అవి నావే!
అవి నావే!
-శృంగవరపు రచన
స్పానిష్ థ్రిల్లర్స్ లో కథలు కొత్తరకంగా ఉంటాయి.కథల్లో ఉండే కొత్తదనం స్పానిష్ సినిమాలకు అంతర్జాతీయ దృష్టిలో పడేలా చేసింది. అటువంటి సరికొత్త అంశంతో వచ్చిన స్పానిష్ సినిమానే 'The Occupant.'
మార్గా, జేవియర్ భార్యాభర్తలు.జేవియర్ యాడ్ ఎక్సిక్యూటివ్ గా పని చేసి ప్రస్తుతం ఏ ఉద్యోగం లేకుండా ఉన్నాడు. అతని భార్య మార్గా. వారికి ఓ కొడుకు. జేవియర్ కు ఉద్యోగం లేకపోవడం వల్ల ఆ దంపతులు ప్రస్తుతం ఉంటున్న విలాసవంతమైన ఇంటిని వదిలి అంతకన్నా తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారతారు.
జేవియర్ చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు.అప్పటి నుండి అతనికి అంతకు ముందు తాము ఉన్న ఇంట్లో ఉన్న వారి పట్ల ఆసక్తి కలుగుతుంది. అక్కడికి తన దగ్గర ఉన్న తాళంచెవితో ఎవరూ లేని సమయంలో వెళ్తూ ఉంటాడు.
ఆ ఇంట్లో కంప్యూటర్ ద్వారా ఆ ఇంట్లో ఉన్న దంపతుల గురించి తెలుసుకుంటాడు.ఆ దంపతులు తోమాస్, లారా. తోమాస్ అంతకుముందు ఆల్కహాలిక్, అలా అతను ఓ సారి యాక్సిడెంట్ చేసినప్పుడు అతని భార్య, కూతురు మోనికా కు గాయాలు అవుతాయి. తోమాస్ షెడ్యూల్ చేసుకున్న పనులను కంప్యూటర్ ద్వారా తెలుసుకున్న జేవియర్ అతన్ని వెంబడిస్తాడు. అతను గ్రూప్ థెరపీకి వెళ్ళినప్పుడు అక్కడకు వెళ్లిన జేవియర్ తోమాస్ సమస్యలను తన సమస్యలుగా చెప్తాడు. ఆ తర్వాత తోమాస్ కు దగ్గర అవుతాడు.
అతను రెండవ పెద్ద ట్రాన్స్పోర్ట్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ అని, అతని భార్య తండ్రి ఆ సంస్థకు సిఈఓ అని తెలుసుకుంటాడు. మొత్తానికి స్నేహితుడిగా మారిన జేవియర్ ను ఇంటికి ఆహ్వానిస్తాడు తోమాస్. ఆ తర్వాత కావాలనే తన కారుకు యాక్సిడెంట్ చేసుకుని తోమాస్ కు ఫోన్ చేసి రమ్మని అడుగుతాడు.తాగుతున్నట్టు నటిస్తాడు జేవియర్.వైన్ తోమాస్ షర్ట్ మీద పడుతుంది. తన ఫోన్ పాడయ్యిందని చెప్పి తోమాస్ ఫోన్ తీసుకుని, దాని నుండి తనకు మెయిల్ పెట్టుకుంటాడు తోమాస్ కు తెలియకుండా.
