మనుగడ క్రీడ

 మనుగడ క్రీడ

-శృంగవరపు రచన



డబ్బు లేకపోతే మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు,డబ్బు కన్నా మనిషికి సంతోషం ముఖ్యం లాంటి విరుద్ధ వ్యాఖ్యల్లో ఉన్న సత్యాల మధ్య సంఘర్షణే ఈ మధ్య విడుదల అయిన ‘Squid Game’ సిరీస్.ఈ సౌత్ కొరియన్ సిరీస్ లో మనిషికి డబ్బు అవసరం ఉన్నప్పుడూ మనిషి ఏదైనా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు,ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడూ అది చేయకూడదనే మానసిక భావన,అయినా చేస్తూనే తప్పు అనుకుంటూనే చేసేసి,చివరకు ఆ మనిషి ఈ ప్రక్రియలో ఎలా శారీరకంగా,మానసికంగా మారతాడో స్పష్టం అవుతుంది.ఈ సిరీస్ ను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఆడిన ఆటలను సీరియస్ స్థాయిలో పెద్దలతో డబ్బు కోసం ఆడించటం, దాని ద్వారా డబ్బు-మనిషి-స్వార్ధం -మానవత్వం-క్రూరత్వాలను వివిధ స్థాయిల్లో భౌతిక పరిణామాల ద్వారా మానసిక ఘర్షణగా స్పష్టం చెయ్యడం.
ఇక కథకు వస్తే జిహున్ కు పెళ్ళయ్యి,ఓ కూతురు పుట్టాక డివోర్స్ కూడా అయిపోయింది.అతని భార్య ఇంకొకతన్ని పెళ్ళి కూడా చేసుకుంది.తన కూతురు అంటే జిహున్ కు ఎంతో ఇష్టం.సందర్భానుసారం పాపను కలుస్తూ ఉంటాడు.ఇక ఆర్థికంగా చూస్తే అతనికి ఎన్నో అప్పులు,ఎప్పుడు బెట్టింగ్స్ కడుతూ,ఓడిపోతూ,అప్పులు చేస్తూ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.ఇక అతని తల్లి ఓ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది.ఓ రోజు జిహున్ రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడూ ఓ అపరిచితుడు చిన్నపిల్లలు ఆడే కొరియన్ ఆట డక్జి ఆడమని,గెలిస్తే డబ్బులు ఇస్తానని చెప్తాడు.జిహున్ ఓడిపోయినప్పుడల్లా ఒక్కో చెంప దెబ్బ తింటాడు,చివరకు గెలిచి డబ్బులు తీసుకుంటాడు.ఆ అపరిచితుడు ఓ కార్డు ఇచ్చి ఇలాంటి చిన్న చిన్న ఆటలు ఆడటం వల్ల డబ్బు సంపాదించవచ్చని,ఆసక్తి ఉంటే కలవమని ఓ విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. అలా ఆ కార్డు ద్వారా వెళ్ళిన అతన్ని ఓ కారులో మత్తు మందు చల్లి తీసుకువెళ్తారు.అతను నిద్ర లేచేసరికి ఓ కొత్త ప్రదేశంలో ఉంటాడు.తనతో కలిపి అక్కడ మొత్తం 456 మంది ఉన్నట్టు,వారిలో ఆఖరి ప్లేయర్ తానే అని అర్ధమవుతుంది జిహున్ కి. ఈ మొత్తాన్న్ఈ పింక్ కలర్ డ్రెస్సులు,మాస్కూలు ధరించిన స్టాఫ్,బ్లాక్ డ్రస్-మాస్క్ ధరించిన ఫ్రంట్ మాన్ నాయకత్వంలో పర్యవేక్షిస్తూ ఉంటారు.మొదటి ఎపిసోడ్ లో ముఖ్యమైన పాత్రలని,ఓ ఆటని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ లో ముగ్గురు ముఖ్య పాత్రలు జిహున్ తో పాటు ప్రేక్షకులకు పరిచయం అవుతారు. వారిలో ఒకరు ప్లేయర్ 1. ఇతను ముసలి వ్యక్తి.సిరీస్ మొత్తం ప్లేయర్ 1 గానే పరిచితం.ఇతనికి బ్రెయిన్ ట్యూమర్ మరియు జ్ఞాపక శక్తి తక్కువ. ఇతన్ని స్నేహితుడిని చేసుకుంటాడు జిహున్.ఇక ఇంకో పాత్ర సాంగ్ వూ.ఇతను జిహున్ కు బాల్యం నుండి స్నేహితుడు.ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ గా పని చేశాడు.ఇక మూడో పాత్ర ఓ అమ్మాయిది.ఆమె ప్లేయర్ 67.జిహున్ బెట్టింగ్ లో గెలిచిన డబ్బును పిక్ పాకెటింగ్ చేస్తుంది.
