ప్రాణం ఖరీదు - విలువలు
ప్రాణం ఖరీదు - విలువలు
-శృంగవరపు రచన
ఈ ప్రపంచంలో మనిషి అభిప్రాయాలూ,విలువలు,నిర్ణయాలు అతను అనుభవించిన గతం,అనుభవిస్తున్న వర్తమానం,అనుభవించబోయే భవిష్యత్తు పై ఉన్న అంచనాల నుండే ఉద్భవిస్తాయి.మనిషి తాను కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడూ తన విలువలుగా చెప్పుకునేవి నిజానికి అతని విలువలు కావు.మనిషికి తన ప్రాణం కొంతసేపట్లో పోతుంది అని తెలిసినప్పుడు దానిని కాపాడుకోవడానికి విలువల గురించి ఆలోచించకూడదు అనుకుంటే అతను కచ్చితంగా తన ప్రాణానికి ఇచ్చిన విలువ,అతను అప్పటివరకూ ఏర్పరచుకున్న విలువలకు ఇవ్వకపోవచ్చు.మనిషి మనుగడకు,విలువలకు మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు మనిషి ప్రవర్తన ఎన్ని రకాలుగా మారిపోతుందో స్పష్టం చేసే ఆంగ్ల సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా ‘సర్కిల్.’
ఈ సినిమాలో పాత్రల పేర్లకు ప్రాధాన్యత లేదు. ఓ యాభై మంది అపరిచితులు ఓ డార్క్ రూమ్ లో ఒక్కొక్కరూ ఒక్కో వృత్తంలో నిలబడి ఉంటారు.వారు అక్కడికి ఎందుకు వచ్చారో,అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.కానీ తాము నిలబడిన వృత్తంలో నుండి బయటకు కదిలితే మాత్రం ప్రాణం పోతుందని కొంతసేపటికి వారికి అర్ధం అవుతుంది. రెండు నిమిషాలకు ఒకసారి ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటుంది.
కొన్ని ప్రాణాలు పోయిన తర్వాత వారికి ఓ విషయం అర్ధం అవుతుంది.అది అక్కడ ఉన్న వారు మెజారిటీ వోటింగ్ ద్వారా ఎవరిని ఎన్నుకుంటారో వారు మరణిస్తారు లేదా వారు ఆ పని చేయకపోతే మాత్రం ఎవరో ఒకరు అయినా మరణిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏ అంశం ఆధారంగా వోటింగ్ మొదలు పెట్టాలి అనే అంశం మీద ఆలోచించి మొదట వృద్ధులు అప్పటికే ఎంతో జీవితం గడిపారు కనుక మొదట వృద్ధులను ఎన్నుకుంటారు.అలా వారిలో కొందరు మరణించాక ఇక్కడ రేసిజం,లెస్బియన్స్ వంటి వారి పట్ల వ్యక్తిగత విముఖత కూడా ఈ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉంటుంది.
ఈ యాభై మందిలో ఓ గర్భవతి,ఆమె కూతురు ఉంటారు. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ జంట ఉంటారు.ఇక ఓ భార్యాభర్త ఉంటారు.ఎవరికి వోట్ వెయ్యాలి అనే అంశం మీద ఎవరికి వారు తాము ఉండకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. దాదాపు అందరూ తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని అని మాత్రమే ఆలోచించేవారు ఉన్నప్పటికి పక్క వారికి వోట్ వేసి తాము హంతకులు కావడం ఇష్టం లేక వాలంటీర్లుగా మారి మరణించిన వారు ఉన్నారు.
ఓ బ్యాంకర్ వ్యక్తులు చేసే ఉద్యోగాలను బట్టి వారు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నారు అనే అంశాన్ని బట్టి తక్కువ ఉపయోగపడే వారి క్రమంలో వోటింగ్ జరగాలని అంటాడు.ఇక భార్యాభర్తలమని చెప్పుకున్న ఆ జంట తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అలా నటించారు తప్ప నిజానికి వారు భార్యాభర్తలు కారని అందరికి అర్ధమవుతుంది.
