జీవితంలో ముందుకే!

జీవితంలో ముందుకే!
-శృంగవరపు రచన




జీవితాల్లో కష్టసుఖాలు దాదాపుగా అందరికి ఒకలానే ఉంటాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనుషుల్లో ఉండే వ్యధను,మనుసులో చెలరేగే సంఘర్షణను,వారి ప్రతిస్పందనను స్పష్టం చేసే తీరులో మాత్రం ఎన్నో రకాలు ఉంటాయి. ఆ తీరుల్లోనే మనుషులను అర్ధం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా కష్టాల్లో చిక్కుకున్న మనుషులు ఎలా జీవితంలో వ్యధను అనుభవిస్తారో,వారి మనసుల్లో శూన్యత ఎలా వారిని ఒక దశ నుండి ఇంకో దశకు పయనించేలా చేస్తుందో స్పష్టం చేసే నవలే కేరళ రచయిత్రి రాసిన ‘Lessons In Forgetting.’
భారతీయ ఆంగ్ల రచయితలను ఈ మధ్యే చదువుతున్న నాకు ఒక్క నవలతోనే ఎంతో నచ్చిన రచయిత్రి అనితా నాయర్. ఈ నవలను అనితా నాయర్ 2010లో రాయగా, 2012 లో ఇదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది. ఈ నవలలో కథ సాధారణమైనదే అయినా కథలోని పాత్రల మానసిక సంఘర్షణను రచయిత్రి స్పష్టం చేసిన తీరు, కథకు అవసరం మేరకే పాత్రలను గురించి పరిచయం చేస్తూ,కథను నడిపే క్రమంలో పాత్రలను కలిపిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది.
ఈ నవలలో ఓ ముఖ్య పాత్ర మీరా. ఆమె భర్త గిరి.కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న గిరి ఓ రోజు తన భార్యను ఓ పార్టీకి తీసుకువెళ్తాడు. ఆ పార్టీ మధ్యలోనే అతను వెళ్ళిపోతాడు. మీరా,ఆమె కొడుకు నిఖిల్ ఆ పార్టీ హోస్ట్ ఆ మార్గంలోనే ఉంటున్న జాక్ కారులో ఆమె ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేస్తుంది . మీరా ఇంటికి చేరుకున్న ఆమె భర్త ఇంటికి రాడు. ఆమె భర్త రాక కోసం ఎదురు చూస్తూనే తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
మీరా తల్లి సోహా,అమ్మమ్మ లిల్లీ.మీరాకు తాత నుండి ఓ రాజభవనం లాంటి ఇల్లు ఉండటానికి లభించింది. మీరా తండ్రి ఆమె బాల్యంలోనే మరణించాడు.లిల్లీ భర్త కూడా ముందే మరణించాడు.మీరా వివాహం కాక ముందు తన తల్లి,అమ్మమ్మలతో కలిసి ఆ ఇంట్లోనే ఉండేది. పెద్దగా ఆస్తులు లేని కుటుంబం వారిది. ఓ షూటింగ్ విషయమై ఆ ఇంటి కోసం వచ్చిన గిరి మీరాను ఇష్టపడతాడు. ఆమెను ఇష్టపడ్డాడో,లేక ఆమె ఉంటున్న ఇంటిని ఇష్టపడ్డాడో అన్న అంశం మీద మీరాకు స్పష్టత రాకముందే వారి వివాహమైపోయింది. గిరి కూడా ఆ ఇంట్లో వారితో కలిసే ఉంటున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. నయనతార,నిఖిల్. నయనతారకు 19 ఏళ్ళు. నిఖిల్ కూడా దాదాపుగా ఓ రెండేళ్ళు తక్కువగా అదే వయసులో ఉన్నాడు.
