నేర ప్రవృత్తి

నేర ప్రవృత్తి
-శృంగవరపు రచన




కాలంతో పాటు సాహిత్యం కూడా మారుతుంది. ఒక్కోసారి ఆ కాలంతో పాటు మనం ముందుకు పయనించినప్పుడు కాలం వెనుక ఉన్న సాహిత్యం మనం దాటి వచ్చామని అనుకుంటాము. ఆ సాహిత్యం పాతపడిపోయినట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఆ సాహిత్యాన్ని చదవడం ద్వారా మనం మనకు తెలిసిన ప్రస్తుత సాహిత్య ప్రజ్ఞతో నాటి సాహిత్యంలో కథను,శైలిని ముందుగానే ఊహించగలిగితే అదే పాతపడిపోయిందనిపించిన సాహిత్యం మన తెలివిని మెరుగుపరిచే సాధనంగా అనిపిస్తుంది. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ మీద నేటికే సాహిత్యం,సినిమాలు విరివిగానే వచ్చాయి. 1998 లో అమెరికన్ మాస్టర్ రైటర్ సిడ్ని షెల్డన్ రాసిన ‘టెల్ మి యువర్ డ్రీమ్స్ ‘ ఈ అంశం మీద వచ్చిన నవల. ఇప్పటికే ఈ అంశం మీద ఎన్నో సినిమాలు చూసిన ప్రేక్షకులు ఈ నవలలో పాఠకులను కథ ఎలా నడుస్తుందో ఊహించేలా చేస్తుంది. ఆ ఊహను బలపరుస్తూ,షెల్డన్ శైలిలో సాగే నవల ఇది.
కథలో ముఖ్య పాత్ర యాష్ లీ పాటర్సన్. ఆమె గ్లోబల్ గ్రాఫిక్స్ లో ఉద్యోగం చేస్తూ ఉంది.ఆమెకు పని తప్ప వేరే లోకం లేదు. అదే కంపెనీలో టోని ప్రేస్కాట్ అనే ఇంకో స్త్రీ పని చేస్తూ ఉంటుంది. నలుగురితో కలిసిపోతూ ఉండే మనస్తత్వం ఆమెది. ఆమె సింగర్ మరియు డ్యాన్సర్. ఇకపోతే ఆ కంపెనీలో పని చేసే మరో స్త్రీ అలెట్ పీటర్స్. ఆమె బిడియస్థురాలు,ఓ పెయింటర్. టోని రోజు ఇంటికి రాగానే ఇంటర్నెట్ ప్రపంచంలో చాట్ రూమ్ లో మునిగిపోయేది.బార్స్,క్లబ్స్ ఆమెకు ఇష్టమైన ప్రదేశాలు. ఇకపోతే అలెట్ కు పెయింటింగ్ మ్యూజియమ్స్ అంటే ఇష్టం. యాష్ లీ కు టోని,అలెట్ తెలియదు. యాష్ లీ మాత్రం వీరిద్దరికి తెలుసు. జీవితం గురించి యాష్ లీకు ఏమి తెలియదని,ఆమె కేవలం పని తప్ప ఏమి పట్టించుకోదని ఈ ఇద్దరి అభిప్రాయం.
అదే ఆఫీసులో పని చేస్తున్న డెనిస్ టిబిల్ యాష్ లీ వెంటపడుతూ ఉంటాడు.ఆమె అతన్ని ఇష్టపడదు. ఓ రోజు తనకు తాను ప్రేమించిన అమ్మాయి విషయంలో ఓ సమస్య ఉందని, ఆ విషయంలో సలహా ఇవ్వడానికి తన ఫ్లాట్ కు రమ్మని యాష్ లీ ని ఆహ్వానిస్తాడు. ఆ రాత్రి అతని ఫ్లాట్ కు వెళ్ళిన ఆమెకు అతను ఇచ్చిన డ్రింక్ తాగగానే స్పృహ తప్పడం, ఆ తర్వాత ఆమె మెళుకువ వచ్చేసరికి ఆమె చికాగో లోని ఓ చీప్ హోటల్ లో ఉండటం,రెండు రోజులు తర్వాత ఆమె స్పృహలోకి వచ్చానని తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక ఆమెకు డెనిస్ టిబిల్ హత్యకు గురయ్యాడని తెలిసి షాకవుతుంది.