ఇంటికి వెళ్ళాక తోమాస్ షర్ట్ నుండి వైన్ వాసనను మార్గా కనిపెట్టడం,గొడవ అవ్వడం అతను జేవియర్ గురించి చెప్పడం జరుగుతుంది. మర్నాడు మార్గా జేవియర్ ను కలిసి తన భర్తను కలవవద్దని చెప్తుంది. అప్పుడు జేవియర్ మొదట తనకు మెయిల్ పెట్టి పిలిచి తాగింది తోమాస్ అని అబద్ధం చెప్పి, సాక్ష్యంగా మెయిల్ చూపిస్తాడు. దానితో మార్గా భర్తతో మరలా గొడవ పడుతుంది. ఆ తర్వాత తన భార్యకు, తనకు గొడవ పెట్టినందుకు జేవియర్ ను గాయపరుస్తాడు.అలాగే మార్గా దగ్గరకు వెళ్ళి తోమాస్ గాయపరిచాడని చెప్తాడు. మోనికాకు ఇష్టమైన షోకు మార్గాతో సహా తీసుకువెళ్తాడు. అక్కడ అందరూ కలిసి దిగిన ఫోటో తోమాస్ కు పంపిస్తాడు. దానితో రెచ్చిపోయి గొడవపడతాడని ముందే ఊహించిన జేవియర్ మార్గాను రక్షణ కోసం పెప్పర్ స్ప్రే ఉంచుకోమని ఇస్తాడు.
అప్పటికే వేరుశనగలoటే తోమాస్ కు ఎలర్జీ ఉందని తెలుసుకున్న జేవియర్ ఆ స్ప్రే లో వేరుశనగ నూనె కలుపుతాడు.తోమాస్ గొడవ పడుతున్న సమయంలో పెప్పర్ స్ప్రే ఉపయోగిస్తుంది మార్గా. ఆ తర్వాత అతను ఊపిరి తీసుకోకపోవడంతో జేవియర్ కు కాల్ చేస్తుంది. జేవియర్ వచ్చి ఆమెను మోనికా దగ్గర ఉండమని చెప్తాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన తోమాస్ ను చంపుతాడు జేవియర్. ఆ తర్వాత స్ప్రే మార్చి పోలీసులకు ఫోన్ చేస్తాను. మొత్తానికి అది యాక్సిడెంటల్ హత్యగా మారుతుంది. తర్వాత జేవియర్ మార్గాను వివాహం చేసుకోవడం తన హోదాను పెంచుకోవడం జరుగుతుంది.
అతని మొదటి భార్య లారా ఆ నిజాన్ని తెలుసుకుని పోలీసులకు చెప్తాను అన్నప్పుడు అతను ఏ మాత్రం భయపడడు. ఆమె కొడుకు కోసం తాను ఇద్దామనుకున్నది లాయర్ కు ఖర్చు పెడతానని హెచ్చరికగా చెప్తాడు.
అలా ఎంతో తెలివిగా ఆస్తి ఉన్న భార్యను, భద్రత గల జీవితాన్ని దక్కించుకుని, దానికి అడ్డు లేకుండా అతను చేసిన ప్రయత్నాలు,అతన్ని గుర్తించిన గార్డెనర్ అతన్ని బెదిరించి పనులు చేయించుకోవాలనుకున్నప్పుడు అతన్ని కూడా అతని మెషిన్ ద్వారానే అంతం చేయడం, ఈ కథలో ఉన్న కొత్తదనం, కొత్త రకమైన కథనం ఈ సినిమాను టాప్ థ్రిల్లర్స్ లో ఒకటీగా ఉండేలా చేసింది.
నైతికత, న్యాయం ఏవైనా సరే మనిషికి తన మనుగడ తర్వాతే.'Survival of the fittest' క్రీడలో తెలివైనవారే తమ తెలివిని తమకు మాత్రమే అనుకూలంగా మార్చుకున్నప్పుడే మనగలుగుతారు. ఈ క్రీడలో గెలుపు ఓటమి వ్యక్తిగత తెలివికి సంబంధించినవి. న్యాయ పరిధిలోకి రాకుండా ఉండగలగటము, ఒకవేళ వచ్చినా గెలవగలగడము అన్ని కూడా మనుగడే ముఖ్య ప్రాధాన్యత అనే అంశాన్ని గుర్తు చేసేవే. కొత్త కథ, కొత్త కథనం ఈ సినిమా ప్రత్యేకత.
* * *
Comments
Post a Comment