ఇక ఆ తర్వాత మిగిలిన వారిలో మెజారిటీ తమ వైపు ఉండేలా చేసుకుని తాను బ్రతికి ఉండేలా చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. ఇక అలా ఆ ప్రక్రియలో అందరూ మరణించి ముగ్గురు మిగులుతారు.వారు ఓ పురుషుడు,గర్భిణి స్త్రీ,ఆమె కూతురు. ఈ మొత్తం ప్రక్రియలో ఆ కూతురికి వోటింగ్ చేయాలి అని కొందరు అనుకుని వేసినా అప్పటికే కొందరికి అలా ఓ బాలికను చంపడం ఇష్టం లేక వెయ్యకపోవడం వల్ల అప్పటి వరకు టై ఏర్పడి ఎలాగో ఆ పాప చివరి వరకు ప్రాణాలతో ఉంది.
ఇక ఆ పురుషుడికి ఓ విషయం అర్ధమయ్యింది. అక్కడ మెజారిటీగా ఉన్నది ఆ తల్లి,కూతురు.వారిద్దరు తనకు వోట్ వేస్తే తర్వాత మరణించేది తానే అని అతనికి తెలుసు.కానీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి వారిని ఎంత చక్కగా మభ్యపెడతాడో అన్నదే ఈ సినిమా ఎండింగ్ లో ఆసక్తిని కలిగిస్తుంది. ఎలాగూ తాను మరణించిన తర్వాత తల్లి,కూతుర్లలో ఒకరు మరణించాలి.అది వారిద్దరి నిర్ణయం అంటాడు. ఆ పాప తాను ఒక్కదాన్ని మరణించే నిర్ణయం తీసుకుంటే తన తల్లితో పాటు,తన తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్రతుకుతుంది కనుక రెండు ప్రాణాలు బ్రతికే అవకాశం ఉంటుందని భావించి తాను మరణిస్తాను అని చెప్తుంది.దానిని అవకాశంగా తీసుకున్న ఆ పురుషుడు తాము ఇద్దరం కలిసి స్వచ్చందంగా ఒకేసారి చనిపోదామని,ఎందుకంటే ఆ తర్వాత ఆ తల్లి తన కూతురుని చంపుకోవడానికి వోట్ వెయ్యకపోవచ్చని నమ్మిస్తాడు.అలా ఆ పాప వృత్తంలో కాలు బయట పెట్టే సమయంలో అతను ఆమె తల్లికి వోట్ వేస్తాడు.అలా ఆ తల్లి కూతుర్లు ఇద్దరు మరణిస్తారు.ఇక అక్కడ నుండి ప్రాణాలతో అతను ఒక్కడే బయటపడతాడు.
ఎవరు బ్రతకాలి?ఎవరు మరణించాలి?అన్న అంశాన్ని ఎవరు నిర్ణయించలేరు. మనిషి జీవితంలో ఏ దశలో ఉన్నాసరే ఇంకా కొంత కాలం జీవించాలనే అనుకుంటాడు.ఆ జీవించడమనే అవకాశం ఇంకొకరిని హత్య చేస్తేనే లభిస్తుంది అనుకుంటే అతను దానిని తన మనుగడకు మార్గం అనుకుంటాడు తప్ప విలువలు పాటించలేదు అనుకోడు.అదే మనిషి నైజం. ఈ ప్రపంచంలో తమకు తమ విలువలతో సంఘర్షించే పరిస్థితులు ఉద్భవించనంతవరకే మనుషులు విలువలు పాటిస్తారు. అతికొద్ది మంది మాత్రమే ఆ విలువలనే తమ జీవితం కన్నా ప్రాధాన్యత ఉన్న అంశంగా భావిస్తారు.
ఈ సినిమాలో మనిషి జీవించే పరిస్థితులను బట్టి అతనిలో అతనికే తెలియని మార్పులు ఎలా వస్తాయో ప్రేక్షకులు ఒక్కో పాత్ర ద్వారా చూస్తారు.ఎదుటి వ్యక్తిని చంపడం నేరం అని,అది సమర్ధనీయ అంశం కాదని అందరికి తెలుసు కానీ తాము బ్రతకాలంటే ఎదుటి వ్యక్తిని చంపడమే మార్గం అయితే అప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు.ఒకవేళ ఈ యాభై మందికి ఏర్పడిన పరిస్థితి ప్రపంచం మొత్తం ఉంటే అప్పుడు మనుషులు హత్యలు చేయడాన్ని ధర్మంగా భావించవచ్చు.
