సర్దుబాట్ల సంసారాలు

 సర్దుబాట్ల సంసారాలు

-శృంగవరపు రచన






మానవ సంబంధాల్లో మంచితనం,స్వార్ధం వంటి అంశాలు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా తలెత్తుతాయి.భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు,శాశ్వతమైన బంధం వారి మధ్య ఉందనుకున్నా,వారు అలా ఉండటానికి ప్రేమ ముఖ్య పాత్ర పోషించవచ్చు లేకపోతే అభద్రత,సామాజిక గౌరవాన్ని నిలుపుకోవటం వంటివి కూడా ముఖ్యపాత్రలు పోషించవచ్చు.ప్రేమ మాత్రమే ఉందనే భావన ఉన్నంత కాలం భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు.అలా కాకుండా తమ మధ్య కూడా ఇంకేవో అవసరాల అనుబంధాలు పెనవేసుకున్నాయి అని తెలిసినప్పుడు భార్యాభర్తల సంఘర్షణ ఎలా ఉంటుందో స్పష్టం చేసే నవలే అల్లూరి గౌరీలక్ష్మి గారి ‘అంతర్గానం.’
సుజాత,భావన అక్కాచెల్లెళ్ళు. సుజాత పదవ తరగతితో చదువు ఆపేస్తుంది.ఆమె భర్త రామం,ఇద్దరు ఆడ పిల్లలు.వారితోనే అత్తామామలు ఉంటారు.మొత్తం ఆరుగురు రామం ఒక్కడి జీతం మీద జీవిస్తారు.రామం భార్య చేత చదివించి ఏదో ఒక ఉద్యోగం చేయిస్తే ఆమె సంపాదన కూడా కుటుంబం నడపటానికి సహకారంగా ఉంటుందని భావించి ఆమెను ఎంత ప్రోత్సహించినా ఆమె ఆసక్తి లేక చదవలేదు. రామం కూడా సంపాదన లేకుండా ఉన్న భార్యను కొన్ని సార్లు అవహేళన చేస్తూ ఉన్నా,సుజాత ఆ విషయాన్ని పట్టించుకోదు.
భావన చదువుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తుంది.ఆమె భర్త హరి.వారికి ఒక కొడుకు టింకు.హరి తల్లి ఎక్కువగా కొడుకు దగ్గర కొంతకాలం కూతురు దగ్గర కాలం గడుపుతూ ఉంటుంది.హరి పొదుపరి.భావన సంపాదించినా జీతం అంతా ఖర్చులకు ఉంచుకుని మొత్తం అతనికి ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు అతని పొదుపులో ఉన్న పీనాసితనం భావనను ఇబ్బంది పెడుతున్నా,అది తప్ప భర్తలో ఏ లోపం లేకపోవడం వల్ల సర్దుకుపోతూ ఉంటుంది.
భావన స్నేహితురాలు ప్రియ.ఆమె ప్రేమించి రమణను వివాహం చేసుకుంటుంది.కానీ బంధంలోని ఎమోషన్స్,ఫీలింగ్స్ లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి రమణ.కేవలం తన వృత్తి,సంపాదన తప్ప ఇంకా ఏ ఎమోషన్ లేని వాడు.వారిద్దరూ ఒకరికొకరు సరిపడక విడిపోతారు.ప్రియ బ్యాంక్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది.హైదారాబాద్ కు ఆమెకు బదిలీ అవ్వడంతో ఆమెకు ఓ అద్దె ఇల్లు చూస్తుంది భావన. ఈ ముగ్గురి స్త్రీల జీవితాలను ఆర్థిక,ప్రేమ కోణాలను వివిధ సందర్భానుసారంగా ఈ నవల స్పష్టం చేస్తుంది.
సుజాత కుటుంబం కోసం భర్త నుండి డబ్బు తీసుకుని టెయిలరింగ్ నేర్చుకుంటుంది. ఆ తర్వాత కుట్టు మిషన్ కొంటుంది.ఆమె కూడా సంపాదిస్తూ ఉంటుంది. భర్త ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేశాక కొంత తానే అత్తతో కలిసి చిట్టీలు కడుతూ పొదుపు చేస్తుంది. భార్య సంపాదన పూర్తిగా తన చేతికి ఇవ్వడం లేదనే బాధ రామంకు ఉంటుంది.అంతకుముందు తాను చెప్పినట్టు చేస్తూ,తాను ఆర్థికంగా ఏ నిర్ణయం తీసుకున్నా గొప్పగా చూసే భార్య ఇప్పుడు అలా చూడలేకపోవడం,బాగా బిజీ అయిపోవడంతో ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి.
