మార్పుతో పోరాటం
మార్పుతో పోరాటం
-శృంగవరపు రచన
నవలల్లో కథల విభిన్నత నేడు ఎక్కువగా కనిపిస్తుంది.నవలా సాహిత్యంలో మనస్తత్వ సంఘర్షణకు ప్రాధాన్యతను ఇచ్చే శైలి కూడా నేడు పరిపూర్ణమవుతుంది.నవలల కథల్లో ఒక్కో అంశం ఒక్కో శైలి పాఠకులను ఆకర్షిస్తుంది.ఈ మధ్య చదివిన నవలల్లో మార్పు పోరాటం గురించి అనేక కోణాల్లో వ్యక్తిగత,సమాజ,వర్గ స్థాయిల్లో అంతర్లీనంగా చొచ్చుకుపోయిన నవలగా చంద్రలత గారి ‘రేగడివిత్తులు’ కనిపించింది.’తానా’ నవలల పోటీలో బహుమతి పొందిన ఈ నవల రైతు-భూమి-సాంకేతికత మధ్య ఘర్షణాంశంగా ప్రాథమిక ప్రాధాన్యతను సంతరించుకున్నా, ఈ నవలలో మనుషులు మారలేక,మార్పుతో యుద్ధం చేస్తూ,నలిగిపోతూ,చివరకు ఇంకో మార్పులో తమకు నచ్చేలా ఇమిడిపోతూ ఉన్న జీవన చిత్రాలు ఈ నవల అంశానికి బలాన్ని చేకూర్చాయి.
మనిషికి తన ఉనికి అంటే తనకు ప్రాధాన్యత ఉన్న ప్రదేశం,తాను బ్రతకగలిగే పరిస్థితులు,తనకు సుఖంగా అనిపించే జీవితం వరకు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. ఇందులో దేనిని వదులుకోవాలన్నా మనిషి అనేకసార్లు ఆలోచిస్తాడు,తిరస్కరిస్తాడు,సంఘర్షిస్తాడు. ఇది సహజం.ఇటువంటి సంఘర్షణతో రేగడి విత్తులు ప్రారంభమవుతుంది.రామనాధం కుటుంబం ఉమ్మడి కుటుంబం.అన్న రత్తయ్య,వదిన శాంతమ్మ,వారి కొడుకు శివుడు,కూతుళ్ళు పద్మ,సరళ.రామనాధం భార్య సావిత్రి.పిల్లలు సుధాకర్,కల్యాణి.ఇక మేనకోడలు అనురాధ.అనురాధ తల్లిదండ్రులు బాల్యంలోనే మరణిస్తే ఆమెను ఈ ఉమ్మడి కుటుంబమే కన్న బిడ్డలా అక్కున చేర్చుకుంది.
ఈ ఉమ్మడి కుటుంబం చిన్న చిన్న బాధలు తప్పిస్తే సంతోషంగా ఉన్న కుటుంబం.ఇక పోతే వ్యవసాయమే జీవన ఆధారం.అందులో నష్టాలను భరిస్తూనే ఆ భూమిపై ప్రేమ వదులుకోలేక,రత్తయ్య అందులోనే మునిగిపోయాడు.వీటితో పాటు పాడి సమృద్ధిగా ఉన్న కుటుంబం.ఇక రత్తయ్య కూతుళ్ళు అత్తవారింట్లో ఉన్నారు.అల్లుళ్ళ అసమర్ధ ధోరణుల వల్ల వారు అసంతృప్తులతోనే ఉన్నారు. ఇన్ని ఉన్నా తమదైనా ప్రాంతంలో ఉన్నామన్న సంతోషం,తమవారితో జీవిస్తున్నామన్న తృప్తి ఈ కుటుంబం అంతా నిండి ఉంది.
ఈ కుటుంబంలో రామనాధం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు.వ్యవసాయం మీద ఆసక్తి కలిగిన రామనాధం ఆ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడు. రామనాధం ఈ నవలకు నాయకుడు,మార్పుకు దిక్సూచి.ఎమోషనల్ గా ఆలోచించే మనస్తత్వాన్ని మానవీయ కోణంకు మాత్రమే పరిమితం చేసుకుని,ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ మార్పు బలవంతంగా రుద్దబడక ముందే తానే మారే మనస్తత్వం ఉన్నవాడు.తాను తన ఉద్యోగ జీవితంలో ఇమడలేనని తెలుసుకున్నాక,వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాక అతను వ్యవసాయానికి అనువైన నెల గురించి ఆలోచించాడు.తమ భూమి దానికి అనువైనది కాదని తన అన్న అనుభవాల ద్వారా తెలుసుకున్న అతను,నల్ల రేగడి నేలను వేరే ప్రాంతంలో కొని,అక్కడ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.అతను ఆ నల్ల రేగడి నేలను స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దొరల్లా ఏలిన నరసింహం దగ్గర కొనడానికి బేరం కుదుర్చుకుని ఇంటికి తిరిగివస్తాడు.
