ఒక క్రియ –రెండు నిర్వచనాలు

 ఒక క్రియ –రెండు నిర్వచనాలు

-శృంగవరపు రచన




సాహిత్యంలో సమాజం-వ్యక్తిగత విలువల మధ్య ఘర్షణ అంశాలను చిత్రీకరించే కథలు ఎన్నో గత రెండు దశాబ్దాలుగా వెలువడుతూనే ఉన్నాయి. నీతి-విలువలు ఆర్థిక కోణంలో ఎలా మారుతూ ఉంటాయో,వాస్తవంలో కాకుండా మనిషి తనకు నచ్చే వాస్తవంలో బ్రతకడానికి ఎలా తపన పడుతూ ఉంటాడో ,వాస్తవం నుండి అవాస్తవం వరకు మనిషి పయనం ఎలా ఉంటుందో స్పష్టం చేసే నవలే రావూరి భరద్వాజ గారి ‘కాదంబరి.’
జగన్నాధం ఓ వార్తాపత్రికలో ఓ గ్రామంలోని వ్యక్తి చిరుతను చంపాడని,అక్కడ ఓ పాడుపడ్డ భవనం కూడా ఉందని చదివి ఆ వ్యక్తితో కలిసి ఆ భవనానికి కూడా వెళ్ళి అతనితో సంభాషణను ఓ వ్యాసంగా తానే ఓ పత్రికకు పంపుదామని భావించి ఆ ఊరు బయలుదేరుతాడు. అలా బయలుదేరిన అతనికి ఆ వ్యక్తి పేరు సీతారాములు అని తెలుస్తుంది.
వాస్తవానికి ఈ నవలలో కథ కన్నా కూడా పాత్రల మనస్తత్వాల ద్వారా సమాజంలో జరిగే కుట్రలు,మారే మనుషుల స్వార్ధాలను స్పష్టం చేసే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనిషి తన ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఏమైనా చేయాల్సిందే అని అలా అతను చిరుతను చంపాల్సి వచ్చిందని,అడవిలో తప్పిపోయి అటువెళ్ళడమే తప్ప ఆ దారి తనకు గుర్తు లేదని చెప్తాడు. ఈ లోపు జగన్నాధానికి సీతారాములుకి అతని భార్యకు ఉన్న మనస్పర్ధల గురించి కూడా తెలుస్తాయి. సీతారాములు భార్య యంకావ్. ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం,ఆ విషయం భర్తకు తెలియడంతో,భర్త ఆ విషయం బయటకు చెప్పుకోలేక ఆమెను కొడుతూ ఉన్నకొద్ది ఆమె కూడా అంతే ధైర్యంగా ఆ సంబంధాన్ని కొనసాగించడం, తన భర్త అడవిలో తిరుగుతున్నప్పుడు ఏదో మొక్క తొక్కడం వల్ల అతనికి పిచ్చి పట్టి తనను కొడుతున్నాడని తనను తాను సమర్ధించుకోవడం జరుగుతుంది.
సీతారాములు,యంకావ్ అట్టడుగు వర్గానికి చెందిన వారు కనుక వారిలో తమను తాము కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఈ రకంగా చేశారు. తన భార్య సంబంధం పెట్టుకోవడం అన్నది తన పరువుకు సంబంధించింది కనుక భార్య అనైతిక ప్రవర్తనకు ఎలా స్పందించాలో తెలియక ఆమె మీద కోపంతో ప్రవర్తించిన వ్యక్తి సీతారాములు ఇక్కడ. కానీ యంకావ్ తాను చేసింది తప్పా,ఒప్పా అన్న మీమాంసలో లేదు ఆ అనుభవాన్ని తన జీవితంలో భాగం చేసుకోవడానికి ఏం చేయాలోఆలోచించి, దానికి అడ్డుగా ఉన్న భర్త మానసిక స్థితి గురించి ప్రచారం చేసి తన తప్పును ఎవరూ పట్టించుకోకూడదనే వారిని ఆ తప్పు నుండి భర్త మానసిక స్థితి వైపు మళ్లించాలని ఆమె అలా ప్రవర్తించింది. జగన్నాథం ఈ పయనంలో కొందరిని కలుసుకుంటాడు.వారి ద్వారా జీవితాన్ని,జీవితంలో ఉన్న సమస్యలను-సంఘర్షణలను వారి కోణాల్లో,తన కోణంలో చూడగలుగుతాడు.అతను ఈ పయనంలో చూసిన మొదటి మనుషుల కోణం ఇదే.