మొత్తం ఆటగాళ్ళు ఆరు ఆటలు ఆడాలి.ఈ ఆటలు ఆడే ముందు కన్సెంట్ ఫార్మ్ మీద ప్లేయర్స్ అందరూ సంతకాలు చేయాలి.అందులో కొన్ని నియమాలు ఉంటాయి.ఏదైనా పరిస్థితుల వల్ల ప్లేయర్ ఆడలేకపోతే ఆ ప్లేయర్ ఎలిమినేట్ అయ్యినట్టు.మెజారిటీ ప్లేయర్స్ ఆడకూడదు అనుకుంటే ఆటలు ఆపేయ్యవచ్చు.మొదటి ఆట పేరు ‘Red Light,Green Light.’ ఆట చిన్నప్పుడు ఆడుకున్నదే.రెడ్ లైట్ అన్నప్పుడు ఆగాలి,గ్రీన్ లైట్ అన్నప్పుడు కదలాలి.అలా కాకుండా అయితే ఆ ప్లేయర్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది.ఎలిమినేషన్ అంటే ఓడిపోయిన ప్లేయర్ ను చంపడం అని ఆట మొదలయ్యాక అక్కడి ప్లేయర్స్ కు అర్ధమవుతుంది.ప్లేయర్స్ ప్యానిక్ అయ్యి ఆట గురించి పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటారు.అలా ప్రాణాలు కోల్పోతారు.చివరకు ఈ ఆటలో 456 మందిలో సగం పైగా మరణిస్తారు. ఈ ఆట ఆడుతున్న సమయంలో జిహున్ ని ఓ పాకిస్తానీ ప్లేయర్ 199 కాపాడతాడు.అతని పేరు అలీ.
ఇకపోతే తమ ప్రాణాలు అయినా కాపాడుకోవాలనుకున్న ప్లేయర్స్ లో కొంతమంది ఇక ఆటను ఆపేసి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటారు.ఇక్కడ కొంతసేపు అందరూ అదే నిర్ణయంతో ఉన్నా,తర్వాత బయటికి వెళ్ళి అప్పుల బాధ పడుతూ నరకం అనుభవించే కన్నా ఈ ఆటలు ఆడి తమ అదృష్టం పరీక్షించుకుందామని నిర్ణయించుకుంటారు.ఇలా విరుద్ధమైన అభిప్రాయాలతో ఉన్న ప్లేయర్స్ మధ్య వోటింగ్ జరిగి ఒక్క వోటు మెజారిటీతో ఆటలు ఆపేసి ఇంటికి పంపే నిర్ణయం జరిగిపోతుంది.దీని వల్ల ఏ డబ్బు రాదు.అలా అందరూ తిరిగి ఇళ్ళకు వెళ్తారు.ఇక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ప్లేయర్స్ జీవితాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలా ఉన్నాయో ప్రేక్షకులకు స్పష్టం అవుతుంది.జిహున్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు ఈ విషయం ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోరు.జిహున్ తల్లికి సర్జరీ అవసరమవుతుంది .అలీకు ఆరు నెలల నుండి జీతం లేదు.భార్య,బిడ్డ ఉన్నారు.యజమానిని నుండి బలవంతంగా డబ్బు లాక్కుని వస్తాడు.ఇక ప్లేయర్ 67 తల్లిదండ్రులు నార్త్ కొరియాలో ఉండిపోయారు.వారిని బయటకు తీసుకురావాలి.అనాధశ్రమంలో ఉన్న తమ్ముడిని చూసుకోవాలి.ఇక సాంగ్ వూ ఆర్థిక స్కాములు చేయడం వల్ల పోలీసులు వెతుకుతున్నారు,తల్లికి తాను అమెరికాలో ఉన్నానని చెప్తాడు.ఇక ప్లేయర్ 1,ఒంటరివాడు,ఏం చేయలేని వాడు.ఇక ఇంకో ప్లేయర్ 101,ఒక గ్యాంగ్ స్టర్.గ్యాంబ్లింగ్ చేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఇలా అందరూ ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న వారే.ప్లేయర్స్ అందరికీ మరలా ఆడటానికి ఆహ్వానాలు పంపబడతాయి.93 శాతం మంది ప్లేయర్స్ మరలా ఆడటానికి వెళ్తారు.జున్ హూ ఓ డిటెక్టివ్.అతని అన్న కనపడకుండా పోవడం,అతని గదిలో జిన్హు దగ్గర ఉన్న కార్డు లాంటిదే ఉండటంతో అతన్ని వెంబడించి మొత్తానికి ఆ స్థలానికి చేరుకుంటాడు దొంగతనంగా.అది ఓ దీవి అని అతనికి అర్ధమవుతుంది.ఓ స్టాఫ్ మెంబర్ ను చంపి ఆ డ్రస్ వేసుకుని వారిలో కలిసిపోతాడు.
