మనకు చిన్న విషయమే!
మనకు చిన్న విషయమే!
కాల్పనిక సాహిత్యంలో రచయిత అనుభూతులు-అనుభవాలు-నమ్మకాలు ప్రాధాన్యతను సంతరించుకోవు.పాఠకులకు తన రచన ద్వారా స్పష్టం చేయాలనుకున్న అంశాన్ని తనదైన శైలిలో కనక్ట్ చేయగలగడానికే ప్రాముఖ్యత ఉంటుంది.అంతర్జాతీయ సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ వర్గంలో టైమ్ ట్రావెల్,ప్యారలల్ వరల్డ్ అంశాల మీద ఎన్నో రచనలు వచ్చాయి,వస్తూనే ఉంటాయి.మనుషుల ఊహల్లో నిజం ఉందో,నిజాన్ని కనుగొనే ప్రక్రియలో ఊహ భాగం అవుతుందో చెప్పడం కష్టం కానీ,ఊహ-నిజం అర్ధాల పరంగా వ్యతిరేక తత్వాన్ని కలిగి ఉన్నప్పటికి,ఆ రెండు ఎప్పుడు కలిసే పయనిస్తూ ఉంటాయి.కొన్ని సార్లు ఊహ నిజంగా మారితే,ఇంకొన్ని సార్లు నిజాన్ని కనుగొనడానికి ఊహ ఆయుధం అవుతుంది.దీనిని మనం సైన్స్ బాషలో 'Assumption'అనుకోవచ్చు.తెలుగు నవలా సాహిత్యంలో మనిషి ఆలోచనలు,అతన్ని ప్రభావితం చేసే ప్రేరణలు,ఎంత వరకు అతనిలో ఉన్న మానసిక సంఘర్షణలు ఈ కొత్త ఊహా లోకంలో చిత్రీకరించబడతాయో,ఎక్కడ అతని నమ్మకాలు,తెలుసుకున్న విషయాలు వంటివి ఆ లోకంలో అతన్ని శాసిస్తాయో వంటి అంతర్లీన మానసిక లోతులతో,మనుషులు ఏర్పరచుకునే సిద్ధాంతాలు,చరిత్రగా మారే సంఘటనల్లో ఉన్న అంతర్లీన స్వార్ధాలను స్పష్టం చేసే నవలే అరిపిరాల సత్యప్రసాద్ గారి 'జరుగుతున్నది జగన్నాటకం.'
ప్రతి వ్యక్తికి తాను చెప్పుకోకుండానే తన ఆలోచనలు,వాదనలు సరైనవి అని నిరూపించుకోవాలనే తపన ఉంటుంది.తన వ్యక్తిగత జీవితం అందులో భాగం కాకుండా,తనను తాను అందులో చేర్చుకోకుండా సమాజం మీద లేక సమాజంలోని వ్యక్తుల మీద,వారి జీవితాలు-అభిప్రాయాలు-నిర్ణయాల ద్వారా తన వాదనను నిలుపుకుంటూ తన మేధస్సును,తాత్కాలికంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సూక్ష్మంగా గమనించకపోతే మన చుట్టూ ఉన్న మనుషుల్లో లేదా మనలో ఇటువంటి ప్రవర్తన మనకు సహజంగానే అనిపిస్తూ ఉంటుంది.కానీ లోతుగా ఆలోచించే కొద్ది దృక్కోణాలు మారిపోతూ,కొన్నిసార్లు వ్యక్తుల స్థాయిలను అనుసరించి ఆ నిర్ణయాలు చరిత్రలో భాగం కూడా అవుతాయి.