అతని నిర్ణయంతో అందరూ విభేదించినా అతను మాత్రం పట్టు బట్టి,తన వాటా కింద వచ్చే భూమిని అమ్మి,అప్పు చేసి మరి నల్ల రేగడి కొని భార్యతో ఆ ప్రాంతానికి వెళ్తాడు.ఇక్కడ పూర్తిగా కొత్త ప్రాంతం,కొత్త భూమి.అప్పటి వరకు ఉమ్మడి కుటుంబంలో ఆత్మీయులతో,తెలిసిన వారితో గడిపిన ఆ దంపతులు అపరిచితుల మధ్య,ఎవరూ లేని ఆ పొలం దగ్గరే ఇల్లు ఏర్పాటు చేసుకుని,ఓ గ్రాసగాన్ని పెట్టుకుని,తాని కుటుంబంతో కలిసి ఉంటారు.రామనాధంకు ఆ నేల కొనడానికి సాయం చేసిన వ్యక్తి బాలయ్య.ఇక్కడ ఈ ప్రాంతపు ఆహార అలవాట్లకు,వ్యవహారాలకు రామనాధం కుటుంబ వాతావరణానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది.అయినా ఆ మార్పు బాధ కలిగించినా పట్టుదలతో ఆ నెలలో నష్టాలు తట్టుకుని,కడుపు కట్టుకుని,డబ్బు పంపిస్తాడు రామనాధం.అక్కడ చివరకు ఒక్కో అడుగు వేస్తూ,తడబడుతూ,నేర్చుకుంటూ,రైతుగా మారిన రామనాధం,భూమి శాస్త్రజ్ఞుడిగా కూడా మారి తాను సేద్యం చేస్తున్న భూమి సారం,అక్కడ పండే పంటలు,కొత్త పంటలు పండాలంటే అవలంభించాల్సిన పద్ధతులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ,తన చుట్టూ పక్కల ఉన్న పొలాలను చూసి నేర్చుకుంటూ,మొత్తానికి విజయం సాధిస్తాడు.అతను విజయం సాధించాక అతని నిర్ణయం మీద నమ్మకం ఏర్పడిన అతని అన్న రత్తయ్య తన కొడుకు శివుడును అతనికి సాయంగా పంపిస్తాడు.
శివుడు కూడా మార్పును త్వరగా అంగీకరించలేని మనస్తత్వం కలవాడే.కానీ మారితే మంచిది అనుకున్నప్పుడు ఆ ప్రయత్నం చేసే మనస్తత్వం ఉన్నవాడు.వరి అన్నం తినే తాను,జొన్న రొట్టెలు తినాల్సి రావడం శివుడికి నచ్చదు.యవ్వన ఉద్రేకంతో అసహనంగా కూడా ఉంటాడు.కానీ రామనాధం మీద నమ్మకం,గౌరవం ఉన్న శివుడు రామనాధం అడుగుజాడల్లో నడుస్తాడు.సావిత్రి మొదట్లో మార్పుకు ఇబ్బంది పడినా,తను ఉంటున్న ఇంటినే పూల మొక్కలతో,కూరగాయల పాదులతో అందంగా తన మనసుకు నచ్చినట్టు మలుచుకుంటుంది.
ఇకపోతే సమాజ దృష్టి నుండి చూస్తే కొందరు రామనాధం పట్ల గౌరవం చూపేవారు అయితే,ఇంకొందరు ఈర్ష్యతో వ్యవహరించే వారు.మొదటి వర్గం తాము ఆ కొత్త అడుగు వేయలేకపోయినా,వేసిన వారి పట్ల గౌరవం ప్రదర్శించే వారు అయితే,ఇంకొందరు తాము చేయాలని పని చేసి,తనను తాను నిరూపించుకున్న వ్యక్తి ప్రాముఖ్యతను అంగీకరించలేని వారు. మార్పు విజయం అయినా,అపజయం అయినా అది చూసే వారి మనస్తత్వాలకు సంబంధించినదే.
