మనుగడలో హింస

 మనుగడలో హింస

-శృంగవరపు రచన



నేటి సినీ ప్రపంచంలో వైవిధ్యత అన్ని అంశాలకు విస్తరిస్తుంది. ఒకప్పుడు హారర్ సినిమాలు అంటే కేవలం సూపర్ నేచురల్ పవర్స్ మరియు మనిషి కల్పనకే సొంతమైన కథల చుట్టూ తిరిగేవి.కానీ అదే హారర్ వర్గంలో మన చుట్టూ ఉన్న క్రిమికీటకాదులను సైతం హారర్ ఎలిమెంట్స్ గా మార్చే శైలి కూడా హారర్ వర్గంలోకి ప్రవేశించింది.మిడతల వల్ల ఆఫ్రికా మరియు కొన్ని ఆసియా దేశాల్లో పంటలకు ఎంత నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయో గతంలో అందరికి తెలిసిందే.పంట నాశనం చేసిన మిడతలను తమ ఆహారంగా,తమ పశువులకు ఆహారంగా మార్చుకునే జీవన విధానం కూడా ఆఫ్రికా దేశంలో ఉంది.దానికి కారణం మిడతల్లో హై ప్రోటీన్ ఉంటుంది. కానీ తర్వాత పంటలకు వాడిన పురుగుమందుల వల్ల మిడతలను తినడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధనలు స్పష్టం చేశాయి. అటువంటి మిడతలను హారర్ ఎలిమెంట్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఫ్రెంచ్ హారర్ సినిమానే ‘ద స్వార్మ్.’
వర్జిన్ అనే స్త్రీ తన కూతురు లారా మరియు కొడుకు గాస్టన్ తో ఫ్రాన్స్ లోని పల్లె ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది.ఆమె భర్త బ్రతికి ఉన్నప్పుడూ గొర్రెల పెంపకంతో బ్రతికిన వారి జీవితాలు అతని మరణంతో అతలాకుతలం అయిపోతాయి. హై ప్రోటీన్ ఉన్న మిడతల పెంపకం ఉన్నప్పటికి,వాటి వల్ల ఎక్కువ లాభం లేదు. లారా కాలేజీలో చదువుతూ ఉంటుంది.ఆమె క్లాస్ మేట్స్ ఆమె తల్లి చేసే మిడతల పెంపకం గురించి ఎగతాళి చేస్తూ ఉంటారు.
మిడతలు ఎక్కువగా పునరుత్పత్తి చేయకపోవడం వల్ల వాటి వల్ల లాభాలు తగ్గుతూ ఉంటాయి. ఆ తర్వాత వర్జిన్ మిడతలు రక్తం తాగడం ద్వారా బాగా పెరుగుతాయని తెలుసుకుంటుంది. అందుకని రక్తం కొనుగోలు చేసి వాటి ఆహారంతో పాటు పెడుతుంది. దాని వల్ల అవి ఎక్కువ పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. ఓ సారి వర్జిన్ బయటకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఉన్న లారా ఆ మిడతలు చేసే శబ్దానికి విసుగు చెంది మిడతల నివాసంగా ఉన్న గ్రీన్ హౌస్ ను ధ్వంసం చేయడంతో దండుగా బయటకు వచ్చిన మిడతలు బయట కారులో కూర్చుని ఉన్న గాస్టన్ మీద పడతాయి.అతనితో పాటు అక్కడే అతను పెంచుకుంటూ ఉన్న గొర్రె పిల్ల మీద పడతాయి. కాసేపటికి వాటి బెడద తగ్గాక గాస్టన్ అప్పుడే ఇంటికి వచ్చిన తల్లికి జరిగింది చెప్తాడు. జరిగింది గ్రహిస్తుంది వర్జిన్. ఆ తర్వాత గొర్రె పిల్ల రక్తం అంతా పిలుస్తూ ఉన్న మిడతలు ఆమెకు కనిపిస్తాయి. కొడుకు బాధ పడతాడని భావించిన వర్జిన్ ఆ విషయం అతనికి చెప్పదు.
