దేశాలు -పౌరులు

 దేశాలు -పౌరులు

-శృంగవరపు రచన



దేశాల మధ్య ఘర్షణలు పౌరులను ఎలా ఇబ్బందులు పడవేస్తాయో స్పష్టం చేసే సినిమానే ‘నో ఎస్కేప్.’ ఓ పేరు లేని సౌత్ ఈస్ట్ ఏసియన్ దేశం ప్రధాన మంత్రి అమెరికాకు చెందిన వాటర్ క్లీనింగ్ సిస్టమ్స్ సంస్థ కార్డిఫ్ ప్రతినిధితో ఒప్పందం చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. దీనికి వ్యతిరేకమైన ఆ దేశలోని రెబల్స్ కూప్ చేసి ఆ ప్రధానమంత్రిని హత్య చేస్తారు.దీనితో ఆ దేశంలో గందరగోళం ఎక్కువవుతుంది.
ఈ ఘర్షణలో నలిగిపోయిన ఓ కుటుంబం,ఆ ఘర్షణ పరిస్థితులను ఈ సినిమా స్పష్టం చేస్తుంది.ఈ సంఘటన జరగడానికి 17 గంటల ముందు కార్డిఫ్ సంస్థలో కొత్త ఉద్యోగి జాక్,తన భార్య అని,మరియు ఇద్దరు కూతుర్లు లూసి,బ్రీజ్ లతో కలిసి సంతోషంగా కొత్త జీవితం మీద ఆశలతో అమెరికా నుండి ఈ పేరు లేని దేశానికి వస్తాడు.
అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ సంస్థ తరపున ఎవరూ రారు.కానీ ఆ సమయంలోనే అతనికి విమానంలో పరిచయమైన తోటి ప్రయాణికుడైన హామండ్ వారికి హోటల్ వరకు లిఫ్ట్ ఇస్తాడు.ఆ హోటల్ లాబిలో జాక్ ను ఆహ్వానిస్తూ అతని ఫోటో సహ ఆహ్వాన పోస్టర్ ఉంటుంది.దానితో కొంతమేరకు సంతృప్తి పడి హోటల్ గదిలో ఉండి కొత్త జీవితం ఎలా ఉంటుందో అని కుతూహలంతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుటుంబం.
ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి జాక్ బయటకు వెళ్తాడు.ఆ సమయంలో అల్లర్లు చెలరేగుతాయి.అతి కష్టం మీద తప్పించుకుని హోటల్ కు వెళ్తాడు.అక్కడ రెబల్స్ అమెరికాకు చెందిన వారిని,విదేశీయులను చంపడం గమనించి,కిటికీల గుండా ఎక్కి,హామాండ్ సహాయం వల్ల తన రూమ్ కు చేరుకుంటాడు.
అతను గదిలోకి వచ్చేసరికి అతని కూతురు లూసి స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళిందని తెలియడంతో ఆమెను కాపాడి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆ హోటల్ లోని విదేశీయులంతా ఆ హోటల్ రూఫ్ పైకి చేరుకుంటారు. అప్పటికే ఎంతో మందిని రెబల్స్ హత్యలు చేశారు.
ఇక తమను ఎవరైనా వచ్చి రక్షిస్తారని వారు ఆశిస్తున్న సమయంలో హెలికాఫ్టర్ ద్వారా వచ్చి మరి అక్కడి వారిని హతమారుస్తారు రెబల్స్.ఆ సమయంలో జాక్ తన భార్యను,పిల్లలను పక్క భవనంలోకి దూకించి తన కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆ తర్వాత బట్టలు అక్కడి దేశస్థుల్లా మార్చుకుని ఓ బండి మీద అమెరికన్ ఎంబసీ దగ్గరకు వెళ్తారు.అప్పటికే రెబల్స్ దానిని కూడా ధ్వంసం చేయడం,జాక్ కుటుంబాన్ని వెంబడించడం జరుగుతుంది.
జాక్ కుటుంబం ఓ ఇంటిలో తలదాచుకుంటే కనిపెట్టి వారిని హతమార్చబోతున్న సమయంలో హామండ్ తన మిత్రుడితో వచ్చి వారిని కాపాడతాడు.ఆ తర్వాత వారికి ఓ భవనం పైన ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేసి ఉదయం వారిని ఆ సరిహద్దు దాటించాలనుకుంటాడు హామండ్.కానీ ఆ రాత్రి దాడి జరగడం,హామండ్,అతని మిత్రుడు జాక్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో మరణించడం జరుగుతుంది.
ఆ తర్వాత ఓ పడవలో వాళ్ళు ప్రయాణించే సమయంలో రెబల్స్ రావడం,కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నంలో ఉండటం,ఎలాగో తప్పించుకుని ఆ వియత్నాంలో అడుగుపెట్టడం,ఆ దేశం కాపాడటం,వారు తిరిగి అమెరికా చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది.
దేశంలో నాయకుల నిర్ణయాలు,దేశాల మధ్య స్పర్ధలు ఎప్పుడు ఆ దేశ పౌరులను కూడా దేశ చర్యలకు ఫలితాన్ని అనుభవించే పరిస్థితుల్లోకి లాగుతాయి.ఇటువంటి పరిస్థితులను చక్కగా దృశ్యీకరించిన సినిమా ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