ఆ తర్వాత కంపెనీ కన్వెన్షన్ ఉండటం వల్ల అందులో పని చేసే వర్కర్స్ అందరినీ కూడా క్యూబెక్ కు తీసుకువెళ్తుంది. అక్కడ టోని ఆన్లైన్ చాట్ రూమ్ లో కలిసిన జీన్ క్లాడ్ ను కలుస్తుంది. అతనితో లంచ్ లకు,డిన్నర్లకు వెళ్తుంది. అక్కడే ఎలెట్ రిచర్డ్ అనే ఆర్టిస్ట్ ను కలుస్తుంది. రిచర్డ్,జీన్ క్లాడ్ ఇద్దరు ఆ తర్వాత హత్యకు గురై మరణిస్తారు. ఈ మూడు హత్యల్లోనూ ఆ ముగ్గురు చనిపోయే ముందు సెక్స్ చేశారని ఆ తర్వాత వారిని కాస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.
మినీ సర్జరీలో ప్రసిద్ధి చెందిన వైద్యుడైన డాక్టర్ స్టీవెన్ పాటర్సన్ యాష్ లీ తండ్రి. యాష్ లీ కు తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలోనే ఆమె ద్రస్సింగ్ మిర్రర్ మీద ‘నిన్ను చంపుతాను’ అని రాసి ఉండటం చూసి పోలీసులకు ఫోన్ చేస్తుంది. బ్లేక్ అనే పోలీస్ ఆఫీసర్ ఆమెకు తోడుగా ఆ రాత్రి ఉంటాడు. ఉదయం చూసే సరికి అంతకు ముందు జరిగిన హత్యల్లో లానే మరణించి ఉంటాడు. యాష్ లీ పీటర్సన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.పోలిగ్రాఫ్ టెస్ట్ లో యాష్ లీకు ఆ హత్యలకు సంబంధం లేదని తేలినా ,హత్య జరిగిన చోట ఆమె ఫింగర్ ప్రింట్స్ లాంటివన్నీ ఆమె ఆ హత్య చేశాయని స్పష్టం చేస్తాయి. యాష్ లీ ,టోని, అలెట్ ఒకరేనని వారంతా యాష్ లీ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల పుట్టిన ఆల్టర్స్ అని పాఠకులకు స్పష్టమవుతుంది.
డేవిడ్ సింగర్ ఒకప్పుడు క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసి, ఓ కేసులో వైఫల్యం చెందడం వల్ల ఆ క్రిమినల్ లా వదిలేసి, ప్రస్తుతం కార్పొరేట్ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. డేవిడ్ సింగర్ యవ్వనంలో ఉన్నప్పుడూ అతని తల్లికి గుండె సమస్య ఉండటం, అప్పటికే మినీ హార్ట్ సర్జరీలో ప్రసిద్ధి చెందిన స్టీవెన్ పీటర్సన్ అతని తల్లిని బ్రతికించడం జరుగుతుంది. స్టీవెన్ పీటర్సన్ దానికి ప్రతిఫలంగా తన కూతురి కేసు తీసుకోమని పట్టుబడతాడు. తనకన్నా ప్రసిద్ధి చెందిన క్రిమినల్ లాయర్స్ ఉన్నప్పటికి,తాను ప్రస్తుతం క్రిమినల్ లాయర్ కాకపోయినప్పటికి అతను తన కూతురి కేసు తనను ఎందుకు వాదించమంటున్నాడో డేవిడ్ కు అర్ధం కాకపోయినా,తన తల్లికి చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆ కేసు తీసుకుంటాడు. Iatrogenicity అంటే హిప్నాసిస్ ద్వారా మల్టీ పర్సనాలిటీ ఉన్న రోగితో అతనిలోని ఆల్టర్స్ గురించి అడిగినప్పుడు కొన్నిసార్లు ఆ వైద్యుడిని సంతృప్తి పరచడానికి ఆ రోగి వాటిని సృష్టించి చెప్పే అవకాశం కూడా ఉంటుంది.యాష్ లీ ట్రయల్ లో ఉన్నప్పుడూ ఈ అంశం ఆమెకు వర్తిస్తుందని అంటే,రిస్కు తీసుకుని ఆమెలో టోని వచ్చేలా చేస్తాడు డేవిడ్.
