మర్చిపోయిన మనిషి
చదువరి
సైన్స్ లో ప్రగతి శీలక చర్యలే దేశాల పురోగతిని ఎప్పటి నుండో నిర్దేశిస్తున్నాయి.దేశాల మధ్య ఎంత గట్టి పోటీ ఉంటే అంతే అంతే తీవ్రంగా ఆ ప్రగతిని ఏ మార్గంలో అయినా ఆ దేశాలు సాధించే ప్రయత్నం చేస్తాయి.ఆ ప్రయత్నాలు పోటీ దేశాల్లో గూఢచారత్వం చేసి ఆ దేశపు ఐడియాలను కాపీ కొట్టడం లాంటి కుట్రల నుండి మొదలుకుని ,ఆ దేశపు ప్రభావిత రంగాల్లో ఉన్న వ్యక్తులను తమ వైపు ఆకర్షించి వారిని దేశ ద్రోహులుగా మార్చడం వరకు అది ఏదైనా కావచ్చు,కానీ ప్రపంచం ముందు తమ ప్రతిభను చాటడమే ఆ దేశాల ముఖ్య ఉద్దేశ్యం.ఇటువంటి సందర్భాన్ని కథాంశంగా ఎన్నుకుని కెన్ ఫోలెట్ రాసిన నవలే ‘Code to Zero.’ కెన్ ఫోలెట్ రచనల్లో అంశాలు ఎంత క్లిష్టమైనవి అయినా సరే,వాటిని చదివింపజేసే శైలిలో రాయడం ఈ రచయిత ప్రత్యేకత.
1957 లో రష్యా స్పుత్నిక్ ను అంతరిక్షంలోకి పంపించి మొదటి ఉపగ్రహాన్ని పంపిన కీర్తి సాధించింది.దాని వెనువెంటనే స్పుత్నిక్-2 కూడా పంపి సంచలనం సృష్టించింది. మొదటి నుండి అమెరికా ఈ విజయం సాధిస్తుందని అందరూ ఆశించినా,రష్యా ఆ అంచనాలను తలక్రిందులు చేసింది.ఆ తర్వాత అమెరికా ఎక్స్ ప్లోరర్ ను పంపినా,నేటికి ప్రపంచంలో అన్నీ దేశాల కన్నా అధికంగా అంటే ఇప్పటి దాకా 1897 పంపి అమెరికా తన సత్తాను చాటినా,మొదటి దానిని పంపిన ఘనతను మాత్రం రష్యానే సాధించింది.ఓ దేశం సూపర్ పవర్ గా అవతరించడానికి స్పేస్ ఆవిష్కరణలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని కెన్ ఫోలెట్ రాసిన నవలే ‘Code To Zero.’
ఈ నవలలో ప్రధాన పాత్రలు ఐదు.ఈ ఐదుగురు స్నేహితులు.వారు ల్యూక్,యాంటోని,బెర్న్,బిల్లీ,ఎస్ప్లెత్. ఈ కథ రెండు రోజుల్లో జరుగుతూనే గతంలో ఈ అయిదుగురికి ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. ఈ కథలో నాయకుడు ల్యూక్.ఈ నవల ఆరంభంలో ల్యూక్ నిద్ర లేచేసరికి ఓ ట్రెయిన్ స్టేషన్లోని టాయ్ లెట్ లో తానెవరో గుర్తు తెలియని పరిస్థితుల్లో మేలుకొంటాడు.అతను తానెవరో తెలుసుకోవడం,తనను ఎవరు ఎందుకు ఇలా చేశారు అన్నది తెలుసుకోవడమే ఈ నవలలోని కథ.
ల్యూక్,ఎస్ ప్లెత్ భార్యాభర్తలు.యాంటోనీ సి.ఐ.ఏ లో పని చేస్తూ ఉంటాడు.ల్యూక్ సోవియట్ ఏజెంట్ అని,అతను రష్యాకు ఇచ్చిన సమాచారం వల్లే రష్యా స్పుత్నిక్ లాంచ్ చేయగలిగిందని,అతన్ని చంపాలని తన డిపార్ట్మెంటు నిర్ణయించుకోవడం వల్ల,అతన్ని ఆ ప్రమాదం నుండి కాపాడటానికి అలా చేశానని చెప్తాడు.
ల్యూక్ తండ్రి బ్యాంకర్,గొప్ప ధనవంతుల కుటుంబం అతనిది. ల్యూక్,బెర్న్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ రెసిస్టెన్స్ కు తోడ్పాటుగా అమెరికా తరపున ఉండి,యుద్ధంలో పాల్గొన్నారు.ఆ సమయంలో బెర్న్ రష్యాకు ఏజెంట్ గా పని చేస్తున్నాడని తెలిసినప్పుడు అతన్ని ల్యూక్ హెచ్చరించాడు.అప్పటి నుండి బెర్న్ కూడా ఏజెంట్ గా ఉండలేదు.కానీ వారి స్నేహం అప్పటి నుండి అంతకు ముందు ఉన్నంత సన్నిహితంగా లేదు.