ఈ సమాజంలో వ్యక్తిగతంగా,వృత్తిపరంగా మనుషులు కలిసి అభిప్రాయాలూ తీసుకోవడం,పరస్పర సహకారం అందించుకోవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ సంబంధాల్లో దాదాపుగా ఎక్కువ శాతం తమ లాభాలకు అనుగుణంగా ఉండేలా ప్రవర్తిస్తారు తప్ప తప్పు ,ఒప్పు అనే నిర్ణయ శక్తి మీద ఆధారపడి కాదు.
ఆ ఊరిలో ఉన్న ఓ ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణను కలుస్తాడు. ఆ ఆఫీసర్ జగన్నాథాన్ని ఏ కలప వ్యాపారం చేయడానికో వచ్చిన వ్యాపారిగా భావించి అతిధి మర్యాదలు చేస్తాడు. తన పని కావాలంటే ఆ భవనానికి వెళ్లాలంటే అతను అనుకున్న అభిప్రాయంలోనే అతన్ని ఉంచాలని భావించిన జగన్నాథం దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉంటాడు.
రక్షించాల్సిన అడవిని తన ప్రయోజన పరిధికి పరిమితం చేసుకున్న అధికారి నారాయణ.మనిషికి తనకు లాభం చేకూర్చేది చిన్న పాటి రిస్కులతో వస్తుందని అనిపిస్తే ఆ లాభాన్ని అందుకోవడానికి పెద్దగా ఆలోచించడు. అటువంటి మనస్తత్వమే ఈ అధికారిది కూడా. తర్వాతి రోజు ఆ అడవిని చూపించడానికి జగన్నాథంతో కలిసి బయలుదేరతాడు నారాయణ. అక్కడ కలప లాంటి వ్యాపారం ఎంత లాభసాటి వ్యవహారమో చెప్తూ ఉంటాడు. ఓ ప్రభుత్వ అధికారి అలా తన స్వార్ధ వలయంలోకి పయనం మళ్ళించి వ్యాపారవేత్తగా మారిపోయాడు. ఇదే మనిషిలో ఉండే వైవిధ్యత. మనిషి వృత్తి ఏదైనా సరే మనిషి మనసులో ఎప్పుడూ లాభం-నష్టం బేరీజు వేసే వ్యాపారి ఇంకో మనిషిగా తిష్ట వేసే ఉంటాడు.
ఆ అడవి మధ్యలోని ఓ సిద్ధిలమైన మంటపం వద్ద తనకు అంతకు ముందే పరిచితుడైన మరియు చారిత్రక పరిశోధకులైన సోమశేఖరశర్మ గారిని కలుస్తాడు జగన్నాథం. ఆయనతో పాటు కొందరు విద్యార్ధులు కూడా ఉన్నారు. రుద్రమదేవి తదనంతరం అక్కడ మాతప్పనాయుడు ఎలా స్థిరపడ్డాడు అన్న అంశం మీద ఆయన వారికి చెప్తూ ఉన్నారు. వారు కొంత సమయం గడిపి అక్కడి నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయారు.అందరూ వెళ్ళిపోయిన అక్కడ కౌముది అనే అమ్మాయి మాత్రం ఉండిపోయింది.
గొప్ప వ్యాపారవేత్త రామకృష్ణయ్య ఆమె తండ్రి అని తెలుసుకుని అప్పటివరకూ చిరాకు పడ్డ నారాయణ ఆమెను ఎంతో గౌరవిస్తాడు.రామకృష్ణయ్య తన బావకు తెలుసని,వారితో కలిసి చదువుకున్నారని అబద్ధం చెప్పి,ఆమెతో పాటు తాను కూడా అక్కడే ఉంటానని చెప్పి అప్పటికి నారాయణను వదిలించుకుంటాడు జగన్నాథం. కౌముది అతను అబద్ధం చెప్పాడని గ్రహిస్తుంది.అసలు తన తండ్రి చదువుకోలేదని తర్వాత జగన్నాథానికి చెప్తుంది. తన అవసరం కోసం అబద్ధం ఆడటానికి వెనుకాడని మనస్తత్వం అతినిది అని అంటుంది.