ఇకపోతే ఇంకో ప్లేయర్ 212,ఓ స్త్రీ.ఆమె ఎవరినైనా తన అవసరానికి మాత్రమే వినియోగించుకునే స్త్రీ.ప్లేయర్ 67 స్టాఫ్ పంచదారతో ఏదో చేస్తున్నారని తెల్సుకుంటుంది.ఆ విషయం సాంగ్ వూ అడిగినప్పుడు జరుగుతుంది.సాంగ్ వూ మనస్తత్వంలోని విభిన్న కోణాలు మనకు ఈ సిరీస్ లో పరిచయం అవుతాయి.అందరి కన్నా తెలివైన వాడు,ఇతనే సిరీస్ లో నాయకుడు అన్న భావన మొదట్లో కలుగుతుంది.అతను మొదట ఆటలు ఆపేసి వెళ్ళిపోయినప్పుడు అలీ మధ్యలో కనిపిస్తే అతనికి ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఇస్తాడు.మరలా వచ్చాక ప్లేయర్ 1,ఆలీ,జిన్ హు,ప్లేయర్ 67 ఒక బృందంగా ఏర్పడతారు.అలాగే తన టీంతో వ్యూహాలు చర్చిస్తాడు.ఇక రెండో ఆట గురించి సాంగ్ వ్యూ ఎప్పుడైతే పంచదార గురించి చెప్పిందో అప్పుడే గ్రహిస్తాడు,కానీ తన బృందం వారికి చెప్పడు. అందరిని ఒక్కో ఆకారం ఎంచుకోమంటారు.అందులో త్రిభుజం,నక్షత్రం ,వృత్తం,గొడుగు ఆకారాలు ఉంటాయి.ముందే ఆట గ్రహించిన సాంగ్ వ్యూ తేలికైన ఆకారాన్ని ఎంచుకుంటాడు.జిన్ హు గొడుగును ఎన్నుకుంటాడు.హాని కాంబ్ నుండి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా తమ షేప్ ను బయటకు తియ్యడమే ఆట.ఈ ఆటలో ప్లేయర్ 212,ప్లేయర్ 101 కు సాయం చేస్తుంది.అందరిలో బలవంతుడు,శారీరక పుష్టి ఉన్న ప్లేయర్ 101 తో ఆమె తనను తాను కాపాడుకోవటానికే మంచిగా ఉంటుంది.అతనికి శారీరకంగా కూడా దగ్గర అవుతుంది. ఇక ఇక్కడ గమనిస్తే ప్లేయర్ 111కు ముందే ఆటలు ఏమిటో తెలిసిపోతాయి.