కథ ప్రారంభంలో సారధి,మూర్తి,ప్రసాద్ ముగ్గురు రేవు పార్టీకి వెళ్తారు. ఈ ఘటనలోనే రచయిత మనకు సారధి పాత్ర తన అభిప్రాయాలే సరైనవి అని నిరూపించుకోవడానికి ప్రసాద్ తో వాదనకు దిగడం పాఠకులకు సారధి పాత్ర మీద ఓ అభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది. మాలతి అనే అమ్మాయి భర్త టూత్ పేస్టును మధ్యలో నుండి నొక్కి వేసుకోవడం నచ్చక అతనికి విడాకులు ఇస్తుంది.ఆ అమ్మాయి ఆ పార్టీకి రావడంతో ఆమె అంత చిన్న అంశానికి విడాకులు ఇవ్వడం సబబు కాదని సారధి ప్రసాద్ తో వాదిస్తాడు.అది ఆమె జీవితమని,అనుభవించిన వారికే ఆ బాధ తెలుస్తుందని ప్రసాద్ వాదిస్తాడు.
మనిషి అభిప్రాయాలకు,అనుభవాల ద్వారా ఏర్పరచుకునే నమ్మకాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఓ మనిషికి సహజంగా ఏ అభిప్రాయం ఉన్నా సరే,అదే అనుభవంలోకి వచ్చినప్పుడు తన సౌఖ్యానికి అనుగుణంగా తన అభిప్రాయానికి విరుద్ధంగా ప్రవర్తించవచ్చు.అప్పుడు అంతకు ముందు ఉన్న అభిప్రాయం స్థానంలో అనుభవం ద్వారా ఏర్పడిన నమ్మకం స్థిరపడుతుంది. సారధికి సంబంధించినంత వరకు మాలతి సమస్య చాలా చిన్న విషయం. అదే అతని జీవితంలో ఓ వింత అనుభవం ఏర్పడినప్పుడు అతని ఎంత మేరకు ఏది తన జీవితంలో చిన్న విషయం?ఏది కాదు?అన్న అంశాల పట్ల ఏ మేరకు తన అభిప్రాయం మీద నిలబడగలిగాడు అన్న అంశాన్ని వినూత్న కోణంలో రచయిత ఆవిష్కరించారు.
ఆ మత్తు మందు తీసుకున్న తర్వాత సారధి ఇంకో కొత్త ప్రపంచంలో కళ్ళు తెరుస్తాడు. ఆ ప్రదేశం పేరు సవ్యలంక.అక్కడ ఆచారాలు అన్ని అతనికి వింతగా అనిపిస్తాయి. అతనికి తన దేశం భారత దేశం అని గుర్తుంటుంది,ఆ దేశ నేతలు అయిన గాంధీ,బోస్ లాంటి వారు కూడా గుర్తు ఉంటారు కానీ అతని పేరు అతనికి గుర్తు ఉండదు.సవ్యలంకలో అందరూ ఎడమ చేతితో అన్ని పనులు చేస్తారు.అక్కడ ఎడమ చేతిని శుభప్రదంగా భావిస్తారు. కానీ కుడి చేతి వాటం ఉన్న సారధి దాని వల్ల ఆ దేశ సేనాధిపతి ద్వారా మరణ శిక్ష వరకు వెళ్తాడు. అదే సమయంలో ఆ రాజ్యంలోని గురువు అయిన వేదాంతం అతన్ని కాపాడతాడు. తన పేరు గుర్తు లేక బోస్ తన పేరు అని వారితో చెప్తాడు.ఆ దేశ మహాగ్రంథంలో మహాబసు అనే విప్లవకారి ఆ దేశంలో ఉన్న అరాచకత్వానికి వ్యతిరేకంగా పోరాడతాడని,అతను నాయకుడై గెలిచాక మహా ప్రళయం వస్తుందని,అందులో అతను కూడా మరణిస్తాడని,ఆ ప్రళయంలో ఎడమ చేతి వాటం ఉన్న వారు మరణించి కుడి చేతి వాటం ఉన్న వారితో నూతన సమాజం నిర్మించబడుతుందని ఉంటుంది. ఆ మహాబసు సారధి అని వేదాంతం మరియు అతని ఆశ్రమంలోని వారు నమ్ముతారు.వేదాంతం శిష్యురాలైన ద్వీప మహాబసును వివాహం చేసుకుంటుందని కూడా ఆ గ్రంథంలో ఉంటుంది. ఆ మహాబసు విదేశీయుడని కూడా ఆ గ్రంథంలో ఉంటుంది.
