కుటుంబరాగం
కుటుంబరాగం
-శృంగవరపు రచన
సాహిత్యం అనుభూతులకు,ఊహలకు,అనుభవాలకు మాత్రమే ఆవిష్కరణ కాదు గడచిన కాల వైభవానికి ఓ వేదిక కూడా. సాహిత్యంలో కాలంతో పాటు వచ్చే ముఖ్య మార్పు పాత్ర చిత్రణల్లో,పాత్ర స్వభావంలో,పరిస్థితుల్లో,తప్పొప్పుల నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.మనుషుల మనసుల్లో సాంకేతిక,వైజ్ఞానిక,మానసిక మార్పులు కూడా కొత్త ఆలోచనలను,కొత్త విలువలను,లోకాన్ని చూసే కొత్త కోణాన్ని పరిచయం చేస్తాయి.ఆ మార్పే సాహిత్యంలో కాలానికి ఓ రికార్డులా నమోదవుతాయి.1973 లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఉగాది నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీధరగారి నవల ‘రాగవిపంచి’ని ఇప్పుడు చదువుతుంటే ఆ కాలపు పరిస్థితులు,ఆలోచనలు,అలాగే నాటికి నేటికీ స్థిరంగా ఉన్న మనిషి అస్థిరత్వ పరుగులు ఒకేసారి సమన్వయంతో నడుస్తున్నట్టు అనిపించింది. ‘రాగవిపంచి’ లో శ్రీధర గారి శైలిలో పాత్రల చిత్రణలో కరుణ, సున్నితత్వం ఉంది. వారి మానసిక సంచలనాన్ని ఆవిష్కరించి వారి పరిస్థితుల ద్వారానే వారి పరిచయం చేయాలనే తపన ఉంది. వాక్య నిర్మాణాల్లో,పద ప్రయోగాల్లో మానసిక విశ్లేషణ,మారుతున్న మనిషి-సమాజం రెండు ఉన్నాయి. బాషాపరంగా నాటి శైలికి,నేటి శైలికి వచ్చిన ఎన్నో మార్పులు ఈ నవల చదువుతుంటే పాఠకులకు కనిపిస్తాయి. సమాజంలో ఇమిడే ప్రయత్నంలో తనలోని సున్నితత్వాన్ని కోల్పోకుండా జీవించాలని అనుకున్నా,మారే సమాజం మనిషిని ఎలా కర్కసుడిగా మారుస్తుందో పరోక్షంగా స్పష్టం చేసే నవల ఇది.
ఈ నవలలో కథను నడిపిన తీరు,తాను చెప్పాలనుకున్న విషయాన్ని రచయిత స్పష్టం చేసిన తీరు నాటకీయ ధోరణిలో ఉన్న దాని ప్రభావం పాఠకులను తాను చెప్పింది అర్ధం చేసుకునేందుకు కథ చివరి వరకు పాత్రల మనస్తత్వాల ఊతంతో చెప్పి ఒప్పించిన తీరు అభినందనీయం.ఈ కథలో ఉన్న ప్రతి పాత్రకు తన ద్వారా ఓ సత్యాన్ని ఆవిష్కరించే గొప్పతనం ఉంది.
రాజగోపాలరావు గారు ధనవంతుడు. ఓ కంపెనీకి చైర్మెన్.ఆయన దగ్గర క్లర్కుగా పనిచేసేవాడు సారధి.రాజగోపాలరావు గారి సోదరి కూతురు అనురాధ.అప్పటికే తల్లి మరణించడంతో అన్నావదినల దగ్గర ఉంటున్న అనురాధ వారి నిరాదరణలో ఉండలేక తనకు ఏదైనా చిన్న ఉద్యోగం చూడమని గోపాలరావుగారికి ఉత్తరం రాస్తుంది. ఆమెను తీసుకురావడానికి సారధిని పంపుతాడు గోపాలరావు.అనురాధ అతనితో కలిసి హైదరాబాద్ వస్తుంది.సారధికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడని భావించిన గోపాలరావు భార్య హేమలతకు అతనంటే గిట్టదు.అనురాధను తీసుకువచ్చేసరికి గోపాలరావు ఢిల్లీ మీటింగుకు వెళ్ళడంతో తాను అనురాధను తీసుకువెళ్లడం శ్రేయస్కరం కాదని భావించిన సారధి ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు.