భావన,సుజాతలకు తండ్రి లేదు.తల్లి మాత్రమే ఉంది. తాను ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల అమ్మను అక్క దగ్గరకు పంపినా ఖర్చులకు డబ్బు పంపేది భావన. ఆ డబ్బు ఖర్చు హరికి నచ్చేది కాదు. వారి తల్లికి ఆరోగ్యం బాగోలేదని భావనకు ఫోన్ వస్తుంది.హరి తల్లికి ఓ రూలు,తనకో రూలు ఏంటని ఆలోచించి తల్లిని తన దగ్గరకు తీసుకువచ్చి ఐదు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తుంది.ఆ పని హరికి నచ్చదు. ఆ తర్వాత హరికి ప్రమోషన్ వస్తుంది. అదే సమయంలో హరి తల్లికి అనారోగ్యం రావడంతో ఆమెకు కూడా ఖర్చు అవుతుంది. ఈ అప్పులు ఎప్పుడూ తీర్చాలా అని సతమతమై బాధపడతాడు హరి.
ప్రియా బ్యాంకులో ఆమె కొలీగ్ రవి.వారిద్దరి మధ్య క్రమక్రమంగా ఇష్టం పెరిగి ప్రేమగా మారుతుంది. రవికి అప్పటికే పెళ్ళి అయిపోయినా వారిద్దరూ రెండో పెళ్ళి చేసుకుంటారు. రవికి మేనమామ కూతురు దుర్గతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు అప్పటికే.దుర్గ కూడా ఆ పెళ్ళికి అయిష్టంగానే ఒప్పుకుంటుంది. మొదట్లో ఇది బానే ఉన్నా రవి ఇంట్లో అసంతృప్తులు,గొడవలు మొదలవుతాయి.
దుర్గకు ఆర్థిక అభద్రత వల్ల భర్త రెండో వివాహానికి ఒప్పుకున్నా, అంతర్మథనం మొదలై ఆమె కూడా చదువు సాగిస్తూ ఉంటుంది. సుజాత ను రామం అర్ధం చేసుకోవడం,భావన భర్త హరికి అనారోగ్యం వచ్చినప్పుడు భావన తల్లి డబ్బు సర్దడం వల్ల హరి తన తప్పులు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియ తన జీవితం తాను గడుపుతూనే రవిని ప్రేమిస్తూ ఉండటం వరకే పరిమితమై అతన్ని సొంతం అనే భావనా నుండి దూరంగా ఉంచడం,ఆమె గర్భవతి అవ్వడం,బిడ్డను కనాలనుకోవడంతో నవల ముగుస్తుంది.
ఆర్థిక భద్రత అవసరాలను తీర్చడమే కాదు,మనిషికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల బంధంలో భర్తలు భార్యలు తమను ప్రేమించడం,గౌరవించడం కచ్చితంగా వారు చేయాల్సిన విధిగా భావించే సందర్భాలు ఎక్కువ. వారు కూడా ఆర్థిక అంశాల్లో భాగస్వాములైతే వారి నిర్ణయ శక్తిని హర్షించే పరిస్థితులు కష్టమవుతాయి. ఇప్పటికీ పరిస్థితులు మారి ఉండవచ్చు,కానీ భార్యా తన తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుంటే హర్షించే భర్తల సంఖ్య మాత్రం తక్కువే.
స్త్రీకి విద్య లేదా ఏదో ఒక నైపుణ్యం ఉండటం చాలా అవసరం. ప్రేమలో పరస్పర గౌరవం లేనప్పుడు ఆ ప్రేమకు విలువ ఉండదు.ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కష్టాలు ఏవైనా చికాకు పెట్టినప్పుడు భార్యల మీద ఆ కోపం చూపించడం కూడా కొన్నిసార్లు భార్యల నిస్సహాయతను ఊతం చేసుకోవడం వల్లే. ప్రియ విద్యావంతురాలైనా సరే వివాహితుడిని ఇష్టపడి వివాహం చేసుకుంది.ఎమోషనల్ అనుబంధం లేని రమణ లాంటి వ్యక్తితో జీవితాంతం ఉండటం కన్నా ఆ అనుబంధం ఉన్న వ్యక్తితో కొన్ని రోజులు ఉన్నా చాలని అనుకుంది.స్త్రీకి రెండో పెళ్ళి అంటే వచ్చే సంబంధాలు ఎలా ఉంటాయో అనుభవం ఉంది కనుక ఆమె అనుభవం నుండి నిర్ణయం తీసుకుని,రవితో పూర్తి అనుబంధం ఉండని పరిస్థితి ఉన్నా దానికి సిద్ధపడింది.దుర్గ భర్తపై ఆర్థికంగా ఆధారపడింది కనుక తనకు ఇష్టం లేకపోయినా భర్త పెళ్ళికి ఒప్పుకుంది. ప్రియ ఆర్థికంగా బలవంతురాలు కనుక ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఫలితాలు ఎదుర్కోగల ధైర్యం కూడా ఆమెకు కొంతమేరకు ఉంది.స్నేహితులైన భావన,సుజాతల సలహాల ఓదార్పు ఉన్నాయి.
మనుషుల నిర్ణయశక్తి,భయాలు,బలహీనతలకు మూలం వారి ఆర్థిక,భావోద్వేగ అభద్రతల నుండి కూడా జన్మిస్తాయి.అటువంటి అభద్రతలను జయించడానికి సిద్ధంగా ఉంటేనే వివాహ బంధంలో అసంతృప్తులు లేకుండా ఉంటాయి.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