క్రూయల్లా

 క్రూయల్లా

-శృంగవరపు రచన


బాలసాహిత్యంలో పెట్స్ కు ప్రాధాన్యత ఎక్కువ.1956 లో నవలగా వచ్చిన '101 Dalmatians' సినిమాగా కూడా వచ్చింది. దీనిలో ప్రతి నాయిక పాత్ర 'క్రూయల్లా డి విల్.' ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిగా వెలుగొందే ఈ పాత్ర దగ్గర పని చేసే అనితా అనే సెక్రటరీ ఇచ్చిన డిజైన్ లో ఉన్న 'బ్లాక్ స్పాట్స్'నచ్చి, ఆ డిజైన్ కోసం డాల్ మెషియన్ కుక్క పిల్లలను కిడ్నాప్ చేస్తుంది. అనితా దగ్గర ఓ ఆడ డాల్ మెషియన్ ఉండటం, అలాగే నాయకుడి దగ్గర మగది ఉండటం, ఆ ఇద్దరు వివాహం చేసుకోవడం, ఆ కుక్కలు కూడా జత కట్టి పిల్లలు కనడం, వాటిని కూడా క్రూయల్లా కిడ్నాప్ చేయడం, వాటిని చంపబోతున్న సమయంలో మిగిలిన జంతువులు వాటిని కాపాడటం, క్రూయల్లా అరెస్ట్ అవ్వడంతో ఈ కథ ముగుస్తుంది.
ఇది ప్రధానంగా పిల్లలకు నచ్చే అంశం. ఇందులోని క్రూయల్లా పాత్రను ప్రతినాయిక నుండి నాయికగా మార్చి, టీనేజర్స్ కు నచ్చేలా తీసిన సినిమానే 2021 లో వచ్చిన 'క్రూయల్లా' సినిమా.
ఇందులో క్రూయల్లా తల్లి స్వార్ధపరురాలు. తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి. ఆమె తాను తల్లి కాబోతున్నానని తెలియగానే, దానికి సంతోషించలేదు. బిడ్డ పుట్టాక ఆ పాపను చంపమని తన దగ్గర పని చేసే వ్యక్తికి అప్పగించింది. కానీ అతను అలా చేయలేక అక్కడే పని చేస్తున్న స్త్రీకి ఆ పాపను పెంచమని అప్పగిస్తాడు.ఆ పాపకు ఎస్టెల్లాగా పెరుగుతుంది. కానీ బాల్యం నుండే ఆమెలో ఓ హింసాత్మక ధోరణి, అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది. ఎస్టెల్లా తల్లి లాగా తయారు కాకూడదని ఎంత ప్రయత్నించినా సరే ఆమెలో అంతర్లినంగా క్రూయల్లా ఉంటుంది. ఎస్టెల్లా కన్నతల్లిని సాయం అడగడానికి వెళ్లిన ఎస్టెల్లా పెంచిన తల్లిని తానే చంపి దానిని యాక్సిడెంట్ గా చిత్రికరిస్తుంది. ఎస్టెల్లా కూడా అది యాక్సిడెంట్ అని అనుకుంటుంది.
ఆ తర్వాత ఎస్టెల్లా అనాధ అవుతుంది. అప్పటి నుండి ఇంకో ఇద్దరు ఆమె జీవితంలోకి ప్రవేశించడం, వారితో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేయడం చేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి ఉన్న ఆమెను ఆమె స్నేహితులు అతి కష్టం మీద అక్కడ ప్రసిద్ధి పొందిన డిజైనింగ్ ఏజెన్సీ లో చేరేలా చేస్తారు. దాని యజమాని ఎస్టెల్లా కన్న తల్లి. ఆ తర్వాత ఎస్టెల్లా ఆమె దృష్టిని ఆకర్షించడం, ఆమె తన పెంచిన తల్లిని చంపిందని, తన కన్న తల్లి అని ఎస్టెల్లా తెలుసుకోవడం,ఆమెకు పోటీగా నిలబడటం, ఆమెను చివరకు అరెస్ట్ చేయించటం, ఆమె క్రూయల్లాగా మారడంతో సినిమా ముగుస్తుంది.
పాత్రలు మంచివా? చెడ్డవా? లేదా మనుషులు మంచివారా? చెడ్డవారా? అనేది మనం చూసే కోణం, మనకున్న అభిప్రాయాలను అనుసరించి ఉంటుంది కానీ, ఆ మనుషుల్లో కాదు. మంచితనం, చెడ్డతనం ఈ ప్రపంచంలో లేవు, మన ఆలోచనల్లో, మన ప్రపంచాల్లో ఉన్నాయి. అవి సమిష్టి ఆమోదంతో సత్యంగా రూపొందాయి. మాతృక నవలలో చెడ్డ పాత్ర ఇంకో కోణంలో ఈ సినిమాలో నాయిక అయ్యింది. ఈ అంశాలు మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ఆలోచించండి.
* * *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