ఈ నవలలో సారధికి ఉన్న ఒకే ఒక బంధం తల్లి.కష్టపడి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నవాడు,బాధ్యతలు తెలిసినవాడు.అలాగే తనకన్నా పై అధికారుల పట్ల వినమ్రతతో మెలిగేవాడు.అప్పటికే గోపాలరావు కుటుంబాన్ని చూసి ఆ కుటుంబంలోని వ్యక్తుల గురించి తెలుసుకున్నవాడు. ఆ ఇంట్లో డబ్బు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారని అతనికి తెలుసు.అనురాధ అలా నిస్సహాయ స్థితిలో వెళ్తే ఆమెను తేలిక చేస్తారని గ్రహించి ఆమెకు మంచి బట్టలు,కావలసినవి కొని రాజగోపాలరావు రాగానే ఆయనతో కలిసి ఇంటికి పంపుతాడు. సారధి అనుబంధాలకు ప్రాధాన్యతను ఇచ్చేవాడు.తాను అద్దెకు ఉంటున్న పక్క గదిలో ఓ భార్యాభర్తలు,వారి బిడ్డలు ఉంటున్నారు.ఆ కుటుంబానికి కొడుకులా మారిపోయాడు సారధి.ఆ ఇంటి ఆడపడుచు అయిన నిర్మలను చెల్లెలిలాగానే భావించేవాడు. అనురాధను తీసుకువచ్చాక వారితో పరిచయం ఏర్పడటం,వారు అనురాధను ఆదరించడం,వారిని అనురాధ అభిమానించడం కూడా జరుగుతుంది.
ఇక గోపాలరావు పెద్ద కొడుకు చిరంజీవి.అతనికి తనను తాను నిరూపించుకోవాలనే కోరిక ఉంది. బాగా సాహిత్యం చదువుతాడు.తన కుటుంబ పలుకుబడి వినియోగించకుండా ఓ నైట్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు.ఆ విషయం ఇంటి నుండి రహస్యంగానే ఉంచుతాడు,ఎందుకంటే కుటుంబ హోదాకు అది చిన్న ఉద్యోగం కనుక. ఇక రెండో కొడుకు మధు.అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక తర్వాత కూతురు శిరీష.
ఈ ముగ్గురు పిల్లలపై వారి తల్లిదండ్రుల ప్రభావం ఉంది. గోపాలరావు ధనవంతుడు కావడానికి కారణం హేమలతా తండ్రి ఇచ్చిన డబ్బే కారణం అయినందుకు,పెళ్లి తర్వాత జీతం అంతా భార్యకే ఇచ్చేవాడు.హేమలతకు ఛైర్మన్ భార్యగా వచ్చే హోదా మాత్రమే అవసరం తప్ప భర్తతో మానసిక అనుబంధం గురించి ఆమె ఎప్పుడు ఆలోచించలేదు.పిల్లలపై తండ్రి ప్రభావం ఉండకూడన్న పట్టుదల,పిల్లల విషయాల్లో తండ్రి జోక్యం లేకుండా ఎలా చెయ్యాలి అన్న ఆలోచనే తప్ప,దాని వల్ల పిల్లల మనస్తత్వాలు ఎలా రూపొందుతున్నాయో అన్న విషయం పట్టించుకోవాలని ఆమెకు ఎప్పుడు అనిపించలేదు.
హేమలతా మీటింగులు,క్లబ్బులు,విలాసాలకు ప్రాధాన్యతను ఇవ్వడం గమనించిన ఆమె కొడుకు మధు కూడా జులాయిగా తిరగడమే జీవితం అనుకున్నాడు.ఇకపోతే చిరంజీవి చదువుకున్నప్పటికి,అతని ప్రతిభకు,ఆలోచనలకు ఇంట్లో ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఓ శూన్యంతో నిండిపోయిన వ్యక్తిలా తయారయ్యాడు.మనుషుల మధ్య అనుబంధాలను నమ్మే చిరంజీవికి సారధి మిత్రుడు. ఇకపోతే అనురాధ ఇక్కడకు రాకముందు చిరంజీవి మీద అభిమానం పెంచుకుంది.