ఇకపోతే ప్రతి ఆటలో ఎంతో మంది చనిపోతూ ఉంటారు.కొందరు స్టాఫ్ సభ్యులు చనిపోయిన వారి అవయవాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు.ప్లేయర్ 111 అంతకుముందు వైద్యుడు కావడం కనుక అతను సహకరిస్తాడు.అందుకు ప్రతిఫలంగానే అతనికి ముందే ఆటలు ఏమిటో తెలిసి పోతూ ఉంటాయి. ఆ తర్వాత కావాలనే ప్లేయర్స్ కు సరిపడకుండా ఆహారం ఇస్తారు.అలా బలవంతులకు,బలహీనులకు మధ్య ఆ రాత్రి గొడవలు జరిగి కొందరు మరణిస్తారు.ఇక్కడ అర్ధమయ్యే సూత్రం ఏమిటంటే దీనివల్ల బలవంతులతో ఉంటేనే బ్రతకగలం అన్న భావాన్ని అక్కడి ప్లేయర్స్ లో ఉండేలా చేయడం.దీని గురించి తెలుసుకున్న ప్లేయర్ 111 అందరిలో బలవంతుడు అయిన ప్లేయర్ 101 బృందంతో కలుస్తాడు.తనకు తర్వాతి ఆట తెలుసు అని చెప్తాడు.తర్వాతి ఆట టగ్ ఆఫ్ వార్.అందరూ పది మంది జట్టుగా ఏర్పడాలి.ఆట ముందుగానే తెలుసు గనుక ప్లేయర్ 101 కేవలం మగవారిని ,బలవంతులను మాత్రమే ఎన్నుకుంటాడు.సాంగ్ వూ,అలీ,జిన్ హూ,ప్లేయర్ 212 కూడా 101 వదిలివెయ్యడంతో ఈ టీం లోనే జేరుతుంది.ఇంకో ప్లేయర్ 240 కూడా ఇంకో అమ్మాయి.అలా ఆ టీంలో ముసలివాళ్లు,స్త్రీలు ఉంటారు.ఈ ఆటలో రెండు బృందాలు ఓ తాడును లాగుతాయి.ఎవరి వైపుకు లాగితే వారు విజేత.పూర్తిగా బలానికి సంబంధించిన ఆట అయినా ప్లేయర్ 1 తన ఆట గెలవడానికి సూత్రాలు చెప్పడం,సాంగ్ వూ కూడా తన తెలివితేటలతో కాపాడటం వల్ల ఈ టీం గెలుస్తుంది.
ఇకపోతే ప్లేయర్ 111 కొందరు స్టాఫ్ తో చేస్తున్న ఆర్గాన్ మాఫియా ఫ్రంట్ మ్యాన్ కు తెలుస్తుంది.ప్లేయర్111 ను,ఆ స్టాఫ్ ను చంపేస్తాడు ఫ్రంట్ మ్యాన్.ఇక తర్వాతి ఆటకు ఇద్దరుగా బృందాలు ఏర్పడమంటారు.ఇక్కడ అలీ శారీరక బలం కలిగిన వాడు కనుక అతనితో బృందంగా ఏర్పడతాడు సాంగ్ వూ.ఇక ప్లేయర్ 1 ను వదలలేక అతనితోనే బృందంగా ఏర్పడతాడు జిన్హూ.ప్లేయర్ 240,ప్లేయర్ 67 ఒక బృందంగా ఏర్పడతారు.ఇది మార్బుల్స్ ఆట.ఒక్కొక్కరికి పది చొప్పున గోలీలు ఇవ్వబడతాయి.తమతో జట్టుగా ఉన్న ఆటగాడి దగ్గర నుండి ఆ గోలీలు తీసుకోవాలి.అలా తీసుకున్న వారు విజేత.మిగిలిన జట్టు సభ్యుడు ఎలిమినేట్ అవుతారు.అలీ న్యాయంగా గెలిచాక అతనికి గోలీలు బదులు రాళ్ళు పెట్టి అతనికి ఇచ్చి ఎవరైనా ముసలి వారు,యువత ఉంటే తీసుకురమ్మని పంపిస్తాడు సాంగ్ వూ.అలా అలీ ఓడిపోయి మరణిస్తాడు. ఇక ప్లేయర్ 1 ఎలిమినేట్ అవుతాడు.ఈ ఆటలో 212 తో కలిసి ఎవరు బృందంగా ఏర్పడరు. ఆట ఆడి వచ్చిన వారికి ఆమె జీవించి ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుంది.ఈ ఆటలో సాంగ్ వూ మొదట పది మందితో బృందంగా ఉన్నప్పుడూ ఎలా కాపాడాడో,కానీ గెలిచిన ఆలిని తన ప్రాణం కాపాడుకోవటానికి ఎలా నమ్మించి మోసం చేశాడో చూశాక డబ్బు మనుషులను ఎలా మారుస్తుందో అర్ధం అయ్యేలా చేస్తుంది. జిన్ హూ బలహీనుడైన ప్లేయర్ 1 ను ఎన్నుకోవడం అతని మానవత్వాన్ని సూచిస్తుంది.