ఇక శివుడికి వివాహం అవ్వడం,అతని భార్య భారతి కూడా ఉమ్మడి కుటుంబంలో అక్కడ ఉంటే శివుడు,రత్తయ్య రామనాధంతో ఉండటం జరుగుతుంది.ఇకపోతే ఈ నవలలో ఇంకో కోణం రామనాధం తర్వాతి తరానికి సంబంధించినది .
రామనాధం కొడుకు సుధాకర్,బాలయ్య కొడుకు మల్లేశ్ ఒకే కళాశాలలో చదువుతూ ఉంటారు.అక్కడ వారికి పక్క ఇంట్లో ఉండే బిందు కుటుంబంతో పరిచయం ఏర్పడటం,బిందు కూడా వారి కళాశాలలోనే చదవడం జరుగుతుంది.బిందు కుటుంబం కథ కేవలం నాటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను స్పష్టం చేసే మేరకు మాత్రమే రచయిత్రి చిత్రీకరించారు.అప్పుడు చదువుకునే అమ్మాయిలు తల వంచుకుని వెళ్ళే రోజులు.బిందు తండ్రి ఆధునిక భావాలు ఉన్న వ్యక్తి.కూతురికి సైకిల్ కొనిస్తాడు.ఆమె సైకిల్ మీద వెళ్ళడం,ధైర్యంగా ఉండటం నచ్చని మగ పిల్లలు చేసే పనులు,చివరకు గొడవల వల్ల మల్లేశ్ వాళ్ళు ఇంటికి,బిందు కుటుంబం కూడా తమ ఊరికి వెళ్లిపోవడంతో బిందు పాత్ర కనిపించకుండా పోతుంది.ఈ పాత్ర చిత్రణల ద్వారా అమ్మాయిల పరిస్థితులనే కాకుండా దొరతనం ప్రదర్శించే వారసత్వం గురించి కూడా నరసింహం కొడుకు భూపాల్ ద్వారా రచయిత్రి స్పష్టం చేశారు.
మల్లేశ్ చదివే కాలేజీలోనే నరసింహం దొర కొడుకు భూపాల్ చదువుతున్నాడు.తండ్రి నుండి అందరినీ బానిసలుగా తనను వారికి నియంతగా భావించుకునే భావజాలాన్ని పొందిన నరసింహం మల్లేశ్ తో అలానే ప్రవర్తించడం,విద్య కూడా మనిషిలో ఉన్న అహంకారాన్ని పోగొట్టలేదని స్పష్టం చేస్తుంది. మనిషి విద్యా లక్ష్యాన్ని తెలుసుకోకుండా ఓ అర్హతగా పరిగణించి చదివితే ఆ విద్యకు ప్రయోజనం ఉండదని ఈ నవల స్పష్టం చేస్తుంది.
ఇకపోతే అనురాధ,కల్యాణి కూడా చదువుకుంటున్నారు.అనురాధను బాల్యం నుండి సుధాకర్ కు ఇచ్చి వివాహం చేయాలని ఆ కుటుంబం అంతా అనుకుంది.సుధాకర్ కూడా అనురాధ మీద అవే ఊహలు పెంచుకున్నాడు.కానీ అనురాధ మల్లేశ్ ను ఇష్టపడుతుంది.అదే విషయం రామనాధంకు చెప్తుంది.రామనాధం కుటుంబంలో మేనరికంగా ఓ సంప్రదాయంగా ఉంది.శాస్త్రియంగా అది తప్పని రామనాధం అప్పటి వరకు ఆలోచించలేదు.అనురాధను కోడలుగా చేసుకుందామనే అప్పటి దాకా అనుకున్నాడు.కొడుకు ఆమె మీద పెట్టుకున్న ఆశలు అతనికి తెలిసినవే.కానీ అనురాధకు ఇష్టం లేని వివాహం చేయడం,ఆమెకు ఈ వివాహం ఇష్టం లేదని చెప్పడం అతనికి ఇష్టం లేదు.అందుకనే దానిలో ఉన్న మంచి చెడులు ఆలోచించి శాస్త్రీయ కోణం గురించి చెప్పి,కుటుంబాన్ని ఒప్పించి మల్లేశ్ తో అనురాధ వివాహం జరిపిస్తాడు.
