678 నంబర్ బస్సు

 678 నంబర్ బస్సు

-శృంగవరపు రచన




స్త్రీల మీద జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారాలలో కేవలం మానభంగం, ఆ తర్వాత బాధితురాలిపై హింస మాత్రమే సీరియస్ గా నేడు పరిగణంపబడుతున్నాయి.స్త్రీలకు ఇష్టం లేకుండా వారిని తాకినా తప్పే అన్న భావన కేవలం ఓ నైతిక అంశంగా మాత్రమే మిగిలిపోయింది తప్ప దానిని సమస్యగా భావించే వారు స్త్రీలలో కూడా తక్కువే. మధ్యలోనే రాజీ పడే పరిస్థితులు కూడా అధికం అవుతున్నాయి.స్త్రీలపై బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఇటువంటి వేధింపులను ఈజిప్ట్ దేశ వాతావరణంలో ముగ్గురు స్త్రీల జీవితాలను అనుసంధానం చేస్తూ ఈ లైంగిక వేధింపులు, వాటికి బాధితుల కుటుంబాలు స్పందించే తీరు, న్యాయ పరిధి వంటి అంశాలను 678 సినిమాలో స్పష్టం చేసే ప్రయత్నం జరిగింది.
ఫాయిజా తక్కువ వేతనం గల ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె భర్త అడిల్, ఓ కొడుకు, ఓ కూతురు. ఆమె భర్త ఆదాయం ఇంటికే సరిగ్గా సరిపోదు.ఫాయిజా రోజు ఆఫీసుకు వెళ్లే బస్సు 678. రద్దీగా ఉండే ఆ బస్సులో ఫాయిజా శరీరాన్ని మగవాళ్ళు తాకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనిని తప్పించుకోవడానికి కొన్ని సార్లు టాక్సీలో వెళ్లినా అంత ఖర్చు భరించలేక ఇష్టం లేకపోయినా ఆ పరోక్ష వేధింపులను భరిస్తూనే ఆ బస్సులోనే వెళ్తూ ఉంటుంది.
ఇక ఈ సినిమాలో ఇంకో ముఖ్య పాత్ర సెబా. ఆమె జూవెలరీ డిజైనర్. ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఆమె జీవితం సజావుగా సాగిపోతున్న సమయంలో ఓ సారి క్రికెట్ స్టేడియంకు ఆ జంట ఆట చూడటానికి వెళ్తారు.
ఆ ఆట ముగిసిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో కొందరు అపరిచితులు సెబాను ఎత్తుకెళ్లి ఏడిపిస్తారు. భౌతికంగా మానభంగం జరగకపోయినా సెబా ఇష్టం లేకుండా వారు అలా బలవంతంగా ఆమెతో వ్యవహరించడం ఆమెను ఎంతో బాధిస్తుంది. తోడుగా ఉంటాడనుకున్న బాయ్ ఫ్రెండ్ ఆ సమయంలో ఆ సంఘటన వల్ల తాను బాధపడినట్టు భావిస్తూ ఆమెకు దూరంగా ఉంటాడు. అప్పటికే గర్భవతి అయినా సెబా గర్భస్రావం అయినా చేయించుకుంటుంది. ఈ విషయం విషయమై పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకున్నా నిలబడదని అర్ధం చేసుకుని ఆ పని చేయదు.ఆ తర్వాత జూవెలరీ డిజైనర్ గా ఉంటూనే స్త్రీలకు ఆత్మ రక్షణ సెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ కథలో మిగిలిన మూడో స్త్రీ నెల్లి. ఆమె బాయ్ ఫ్రెండ్ ఓమర్. ఓమర్ కు స్టాండ్ అప్ కమిడియన్ గా ఉంటూనే, ఇష్టం లేకపోయినా బ్యాంకు ఉద్యోగం కూడా చేస్తూ ఉంటాడు.
ఓ రోజు నెల్లి ఇంటికి వస్తున్న సమయంలో ఓ ట్రక్ లో వస్తున్న వ్యక్తి ఆమెను పట్టుకుని ట్రక్ నడుపుతూనే ఇడుస్తూ వెళ్తాడు.తల్లి, బాయ్ ఫ్రెండ్ సాయంతో ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి తీసుకువెళ్లినా అక్కడి అధికారి ఎక్కువ శిక్ష పడుతుంది కనుక అసాల్ట్ కేసు నమోదు చేస్తాను కానీ, లైంగిక వేధింపుల మీద అయితే కేసు తీసుకోనని చెప్తాడు. ఆ తర్వాత ఈ విషయంలో మొదటి లా సూట్ వేసిన వ్యక్తిగా నెల్లి సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయం మీద టీవీలో ప్రోగ్రాం చేసినా ఆమెను సపోర్ట్ చేసిన వారు తక్కువే. దీనితో ఆ లా సూట్ వెనక్కి తీసుకోమనే ఒత్తిడి ఆమె మీద ఇంటి నుండి కూడా పెరుగుతూ ఉంటుంది.