జున్ హూ మొత్తానికి ఆర్గాన్ మాఫియా కనుక్కుని,ఆ ఆటల్లో పాల్గొన్న వారి వివరాలు ఉన్న ఫైల్స్ కూడా వెతుకుతాడు.అందులో తన అన్న వివరాలు ఉంటాయి.ఆ తర్వాత విఐపిలు వస్తారు.వారి కోసం ఓ ఆట నిర్వహిస్తారు.ఈ ఆట జరుగుతున్న సమయంలో ఓ విఐపి ని గాయపర్చి అతని కన్ఫెషన్ రికార్డ్ చేసి అక్కడి నుండి తప్పించుకుంటాడు జున్ హూ.అతన్ని ఫ్రంట్ మ్యాన్ పట్టుకుంటాడు.చివరకు ఫ్రంట్ మ్యాన్ తన అన్నే అని అర్ధమవుతుంది.తమ్ముడు లొంగకపోవడంతో అతన్ని హత్య చేస్తాడు.
ఇక ఐదవ ఆటలో ప్లేయర్స్ అందరూ ఒక్కో నంబర్ ఉన్న బట్టలను ఎన్నుకోవాలి.16 మంది ప్లేయర్స్ ఉన్న ఆట అవ్వడం వల్ల ఒక్కొక్కరూ ఒక్కో నంబర్ ఎన్నుకుంటారు.జిన్ హూ చివరకు తికమకపడి ఏది మిగలకపోవడంతో 16 ను ఎన్నుకుంటాడు.ఇక ఆట ఏమిటంటే ఓ బ్రిడ్జిని దాటాలి.అందులో ఒక్కో టైల్ ట్యామ్పర్డ్ లేదా నార్మల్ గ్లాసుతో తయారు అవుతుంది.ట్యామ్పర్డ్ గ్లాస్ అయితే మనిషి బరువును భరిస్తుంది,మామూలు గ్లాస్ అయితే ప్లేయర్ కింద పడి మరణిస్తాడు.మొత్తం అందరికీ కలిపి 16 నిమిషాలు ఆట.ఈ ఆటలో కొందరు మరణిస్తూ ఉంటారు.తర్వాత ఉన్నవారు ముందు వారి అడుగులను బట్టి అనుసరిస్తూ ఉంటారు.వీరిలో 101 వంతు వచ్చేసరికి తాను మరణించి వెనుక వారు బ్రతకడం నచ్చక ఆగిపోతాడు.ఇక ప్లేయర్ 212 అతని మీద కోపంతో అతని కలిసి ముందుకు బలవంతంగా అడుగు వేయించడంతో అది నార్మల్ గ్లాస్ అవ్వడంతో ఇద్దరు మరణిస్తారు.ఇక మిగిలిన ప్లేయర్స్ నలుగురు.సాంగ్ వూ,జిన్ హూ,ప్లేయర్ 67,ప్లేయర్ 13.ప్లేయర్ 13 అంతకుముందు గ్లాస్ తయారీలో పని చేయడం వల్ల అతను ఏదో కనిపెట్టగలుగుతాడు.అలా ఒకటి కనిపెట్టినా,ఆ విషయం గమనించిన ఫ్రంట్ మ్యాన్ లైట్ ఆఫ్ చేస్తాడు.వెలుగు లేకుండా ఎవరూ కనిపెట్టలేరు.ఇక ఆఖరి టైల్ ఒకటే మిగులుతుంది.సాంగ్ వూ అతన్ని ముందుకు నెడతాడు.అతని పడిపోవడంతో మిగిలిన దాని మీద అడుగు వేసి మొత్తానికి ఫినిష్ చేస్తాడు.అతన్ని అనుసరించి జిన్ హూ ,ప్లేయర్ 67 కూడా ఆట ముగిస్తారు. ఈ ముగ్గురు మాత్రమే ఫైనల్ లిస్టుకు మిగులుతారు.
ఈ ఆట చివరిలో గ్లాస్ ప్లేయర్ 67 పొట్టకు గట్టిగా తగులుతుంది. ఆ రాత్రి మిగిలిన ముగ్గురికి గ్రాండ్ డిన్నర్ ఇస్తారు.చివరకు ముగ్గురుకి మూడు కత్తులు కూడా ఇస్తారు.ఆ రాత్రి ప్లేయర్ 67 జున్ హూ తో ఒకవేళ తమ ఇద్దరిలో ఒకరే బయటకు వెళ్తే ఆ ఒక్కరూ మిగిలిన వారి కుటుంబాన్ని చూసుకోవాలి అని అంటుంది.ఆమె కడుపు దగ్గర గాయం నుండి రక్తం కారుతూ ఉండటంతో ఆమెను కాపాడటానికి స్టాఫ్ ను పిలవడానికి జున్ హూ వెళ్ళిన సమయంలో సాంగ్ వూ ఆమెను చంపేస్తాడు,దాని వల్ల అతను గెలిచే అవకాశం పెంచుకోవడానికి.
