ఉనికి లేని చోట!

 ఉనికి లేని చోట!

-శృంగవరపు రచన



కొన్ని సినిమాల్లో డ్రామా ఉంటుంది. కొన్ని సినిమాల్లో క్రైమ్ ఉంటుంది. ఇంకొన్ని సినిమాల్లో హాస్యం ఉంటుంది. అతి కొద్ది సినిమాల్లోనే జీవితం ఉంటుంది. అటువంటి సినిమానే లెబనీస్ సినిమా 'Capharnam.' తమకoటు ఎటువంటి ఉనికి లేక, పేదరికం లో మగ్గుతూ, తాము నివసించే దేశంలో తాము పౌరులమని చెప్పుకునే డాక్యుమెంట్స్ లేకుండా జీవించే వారి పిల్లలు, వారి తరాలు ఎలా ఉంటాయో ఈ సినిమా స్పష్టం చేస్తుంది. ఈ కోణంతో పాటు వేరే దేశాలకు పని కోసం వలస వచ్చే ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ ఇబ్బందులు,ప్రశ్నర్ధమైన ఉనికితో జీవితం సాగించే దృక్కోణం కూడా ఈ సినిమాలో ఉంది.ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
ఈ సినిమాలో కథ అంతా జైన్ అనే 12 ఏళ్ళ కుర్రవాడి కథగా నడుస్తుంది. జైన్ ఓ వ్యక్తిని చంపే ప్రయత్నం చేసినందుకు ఐదేళ్ళ జైలు శిక్ష పడుతుంది. జైన్ ఆ శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే తన తల్లిదండ్రుల మీద కేసు వేస్తాడు. కోర్టుల్ తన జీవితం గురించి చెప్తాడు జైన్ ఆ సందర్భంలో.
జైన్ తన తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళతో కలిసి లెబనాన్ రాజధాని అయిన బీరుట్ లోని మురికివాడల్లో జీవిస్తూ ఉంటాడు. అతనికి ఏడుగురు తోడబుట్టినవాళ్లు.వారిలో అతని తరువాత అమ్మాయి అయిన సహర్ అంటే జైన్ కు ప్రేమ, ఇష్టం.నొప్పి తగ్గించే మాత్ర అయిన ట్రామాడల్ ను దొంగ ప్రిస్క్రిప్షన్స్ తో జైన్ తెస్తే ఆ మందులను పౌడర్ లా చేసి బట్టలతో నానబెట్టి దానిని డ్రగ్స్ లా తయారు చేస్తుంది ఆ కుటుంబం. ఆ డ్రగ్స్ ను జైన్ అన్నయ్య కు ఇస్తే అతను జైలులో ఉన్న డ్రగ్ బానిసలకు అమ్ముతూ ఉంటాడు.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నిజంగా ప్రేక్షకులను కదిలిస్తాయి.సహర్ బట్టలకు రక్తపు మరకలు ఓ ఉదయం ఉండటం గమనించిన జైన్ ఆ బట్టలు ఉతకడం, ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే అసద్ అనే అతనికి ఇచ్చి వివాహం చేసేస్తారని, అందునుండి చెల్లిని కాపాడటానికి ఆమెను తనతో పాటు వేరే కొత్త ప్రదేశానికి తీసుకువెళ్ళి కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటాడు.కానీ వెంటనే సహర్ వివాహం అసద్ తో జరిగిపోతుంది. దానితో బాధతో జైన్ బస్ ఎక్కి
, పక్కనే ఉన్న రాస్ బీరుట్ లో దిగుతాడు. అతనికి అక్కడే రాహిల్ అనే స్త్రీ పరిచయమవుతుంది. ఆమె ఇతియోపియా నుండి వచ్చిన ఇమ్మిగ్రెంట్ వర్కర్. ఆమెకు పాలు తాగే కొడుకు యోనస్. అనాధలా ఉన్న రాహిల్ జైన్ కు తన ఇంట్లో ఆశ్రయమిస్తుంది.దానికి బదులుగా రాహిల్ పనికి వెళ్ళినపుడు యోనస్ కు బేబీ సిట్టింగ్ చేస్తాడు జైన్.
రాహిల్ కు వర్క్ పర్మిట్ అయిపోతుంది.అస్ప్రొ అనే అతను నకిలీవి ఇస్తూ ఉంటాడు. దానికి కావలసిన డబ్బులు రాహిల్ దగ్గర ఉండవు. దానికి బదులుగా యోనస్ ను ఇవ్వమంటాడు అస్ప్రొ. తన బిడ్డను వదులుకోవడానికి ఒప్పుకోదు రాహిల్. రాహిల్ ను అరెస్ట్ చేస్తారు వర్క్ పర్మిట్ అయిపోవడం వల్ల. ఆమె కోసం ఇంట్లో జైన్ ఏసురు చూస్తూ ఉంటాడు. ఎన్ని రోజులైనా ఆమె రాదు. ఆమె ఆస్ప్రొ దగ్గరకు వెళ్ళి ఉండవచ్చని జైన్ కు ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్తాడు. క్రమేపి యోనస్ ను చూసుకుంటూ ఉంటాడు. తర్వాత తాను కూడా అస్ప్రొ ద్వారా వేరే దేశం వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ డబ్బులు లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో యోనస్ ను అస్ప్రొకి ఇస్తాడు. అస్ప్రొ జైన్ ను ఏదైనా అతనికి ఉనికిని స్పష్టం చేసే డాక్యుమెంట్ తీసుకురమ్మంటాడు. దాని కోసం తన ఇంటికి వెళ్తాడు జైన్.అక్కడ అతని తండ్రి తమ లాంటి వారికి ఏ పేపర్లు ఉండవని చెప్తాడు. అప్పుడే జైన్ కు తన చెల్లి సహర్ చనిపోయిందని తెలుస్తుంది.11ఏళ్లకే గర్భవతి అయి మరణిస్తుంది. అసద్ ను చంపే ప్రయత్నం చేసి అరెస్ట్ అవుతాడు. అతను జైలులో ఉండగా అతన్ని చూడటానికి వచ్చిన అతని తల్లి సహర్ మరణించినందుకు బాధ పడవద్దని తాను మళ్ళీ గర్భవతి కాబోతున్నానని చెప్తుంది. ఆ విషయం విన్నాక తల్లి మీద అసహ్యం కలుగుతుంది జైన్ కు. ఓ రోజు టివి లో బాలల మీద జరుగుతున్న ఘోరాలు కార్యక్రమం చూసాక కాల్ చేసి తాను తన తల్లిదండ్రుల మీద తనను కన్నందుకు కేసు వేయాలనుకుంటున్నాను చెప్తాడు. జైన్ ద్వారా అస్ప్రొ ను పట్టుకోవడం, రాహిల్ -యోనస్ కలుసుకోవడం, జైన్ కు ఐడి కార్డు కోసం ఫోటో తియ్యడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాకు రెండు కోణాలు ఉన్నాయి. లెబనాన్ లో ఉంటూ తమకంటూ ఉనికి లేని జైన్ కుటుంబం, ఇమ్మిగ్రెంట్ వర్కర్ గా వచ్చిన రాహిల్... ఈ రెండు కథలు ఉనికి లేని జీవితాల్లో ఉండే కష్టాలను, పిల్లలకు తిండి ఉంటే చాలని పెళ్లిళ్లు చేసే పరిస్థితులను ఈ సినిమా ఎంతో దగ్గరగా చూపిస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