ఈ వివాహం వల్ల సుధాకర్ మనస్తత్వంలో మార్పు వస్తుంది.అతను తండ్రి పట్ల నిరాసక్తత,ఓ రకమైన విముఖత పెంచుకుంటాడు. తర్వాత సుధాకర్ గీతను వివాహం చేసుకుంటాడు.సుధాకర్ ఊహలకు తగ్గట్టు లేని గీతతో అతను సర్దుకుపోతూ ఉంటాడు.గీత వుమ్మడి కుటుంబంలో తన హక్కును ప్రదర్శిస్తూ ఏ పని చేయకుండా తనకు నచ్చినట్టు ఖర్చుపెడుతూ ఉంటుంది ఉమ్మడి ఆస్తిని.భారతి తన కూతురు ధాత్రి,గీత కూతురు,ఇంకా పద్మ,సరళ పిల్లలందరిని చూసుకుంటూ ఉంటుంది.
ఈ నవలలో మార్పుతో పోరాటం చేసిన ఇంకో పాత్ర అనురాధ.వివాహం తర్వాత ఆమె ఆహార వ్యవహారాల్లో ఎన్నో మార్పులు ఉండటం,ఆమెకు పిల్లలు పుట్టలేదని అత్త నిందించడం,అనురాధాకు నచ్చని ఎన్నో పనులు ఆమె అత్త పిల్లల కోసం చేయించడం,ఉద్యోగం కోసం మల్లేశ్ వేరే చోట ఉండటం,ఈ పరిస్థితులు అనురాధాను కొన్నిసార్లు ఆమెను ఆమె తక్కువ చేసుకునేలా చేస్తాయి.కానీ అనురాధ తర్వాత గర్భవతి అవుతుంది.రామనాధం కుటుంబం ఆమెకు ప్రసవానికి తీసుకురావడం,ఆమె మానసిక స్థితిలో నమ్మకం,సంతోషం ఉండటం ఆమె స్వయంగా గమనించి,మారుతుంది.
ఇక వ్యవసాయపరంగా రామనాధం విజయం సాధించడంతో పాటు అందరూ ఆ దారిలో పయనించేలా చేయడంతో ఆ ఒక్క గడప ప్రాంతం యాభై గడపలకు పెరుగుతుంది. రామనాధం పట్టి పంటలో లాభనష్టాలు గమనించి,హైబ్రిడ్ విత్తనాలు వాడి,పంట దిగుమతి పెరిగేలా చేసి,అక్కడ పట్టి వేయడానికి భయపడే రైతుల్లో ధైర్యాన్ని కలిగిస్తాడు. ఆ ప్రాంతం కూడా రామనాథం పేరు మీద రాంనగర్ గా మారుతుంది.
రామనాధం స్వయంగా రేగడి సీడ్స్ పేరుతో విత్తనాలు ఉత్పత్తి చేస్తాడు.అనురాధ,మల్లేశ్ కూడా వ్యవసాయంలోకి దిగుతారు. విజయం సాధిస్తారు.అనురాధ అత్త ఆమెను కోడలుగా కాకుండా అనురాధగా గుర్తించి,గౌరవిస్తుంది.
ఇకపోతే ఈ నవలలో ఇంకో పాత్ర దస్తగిరి.రైతులకు విత్తనాలు అమ్ముతూ నాసి రకం విత్తనాలు రైతులకు ఇచ్చి వారి చావుకు కారణమవుతాడు.మళ్ళీ అతను తర్వాత రైతుల పొలాలు అమ్మిపెట్టడం,ఆ ప్రాంతంలో ధనవంతుడిగా మారడం జరుగుతుంది.దస్తగిరి తన గురించి మాత్రమే ఆలోచించుకునే పాత్ర.అతనికి ఏ పరిస్థితులు ఎదురైనా సరే తన లాభానికి తగ్గట్టు మలచుకోగల శక్తి ఉంది.అది ఎవరికి హాని కలిగించినా,దానిని పట్టించుకోకుండా,మనుషుల బలహీనతల మీద వ్యాపారం చేస్తూ ఎదిగే వ్యక్తిత్వం అతనిది. ఈ మార్పులో వ్యక్తి స్వార్ధం,తన పనులకు బాధ్యత వహించని నిర్లక్ష్యం ఉంది.