ఈ సంఘటనలు జరుగుతున్న సమయంలో సారధిగా కూడా ప్రస్తుత ప్రపంచంలో ఉంటాడు. అతను సైకియాట్రిస్ట్ అయిన నరసింహంతో తన అనుభవాలు పంచుకుంటూ ఉంటాడు.అతను మొదట్లో దీనిని తేలికగా కొట్టేసినా ఆ తర్వాత సారధి అనుభవాలను నమ్ముతాడు.ఆ తర్వాత ఆ ప్యారలల్ వరల్డ్ లో తాను వేదాంతం అని చెప్తాడు.
మహాబసుగా నిరూపించుకున్న బోస్ సవ్యలంకలో ఈ ఎడమ చేతి వాటం ఎలా ఆ రాజ్యంలోకి వచ్చిందో ఆ రాజ్యంలోని సాహిత్యం ద్వారా,పాటల ద్వారా,కథల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.ఆ ప్రయత్నంలో భాగంగా అతను సవ్యలంకలోని అడవుల్లో ఉన్న ఓ దేవత కుడి చేతితో ఆశీర్వదించడం చూసి మొదట ఆ రాజ్యంలో కుడి చేతి వాటం ఉండేదని,ఆ తర్వాత బలవంతంగా ఎడమ చేతి వాటం రుద్దబడిందని అర్ధం చేసుకుంటాడు.సవ్యలంక రాజుకు వ్యతిరేకంగా గాంధీలా అహింసా మార్గంలో ఆ సవ్యలంక ప్రజల్ని నడిపిస్తాడు. కానీ ఆ రాజు దానిని అవకాశంగా తీసుకుని 26 మంది నిరాయుధులను హత్య చేస్తాడు.అప్పటి నుండి హింస వైపు మళ్ళుతాడు.ఆ తర్వాత ఆ రాజును కలుసుకున్నప్పుడు అతనికి ఎడమ చేతి వాటం ఎలా అమల్లోకి వచ్చిందో స్పష్టమవుతుంది. సవ్యలంక మొదటగా కుడి చేతి వాటం ఉన్న రాజ్యమే.కానీ ఓ రాజకుమారుడికి ఎడమచేతి వాటం ఉండటం వల్ల దానిని కప్పి పుచ్చి,కుడి చేతి వాటాన్నే అశుభంగా మార్చి,కట్టు కథలు ప్రచారం చేసి మొత్తానికి మతాధికారుల సాయంతో రాజు దానినే చట్టబద్ధం చేశాడు.
సహజంగానే పురుష ఆధిపత్యం ఉన్న సమాజం వల్ల అంతకు ముందు ఉన్న మాతృ స్వామ్య వ్యవస్థను అంతం చేయడానికి కూడా ఆ దేవతల కుడి చేతి ఆశీర్వాదాన్ని ఆ రాజ్యానికి అశుభంగా ప్రకటించి,కల్పిత కథల ద్వారా ప్రజలను నమ్మించి,పాటించకపోతే కఠినంగా శిక్షించి మొత్తానికి ఆ రాజ్యాన్ని ఎడమచేతి వాటం ఉన్న రాజ్యంగా మార్చారు.స్వతహాగా అక్కడ ఉన్న రాజు కూడా కుడి చేతి వాటం ఉన్న రాజు అయినప్పటికి తప్పని పరిస్థితుల్లో అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పి,మహాబసును సేనాధిపతి నుండి కాపాడే ప్రయత్నంలో తాను మరణించి అతన్ని అక్కడి నుండి తప్పించుకునేలా చేస్తాడు.ఆ తర్వాత అతను యుద్ధంలో గెలవడం,మహాప్రళయం రావడం అందరూ అందులో కొట్టుకుపోవడంతో ఆ ప్రపంచ కథ సమాప్తమవుతుంది.ఇకపోతే డాక్టర్ నరసింహం కూడా అతని ఊహే అని అతనికి స్పష్టమవుతుంది.ఇక ప్రస్తుత లోకానికి అతను రావడంతో నవల ముగుస్తుంది. ఇదే కథలో సమాజంలో అధికారానికి, వ్యాపారానికి ఉన్న ఆవశ్యక సంబంధాన్ని కూడా రచయిత స్పష్టం చేశారు. వ్యాపార దృక్కోణమే అది స్థిరపడ్డాక రాజ్యం కాంక్షగా పరిణామిస్తుందని ఉదాహరణలతో సోదాహరణంగా రాసారు.
