సెల్ ఫోన్ రహస్యాలు బట్టబయలు అయితే?
ప్రతి మనిషికి తన అభిప్రాయాల, నిర్ణయాల, ఇష్టాల విషయంలో స్వేచ్చ ఉంది.జీవిత భాగస్వామి అయినా సరే అన్ని అంశాల్లో ఏక అభిప్రాయంతో అన్ని అంశాల్లో ఏకిభవించాలని లేదు. స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు-బిడ్డల మధ్య కూడా రహస్యాలు ఉంటాయి. మనుషులకు ఆ గోప్యత అవసరం, ఎందుకంటే ఆ గోప్యతకు స్థానం లేకపోతే ప్రతి మనిషి తన జీవితంలోని ప్రతి అంశం విషయంలోనూ ఇతరులను ఒప్పించడానికో, లేక విభేదించడానికో సమయం వెచ్చించాలి. మనుషుల మధ్య ఉండే వైవిధ్య అభిరుచులు, భావోద్వేగ అనుభూతులు ఎప్పుడూ గోప్యతలోనే తమ ఉనికిని కాపాడుకోగలుగుతాయి.ఇప్పుడు ఆ గోప్యత అంతా స్మార్ట్ ఫోన్లలో నిండిపోయింది. తమ ఫోన్ విషయంలో తమ ప్రైవసీ కోరుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి. అటువంటి ప్రైవసీను ఓ ఏడుగురు స్నేహితులు ఓ రాత్రి సరదాగా గడుపుతున్న సమయంలో ఓ ఆటగా బట్టబయలు చేయాలనుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎలా వారి జీవితాల్లో రహస్యాలను బట్టబయలు చేసిందో స్పష్టం చేసే ఫ్రెంచ్ సినిమానే 'Nothing to hide.'
మేరీ, విన్సెంట్ భార్యాభర్తలు. మేరీ థెరపిస్ట్, విన్సంట్ డాక్టర్. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ చేస్తాడు. ఈ జంటకు మార్కో, చార్లెట్ దంపతులు, థామస్, లీ దంపతులు స్నేహితులు. వీరికి ఇంకో స్నేహితుడు బెన్. ఆ రోజు చంద్రగ్రహణం. ఆ రాత్రి ఈ ఏడుగురు మేరీ దంపతుల ఇంట్లో సరదాగా డిన్నర్ కు వస్తారు.
వారు సరదాగా గడుపుతున్న సమయంలో వారు ఓ ఆట ఆడాలనుకుంటారు. దాని ప్రకారం వారి సెల్ ఫోన్లు టేబుల్ మీద పెట్టాలి. వారికి వచ్చే కాల్స్, మెసేజీలు ఏవైనా సరే అందరికి తెలిసేలా స్పీకర్ మీద పెట్టి మాట్లాడాలి, మెసేజీలు గట్టిగా చదవాలి.ఈ పార్టీకి బెన్ తన గర్ల్ ఫ్రెండ్ ని అనారోగ్య కారణంగా తీసుకురాలేదని చెప్తాడు. అలా ఆటలో భాగంగా మేరికి తండ్రి నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ ద్వారా ఆమె బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకోబోతుంది అని అక్కడి వారికి తెలుస్తుంది. ఆ తర్వాత విన్సెంట్ కు కూతురు అయినా మెలిన్ కాల్ చేస్తుంది. ఆ రోజు తాను ఫస్ట్ డేట్ కు వెళ్ళబోతున్నానని చెప్పి తండ్రి సలహా అడుగుతుంది. తల్లులతో ఆడపిల్లలు ఫ్రీగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ పిల్లలు స్వేచ్చ అనేది లింగ భేదం లేకుండా తండ్రితో కూడా ఎంత ఓపెన్ గా ఉంటారో ఈ కాల్ ద్వారా ప్రేక్షకులకు అర్ధమవుతుంది.తన కూతురు డేట్ కు వెళ్తుందని ముందే ఊహించిన విన్సంట్ కూతురికి కాండోమ్స్ ఇవ్వడం, సెక్స్ ఎడ్యూకేషన్ పట్ల అవగాహన కలిగించడం, వైద్యుడిగా, తండ్రిగా విన్సెంట్ పరిణతి ఈ కాల్ లో స్పష్టం అవుతుంది. తన కూతురికి, తనకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి మేరికి అర్ధమవుతుంది. కూతురుకు, తండ్రికి మధ్య ఉండే సున్నితమైన అనుబంధాన్ని, ఎంతో సున్నితంగా ఈ కాల్ లో నిక్షిప్తం చేయడం ఈ సినిమాలో నాకు వ్యక్తిగతంగా నచ్చిన అంశం.