మిడతల పెంపకానికి ఇంకొన్ని గ్రీన్ హౌసులు తయారు చేయిస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు రక్తం సప్లై దొరకదు. అందుకని ఓ రాత్రి పక్కింటి కుక్క ఆ దగ్గరకు వస్తే దానిని మిడతలకు ఆహారంగా వేస్తుంది. ఆ తర్వాత అక్కడికి కొంత దూరం లో ఓ ఆవును చంపి దాని రక్తం మిడతలకు ఆహారంగా ఇస్తుంది. ఆ తర్వాత కూతురికి ఓ స్కూటి బహుమతిగా ఇస్తుంది. కొడుకుకు సాసర్ క్యాంపుకు వెళ్ళాలని ఎప్పటి నుండో కోరిక.అతన్ని కూడా అక్కడికి పంపిస్తుంది. తమ్ముడిని క్యాంపు బస్ ఎక్కించి ఇంటికి వచ్చిన లారాకు తల్లి కనిపించదు. తల్లి మిడతలకు తన రక్తాన్ని ఇవ్వడం చూసి షాకై భయపడుతుంది లారా. వర్జిన్ కు మిత్రుడు మరియు ఆ కుటుంబానికి ఆప్తుడు అయిన కరీం కు లారా కాల్ చేస్తుంది. తల్లి ప్రవర్తన వింతగా ఉందని చెప్తుంది. వర్జిన్ ను ,లారా ను ఇంటికి డిన్నర్ కు ఆహ్వానిస్తాడు కరీం.
తల్లీకూతుర్లు కరీం ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో తప్పిపోయిన కుక్కను వెతుక్కుంటూ వర్జిన్ ఇంటికి వస్తాడు కుక్క యజమాని. అతను మిడతలు ఉన్న గ్రీన్ హౌస్ లోకి ప్రవేశిస్తాడు. లోపల గ్రీన్ బ్యాగ్స్ లో ఉన్న మిడతలను అతను కదిలించడంతో అవన్నీ అతని మీద పడి అతని రక్తాన్ని త్రాగుతాయి.అతను మరణిస్తాడు.
కరీం వర్జినాను,లారాను ఇంటి దగ్గర దింపుతాడు. మిడతల గురించి,తల్లి గురించి అనుమానంగా ఉందని లారా చెప్పిన మాటలు గుర్తొచ్చి గ్రీన్ హౌస్ లోకి వెళ్తాడు.అక్కడ శవమై ఉన్న మనిషిని చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్ధం చేసుకుంటాడు. వెంటనే పెట్రోల్ పోసి ఆ గ్రీన్ హౌసులను తగలపెడతాడు. వర్జినా అడ్డుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ మంటల్లో నుండి బయటకు వచ్చిన మిడతలు వర్జినా ఇంటి మీద దాడి చేస్తాయి.లారాను కాపాడే ప్రయత్నంలో కరీం మరణిస్తాడు.లారా అడవిలోకి పరిగెత్తి అక్కడి నుండి దగ్గరలోని నదిలో ఉన్న పడవ కింద ఉంటుంది మిడతల నుండి తప్పించుకోవడానికి.అయినా సరే ఆమెను వెంబడిస్తాయి. కూతురిని కాపాడుకోవడానికి రక్తం వచ్చేలా గాయం చేసుకుని మిడతలను ఆకర్షిస్తుంది వర్జినా. కూతురిని కాపాడుకుని గాయాలతో వర్జినా బయటపడటంతో సినిమా ముగుస్తుంది.
మనిషి బ్రతకడానికి హింస తప్పనిసరి అయితే అది చేయడానికి మనిషి వెనుకాడడు.ఈ సినిమాలో వర్జినా మొదట మిడతలకు గడ్డి పెట్టేది. ఆ తర్వాత అవి రక్తం ద్వారా ఎదుగుతాయని తెలుసుకుని వాటికి రక్తం అలవాటు చేసింది. అవి ఆ క్రమంలో ప్రిడేటర్స్ గా మారిపోయాయి. తన మనుగడ కోసం ఆమె ఆ పని చేసినా అది ఆమెను పరోక్ష హంతకురాలిని చేసింది. ఇందులో మనుగడ ఉంది అనుకోవచ్చు,హింస ఉందని అనుకోవచ్చు. పరిస్థితులు,పేదరికం మధ్య యుద్ధంలో మార్గం ఒకటే హింసగా మారే పరిణామంగా కనబడితే అది తప్పో,ఒప్పో అన్నది మనిషిగా కాదు పరిస్థితుల సాక్షిగా నిర్ణయించాల్సిందే.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!