ఆ రోజు ఇంటి నుండి వెళ్ళిపోయిన గిరి ఆ తర్వాత రోజు ఫోన్ చేసి తాను చెన్నైలో ఉన్నానని ఇక రాననే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తాడు. దానికి కారణం ఆమె ఆ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడమే అని గ్రహిస్తుంది మీరా. మీరా తాతయ్య ఆ ఇంటిని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. ఇంకా ఆ గడువు పూర్తవ్వడానికి 45 ఏళ్ళు పైనే ఉంది.ఆ విషయం ఎప్పుడూ మీరా చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకునేవాడు కాదు గిరి. అప్పటికే 44 లోకి ప్రవేశించింది మీరా. అప్పటికే కార్పొరేట్ భార్యల కోసం కుక్ బుక్ రాసిన ఆమె ప్రసిద్ధి పొందినప్పటికి ఆమె వివాహం విచ్చిన్నమయ్యాక ఆమె ఇంకో పుస్తకం ప్రచురించే ఉద్దేశ్యం లేదని ఆమె పుస్తకం ప్రచురించిన ప్రచురణ కర్తలు స్పష్టం చేస్తారు.మీరా తన కుటుంబాన్ని నడపటం కోసం అన్నీ ఖర్చులు తగ్గిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. సబ్ టైటిల్స్ రాసే ఉద్యోగం వస్తుంది. ఇది మీరా కథ.
ఇక ఈ నవలలో ఇంకో ముఖ్య కథ జాక్ ది. జాక్ అమెరికాలో స్థిరపడ్డ ప్రొఫెసర్. సైక్లోన్స్ మీద పరిశోధన చేస్తూ ఉంటాడు. అతని బాల్యం,అతను దాటి వచ్చిన పరిస్థితులు,కొడుకుగా అతని ప్రవర్తన,తర్వాత అతని కూతురు ప్రవర్తన,మొత్తం మీద అతని జీవితపు సంఘర్షణను బాల్యం నుండి ప్రస్తుతం వరకు రచయిత్రి ప్రేక్షకులకు స్పష్టం చేస్తుంది.
జాక్ అసలు పేరు కృష్ణమూర్తి. అతన్ని బాల్యంలో కిచా అని పిలిచేవారు. అతని తల్లి శారద. ఆమె భర్త జాక్ యుక్తవయసుకు వచ్చాక సన్యాసిగా మారడానికి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. శారద చెల్లెలు కళ. కళ తల్లిదండ్రులు శారద భర్త ఆమెను వదిలివేయడం కూడా శారద తప్పుగానే భావించారు.కళకు వివాహమైంది. కళకు పెద్ద జడ ఉండేది. అది ఎంత పెద్దది అంటే దానిని మోసేసరికి కళకు మెడ నొప్పి వచ్చేది. పెళ్లి కాక ముందు తండ్రి,పెళ్లయ్యాక భర్త ఆమె జడ ఆమెకు అనుకూలంగా కత్తిరించుకోవడానికి ఒప్పుకోలేదు.
అదే సమయంలో ఆమె అక్క కొడుకు కిచా ఆమెను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అతను వచ్చినప్పుడల్లా ఇద్దరు సముద్రం దగ్గర కాసేపు కూర్చునేవారు. కిచా పిన్ని బాధను గమనించి ఆమె జడను కొంతమేరకు కత్తిరించుకోమని సలహా చెప్తాడు. ఎవరూ గుర్తించరన్న ధైర్యంతో కొంత జుట్టును కళ కత్తిరిస్తుంది.ఆ విషయం గుర్తించిన ఆమె భర్త ఆమె తనను మోసం చేసినట్టు భావిస్తాడు.ఆమె భర్త మాత్రమే కాదు,ఆమె అత్తింటి వారందరూ కూడా ఆమె తమ కుటుంబం నమ్మకాన్ని వమ్ము చేసినట్టే భావిస్తారు. ఆమెకు తిరిగి కత్తిరించిన జుట్టు వచ్చేవరకు కూడా ఆమె భర్త ఆమెతో మాట్లాడలేదు.
ఆ తర్వాత పెళ్ళయిన ఎన్నో సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టని కారణం చేత తాను రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కళ భర్త ఆమెకు స్పష్టం చేస్తాడు.తాను రెండో పెళ్లి చేసుకున్నా సరే,తామంతా ఒకే కుటుంబంగా ఉండవచ్చని చెప్తాడు. తన గౌరవానికి భంగం కలిగినట్టు భావించిన కళ భర్తను వదిలేస్తుంది. వచ్చేసే ముందు ఆమె తన జడను కత్తిరించి భర్త చేతిలో పెట్టి వచ్చేస్తుంది. పుట్టింటికి మొదట వచ్చినా ,తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల ఆమె తన అక్క శారదతో కలిసి ఉంటుంది.