ఈ దస్తగిరి పాత్రను పోలిన పాత్రలే శివుడు బావలవి కూడా.సరళ,పద్మ భర్తలు రామనాధం,రత్తయ్య బాగుపడటం గమనించి వారి మీద వాలిపోతే,వారి పొలాన్ని కూడా రామనాధం కుటుంబమే పట్టించుకుంటూ ఉంటే వారు మందు-మగువ వ్యసనాల బారిన పడి పొలంలో ఉండే మందులను అమ్ముకోవడం,ధాన్యం,సరుకులు పక్క దోవ పట్టించడం చేస్తారు. రాంనగర్ అభివృద్ధి చెందడం వల్ల అక్కడ సారాకొట్లు,వ్యభిచారం కూడా వ్యాపారాలుగా మారిపోయాయి.దాని ప్రభావం కూడా ఈ పాత్రలపై ఉంది.
తన అక్కలను బాధ పెడుతున్న బావలను కొట్టినందుకు,పట్టించుకొనందుకు శివుడి మీద,భర్తలను సమర్ధించని రామనాధం మీద కోపాన్ని పెంచుకున్న పద్మ,సరళలు ఆ కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటారు.కల్యాణి డాక్టర్ అవుతుంది.ఇంకో డాక్టర్ తో వివాహం చేస్తారు.సరళ,పద్మలు తమను కల్యాణి లా చదివించకపోవడం వల్లే తమ జీవితాలు ఇలా ఉన్నాయని నిందిస్తారు.తమ అసమర్ధతలను పక్క వారి లోపంగా స్పష్టం చేసే పాత్రలు ఇవి.
ఇదే నవలలో భారతి,శివుడు పాత్రలు ముఖ్యమైనవి.మార్పు కన్నా కూడా పరిస్థితులకు తగ్గట్టు పని చేస్తూ,ఆత్మీయతలకే ప్రాధాన్యత ఇస్తూ నిస్వార్ధంగా ఉన్న పాత్రలు ఇవి.భారతి తనకున్న అసంతృప్తులను శివుడికి చెప్పడంలో మనకు భారతి పాత్ర తనకంటూ ఓ ఉనికి కోసం కాకుండా కేవలం కుటుంబం కోసమే ఎలా మిగిలిపోయిందో అర్ధం అయ్యేలా చేస్తుంది.
చివరకు మల్లేశ్ ట్యాగ్ చేయించిన పట్టి విత్తనాలు నకిలీ అవ్వడం,నష్టపోయిన వారికి రామనాధం నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుంది.నరసింహం అప్పటికే ఎంపీ,కొడుకును కూడా దౌర్జన్య పద్ధతుల్లో ఎమ్మేల్యే ను చేయడం,అక్కడి పొలాలను కొని చేపల చెరువులుగా మార్చాలనుకోవడం,సుధాకర్ దానిని సమర్ధించడం,రామనాధం విభేదించడం జరుగుతుంది.
మొత్తానికి పట్టు పట్టి రామనాధం మరలా ఇంకో కొత్త పంట అయినా పొద్దుతిరుగుడు వెయ్యడం,నరసింహం మనుషులు పంట నాశనం చేయడం,అయినా నిరుత్సాహ పడక తాను నిరంతర విద్యార్ధి,అన్వేషికుడిగా ఉండాలని రామనాధం నిర్ణయించుకుని సాగిపోవడం,అతనికి శివుడు అండగా ఉండటంతో నవల ముగుస్తుంది.
మనుషులకు కష్టాల నుండి సాధించాలన్న తపన వస్తుంది. ఆ తపన తర్వాత అపజయాలు,విజయాలు.కొన్నాళ్ళకు వాటికి అలవాటు పడ్డాక కొన్ని అసంతృప్తులు,మరలా కష్టాలు. ఈ వలయం మనిషి జీవితసూత్రానికి ముడిపడి ఉన్న అంశం. ఈ క్రమాన్ని ఊహించి,తనను తాను దానికి తగ్గట్టు మార్చుకోగలిగేవాడే జీవితంలో మార్పుతో సావాసం చెయ్యగలడు.
ఈ నవలలో చంద్రలతగారు వ్యవసాయ వాతావరణాన్ని,శాస్త్రియంగా వచ్చిన మార్పులను,రైతుల జీవితంలో ఉండే బాధలను,ఉమ్మడి కుటుంబాల్లో తలెత్తే సంకుచిత మనస్తత్వాలను,మనుషులు మార్పుతో ఇమడలేక బాధ పడే పరిస్థితులను,దాని వల్ల జీవితాన్ని నిస్సారంగా మార్చుకునే క్రమాన్ని ఎంతో చక్కగా చిత్రీకరించారు.
* * *
Comments
Post a Comment