క్యాస్ట్ పొల్యూషన్
చదువరి
క్యాస్ట్ పొల్యూషన్
-శృంగవరపు రచన
కోలపల్లి ఈశ్వర్ గారి నవలల్లో నేను చదివిన రెండో నవల 'వేగు చుక్క.'అంతకుముందు చదివిన నవల 'అనగానగా ఓ దుర్గ కథ.'అమ్మాయి జీవితాన్ని ఎంతో సున్నితంగా రాసిన ఆయన 'వేగు చుక్క'లో పల్లెల్లో బలపడి ఉన్న కుల వ్యవస్థను సామాజిక-వ్యక్తిగత స్థాయిలో సామాజిక సిద్ధాంతాలతో స్పష్టం చేసారు 'వేగు చుక్క'లో.
పల్లెటూరులు అనగానే స్వచ్చత, అనుబంధాలకు ఊతమైన వాతావరణం, పట్టణం అనగానే కాలుష్యం, మనుషులంటే పట్టని నాగరికత అనిపిస్తాయి. కానీ పల్లెటూర్లలో ఇంకా ఉండిపోయిన కుల వ్యవస్థ మనుషుల మధ్య ఉండే అసమానత్వాన్ని ఇంకా మోస్తూ ఉంటే, పట్టణాల్లో కులాలను పట్టించుకోకుండా మనిషిగా గౌరవించే సంస్కృతి ఉంది.
ఈ కథలో పరమేశ్వరశాస్త్రి కొడుకు చక్రధర్. సెలవులకు తన మిత్రుడైన రాజును ఇంటికి తీసుకువస్తాడు. రాజు నిమ్న కులస్థుడని తెలిస్తే ఇంట్లో వారు అవమానిస్తారని ఆ నిజం దాస్తాడు. ఆ ఊరిలో కుల వ్యవస్థ బాగా బలపడిపోయింది.ఈ కుల వ్యవస్థ మనుషుల గౌరవాన్ని ఎలా బానిసత్వంగా మార్పు చెందేలా చేస్తుందో రచయిత వివిధ అంశాల ద్వారా స్పష్టం చేస్తాడు.ఆ ఊరి పేరు నెమళ్ళ పాలెం.
సాధారణంగా వయసులో పెద్ద వారికి గౌరవం చిన్న వారు ఇవ్వడం సహజం. కానీ ఆ గౌరవం పక్కన పెడితే వీరయ్య లాంటి పేరును వీరి గాడు లా మార్చడం, పేర్లను గాడు, గాళ్ళతో జత చేసి పిలవడం, అగ్ర కులస్థులు తమ వారిని దూషించేటప్పుడు కూడా నిమ్న కుల పేరుతో తిట్టడం, వంటివి మనిషిని సాటి మనిషి కులం అన్న సాకుతో మనిషి అనే ప్రత్యేక ఉనికి నుండి తమ కన్నా తక్కువ వాడు అనే భావనలో జీవించేలా చేయడం గురించి రచయిత ఈ నవలలో స్పష్టం చేస్తారు.
నాగరాజు ఆ ఊరిలో హరిజనుడు. అతని తమ్ముడు సత్యనారాయణ, పట్నంలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతని కూతురు చంద్రకళ. నెమళ్ళ పాలెంలో పెదనాన్న ఇంటికి వచ్చిన అక్కడి కుల జాడ్యాన్ని చూసి దానిని మార్చాలని నిర్ణయించుకుని ఆ ఊరిలోని బావి నీరు తాగుతుంది. దానితో అగ్ర కులస్థులు దానితో ఆ బావి అపవిత్రమయ్యిందని గొడవ చేయడం, ఆ సందర్భంలోనే చంద్రకళ తన కులస్థుల్లో తమ ఆత్మగౌరవం కించ పరచబడుతున్న తీరును తెలిసేలా చేయడం, వారు అగ్రకులస్థులకు పనులు చేయడం మానెయ్యడం జరుగుతుంది.ఇది చంద్రకళ వైపు నుండి జరిగిన కథ.
ఇక రెండో కథ రాజు, చక్రధర్ ల వైపు నుండి నడుస్తుంది.
రాజు బ్రాహ్మణుడిలా వ్యవహరిస్తూ బ్రాహ్మణులూ ఎలా అధికులో అవసరం, సందర్భం పరంగా ఎక్కువ చేసి చెప్తూ ఉంటాడు. పరమేశ్వరశాస్త్రికి అది నచ్చదు. అలవాటు పడి, మార్పును ఆహ్వానించలేక అలా ఉండిపోయినా అతని మనసులో మనుషులు అందరూ ఒక్కటే అన్న భావన ఉంది.ఎప్పుడైతే రాజు ఆలా మాట్లాడుతున్నాడో అతని పట్ల, అతని భావజాలం పట్ల ఆయనకు విముఖత కలిగింది. ప్రతి మనిషిలోనూ మంచితనం, మావత్వం ఉంటుంది. అవి కొన్ని సామాజిక కారణాల వల్ల, వాతావరణం వల్ల, ఆచార వ్యవహారాల వల్ల చీకటిలోనే ఉండిపోతుంది. అటువంటి మంచితనాన్ని శాస్త్రిగారిలో వెలికి తీయడానికే రాజు ఆ కుల అహంకారాన్ని ప్రదర్శించేలా మాట్లాడతాడు. దీనిని మనుషులను మార్చే ఇంకో మార్గంగా రచయిత ఈ నవలలో ఎన్నుకున్నారు.