అతి కష్టం మీద ఆమెకు ఉన్న ఆల్టర్స్ గురించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరూపించి ఆమెకు సైకియాట్రిక్ ట్రీట్ మెంట్ కు తరలించేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ లో దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆ ఆల్టర్స్ ఎందుకు పుట్టాయో తెలుస్తుంది. బాల్యంలోనే స్టీవెన్ తన కూతురిని లైంగికంగా వేధించడం జరిగింది. ఆ సమయంలో పుట్టిన ఆల్టర్స్ ఇవి అని తెలుస్తుంది. యవ్వనంలో ఉన్నప్పుడూ ఓ స్నేహితుడు ఆమెకు ప్రపోస్ చెయ్యడం,వారిద్దరు అక్కడి నుండి వెళ్లిపోవాలి అనుకోవడం,ఆ రాత్రి యాష్ లీ గా ఇంటికి తిరిగి వెళ్ళినా టోని అతన్ని హత్య చేయడం జరుగుతుంది. అలా తండ్రి లైంగిక వేధింపుల వల్ల పుట్టిన ఈ రెండు ఆల్టర్స్ లో టోని మాత్రమే హత్యలు చేసింది.అలెట్ ఓ ఆర్టిస్ట్. ఆమె బాధను మరిపించడానికి పుట్టిన సృజనాత్మక ఆల్టర్ .ఈ మానసిక అపసవ్యతలో ఆ వ్యక్తిలో ఆల్టర్స్ ప్రవర్తన వచ్చినప్పుడు ఫ్యూగ్ అమినీషియా ఉంటుంది. దాని వల్ల ఆ ఆల్టర్స్ కొన్ని గంటలు,కొన్ని రోజులు,కొన్ని వారాలు ఉండవచ్చు,కానీ ఆ కాలంలో ఏం జరిగిందో ఆ వ్యక్తికి మాత్రం తెలియదు. ఆ రెండు ఆల్టర్స్ ను యాష్ లీ కి పరిచయం చేసి వారి మధ్య సంధి చేసి, ఆ ముగ్గురిని ఒకటిగా మార్చడమే ఇక్కడ ఈ అపసవ్యతకు పరిష్కారం.
డేవిడ్ సింగర్ కు తాను మాత్రమే ఆ కేసు తీసుకోవాలని స్టీవెన్ ఎందుకు పట్టుబట్టాడో అప్పుడు అర్ధమవుతుంది. ఒకవేళ తాను చేసిన పని బయటపడినా సరే డేవిడ్ అయితే కృతజ్ఞత వల్ల బయట పెట్టడని భావించి అలా చేశాడని స్పష్టమవుతుంది. అదే సమయంలో స్టీవెన్ ఇంకో పెళ్లి చేసుకోవడం,వివాహమై చిన్న కూతురు ఉన్న ఆమెను చేసుకోవడం,వారిద్దరితో అప్పటికే దాదాపుగా క్యూర్ అయిపోయింది అనుకున్న యాష్ లీ దగ్గరకు రావడం జరుగుతుంది. అక్కడ ఆ బాలికను చూడగానే యాష్ లీ కు తన తండ్రి ఆ పాపను కూడా తనలానే చేస్తాడనే భావన కలుగుతుంది. ఆ తర్వాత నుండి హింసాత్మకంగా మారిపోయినా కొంతకాలానికి ఆ కోపం ఆమెలో తగ్గిపోతుంది. ఆమె మామూలు మనిషి అయ్యిందని భావించి ఆమెను విడుదల చేస్తారు.కానీ ఆమె తన తండ్రి కొత్తగా మారిన ప్రదేశానికి వెళ్లడానికి బయలు దేరడంతో పాటు ఆమెలో టోని రావడంతో ఆమె తన తండ్రిని హత్య చేయడానికి బయలుదేరి ఉండవచ్చని చెప్పకుండా చెప్తూ రచయిత ముగిస్తాడు.
ఈ కథ 1998 లో కచ్చితంగా గొప్ప కథే. ఇప్పటికే ఈ అంశం మీద ఎన్ని సినిమాలు వచ్చినా ఎప్పటికీ ఆసక్తిని కలిగించే అంశం ఇది ఎందుకంటే ఇది మనిషిలో ఉన్న అసంతృప్తులు,వ్యధల నుండి పుట్టిన క్రైమ్ మోటివ్ పర్సనాలిటీ కి సంబంధించిన కథ కనుక. ఇలాంటి కథలు చదువుతూ ఉంటే కొంతమేరకు ఊహించే ప్రయత్నం చేయగలగడం కూడా ఈ నవల వల్ల పాఠకుల్లో ఊహా శక్తిని పెంచుతుంది.

* * * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