ఏకాంతంలో ఉన్న కౌముది అతన్ని రెచ్చగొట్టడం,అతనితో తెలివిగా,గడుసుగా ఉండటం,అతను ఆమెను ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నవలలో ప్రధాన పాత్రలు రామకృష్ణయ్య,కౌముది. వీరిద్దరి కథ,వీరి మనస్తత్వాలు తెలివి-డబ్బు-పేదరికం మధ్య జరిగే యుద్ధాన్ని స్పష్టం చేస్తాయి.
తిరిగి వచ్చిన రామకృష్ణయ్య,జగన్నాథం,నారాయణ,కౌముది లతో ఆ రాత్రి మందు తాగుతూ తన జీవిత కథ చెప్తాడు. కౌముది కూడా సిగరెట్ కలుస్తుంది,మందు తాగుతుంది. అది ఆమెకు తండ్రి ఇచ్చిన స్వేచ్చ. ఆ స్వేచ్చను అందరికి స్పష్టం చేయాలనే తహ తహ ఆమె ప్రతి మాటలో,చేష్టలో స్పష్టమవుతుంది.
రామకృష్ణయ్య తండ్రి మెతకవాడు. అతని తండ్రి మరణించాక అతన్ని మోసం చేసి అతనికి ఏమి దక్కకుండా చేశారు అన్నదమ్ములు. భార్యాబిడ్డలతో పేదరికంతో బ్రతుకును ఈడుస్తున్న సమయంలో అతని భార్య,కూతురు ఆ పేదరికంలో జబ్బులతో మరణించారు.మిగిలిన కొడుకును ఎలాగో ఓ మేరకు చదివించే ప్రయత్నం చేసినా రామకృష్ణయ్యకు చదువు వంటబట్టలేదు. తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు.
పస్తులు ఉన్నాడు. ఒక ప్రెస్ లో కాఫీ,టీలు అందించే పని చేశాడు. హోటల్లో పని చేశాడు.సినిమా హాల్లో పని చేశాడు. సినిమా హాల్లో అతనికి చంద్రశేఖరం పరిచయమయ్యాడు.అప్పటికే ఆయన స్థిరపడిపోయిన వ్యాపారవేత్త.కలప వ్యాపారం లాంటివి ఎన్నో చేస్తున్నాడు. రామకృష్ణయ్యకు తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు. ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. అతనికి ఆ వ్యాపార మెళుకువలు తెలిసేలా చేశాడు.
కోటీశ్వరుడైన చంద్రశేఖరంకు ఒక్కర్తే కూతురు సరస్వతి.ఆమెకు అవిటితనం ఉంది.ఆమె గురించి తల్లిదండ్రులు కుమిలిపోని రోజులు లేవు. రామకృష్ణయ్య అన్ని వ్యవహారాలు ఎంతో చాకచక్యంగా నెట్టుకురావడంతో అతన్ని అల్లుడిగా చేసుకున్నాడు చంద్రశేఖరం. ఆ తర్వాత చంద్రశేఖరం ప్రవర్తనలో మార్పు వచ్చింది.అల్లుడిని తక్కువ చేసి మాట్లాడేవాడు. తన పేదరికంతో అతను వ్యాపారం చేశాడని అర్ధం చేసుకున్నాడు రామకృష్ణయ్య.
భార్యతో సహా అక్కడి నుండి కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. ఇడ్లీలు అమ్మాడు. సినిమా హాల్లో క్యాంటిన్ పెట్టాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారంలోకి,కలప వ్యాపారంలోకి అన్నింటిలోకి దిగాడు. ఆ సమయంలోనే చంద్రశేఖరంతో ఉన్న అనుభవం అతనికి ఎంతో లభించింది. ఆ తర్వాత చంద్రశేఖరం మరణించిన ఆస్తులన్నీ సరస్వతికే ఇచ్చిన వారు వచ్చిన ఇంటిని హై స్కూల్ కి,మిగిలింది అనాధాశ్రమంకు ఇచ్చారు.
అప్పటివరకూ వ్యాపారపరంగా విజయం సాధించిన రామకృష్ణయ్య మయురాక్షి ప్రాజెక్ట్ ప్రభుత్వం కడితే అక్కడి రైతులకు ఉపయోగం ఉంటుందని భావించి సభ నిర్వహించడం, అది పెద్ద వార్త అవ్వడం, ఆ ప్రాజెక్ట్ కట్టకపోవడానికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరూ ఎమ్మేల్యేలు కూడా ప్రతిపక్షం వారని చెప్పడం, ఆ తర్వాత రామకృష్ణయ్య చేతనే నాటకీయంగా ఆ ప్రాజెక్టు రాదని చెప్పించి ఉద్యమాలు చేయించి,ఇక రాదు అనే అభిప్రాయం వారిలో స్థిరపడ్డాక నాయకుల చుట్టాలు,స్నేహితులు చౌకగా ఆ భూములు కొనేయ్యడం,ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుండి దృష్టి మరాల్చడానికి అక్కడ ఓ పెద్ద పరిశ్రమ వస్తుందని నమ్మించి అక్కడి స్థలాలను అమందం ద్వారా అదే నాయకులు లాభాలు పెంచుకుని,చివరకు మయురాక్షి ప్రాజెక్టుకు అనుమతినివ్వడం జరిగింది.కానీ అక్కడ ఆ ఉండే జనాలు అప్పటికే రాదని ఆశ వదులుకుని ఆ భూముల్ని అప్పటికే అమ్ముకున్నారు.అలా ఆ ప్రాజెక్టు కూడా పెద్దలకే లాభాన్ని చేకుర్చింది.జరిగింది కుట్ర అని రామకృష్ణయ్య అంటే అతని కూతురు కౌముది అతన్ని వ్యతిరేకిస్తుంది.
వ్యాపారం కోసం ఎన్నో తప్పులు చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎలా అవుతుందని,ఒకవేళ అక్కడ భూములు కొనుక్కుని ఉంటే అలా తండ్రి అని ఉండేవాడు కాడని,అతనికి ఆ ప్రజల పట్ల సానుభూతి వంటివి లేవని కేవలం తనకు ఆ లాభంలో భాగం లేదనే ఈర్ష్య మాత్రమే ఉందని అంటుంది. ఆ నిజాన్ని అంగీకరిస్తాడు రామకృష్ణయ్య.
రామకృష్ణయ్య పేదరికంలో పుట్టాడు. అటు పేదరికం,ఇటు ఐశ్వర్యం రెండు అనుభవించాడు. పిల్లలకు అతి స్వేచ్చను ఇచ్చాడు. కొడుకు వసంత్ దొంగతనం చేస్తే కూడా దానికి అతన్ని దండించలేదు కానీ ఇక డబ్బు తాళాలు అతనికే ఇచ్చేశాడు. ఇకపోతే కౌముడికి తెలివి ఉంది. తన తెలివిని తన వాదనల ద్వారా ఎదుటి వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా నిరూపించుకోవాలనే తపన ఉంది.
ఆ తర్వాత జగన్నాథం ఇంటికి వెళ్ళిపోతాడు. తమ దగ్గరకు రమ్మని అతన్ని ఆహ్వానిస్తారు రామకృష్ణయ్య,కౌముది. ఆ తర్వాత రామకృష్ణయ్య కొత్త కనస్ట్రక్షన్ లో మునిగిపోతాడు.అతని కూతురు కౌముది శంకరం అనే ఇంజనీర్ తో లేచిపోతుంది. రామకృష్ణయ్య వారి వివాహానికి ఒప్పుకుంటాడని తెలిసిన కావాలనే ఆ పని చేస్తుంది. అప్పటికే ఎందరికో కాలేజీలో ప్రేమ లేఖలు రాసి వారిని తన చుట్టూ తఇప్పుకుని ఏడిపించడం వంటివి చేసింది. కేవలం వ్యతిరేకతను ఎప్పుడు తన జీవితంలో ఎదుర్కొని కౌముది ఆ వ్యతిరేకత కోసమే ఈ పని చేస్తుంది.
శంకరం,కౌముది ఇద్దరు జగన్నాథంను రమ్మని ఉత్తరం రాస్తారు. శంకరం వారిద్దరికి కావాలనే ఏకాంతం వదిలి వెళ్ళిపోతాడు. కౌముది తానే శంకరం వెంటపడ్డానని,అతనికి తన ప్రేమ వ్యవహారాలు,ఆఖరికి జగన్నాథాన్ని ముద్దు పెట్టుకున్న విషయం కూడా తెలుసునని,అయినప్పటికి ఏమి అనడని అదే తనకు నచ్చడంలేదని,అందరిలా తమ మధ్య గొడవలు ఉంటే బావుంటుందని అంటుంది.
కౌముది మనస్తత్వానికి అతను ఎలా ఉన్నా నచ్చడని అంటాడు జగన్నాథం. అలా మారితే ఆమె అతన్ని చెడ్డవాడిని చేస్తుందని అంటాడు. పేదరికం,ఐశ్వర్యం రెండు అనుభవించిన రామకృష్ణయ్య లో ఆత్మవిశ్వాసం ఉంది,అహంకారం ఉన్నప్పటికి కూడా ఆయన అనుభవంతో అధిగమించగలడు.కానీ కౌముది లో అహంకారం మాత్రమే ఉందని అంటాడు. తండ్రికి డబ్బు ఉన్న సుఖించడం రాదని భావించిన కౌముదికి జీవితం ఉన్నా అనుభవించడం రాదని అంటాడు జగన్నాథం. అతని మాటలతో తనలో ఉన్న ఇంకో వాస్తవాన్ని చూస్తుంది కౌముది.
ఆ తర్వాత వచ్చిన శంకరం కూడా తన గురించి చెప్తాడు. కౌముదికి తాను తెలివైనదానిని అనే అభిప్రాయం గట్టిగా ఉందని,తనకు మాత్రం ఆమె తాలివితక్కువ దానిలా అనిపిస్తుందని అంటాడు. కావలనే ఆమెకు దూరంగా ఉండి,ఆమె దృష్టిలో పడ్డానని,మయురాక్షి ప్రాజెక్టు వస్తే కొందరు ప్రజలకైనా లాభం ఉంటుందని,దానిని తాను సాధించలేను కనుక కౌముది ద్వారా ఆమె తండ్రి దానికి పూనుకునేలా చేశానని అంటాడు. కౌముది పట్ల ఉన్న జాలి,అనుకంప వల్ల ఆమె ఎలా ఉన్న ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటానని,దాని వల్ల తాను ఎంతో క్షోభను అనుభవిస్తానని చెప్తాడు. ఈ అందరి కథలు,మనస్తత్వాలు తెలుసుకుని తిరుగు ప్రయాణం చేస్తాడు జగన్నాథం.
ఈ నవలలో నైతికత,డబ్బు,పేదరికం,విలువలు,స్వేచ్చ వంటి ఒకే పదాలకు మారే రెండు నిర్వచనాలను గురించి పరోక్షంగా రచయిత స్పష్టం చేస్తారు. మొదటి నిర్వచనం పేద-మధ్య తరగతి వారికి వర్తిస్తే ,రెండో నిర్వచనం డబ్బు-పలుకుబడి ఉన్న వారికి వర్తిస్తుంది. కౌముది లా పేద-మధ్యతరగతి స్త్రీలు వ్యవహరిస్తూ వారికి పొగరుబోతుతనం,తిరుగుబోతుతనం అంటకట్టబడతాయి. కానీ కౌముదికి మాత్రం అవి తెలివి,చురుకుదనం వంటి సకార లక్షణాలుగా భావించబడ్డాయి. డబ్బు-పలుకుబడి ఉన్నవారికి కోపం వచ్చేలా ప్రవర్తిస్తే తమకు ముప్పు అనుకునే మనస్తత్వం ఈ ద్వంద అభిప్రాయజాలానికి మూలం.
ఈ నవలలో శంకరం తెలివి వల్ల ప్రాజెక్టు వచ్చిన ఆ ప్రతిభ మొత్తం రామకృష్ణయ్య,కౌముదిలకే ఆపాదించబడింది. కౌముది తాను తెలివైన దానిని అనే విషయం నిరూపించుకునే ప్రయత్నంలో తెలివైన శంకరం ఆమె మనస్తత్వాన్ని పసిగట్టి అంతే తెలివిగా ఆమెతో ప్రవర్తించాడు. ఎవరినైనా చూడగానే,వారితో మాట్లాడుతూ ఉండగానే వారి మనసులో ఏముందో కనిపెట్టగల చురుకుదనం కౌముదికి ఉన్నప్పటికీ ఆ తెలివితేటలు ఆమె ఎప్పుడూ తనను తాను అధికంగా భావించుకుంటూ ఉండటానికి,దానిని నిరూపించడానికే వెచ్చిస్తుంది.
ఈ సమాజంలో ఏ విలువ అయినా సరే ఆర్థిక బలం ఉన్నవారికి అనుకూలంగా మారిపోతుంది. ఈ సమాజంలో ధనవంతుల కన్నా పేద,మధ్యతరగతి వారే ఎక్కువ.వారు తమ వర్గానికి చెందిన వారిని తమ విలువలతోనూ,ధనవంతులను వారి ధనం అనే విలువతోనూ చూడటం అలవాటు చేసుకుంటారు. తెలివైన వాడు,ఆలోచించగలిగిన శక్తి ఉన్నవాడు కూడా తన పని నెరవేర్చుకునే మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటాడు తప్ప, ఈ దృష్టిలో మార్పు కోసం ఎవరూ ప్రయత్నించరు.
మనిషి ఆర్థిక వర్గం ఏదైనా సరే తనను గురించి తాను నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అతనికి అది నచ్చదు.దానికి కారణం తనలో ఈర్ష్య,ద్వేషం,స్వార్ధం వంటి భావనలు ఉన్నాయన్న ఆలోచనను ఏ మనిషి తట్టుకోలేడు. ఈ నవలలో అదే నిజం కౌముది నోటి నుండి విన్నప్పుడు మొదట జీర్ణించుకోలేకపోయినా తర్వాత అది సత్యమని గ్రహించి ఆ ప్రాజెక్టు విషయంలో జరిగిన అన్యాయాలను ఓ వ్యాసంలా రాయించి రామకృష్ణయ్య వార్తాపత్రికల్లో వచ్చేలా చేసినందుకు అతనికి అండగా ఉన్న పెద్ద వారు అతని మీదే దాడికి సిద్ధపడ్డారు. ఆ వెంటనే అంతకు క్రితం రామకృష్ణయ్యలా మారిపోయాడు ఆయన.
కష్టాల్లో ఉండే మనిషి సుఖాలు ఎలా కోరుకుంటాడో,సుఖాల్లో ఉన్నప్పుడూ కష్టాలు కోరుకునే విచిత్ర మనస్తత్వం కూడా ఉంటుందని, ఆ కష్టాల్లో థ్రిల్ అనుభవించే ఈ చిత్రమైన మనఃస్థితి కూడా సహజమేనని ఈ నవలలో కౌముది పాత్ర స్పష్టం చేస్తుంది.
తప్పు-ఒప్పు,నీతి-అవినీతి అనేవి వ్యక్తిగత స్వార్ధాల నుండి జన్మిస్తాయని,సమాజం కూడా తనను శాసించే డబ్బు,అధికారం ఉన్న వారికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ముందుకు సాగుతుందని కూడా రచయిత ఈ నవలలో చెప్పకనే చెప్తారు. ఓ అవాస్తవంలో జీవించే మనిషి వాస్తవంలోకి పయనించాలంటే అవాస్తవికత ఇచ్చే భద్రతను కూడా వదులుకోగలగాలి. ఏ మనిషి అయినా సరే తనకు అనువుగా తన విలువలను,నీతిని నిర్మించుకుంటాడు గాని సమాజంలో ఒకే నిర్ధిష్ట విలువ ఉండదు. వ్యక్తులకు తమ కుటుంబాలు,అనుబంధాలు ముఖ్యం తప్ప సమాజంలో మారే అభిప్రాయాలూ కాదు.అందుకే ప్రతి మనిషి తనకు,తన కుటుంబానికి మంచి చేసే వాటినే తన నైతిక పతనానికి సమర్ధింపుగా మలచుకుంటాడు.మనిషి మనస్తత్వంలోని నైతిక సంక్లిష్టతను స్పష్టం చేసే నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