సమాజంలో జీవించే మనిషి సౌఖ్యాన్ని అనుసరించి జన్మించే విలువలు మనిషి ప్రాణం కన్నా విలువైనవి కావనే వాస్తవాన్ని అందరూ అంగీకరించకపోవచ్చు కానీ ఈ ప్రపంచంలో మనిషి జీవించి ఉంటేనే ఆ విలువలు జీవిస్తాయి,మృత కళేబరాలకు అవి వర్తించవు. ఇది ఓ కోణం అయితే,అందరం కచ్చితంగా మరణించే పరిస్థితి ఉన్నప్పుడూ తమ చావు కూడా తమకు ఓ గౌరవాన్ని ఇవ్వాలి అనుకునేవారు మాత్రం చావును కూడా జీవించినంత సంబరంగా భావించే విలువలను కాపాడుకుని మరణిస్తారు.
ఆ మరణంలో ఓడిపోయినా,గౌరవం దక్కిన సంతృప్తి ఉంది.బాలీవుడ్ సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ లో ఉన్న ఓ భావన ఇక్కడ వర్తిస్తుంది. తన తండ్రిని దొంగగా చిత్రీకరించి,అతను మరణించేలా చేసినా గ్రోవర్ ను అదే పరిస్థితుల్లో దొంగగా చేయడానికి నాయకుడైన చార్లెస్ తన మిత్రులతో,తండ్రితో బృందంగా ఏర్పడి ఓ ప్రణాళిక వేస్తాడు. అందులో భాగంగా వారు డ్యాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనాల్సి వస్తుంది.వోట్లను హ్యాక్ చేసి ఫైనల్స్ కు వెళ్తారు.ఆ బృందంలో వారికి నాట్యం వచ్చిన మేనక ద్వారా ఓ మేరకు చేసినా వీరి దృష్టి దొంగతనం మీద మాత్రమే ఉంటుంది.ఎంతో కష్టపడి ఆ దొంగతనం చేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మేనక మాత్రం రావడానికి ఒప్పుకోదు.అప్పటికే ఆ బృందం తాము గెలవమనే భావనతో ఉన్నారు,కానీ అంతకుముందు పోటీలో కాంపిటీషన్ మధ్యలో ప్రత్యర్ధిని కాపాడిన మానవత్వానికి మాత్రమే ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నారు.కానీ ఆ పనితో దేశంలో నమ్మకం పెంచుకున్న ఆ దేశ నమ్మకాన్ని తాను వదిలి రానని,తాను ఓటమి గురించి బాధ పడనని,కానీ గౌరవంగా ఓడిపోవాలనుకుంటున్నాను అని మేనక అక్కడే ఉండిపోతుంది.వారు గెలుస్తారు ముగింపులో.ఇక్కడ ఓటమి,గెలుపు ఏదైనా సరే అది గౌరవంగా ఉండాలి అనే ఓ అంతర్లీన విలువ కొందరిలో ఉండిపోతుంది.ఆ ఒక్క విలువే మనుగడ,గౌరవం మధ్య రేఖగా ఉంటుంది.
ఇక ప్రస్తుత సినిమా సర్కిల్ విషయంలో దీనిని అన్వయిస్తే,మనిషికి జీవించడం మరణించడం మధ్య తాము బాధ పడని విధంగా ఈ రెండింటి మధ్య పయనం ఉండేలా చూసుకోవడం అనే మధ్యస్థ భావనతో కూడిన సున్నితత్వం కూడా ఉంటుంది. ఆ సున్నితత్వ స్పష్టతే మనుగడ-జీవితం-గౌరవం మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది.బహుశా మనుషుల విలువలు వారు వాటిని పాటించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే ఆ విలువలు వారికి వర్తిస్తాయో,లేదో అన్న అంశాన్ని నిర్ధారించే కోణంగా పరిగణించాలెమో!
* * *
Comments
Post a Comment