే దానికి వ్యతిరేకంగా ఉన్న ఆర్ధిక స్థితి ఉన్నవారిని భయపెట్టడం, ఏడిపించడం, చులకన చేయడం వల్ల ఓ ఆనందాన్ని పొందే అవకాశం ఉన్న మనస్తత్వ దొరణులు మిశ్రమంగా మనుషుల మనస్సులో పైకి ఒప్పుకోకపోయినా ఉండబట్టే ఇది మనుషులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆలోచిస్తే మనిషి ఈ అభిప్రాయల చట్రంలో కొన్నిసార్లు జడ్జిగా ఇంకోసారి ముద్దాయిగా కూడా ఉండే పరిస్థితుల్లోనే ఉంటాడు.ఈ రెండు స్థానాల్లో ఉండకుండా ఉండే వ్యక్తి స్వతంత్ర జీవి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!