ఆశయాలు-జీవితాలు
చదువరి
ఆశయాలు-జీవితాలు
-శృంగవరపు రచన
(లల్లా దేవి గారి 'భార్గవి'నవలా సమీక్ష)
'లల్లా దేవి' పేరుతో ఎన్నో రచనలు చేసిన రచయిత పరచూరి నారాయణాచార్యులు గారు.ఆయన రచనలు 1980 ల కాలం నాటివి. ఆయన నవలలు ఇంతకు ముందు ఒకటి కూడా నేను చదవలేదు. దానికి ఓ కారణం స్త్రీ పేరుతో ఆయన నవలలు రాశారని, అలా కాకుండా నేరుగా తన పేరుతోనే రాయలేనితనం అని నాకు అనిపించడం వల్ల కావచ్చు.కానీ ఆ ఒక్క కారణం వల్ల దాదాపు అరవై నవలల దాకా రాసిన ఆయన సాహిత్యాన్ని ఓ పాఠకురాలిగా చదవకపోవడం నా సంకుచిత్వం అని అనిపించింది.మొత్తానికి ఇన్నాళ్ళకు ఆయన నవల 'భార్గవి' చదివాను.కచ్చితంగా మంచి నవల అని చెప్పడానికి కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.బాష ఎంతో ఉన్నతంగా ఉంది.భావాలు ఆశయస్పూర్తిని నింపేలా ఉన్నాయి ఈ నవలలో.స్త్రీ మనసును ఓ కోణంలో ఆవిష్కరింపజేసే నవల ఇది.
స్త్రీ,పురుషుల మధ్య వివాహమయ్యాక పురుషుడు స్త్రీ మీద ప్రదర్శించే ప్రేమ అతని పురుషాధిక్యత నుండే జన్మిస్తుంది చాలా సార్లు. తన భార్య తాను పిలవగానే రావడం,తనకు అన్ని అందించడం అందరి ముందు ఇవన్నీ జరుగుతూ ఉండటం అతనికి తన ఆధిక్య స్ఫూర్తిని నిలుపుకునేలా చేస్తూనే,ఆ భావజాలాన్ని అతనిలో బలపడేలా చేస్తుంది. పురుషుడు ఇది చేసేటపుడు అలా అనుకోకపోవచ్చు కానీ అది సాధారణ చర్యలా జరిగిపోతూ ఉంటుంది.ఎవరింటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లోనే స్త్రీలు అతిధి మర్యాదలు చేయడం,చాలా సందర్భాల్లో వాళ్ళు గౌరవం ఇవ్వడానికి సూచనగా నిలబడే ఉండటం వంటివి మనం గమనిస్తూనే ఉంటాము.అది వినయమా?విధేయతా?అలా మసులుకోకపోతే అక్కడ అత్తరింట్లో మనలేమనే భయంతో వచ్చిన బానిసత్వమా? అన్నదానికి ఎవరి సౌకర్యానికి తగ్గట్టు వారు అన్వయించుకోవచ్చు కానీ ఈ అంశాలన్నీ ఆలోచించేవారు మాత్రం ఆ అన్వయ పరిధిని దాటి తమ సమాన స్థాయిని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. బలహీనుల మీద బలవంతులు అధికారం చలాయించడం వల్లనే శక్తి చేకూర్చుకోవడం అన్ని వర్గాల్లో జరిగేదే.తాము బలహీనులుగా ఉండిపోకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేసేవారే మార్పుకు నాంది అవుతారు. అటువంటి ఇద్దరి స్త్రీల కథే ఈ 'భార్గవి' నవల.
ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు ఇద్దరు. ఒకరు ముందు తరం ప్రతీక కౌసల్య. ఇంకొకరు కథ నడుస్తున్న కాలం నాటి స్త్రీ అయిన భార్గవి.కౌసల్య భార్గవి జీవితాన్ని మార్చుకునే గమనంలో ఓ ఇంధనంలా తోడ్పడుతుంది.భార్గవి డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి శ్రీనివాస దీక్షితులు,తల్లి సీతమ్మ. కాలానికి తగ్గట్టు మార్పులను ఆహ్వానించాలని భావించే వ్యక్తి భార్గవి తండ్రి అయితే, స్త్రీ అంటే కేవలం పెళ్ళి-పిల్లల కోసమే పుట్టిందని భావించే స్త్రీ ఆమె తల్లి.అయినా తండ్రి ప్రోత్సాహంతోనే డిగ్రీ వరకు వచ్చింది.