ఇక చివరి ఆట సాంగ్ వూ,జిన్ హూ ల మధ్య.ఆ ఇద్దరికీ స్క్విడ్ గేమ్ పెడతారు.ఒకరు అఫెన్స్ ,ఇంకొకరు డిఫెన్స్ ఆడతారు.ఎంత హింస అయినా చోటు చేసుకోవచ్చు.ఆ ఆటలో జిన్ హూ దాదాపుగా సాంగ్ వూ ను చంపే సమయంలో మనసు మార్చుకుని మెజారిటీ ప్లేయర్స్ ఒప్పుకుంటే ఆట ఆపవచ్చు కనుక తనకు ఇష్టం లేదని చెప్తాడు.అతని నిర్ణయానికి సాంగ్ వూ కూడా ఆశ్చర్యపోతాడు.ఇక అలా ఖాళీగా తిరిగి వెళ్ళిన లాభం లేదని గ్రహించిన సాంగ్ వూ తన తల్లిని చూసుకొమ్మని జిన్ హూ కి చెప్పి తానే కత్తితో పొడుచుకుని మరణిస్తాడు.అలా గెలిచి బయటకు వస్తాడు జిన్ హూ.ప్లేయర్ ఒక్కొక్కరికి ఒక మిలియన్ చొప్పున 456 మిలియన్ల వన్ అతని బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు.అతను తిరిగి వచ్చేసరికి అతని తల్లి మరణిస్తుంది.సాంగ్ వూ తల్లికి కొంత డబ్బు ఇచ్చి,అది తాను సాంగ్ వూ కి ఇవ్వాల్సిందని చెప్పి,ప్లేయర్ 67 తమ్ముడిని ఆమెకు అప్పచెప్తాడు.
జున్ హూ డబ్బు ఖర్చు పెట్టడు.అయిన వారు లేకపోతే డబ్బు ఎందుకు పనికి రాదని అతనికి అర్ధమవుతుంది .తన ముందే అంతమంది మరణించడం అతన్ని డబ్బు పట్ల అభిప్రాయం మార్చుకునేలా చేస్తుంది.అదే సమయంలో అదే ప్లేయింగ్ విజిటింగ్ కార్డు అతనికి పంపబడుతుంది.అక్కడికి వెళ్ళి చూస్తే ప్లేయర్ 1 ఉంటాడు.తాను కూడా ఆ ఆటలు ఆడించే వారిలో ఒకడిని అని,నిజంగా అంత జరిగాక మనుషుల్లో మానవత్వం ఉందని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు.తాను దగ్గర ఉండి ఆ అనుభవం పొందడానికే అలా ప్లేయర్ గా ఉన్నానని చెప్తాడు.తర్వాత అతను మరణిస్తాడు.అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న విషయం తెలుసుకోవడానికి మరలా ఆడటానికి జున్ హూ బయలు దేరడంతో ఈ సిరీస్ ముగుస్తుంది.
డబ్బు కోసం మనిషి కలిసి పని చేస్తాడు.డబ్బు కోసం అదే మనిషి కలిసి ఉన్న వారిని చంపుతాడు.డబ్బు వచ్చే అవకాశం లేనప్పుడు మనిషిలో నిస్సహాయత నుండి జన్మించే మంచితనం మిగిలి ఉండవచ్చు.ఈ సిరీస్ లో టీంగా ఓ భార్యా భర్త ఏర్పడినప్పుడు స్వయంగా భర్త గెలవడం భార్య మరణించడం జరుగుతుంది.తర్వాత అతను బాధతో ఆత్మహత్య చేసుకుంటాడు.అవసరాలు మనిషిని ఎంత వరకైనా నడిపిస్తాయి.కానీ అదే అవసరం లేని పరిస్థితుల్లో అదే మనిషి ఎంత డబ్బు ఉన్నా దాని పట్ల నిర్లిప్తత కూడా ప్రదర్శించవచ్చు.పరిస్థితులు,అవసరాలు,ఆశలు మనిషిని ఏదైనా చేసేలా చేస్తాయి.వాటికి అవకాశాలు తోడైతే మనిషిలోని ఇంకో హంతకుడిని స్వయంగా చూడవచ్చు.ఇది మనుగడ క్రీడ అంతే.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!