ఇకపోతే మార్కో బెన్ ఫోన్లు ఒకేలా ఉంటాయి. తనకు ఓ స్త్రీ రాత్రి ఫోటో పంపిస్తుందని, ఇప్పుడు ఆ విషయం తెలిస్తే తనకు, భార్యకు మధ్య అపార్ధాలు తలెత్తుతాయని అందుకోసం ఫోన్లు మార్చడానికి ఒప్పిస్తాడు మార్క్. ఇక మార్క్ ఫోన్ బెన్, బెన్ ఫోన్ మార్క్ మార్చుకుంటారు. మార్క్ ఫోన్ కు ఓ స్త్రీ ప్రయివేట్ ఫోటో పంపిస్తుంది. అది అందరూ చూస్తారు. అది బెన్ కు వచ్చింది అనుకుంటారు. ఆ తర్వాత బెన్ ఫోన్ కు జూలియన్ అనే అతను మెసేజ్ చేస్తాడు. అతను పదే పదే చేసే మెసేజీల వైఖరిని బట్టి వారిద్దరికి మధ్య గే సంబంధం ఉందని అందరికి అర్ధమవుతుంది. దానితో చార్లెట్,మార్క్ తో ఈ విషయం మీద గొడవ పడుతుంది. ఆ తర్వాత లీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మెసేజీలు చేస్తాడు, దాని మీద ఆ ఇద్దరికీ గొడవ అవుతుంది. ఆ తర్వాత థామస్ కు ఇంకో స్త్రీతో సంబంధం ఉందని కాల్ ద్వారా అర్ధం అవుతుంది. ఇక వారిద్దరూ కూడా గొడవ పడతారు. చార్లెట్ ఫెస్బుక్ లో అజ్ఞాతంగా చాటింగ్ చేయడం మార్కుకు తెలుస్తుంది. బెన్ తమ ఫోన్లు మార్చిన విషయం చెప్తాడు. తాను జూలియన్ ను తీసుకురాకపోవడానికి కారణం వారు ఇలా స్పందిస్తారనే అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కొట్టుకున్నా చివరకు అందరూ అన్యోన్యంగానే వెళ్తారు. దీనితో సినిమా ముగుస్తుంది.
మనుషులకు ఎంత సన్నిహితులు ఉన్నా, ఓ వ్యక్తిగత రహస్య జీవితం ఉంటుంది. తమ జీవితంలో తమను ఆమోదించే వారితో ఒకలా, వ్యతిరేకంచే వారితో ఇంకోలా జీవించడం మనిషి జీవితంలో ఉండే సాధారణ ప్రక్రియ. మనుషుల జీవితాలు గురించి తెలుసుకున్న కొద్ది వారి మీద జడ్జిమెంట్లు నిర్ణయించడం సహజం. తన జీవితం మీద ఎదుటి వారు చేసే పరోక్ష ప్రభావాన్ని నియంత్రించే సాధనం కూడా ఈ గోప్యత అని కొన్ని కోణాల్లో ఒప్పుకోక తప్పదు. ఏది ఏమైనా మన గురించి అన్ని అంశాలు అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎంత వరకు ఎవరికి తెలియాలో అన్న నిర్ణయం మన పరిణతి మీద ఆధారపడి ఉంటుంది.
* * * *
Comments
Post a Comment