మనిషి బానిసగా మారడానికి ముఖ్య కారణం ఆకలి. ఉద్యోగం-ఉద్యోగి మధ్య ఉండాల్సిన సంబంధం బానిస-యజమానిలా మారిపోయింది. తమ పనులు చేయించుకోవడానికి, శ్రమ దోపిడీ చేయడానికి అడ్డు రాని కులం మిత్రులు, బంధువులు అనుకోవడానికి అడ్డం వస్తుందని ఓ చోట రచయిత ఈ నవలలో అంటారు. ఆ ఆకలి వల్లే ఉద్యమం నీరు గారే సమయంలో ముసలయ్య ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని, అతని భార్య గన్నేరు పప్పు తిని మరణించి బానిసలుగా గౌరవం లేకుండా బ్రతకడం కన్నా కూడా చావడం మేలని నిరూపించడంతో ఆ వాడ ఏకమై చంద్రకళ నాయకత్వంలో ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఈ సమయంలో అగ్రకులస్థులు ఈ ఉద్యమాన్ని ఆపడానికి వారికి ఆహరం అందకుండా చేస్తారు. అయినా ధైర్యంగానే ఉంటారు. ఆకలితో కొందరు మరణిస్తూ కూడా ఉంటారు.
రాజు బ్రాహ్మణుడు అనుకుని అతనికి చక్రధర్ చెల్లెలు అయిన చాముండేశ్వరితో వివాహం చేయాలని ఆ కుటుంబం అనుకుంటుంది. రాజు తాను హరిజనుడు అని చెప్పి చక్రధర్ తో కలిసి ఆ ఉద్యమంలో భాగమవుతాడు. చాముండేశ్వరి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని తాను మానసికంగా హరిజనుడిని ఇష్టపడినందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తుంది. దానికి ఆ విషయం ఎవరికి తెలియదు కనుక ఏం కాదని ఆమె బామ్మ అన్నప్పుడు ఎవరికి తెలియకపోతే ఆచారం పాటించకపోయినా ఫర్వాలేదా అని ప్రశ్నిస్తుంది. తాము పూజించే దేవుళ్ళల్లో కృష్ణుడు యాదవుడు, శివుడు జంగముడు అయినప్పుడు తక్కువ కులపు దేవుళ్లను ఎందుకు పూజిస్తున్నామని అడుగుతుంది. పరమేశ్వర శాస్త్రి తన కూతురికి రాజునిచ్చి వివాహం చేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత అటు పనులు చేసే వారు రాక వానలు రావడం వల్ల అగ్రకులపు పంటలు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ నవలలో మార్పుకు కేంద్రంగా ఓ ప్రకృతి వైపరీత్యాన్ని ఎన్నుకున్నారు రచయిత. వరద ముంపుకు గురైన ఆ గ్రామం చివరకు ఆకలి గురై కుల వ్యత్యసాలు లేకుండా కలిసి తింటారు. ఆ ఊరిలో హరిజన వాడ ఆ తరువాత నుండి ఉండకుండా పోతుంది. తక్కువ కులం పేరుతో వచ్చే ప్రభుత్వపు సహాయాలు వద్దని, కుల ప్రస్తావన లేకుండా పేదరికం నిర్ములించే పథకాలు అయితే కావాలని ఆ ఊరిలో ప్రజలు స్పష్టం చేస్తారు. మొత్తానికి ఆ వరద ఆ ఊరి ప్రజల్లో మార్పు తెచ్చినట్టు ముగింపునిచ్చారు. చంద్రకళ-చక్రధర్, రాజు-చాముండేశ్వరి ల వివాహలతో నవల ముగుస్తుంది.
మార్పు అనేది 'Group psychology' లో మనుషుల సెంటిమెంట్లు, ఆలోచనలు, ఆశయాలు ఎలా మనుషుల్లోకి ప్రవహిస్తాయో స్పష్టం చేసే నవల ఇది. దీనికి నిదర్శనంగా శాస్త్రి ఉద్యమంలో భాగమైనప్పుడు అగ్ర కులస్థులు కొందరు కూడా దానికి సహకరించడాన్ని రచయిత చిత్రికరించారు. అందుకనే సాధారణంగా సెలబ్రిటీలు యాడ్లు చేయడం కూడా ఆ సెంటిమెంట్ ను వినియోగదారుడిలో ప్రవహించేలా చేయడానికే. ఇదే ఎన్నో అంశాలకు కూడా వర్తిస్తుంది.
మంచి అంశాన్ని ఎంతో సులభంగా చెప్తూనే సోషియాలాజి-సైకాలాజీలను అవసరానికి తగ్గట్టు చొప్పిస్తూ రచయిత రాసిన తీరు అభినందించాల్సిందే.
* * *
Comments
Post a Comment