ఇకపోతే శిరీష చిన్నతనం, ఆకర్షణలు దాటని అమ్మాయి. సారధి వెంటపడి, అతన్ని ప్రేమిస్తున్నానని వేధిస్తూ ఉంటుంది. శిరీష అతన్ని ఇష్టపడటం, సారధి మధు అబద్ధాలు చెప్పి తండ్రి దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భాల్లో నిజం చెప్పడం వంటి అంశాలు సారధి పట్ల మధుకు కోపాన్ని కలిగిస్తాయి.
ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ సర్దుకుపోతూ జీవిస్తుంది అనురాధ.సారధి మిత్రుడు ప్రసాద్.సారధి తల్లి అనసూయ మరణించడంతో సారధి అక్కడికి స్నేహితుడైన ప్రసాద్ తో కలిసి వెళ్తాడు.
తల్లి తండ్రి సీతారామయ్యను కలవమని రాసిన ఆఖరి ఉత్తరంతో తండ్రి దగ్గరకు మిత్రుడితో కలిసి వెళ్తాడు సారధి. అక్కడ తండ్రి ఆరోగ్యం అంతంతమాత్రం ఉన్నట్టు, తండ్రి చెల్లెలు-బావ తండ్రి ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తండ్రి ద్వారా తెలుసుకుంటాడు సారధి. అక్కడే మేనత్త కూతురు దుర్గ పరిచయం అవుతుంది.
ఆ తర్వాత సారధి తిరిగి వస్తాడు. ధనవంతుడైన తండ్రి ద్వారా కలిమి కూడా సారధి జీవితంలో ప్రవేశిస్తుంది. ప్రసాద్ కు హైదరాబాద్ బదిలీ కావడంతో ప్రసాద్ కూడా సారధితో కలిసే ఉంటాడు.
హేమలత తన కూతురు శిరీషకు పెళ్ళి సంబంధం చూస్తుంది. ఆ పెళ్ళి కొడుకు శ్యామ్ ని ఒప్పించి తన చదువు అయ్యాక వివాహం అని ఒప్పిస్తుంది శిరీష. ఇక అతని సోదరి జయతో చిరంజీవికి వివాహం చేయాలనుకుంటారు. కానీ చిరంజీవి తనకు పెళ్ళి వద్దని తెల్చేస్తాడు. మధు అప్పటికే అనురాధతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నా ఆమె అన్నతో సన్నిహితంగా ఉంటుందని గమనించి ఆ విషయం తల్లికి చెప్పి, అందువల్లే చిరంజీవి పెళ్ళికి ఒప్పుకోవడం లేదని చెప్తాడు. దానితో హేమలత అనురాధను నిందించి, చిరంజీవిని పెళ్ళికి ఒప్పించే బాధ్యత ఆమెకే అప్పగిస్తుంది.
ఆ తర్వాత చిరంజీవి మొదట ఒప్పుకోకపోయినా ఆ తర్వాత జయను వివాహం చేసుకుంటాడు.ప్రసాద్, నిర్మల ప్రేమించుకుంటారు.ప్రసాద్ ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల కట్నం ఉంటేనే ఒప్పుకుంటామని అతని తల్లిదండ్రులు పట్టుబట్టడం, నిర్మల పెళ్ళికి తానే ఆ ఖర్చు భరిస్తానని మాట ఇస్తాడు సారధి. ఆ తర్వాత సారధిని ఫెయిల్యూర్ పోగొట్టాడన్నా నెపం మీద సారధి ఉద్యోగం తప్పిస్తాడు గోపాలరావు.కట్నం లేకుండా ఆదర్శ వివాహం చేసుకున్న చిరంజీవికి అనారోగ్యం వస్తుంది. సారధి తండ్రి ఇచ్చిన డబ్బులతో నిర్మల, ప్రసాద్ వివాహం చేయాలనుకున్నా ఆ డబ్బు దొంగతనంకు గురవ్వడంతో ఆ పెళ్ళి ఆగిపోతుంది. చిరంజీవి అనారోగ్యంతో మరణిస్తాడు. మరణించే ముందు అనురాధతో తాను ఆమెను ప్రేమించాను కనుకనే పెళ్ళి చేసుకోలేదని, తాను మరణిస్తానని ముందే తెలుసునని చెప్తాడు చిరంజీవి.
