సృష్టించిన జీవితం

 సృష్టించిన జీవితం

-శృంగవరపు రచన



క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఆసక్తిని కలిగించే కొత్త మోటివ్ లను రూపొందించడంలో నేటి రచయితలు, దర్శకులు ముందు ఉంటున్నారు. అటువంటి ఓ ఆసక్తికరమైన సిరీస్ 'Clickbait.' Clickbait అంటే వీడియోల వీక్షకుల సంఖ్య పెంచడానికి ఉపయోగించే థంబ్ నెయిల్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ ఓ హత్య, దానికి గల కారణాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర నిక్. నిక్ కుటుంబంలో అతని భార్య సోఫి, కొడుకులు ఇతన్, కేయ్, చెల్లెలు పియా, తల్లి ఉన్నారు. నిక్ తల్లి పుట్టినరోజు పార్టీలో ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉన్న సమయంలో పియాకు, నిక్ కు గొడవ అవ్వడం, నిక్ పియాను వెళ్లిపొమ్మనడం, పియా అక్కడి నుండి వెళ్లిపోవడం జరుగుతుంది.
ఆ తర్వాత ఉదయం యూట్యూబ్ లో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో నిక్ 'I abuse women' అనే పోస్టర్ పట్టుకుని ఉంటాడు. దానితో పాటు ఆ వీడియోను 5 మిలియన్ మంది చూస్తే మరణిస్తానని కూడా ఉన్న పోస్టర్ కూడా పట్టుకుంటాడు.ఆ ఉదయం నుండే నిక్ కనిపించకుండా పోతాడు.
ఈ కేసును రోషన్ అనే డిటెక్టివ్ డీల్ చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగెషన్ లో సోఫికి హామీల్టన్ తో సంబంధం ఉన్నట్టు, ఈ విషయమై నిక్ అతనితో ఓ రోజు బార్ లో గొడవ పడినట్టు తెలుస్తుంది. నిక్ ఓక్ లాండ్ లోని ఓ హై స్కూల్ లో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో ఫిజికల్ థెరపిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు.
సోఫికి హామీల్టన్ తో కొన్నాళ్ళు సంబంధం ఉండటం, ఆ విషయం భర్తతో చెప్పడం, అప్పటి నుండి అతను బాధ పడటం జరిగిందని ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఆ తర్వాత నిక్ శవం దొరుకుతుంది.
నిక్ కు గర్ల్ ఫ్రెండ్ అని ఓ స్త్రీ వస్తుంది. తాను లాస్ ఏంజెల్స్ లో ఉండేదానినని చెప్తుంది. నిక్ కు భార్యతో ఉన్న గొడవ, మరియు అతని కుటుంబ విషయాలు కూడా ఆమెకు తెలుసని చెప్తుంది. నిక్ డేటింగ్ సైట్ల ద్వారా ఎందరో అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడని, అందులో ఎవరో అతన్ని చంపి ఉండవచ్చని భావిస్తారు.
రిపోర్టర్ బెన్ పార్క్ ఆ సైట్లను హ్యాక్ చేసి నిక్ కు సారా అనే ఆమెతో సంబంధం ఉందని తెలుసుకుని, ఆమె కోసం వెళ్తే, ఆమె మరణించిందని తెలుస్తుంది. ఆమె అన్న సైమన్ బర్తన్ ను కలవడానికి వెళ్లిన పార్క్ అతను ఇంట్లో లేకపోవడంతో, ఆ ఫ్లాట్ లో చొరబడి, సారా ఫోన్ దొంగిలిస్తాడు. ఆ ఫోన్ లో మెసేజిల ద్వారా ఆమె మరణించే ముందు నిక్ కు మెసేజ్ చేసిందని తెలుస్తుంది. సైమన్ ని ఇన్వెస్టిగెట్ చేస్తారు.
తన చెల్లి మరణించడంతో నిక్ ను పట్టుకుని, ఆ వీడియోలు చేయించింది తానే అయినా, నిక్ తాను ఏ అమ్మాయిని కలవలేదని చెప్పడం, అతని నిజం చెప్తున్నాడని అనిపించడంతో తాను అతన్ని వదిలేశానని చెప్తాడు.
నిక్ కొడుకు ఇతన్ తన తండ్రితో సంబంధం ఉన్నట్టు చెప్పుకున్న స్త్రీలతో మాట్లాడితే వారు అతనితో ఫోన్లో మాట్లాడటమే తప్ప, కలవలేదని, నిక్ స్వరం ఇతన్ వినిపించినప్పుడు ఆ స్వరం కాదని స్పష్టం చేస్తారు. ఇతన్ తన స్నేహితురాలి సాయంతో ఆ మెసేజీలు వారికి వెళ్లిన చిరునామా కనుక్కుంటాడు.
ఆ చిరునామా నిక్ తో పాటు స్కూల్ లో అడ్మిన్ విభాగంలో పని చేసే డాన్ ది. ఆమెకు పెళ్లయి, పిల్లలు లేరు. నిక్ సోషల్ మీడియా అకౌంట్ అప్డేట్ చేసిన ఆమె నిక్ ప్రొఫైల్, పాస్ వర్డ్ సాయంతో నిక్ లా నటించి వేరు వేరు పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసిందని, ఓ రోజు బాధలో ఉన్న నిక్ తన బాధల గురించి చెప్పడంతో, వాటిని కూడా ఆ స్త్రీలతో నిక్ లా వాయిస్ ఆల్టర్ ఉపయోగించి మార్చి మాట్లాడి, మోసం చేసిందని అర్ధమవుతుంది.
సైమన్ వదిలేసాక ఆ విషయం అర్ధమైన నిక్ డాన్ ఇంటికి రావడం,రహస్యం బయటపడిపోవటంతో డాన్ భర్త భార్యను కాపాడుకోవడానికి హత్య చేయడం జరుగుతుంది.
సోషల్ మీడియాలో నిజాల కన్నా కూడా ఆసక్తి కలిగించే అంశాలు అవ్వడమే ముఖ్యం. ఆ ఆసక్తిని పెంచడానికి మనిషి ఏ మేరకు అయినా సరే ఇతరుల జీవితాలలో ప్రవేశించడానికి వెనుకాడడని స్పష్టం చేసే సిరీస్ ఇది.
*     *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!