ల్యూక్ మొదట ఎస్ ప్లెత్ ను ఇష్టపడ్డాడు.కానీ తర్వాత బెల్లినీ చూశాక ఆమెను ప్రేమించాడు.ల్యూక్ యుద్ధం నుండి తిరిగి వచ్చేసరికి ఆమె గర్భస్రావం చేయించుకున్న విషయం తన దగ్గర నుండి దాచిందన్న కారణం వల్ల ఆమె నుండి విడిపోతాడు.బెల్లి బెర్న్ ను వివాహం చేసుకుంటుంది.
బెల్లి మనిషి మెదడు మీద పరిశోధన చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో యుద్ధ ఖైదిల మెదడులను నియంత్రించి వారిని తమకు అనుగుణంగా ప్రవర్తించేలా చేయడానికి,బెల్లి పరిశోధనను వినియోగించడానికి అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ పరిశోధనకు ఫండింగ్ ఇస్తుంది.దీని వల్ల తలెత్తే నైతిక సమస్యలను గ్రహించిన బెర్న్ దానిని వ్యతిరేకిస్తాడు. ఇందులో తలెత్తిన సంఘర్షణ వల్ల ఆ ఇద్దరు ఓ బాబు పుట్టిన కొన్నేళ్లకు విడిపోతారు.కానీ ఇద్దరు స్నేహితులలానే ఉంటారు. వారిద్దరు విడిపోయిన కొంత కాలానికి ల్యూక్ ఎస్ ప్లెత్ ను వివాహం చేసుకుంటాడు.
మిగిలిన అన్నీ విషయాలు మిత్రుల ద్వారా తెలుసుకోగలిగిన ల్యూక్ ఎస్ ప్లెత్ కు తనకు ఉన్న అనుబంధాన్ని మాత్రం తెలుసుకోలేడు చివరి వరకు కూడా.ఆమెకు,తనకు ఎందుకు పిల్లలు లేరో అతనికి అర్ధం కాదు.యాంటోని ఏదో నిజం దాస్తున్నాడని ల్యూక్ నిజంగా సోవియట్ ఏజెంట్ కాడని బెర్న్,బెల్లి నమ్మి అతనికి ఆ నిజం తెలుసుకోవడానికి సహకరిస్తారు.అతను ఏదో ఫైల్ తో బయలుదేరి ఓ హోటల్ లో రూమ్ తీసుకున్నట్టు,మధ్యలో యాంటోనిని కలిస్తే అతను ఏదో మత్తు మందు కలిపి తనకు బెల్లి లేని సమయంలో ఆమె ఆసుపత్రికి తీసుకువెళ్లి ‘గ్లోబల్ ఆంనీషియా’ వచ్చేలా చేసినట్టు ల్యూక్ కు అర్ధమవుతుంది.
యాంటినో సోవియట్ ఏజెంట్. డబల్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ అమెరికన్ స్పేస్ రహస్యాలు అన్నీ అటు వైపుకు చేరవేస్తున్నాడు.ఆ విషయం గుర్తించిన ల్యూక్ అమెరికా లాంచ్ చేయబోతున్న ఎక్స్ ప్లోరర్ విఫలం అవ్వడానికి చేసిన బ్లూ ప్రింట్ ఎవరికి తెలియకుండా పై అధికారులకు అందజేయడానికి ఆ రోజు వచ్చాడు.అతనికి ఆ విషయం గుర్తు ఉండకుండా చేసి,ఆ తర్వాత ఆ విషయం బయటకు రాకుండా ఉండటానికి అతన్ని హతమార్చాలనుకుంటాడు యాంటినో. ఎస్ ప్లెత్ కూడా సోవియట్ ఏజెంట్.ల్యూక్ ను వివాహం చేసుకుంది కూడా ఆ రహస్యాలు అందించడానికే.ఆమె అందుకే పిల్లలు పుడితే మారిపోతుందని ముందే ప్లాన్ చేసి పిల్లలు పుట్టకుండా చేసుకుంటుంది. ఇవన్నీ తెలుసుకున్న ల్యూక్ చివరకు వారిని పట్టించడం,వారు చనిపోవడం,ల్యూక్ మరలా బిల్లీని వివాహం చేసుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ నవలలో ల్యూక్ పాత్ర ఏదైనా ఓ తప్పు చేసిన వారిని పూర్తిగా క్షమించని తత్వం కలిగిన పాత్ర అయినప్పటికి,గతం మర్చిపోయాక వారిలోని స్నేహాన్ని,ప్రేమను మరలా సన్నిహితంగా కష్ట సమయంలో చూసి మరలా వారిని స్నేహితులుగా చేసుకునే పాత్ర కూడా. ఈ నవలలోని కథ కల్పితం అయినా స్పేస్ కాన్స్పిరసీ సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయాన్నవి మాత్రం నిజం. దేశాల మధ్య జరిగే వ్యూహాలు,స్పైయింగ్ వంటివి తెలుసుకోవాలంటే కెన్ ఫోలెట్ నవలలు చదవాల్సిందే.
* * *
Comments
Post a Comment