నిర్మల లేచిపోయి వెనుక ఇంట్లో ఉన్న వివాహితుడుతో వెళ్ళిపోతుంది.పేదరికం, ఇంకా వివాహం కాదేమో అన్న భయం ఆమె చేత ఆ పని చేయిస్తాయి. ఉన్న ఉద్యోగం పోయాక సారధికి అంత కన్నా ఉన్నత ఉద్యోగం వస్తుంది.దానికి రికమెండ్ చేసింది గోపాలరావు అని అతనికి తర్వాత తెలుస్తుంది.గోపాలరావు రిటైర్ అవుతాడు. అతను రిటైర్ అయ్యాక వచ్చిన యాభై వేల సొమ్మును అనురాధ పేరు మీద వేస్తాడు. ఆ తర్వాత సారధి, అనురాధ, శిరీషలకు తన జీవితం గురించిన ఓ విషయం చెప్తాడు. తాను, అన్నపూర్ణ అన్నచెల్లెల్లు అని, అనసూయ తమ ఊరిలోనే ఉండేదని, కలిసి చదువుకునేవారిమని, ఆ తర్వాత అనసూయ, తాను వివాహం చేసుకుందామనుకున్నప్పటికి కుటుంబాల మధ్య డబ్బు వల్ల వచ్చిన పట్టింపుల వల్ల ఆ పెళ్ళి జరగలేదని చెప్తాడు. ఆ తర్వాత అనసూయకు సీతారామయ్యతో వివాహం జరిగిందని, అనసూయను అత్త వారింట్లో ఎంతో వీధించేవారని, సీతారామయ్య ఆరోగ్యం కుంటుబడటంతో, అనసూయ మీద ఆరళ్ళు పెరిగిపోవటం, ఆమె తట్టుకోలేని పరిస్థితుల్లో గోపాలరావుకు ఉత్తరం రాయడం, గోపాలరావు సమాధానం రాసిన లేఖ కుటుంబానికి చిక్కి ఆమెను వెళ్లగొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెకు టీచర్ శిక్షణ ఇప్పించి ఆమెను ఓ పల్లెటూరిలో స్థిరపడేలా చేశాడు గోపాలరావు.
తర్వాత హేమలతకు పిల్లలు పుట్టడం, రెండో బిడ్డ మరణించాడని నమ్మించి ఆ బిడ్డను అనసూయకు ఇచ్చి పెంచమనడం, దాని ద్వారా పెంపకంలో ప్రేమ, బాధ్యత ఉంటే ఎలా తయారు అవుతారో భార్యకు ఆ బిడ్డను సాక్ష్యంగా చూపాలనుకోవడం, ఆ బిడ్డ సారధి అవ్వడం గురించి చెప్తాడు.
ఇక ముగింపులో అందరికి నిజం తెలియడం, దుర్గ-మధు, జయ-ప్రసాద్, సారధి-అనురాధ వివాహాలు, మారిన గోపాలరావు కుటుంబంతో నవల ముగుస్తుంది.
భార్యాభర్తల పంతాలు పిల్లల్లో సృష్టించే నున్యత, ఆ స్పర్ధల నుండి పిల్లల్లో పుట్టే లెక్కలేనితనం, అహంకారం, అలానే తల్లి ప్రేమ కొడుకును తీర్చిదిద్దే తీరు ఎలా ఉంటుందో రచయిత కథను ఎన్నుకుని చెప్పిన తీరు కథతో పాటు పాఠకులు కూడా ఆ పాత్రలతో పరోక్ష బంధాన్ని ఏర్పర్చుకునేలా చేస్తుంది.
* * *
Comments
Post a Comment