శారద ఓ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం వెతుక్కుంటుంది. ఆ తర్వాత ఆ ఉద్యోగంలో ఎదుగుతూ,ఇంకో టీచర్ ను ఇష్టపడుతుంది. జాక్ తల్లి తాను ఇంకో వ్యక్తిని ప్రేమించానని, తాను అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కొడుకుకు చెప్తుంది. తల్లితో అప్పటి నుండి జాక్ అనుబంధం మారిపోతుంది.పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన జాక్ తల్లితో తన అనుబంధాన్ని కూడా తెంచుకుంటాడు. తన తల్లి తన తండ్రి కోసం ఎదురు చూసినప్పుడు విసుక్కున్న జాక్,అదే తల్లి కొత్త జీవితాన్ని వెతుక్కున్నప్పుడు కూడా ఆమెను ఆమోదించలేకపోతాడు. ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడిన జాక్ తన తల్లి చనిపోయినప్పుడు కూడా వెళ్ళడు.
జాక్,నైనా పెళ్లి చేసుకుంటారు. వారికి స్మృతి,శృతి పిల్లలు. నైనా,జాక్ ఇద్దరు విడిపోతారు. తర్వాత జాక్ ఓ స్త్రీతో డేటింగ్ చేసినప్పుడు స్మృతి అంగీకరించలేకపోతుంది. శ్రుతి బాధ్యత నైనా,స్మృతి బాధ్యత జాక్ తీసుకుంటారు. స్మృతి స్వేచ్చ హద్దులు దాటిందని జాక్ తెలుసుకునేసరికి పరిస్థితులు చేజారిపోతాయి. గ్రాడ్యూయేషన్ ఇండియాలో చేయడానికి వచ్చిన స్మృతి ఓ యాక్సిడెంట్ జరిగి ఆమె మంచానికే పరిమితమైపోతుంది.ఆమెకు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి భారత దేశం వస్తాడు జాక్.
ఆమె స్నేహితులను కలుస్తాడు. శివం,మాథ్యూ,రోహన్ లతో ఆమె సన్నిహితంగా ఉందని తెలుసుకుంటాడు జాక్. మొదట శివంతో సన్నిహితంగా ఉన్నా ఆమె,ఆ తర్వాత మాథ్యూతో,ఆ తర్వాత రోహన్ తో సన్నిహితంగా ఉందని తెలుసుకుంటాడు. శివంను,మ్యాథ్యును కలుసుకున్న జాక్ ఆమె ఆ ఇద్దరితో సన్నిహితంగా ఉంటే వారూ దానిని ప్రేమగా భావించినా ఆమె మాత్రం అది స్నేహమని తేల్చేసి తమకు దూరమైందని స్పష్టం చేస్తాడు.
సైక్లోన్స్ మీద పరిశోధన చేస్తున్న జాక్ కు ఓ అసిస్టెంట్ అవసరం పడుతుంది. తనకు ఓ అసిస్టెంట్ కావాలని తనకు తెలిసిన వారికి చెప్పడం,మొత్తానికి ఆ అవకాశం మీరా వరకు రావడం,తనకు అప్పటికే
వచ్చిన ఉద్యోగం కన్నా కూడా దీనికి జీతం ఎక్కువని తెలుసుకున్న మీరా ఈ అసిస్టెంట్ ఉద్యోగం వైపు మక్కువ చూపడం జరుగుతుంది.
అలా జాక్ దగ్గర అసిస్టెంట్ గా మారుతుంది మీరా. మీరా భర్త విడాకుల నోటీస్ పంపుతాడు. భర్త వెళ్ళిపోయిన రోజు పార్టీలో మీరా రోహన్ అనే నటుడిని కలుస్తుంది.అతను ఫోన్ చేయడం,అతనితో సన్నిహితమవ్వడం జరిగిపోతుంది. ఆమె అతనితో కలిసి ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ కు వెళ్తుంది.అక్కడ జాక్ వారిని చూస్తాడు. ఆ తర్వాత నయనతార రోహన్ తన బాయ్ ఫ్రెండ్ అని,అతనితో తల్లి సంబంధం కలిగి ఉండటం నచ్చలేదని స్పష్టం చేయడంతో అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. మీరాతో ఉన్న రోహన్ తన కూతురికి యాక్సిడెంట్ జరిగే ముందు ఉన్నాడని గుర్తించిన జాక్ అతన్ని కలిసే ప్రయత్నం చేసినా అతను కలవడానికి నిరాకరించడంతో మీరా సాయం తీసుకుని మీటింగ్ ఏర్పాటు చేయిస్తాడు జాక్.