ఫాయిజా సెబా నిర్వహించే క్లాసులకు వెళ్తూ ఉంటుంది. సెబా నిర్వహించే క్లాసులకు వచ్చే వారిలో ఒక్కరు కూడా తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ఒప్పుకోరు.ఫాయిజా బస్సులో ఎదుర్కునే వేధింపులను ఎదుర్కోవాలని నిర్ణయించుకుని బస్సులో తన పట్ల అలా ప్రవర్తించే మగవారిపై అజ్ఞాతంగా తన దగ్గర ఉన్న హెయిర్ పిన్స్, చిన్న చాకులతో దాడి చేస్తుంది.
అలా ఆమె చేసిన దాడులు సంచలనమౌతాయి. ఆమె అని తెలియకపోయినా మగవారిపై బస్సులో దాడులు జరుగుతున్నాయని అందరికి తెలుస్తుంది. సెబాకు ఒక్కదానికే ఈ విషయం తెలుసు. ఈ కేసును మాగెడ్ అనే డిటెక్టివ్ ఇన్వెస్టిగెట్ చేస్తూ ఉంటాడు.సెబా క్లాసులకు వచ్చి పరిచమైన నెల్లి ద్వారా ఫాయిజా కూడా పరిచయమవుతుంది. ఈ ముగ్గురు ఒక్కటవుతారు.ఇక ఇలాంటివి తాను చేయనని తన పిల్లలను చూసుకోవాలని చెప్తుంది ఫాయిజా. మాగెడ్ మొత్తానికి ఈ ముగ్గురి విషయం కనుక్కుంటాడు. మాగెడ్ భార్య ఐదవ ప్రసవం అప్పుడు దగ్గర ఉండడు. ఆమె మరణిస్తుంది, బిడ్డకు జన్మనిచ్చి. ఆమె పట్ల ఎప్పుడూ తాను నిర్లక్ష్యంగా ఉండటం మాగెడ్ ను బాధిస్తూ ఉంటుంది.
మాగెడ్ ఈ ముగ్గురిని పట్టుకున్నా ఈ విషయం పెద్దది చేస్తే ఈ ముగ్గురు సెలబ్రిటీలు అవుతారని భావించి హెచ్చరించి వదిలేస్తాడు. ఆ తర్వాత ఫాయిజా సెబాను ఆమె వేషధారణ వల్లే ఆమెకు స్టేడియంలో అలాంటి అనుభవం జరిగిందని, మరి తన లాంటి బురఖాలు ధరించి ఉండే వారిపై కూడా అవి విస్తరిస్తూనే ఆ ప్రభావం ఉందని అంటుంది. ఆమె మాటలకు బాధపడిన సెబా తన జుట్టు, వేషధారణ మార్చుకుని బస్సులో ప్రయాణం చేస్తూ అలా ఓ స్త్రీను ఇబ్బంది పెడుతున్న అతన్ని చాకుతో గాయపరిచి మాగెడ్ కు లొంగిపోతుంది. కానీ భార్య మరణంతో మారిన మాగెడ్ ఏ ఫిర్యాదు రాలేదు అని ఆమెను పంపేస్తాడు. ఆ తర్వాత లా సూట్ లో నెల్లి విజయం సాధిస్తుంది, నిందితుడికి శిక్ష పడుతుంది.
ఇలాంటివి స్త్రీలు తమ రక్షణ కోసం చేసినప్పుడు సదరు బాధితుడు ఫిర్యాదు ఇవ్వలేడు కూడా. దానికి కారణం తాను చేసిన తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది కనుక. బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్త్రీలపై జరిగే ఇటువంటి వేధింపులను స్త్రీలు కూడా పట్టించుకోరనే ధైర్యం, ఇలాంటివి బయట పెట్టి తమ పరువు మర్యాదలు పోగొట్టుకోరన్న ధైర్యంతో ఈ పనులు చేయడానికి వెనుకాడని వారే ఎక్కువ.
ఈ సినిమా ఎన్నో కోణాల్లో ఆలోచింపజేసేలా చేస్తుంది.ఏ అంశమైనా సరే సర్దుకుపోగలిగే స్థాయి వరకు సర్దుకుపోవడమే మంచిదన్న భావన ఎంతోమందికి దీనిని సీరియస్ గా తీసుకొని మనస్తత్వం ఉండేలా చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష