చూపు లేని జీవితం

చూపు లేని జీవితం
-శృంగవరపు రచన




జీవితంలో ఏ తప్పు చేయకుండా ప్రమాదానికి గురవ్వడం, ఆ ప్రమాదం కోలుకోలేనిది కావడం మనిషిలో జీవితం పట్ల నిరాశ కలిగేలా చేస్తాయి. కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ చుట్టూ జరుగుతున్నా వాటిల్లో సత్యాలను,అసత్యాలను దృష్టి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.అప్పటికప్పుడే కారణం లేకుండా ఆ అవకాశం మాయమైపోతే,దృష్టి లేని చోట సృష్టించుకున్న ప్రపంచంలో అసత్యాల మధ్య జీవించాల్సి వస్తే ఆ మనిషి పడే వ్యథ,సంఘర్షణను ఎంతో చక్కగా 2020లో వచ్చిన ‘సైట్ లెస్ ‘ సినిమా స్పష్టం చేస్తుంది.
వయోలినిస్ట్ ఎలెన్ యాష్లండ్ మీద గుర్తించే వీలు లేని వ్యక్తి దాడి చేసి ఆమె కళ్ళల్లో ఓ రసాయనం పోయడం వల్ల ఆమె కళ్ళు పోతాయి. ఆమె అన్నయ్య దూర ప్రాంతంలో ఉండటం వల్ల ఆమెను క్లేటన్ అనే కేర్ టేకర్ సంరక్షణలో కొత్త అపార్ట్మెంటులో ఉండేలా ఏర్పాటు చేస్తాడు. ఎలెన్ కు జీవితంలో ముఖ్యులైన వారు ఇద్దరు,ఒకరు ఆమె స్నేహితురాలు సాషా అయితే ఇంకొకరు ఆమె సోదరుడు.ఆమె ఎన్నిసార్లు వీరిద్దరికి ఫోన్ చేసినా ఎవరు స్పందించరు.
చూపు లేని కొత్త జీవితానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలెన్. ఆమెకు శబ్దం వినబడినప్పుడు లేదా ఎవరైనా వచ్చిన అలికిడి వినబడినప్పుడు ఆమె తన ఊహకు తగ్గట్టు అక్కడ వ్యక్తి ఉన్నట్టు ఊహించుకుంటుంది. ఓ రాత్రి ఆమెకు ఎవరో స్త్రీ పక్క ఫ్లాట్ నుండి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది.ఆమె భర్త ఆమెను హింసిస్తున్నాడని ఆమె అర్ధం చేసుకుంటుంది. తర్వాతి రోజు పక్క ఫ్లాట్ తలుపు మీద తన ఇంటికి టీకి రమ్మని ఆహ్వానం పేపర్ మీద రాసి ఆ తలుపుకు అంటిస్తుంది. ఎలెన్ ఫ్లాట్ కు పక్క ఫ్లాట్ లో ఉండే లానా తర్వాతి రోజు వస్తుంది.ఆమె మొహం మీద ఉన్న కుట్లను బట్టి ఆమె భర్త దానికి కారణం అనుకుంటుంది.ఆమె భర్త పేరు రూజో అని తెలుసుకుంటుంది. ఈ లోపు లిఫ్ట్ నుండి రూజో రావడంతో లానా అక్కడి నుండి వెళ్లిపోతుంది. వెళ్ళిపోయే ముందు ఎవరిని నమ్మవద్దని హెచ్చరిస్తుంది.
ఆ తర్వాత క్లేటన్ వెళ్ళిపోయాక ఓ రోజు ఎలెన్ మీద దాడి జరుగుతుంది. ఆమె స్పృహ కోల్పోయే లోపు 911 కు కాల్ చేస్తుంది. ఆమె స్పృహలోకి వచ్చేసరికి ఆమె దగ్గర ఓ వైద్యుడు ఉంటాడు.అతను వెళ్ళాక డిటెక్టివ్ బ్రైస్ వస్తాడు. ఆమె స్నేహితురాలు సాషా ఎలెన్ ఎక్స్ హస్బెండ్ తో సంబంధం పెట్టుకోవడం,ఎలెన్ మీద దాడి జరిగిన రోజు ఆమె కారు దగ్గర సాషా షూ సైజు సరిపోయే షూ మార్క్స్ ఉండటం వల్ల ఆమె అనుమానితురాలు అని చెప్తాడు.
ఆ తర్వాత చుట్టూ ఏం జరుగుతుందో తెలియక ఆ పరిస్థితిలో బ్రతకలేక ఎలెన్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తన అన్నకు,సాషాకు,క్లేటన్ కు ఉత్తరాలు రాస్తుంది. కానీ ఆమె బాల్కనీ నుండి దూకినా ఆమె ఓ సౌండ్ ప్రూఫ్ పరిసరాల్లోకి అడుగుపెడుతుంది.ఆమె రోజు వినే వాహనాల శబ్దాలు కూడా రికార్డ్ చేసినవి అని ఆమెకు అర్ధమవుతుంది. అప్పుడే ఆమెకు అక్కడికి వివిధ వ్యక్తులుగా వచ్చింది క్లేటన్ ఒక్కడే అని అర్ధమవుతుంది.లానా ఇంట్లో వెనుక ఉన్న వెంట్ ద్వారా తప్పించుకోవచ్చని చెప్తుంది.లానా క్లేటన్ చెల్లెలని అప్పుడు ఎలెన్ కు తెలుస్తుంది.
తిరిగి ఫ్లాట్ కు వచ్చిన ఎలెన్ కు డిన్నర్ ఏర్పాటు చేస్తాడు క్లేటన్. ఆమె తల్లి పక్షులకు పంజరాలు తయారు చేసేదని చెప్తాడు.తనను తండ్రి బేస్మెంట్ లో మూడేళ్ళ పాటు ఉంచాడని,బయటి ప్రపంచం తెలియని తను కేవలం ఎలెన్ పాటలు విని ప్రపంచాన్ని సృష్టించుకున్నానని చెప్తాడు.అదే ప్రపంచం ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని అంటాడు.క్లేటన్ ను దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎలెన్ కు అక్కడ ఓ రసాయనాన్ని వాసన ద్వారా గుర్తిస్తుంది.తన కళ్ళు పోయేముందు అదే రసాయనం తన కళ్ళల్లో తనను దాడి చేసిన వ్యక్తి వేసినట్టు ఆమెకు గుర్తుకు వస్తుంది.అదే రసాయనం క్లేటన్ కళ్ళల్లో పోసి లానాతో సహా ఆమె అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఆర్నెల్ల తర్వాత ఆమె వేదిక మీద ప్రదర్శన ఇస్తుంది. చూపు కోల్పోయినా ఆమె తన జీవితాన్ని అక్కడితో ముగించలేదు అనే భావన ఈ ముగింపులో ఉంది.
చూపు లేనప్పుడు మనిషి కొన్నిసార్లు పారనోయాకు కూడా గురయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతిదానిని అనుమానించడం జరుగుతుంది.ఆ అనుమానం దాటి ఓ సమన్వయంతో జీవించగలిగితే చూపు లేకపోయినా జీవితం ఆగిపోదు.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!