ఇది కథ పరమైన నవల మాత్రమే కాదు మనుషుల నమ్మకాలను,అభిప్రాయాలను,చరిత్రను ఎన్నో కోణాల్లో ప్రశ్నించే రచన కూడా.కుడి చేతి వాటం,ఎడమ చేతి వాటం అనేవి చిన్న విషయాలు కానీ దాని కోసం ఓ దేశంలో యుద్ధాలు,విప్లవాలు రావడం అన్నది పెద్ద విషయం.వ్యక్తిగతంగా ఏదైనా తన జీవితాన్ని,స్వేచ్చను భంగపరచనంతవరకు మనిషి ప్రతి అంశాన్ని చిన్న విషయంగానే చూస్తాడు.తన మీద ఎవరి అభిప్రాయం అయినా రుద్దబడినప్పుడు మాత్రమే అది అతని సమస్యగా మారుతుంది.సారధి ఎప్పుడైతే అక్కడ తన జీవితాన్ని సవ్యలంకకు అనుగుణంగా మార్చుకోలేని పరిస్థితుల్లో పడ్డాడో,అప్పుడే అది అతనికి ఆ దేశ సమస్య కాకుండా తన సమస్యగా కనిపించింది.తాను అనుభవించాడు కనుక అది అందరి కోణాల్లోనూ కూడా అతనికి సమస్యగానే కనిపించింది. బయట దేశస్థుడిగా ఉంటే అతనికి చిన్న అంశం అవ్వవచ్చు,కానీ అక్కడి నుండి బయటపడలేని పరిస్థితులు వచ్చినప్పుడు పెద్ద అంశమైపోయింది.
మనిషి నమ్మకాలకు మూలం,చరిత్రకు మూలం అనుభవాలు మాత్రమే కాదు కండిషనింగ్ కూడా.ఏదైతే మనిషి పదే పదే ఎక్కువమంది ద్వారా వింటాడో అదే సత్యమని చూడకపోయినా విశ్వసిస్తాడు.మామూలు మనిషి కూడా ఏదైనా కొనేటప్పుడు ఆ కొనే వస్తువు మీద మిగిలిన వారి అభిప్రాయాలకు అనుగుణంగా తన నిర్ణయాన్ని తీసుకుంటాడు.ఇది మనిషి జీవితంలోని ఎన్నో అంశాలకు వర్తిస్తుంది.
పదే పదే మనిషికి ఒకే సంఘటనను ఎంతో మంది వ్యక్తుల ద్వారా విన్నప్పుడు,అదే కొన్ని సార్లుచరిత్ర అయిపోతుంది.దాని కోణం ఆ విన్నవారి కోణం కావచ్చు,అది ప్రచారం చేసిన వారి కోణం కావచ్చు,కానీ చూసి-అనుభవించిన వారి కోణాలు మాత్రం పరిమితమే.మనుషుల ఆలోచనల్లోని ఎన్నో దృక్కోణాలను,నమ్మకాలను,సిద్ధాంతాలను.శాస్త్రీయతను,తాత్వికతను మేళవించి ఈ నవలలో పాఠకులకు ఎన్నో కోణాలను పరిచయం చేశారు సత్యప్రసాద్ గారు.ఓ సూక్ష్మ అంశాన్ని తాత్విక-చారిత్రక-శాస్త్రీయ కోణాల్లో ఏకకాలంలో పాత్రల చర్చల ద్వారా స్పష్టం చేయడం రచయితలోని బహుముఖ రచనా ప్రజ్ఞను స్పష్టం చేస్తుంది.ఈ నవలలోని సారధి పాత్రలో పాఠకులు తమను కనీసం రెండు మూడు సార్లు అయిన దర్శించుకోగలగడం ఈ నవలా వస్తుధ్వని విశిష్టత.
* * *
Comments
Post a Comment