స్మృతి తనను ప్రేమించిందని, తనకు ఆమె ప్రేమ బరువుగా అనిపించిందని,ఆమెకు బ్రేకప్ చెప్పడానికి తాను ఆమెను తమిళనాడు తీసుకువెళ్లానని చెప్తాడు రోహన్. అక్కడ సముద్రం దగ్గర ఆమెకు చిన్న దెబ్బ తగలడం వల్ల ఆమెను అక్కడ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లానని,అక్కడ లింగ నిర్ధారణ,గర్భస్రావాలు చేస్తున్నారని తెలుసుకున్న స్మృతి ఆ విషయం బయట పెట్టడానికి పూనుకుందని,ఆమె సాయంత్రం తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిందని,కానీ ఆ రోజు మధ్యాహ్నం ఆ ఆసుపత్రి యాజమాన్యంలో కొందరు తన మీద దాడి చేశారని, అప్పుడే తాను తిరిగి వచ్చేశానని, స్మృతికి తర్వాత యాక్సిడెంట్ జరిగిందని పేపర్ లో చదివానని చెప్తాడు రోహన్.
ఆ తర్వాత ఆమె ప్రయత్నం ఆపడానికే ఆమెను సామూహిక మానభంగం చేసి,ఆమె తల మీద ఓ చెట్టు మొద్దుతో బలంగా తగిలేలా కొట్టి దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరించారని తెలుసుకుంటాడు జాక్. మీరా,జాక్ రిలేషన్ లో ఉంటారు. స్మృతిలో మొత్తానికి కదలిక వస్తుంది. జాక్,మీరాల సంబంధాన్ని మీరా పిల్లలు కూడా ఆమోదిస్తారు.గిరి కూడా ఇంకో వివాహం చేసుకుంటాడు. ఇక్కడితో నవల ముగుస్తుంది.
ఈ నవలలో గ్రీకు పురాణాల్లో హెరా తో మీరా జీవితం పోల్చడం కొత్తగా అనిపిస్తుంది. జీవితంలో మనుషులు తమకు ఎదురయ్యే కష్టాలను, దేవుళ్ళతో పోల్చుకుని ఓ రకమైన తృప్తి పొందడం చూస్తూనే ఉంటాము. ఆ కోణం నుండి మీరా పాత్రలో మానసిక సంఘర్షణను రచయిత్రి చెప్పిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది.
జీవితంలో మనుషులకు వివాహం,కుటుంబం విషయాల్లో ఎన్నో దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మానసిక సాన్నిహిత్యం లేకపోయినా పిల్లల కోసం,కుటుంబం కోసం సర్దుకుపోయేవారే ఎక్కువమంది. కానీ జీవితంలో ఊహించని మార్పులు తలెత్తినప్పుడు అక్కడితో ఆగిపోకుండా మనిషికి ముందుకు పయనించాలని,మనకు నచ్చని జీవితంలో,నచ్చని వారితో ఎక్కువ కాలం ఇమడలేమని, ఎంత త్వరగా ఆ విషయం గుర్తించి, అక్కడి నుండి తన జీవితాన్ని తాను నిర్మించుకోవడం మొదలు పెడితే అంత మంచిదని ఈ నవల స్పష్టం చేస్తుంది.
జీవితంలో ఏ దశలో ఉన్నా సరే,మనిషి సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టవచ్చని జాక్,మీరా జీవితాలు స్పష్టం చేస్తాయి. మనిషి జీవితంలో ఒక్కో దశలో ఉన్నప్పుడూ ఒక్కోలా ఆలోచిస్తాడని, పి‌ల్లలుగా ఉన్నప్పుడు అంగీకరించలేని విషయాలు ఎన్నో పెద్దలుగా మారాక పరిస్థితులను అర్ధం చేసుకునే శక్తి పెరగడం వల్ల, వాటిని అంగీకరించి,ఆమోదించే దృక్కోణం ఏర్పడుతుందని కూడా ఈ నవల స్పష్టం చేస్తుంది. జీవితంలో సెకండ్ ఛాన్స్ ఎప్పుడు మనుషులకు స్వాగతం పలుకుతుందని కూడా ఈ నవల స్పష్టం చేస్తుంది. ఎన్నో చెప్పలేని మానసిక గందరగోళాలకు కూడా ఈ నవలలో పాఠకులకు ఓదార్పు లభించిన భావన కూడా కలుగుతుంది.

*    *      * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!