కౌసల్య ఓ లేడీస్ హాస్టల్ నడుపుతుంది. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని ఏ సందర్భంలో అయినా నిలుపుకోవాలని,దాని కోసం ఆమె ధైర్యంగా నిలబడాలని,పరిస్థితులకు లోబడి లొంగిపోకూడదని తన హాస్టల్లో ఉండే అమ్మాయిలను స్వతంత్ర శైలిలో జీవించేందుకు అవసరమైన క్రమశిక్షణను,వాతావరణాన్ని ఆమె అక్కడ నిర్మించింది. కౌసల్య వ్యక్తిగతంగా భర్తతో ఇమడలేక విడిపోయి తర్వాత ఈ హాస్టల్ పెట్టింది. చలం పుస్తకాలు చదివి ఆమె చెడిపోయిందని,ఆ హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలను తన లానే తయారు చేస్తుందని గిట్టని వారు తమ అక్కసు వెళ్లగ్రక్కినా,ఎన్నో దుష్ప్రచారాలు చేసినా సరే అవేమీ పట్టించుకోకుండా ఎంతో క్రమశిక్షణతో హాస్టల్ నడుపుతూ ఉంటుంది కౌసల్య.ఆమె వ్యక్తిత్వానికి ముగ్దురాలైన విద్యార్ధిని భార్గవి.
తాను హాస్టల్ లో ఉండకపోయినా సరే హాస్టల్ కు వస్తూ ఉండేది భార్గవి.కాలేజీలో ఓ సమస్య విషయమై ఆమె ఆ కాలేజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ ను కలుస్తుంది భార్గవి. ఆ తర్వాత అతను పార్టీకి ఆహ్వానిస్తే వెళ్ళాల్సి వస్తుంది.అక్కడ అతను అమర్యాదగా ప్రవర్తించబోతే అతన్ని చెంప దెబ్బ కొట్టి ఇంటికి వచ్చేస్తుంది.ఆ తర్వాత సంజయ్ తండ్రి,భార్గవి తండ్రి స్నేహితులు అవ్వడం వల్ల సంబంధం కుదరడం వల్ల అతనితోనే పెళ్ళి నిశ్చయించబడుతుంది.సంజయ్ కు మందు,మగువ వ్యసనాలని తెలిసి కూడా వివాహామంటే భార్యా భర్తలు సమానంగా ఉండాల్సిన బంధమని,అది సంజయ్ కు తెలిసి వచ్చేలా చేస్తానని అతనితోనే ఛాలెంజ్ చేసి అతన్ని పెళ్ళి చేసుకుంటుంది.సంజయ్ కూడా తనను దెబ్బ కొట్టిందన్న కసితోనే ఈ వివాహానికి ఒప్పుకుంటాడు.
సంజయ్ సంప్రదాయమైన వివాహం కోరడం,భార్గవి రిజిస్టర్ మ్యారేజ్ అనడంతో వారిద్దరి మధ్య పంతం మొదలవుతుంది. మొత్తానికి ఈ విషయంలో భార్గవి పట్టుదలే నెగ్గుతుంది.తనకు ఇష్టం లేకుండా తనను తాకకూడదని సంజయ్ దగ్గర మాట తీసుకుంటుంది భార్గవి.పెళ్ళయిన వెంటనే సంజయ్ మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది.సంజయ్ అంతకు ముందు అంజు అనే అమ్మాయితో గడిపాడు.ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు.ఆమె గర్భవతి అయ్యింది.ఆమె ఆ విషయం సంజయ్ తండ్రి దృష్టికి తీసుకువెళ్ళింది.కానీ ఆమెను భయపెట్టమని చెప్పడం,ఆమెను ఎర్రనాగు హతమార్చడం జరిగింది.ఎర్రనాగు ఆ ఊరిలోనే పేరు మోసిన గుండా.అతన్ని కాలేజీ ఎన్నికల సమయంలో తాను గెలవడానికి పిలిచిన సంజయ్ కు ఓ విశ్వాసపాత్రమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. సంజయ్ భార్య భార్గవిను ఎంతో గౌరవించేవాడు.అతని ద్వారానే అంజు గురించి భార్గవికి తెలుస్తుంది.
సంజయ్ కు మానసిక అస్వస్థత అంజు మరణం పట్ల ఉన్న అపరాధ భావం నుండి జన్మించి ఉండవచ్చు.రచయిత దీనికి స్పష్టమైన కారణాలు పేర్కొనకపోయినా అతను తాను అంజు అన్నట్టు ప్రవర్తించడం వల్ల అది పాఠకులకే వదిలివేయబడిన అంశం.స్వస్థత చిక్కుతున్న కొద్ది తనను ఎంతో కష్ట పడి మనిషిని చేసినా భార్గవి అన్ని చేయిందని తెలిసినా సరే తన ఆధిక్యతను నిలుపుకోవాలన్న భావన మాత్రం అతని మనసును వీడిపోదు.ఆమె మీద కోపంతోనే ఇంకో స్త్రీని తీసుకువచ్చి ఆమెకు అధిక ప్రాధాన్యతను ఇస్తాడు.అయినా భార్గవి హుందాగానే ఉంటుంది.చివరకు ఆమె వల్ల సమస్య తలెత్తినప్పుడు కూడా ఆమె పరిష్కరిస్తుంది.
అంజు కుటుంబానికి సంజయ్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆమె చెల్లెలు మంజులను సంజయ్ కు ఇచ్చి వివాహం చేయిస్తుంది.అప్పటికే కౌసల్యకు క్యాన్సర్ వల్ల అస్వస్థత ఉండటం వల్ల ఆమె మరణించాక ఆ హాస్టల్ లో తాను కౌసల్య లానే మారిపోయి ఆ బాధ్యతలను స్వీకరించడంతో నవల ముగుస్తుంది.
జీవితంలో మనిషికి స్వతహాగా ఉండే అభిప్రాయాలూ అతని పరిస్థితుల వల్ల బలపడతాయి. భార్గవి పెళ్ళి చేసుకుని సంజయ్ ను మార్చగలను అని అనుకుంది. ఓ చోట భార్గవి సంజయ్ తో 'స్త్రీని అనుభవించడం నేర్చుకున్నావు గాని అర్ధం చేసుకోవడం నేర్చుకోలేదు' అంటుంది.భార్యాభర్తల మధ్య ఉండే యాంత్రికతలో ఉన్న భద్రత కోసం అపార్ధాలను స్త్రీలు పట్టించుకోరు.తాము కోరుకున్నట్టు ఉండాలనే నియమం మీదే భార్యలను తెచ్చుకుంటారు భర్తలుగా మారబోయే పురుషులు.ఆ బంధంలో అనుభవాలు,యాంత్రికతలు ఉన్నాయి తప్ప అర్ధాలు-ఆలోచనలు ఉండే ఆస్కారం తక్కువే.అది అలవాటు పడిపోయిన అనుబంధం. సంజయ్ పుట్టుకతోనే ధనవంతుడు,విలాస పురుషుడు.అతనికి అవరోధాలు ఎప్పుడు ఏర్పడలేదు అందుకే అతను ఎప్పుడు మారాలని అనుకోలేదు.భార్గవి కావాలనిపించినా,ఆమె కోసం తాను మారాలి అని భావనలో గాఢత్వం లేదు. తాను మార్పు కోసం జీవితాన్నే కోల్పోయినా,ఆ బంధాలను వదిలేసి తన ఆలోచనలకు అనుగుణంగా స్త్రీల వ్యక్తిత్వాలను బలపరిచే హాస్టల్ నిర్వహణా బాధ్యతను తీసుకుని తన జీవితాన్ని మలుచుకుంది భార్గవి.
వాల్మీకి విషాధం రామాయణమయ్యింది. విషాధంలో చరిత్రను సృష్టించే స్పూర్తి ఉంటుంది. కాకపోతే మనుషులను బట్టి అది రూపాన్ని మార్చుకుంటుంది.ఇంకొకరిని మార్చాలనుకునే ఆశయం కన్నా తన ఆశయాన్ని నమ్మి గౌరవించే వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నమే గొప్పది అని ఈ నవల స్పష్టం చేస్తుంది.
ఈ నవలలో ఎర్రనాగు పాత్రలో మార్పులు పాఠకులు గమనించవచ్చు.ఎర్రనాగు ఓ తాను ప్రేమించిన స్త్రీ సంతోషం కోసం ఆమె భర్తను చంపి గుండాగా మారాడు.ఎవరి కోసమైతే అతను ఆ పని చేశాడో ఆమె కూడా అతన్ని చూసి భయపడి దూరంగా జరిగిపోయింది.ఇక ఆ ప్రవాహంలో కొట్టుకునిపోయాడు.కానీ అతని మనస్తత్వంలోని మంచితనం భార్గవి వల్ల బయటపడింది.ఎన్నో సందర్భాల్లో భార్గవి కోసం అతను హాస్టల్ ను కాపాడటం కోసం అదే దౌర్జన్యం చేసినా,చివరకు అలాంటి ప్రయత్నంలోనే మరణించినా అతను మార్పుతో మరణించడం అతనికి సంతోషాన్ని మిగిల్చింది.భార్గవి ప్రయత్నం ఎర్రనాగు విషయంలో మంచి ఫలితాన్ని ఇచ్చినా దానికి కారణం భార్గవి పట్ల అతనికి గౌరవం ఉండటం,ఆమెను నమ్మడం. ఈ రెండు సంజయ్ కు లేకపోవడం వల్ల అతన్ని మార్చలేకపోయింది భార్గవి. భార్గవి వ్యక్తిత్వాన్ని ఇష్టపడినా,స్వతహాగా తనను తాను పూర్తిగా మార్చుకునేంతగా ఆమె ప్రభావితం చేయలేకపోయింది.దానికి కారణం అతని జీవితంలో ఏ వెలితి లేని జీవితం కావడం,అందులో ఏ పరిస్థితిలోనూ అతను మారాలని అనుకునే ఆలోచనలు ఎప్పుడు రాకపోవడం.తన ప్రస్తుత జీవితంలో అతనికి సంతోషం ఉండటం,మార్పు వల్ల అతనికి ప్రయోజనం లేదని అనిపించడం.
వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఈ రెండు పాత్రల ద్వారా మనుషుల్లోని మార్పుల కోణాలను రచయిత స్పష్టం చేశారు.అధిక వివరణలు,సాగతీతలు లేకుండా చెప్పాలనుకున్న అంశాన్ని పాత్రల ద్వారా స్పష్టం చేస్తూ చక్కగా రాశారు.ఆలోచింపజేసే నవల.
* * *
Comments
Post a Comment