ఎవరు ?

 ఎవరు ?

-శృంగవరపు రచన




అమెరికన్ థ్రిల్లర్ రచయితల్లో హార్లెన్ కోబెన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రెంజర్ తో సంచలనం సృష్టించాడు. ఇన్నోసెంట్ ,ఇంటూ ద వుడ్స్ లాంటి ఎన్నో థ్రిల్లర్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన కోబెన్ కథ చెప్పడంలో,ఎన్నో మలుపులు ఉండేలా కథను మలచడంలో సిద్ధహస్తుడు .కోబెన్ ‘ఫూల్ మీ వన్స్’ లో కథను నడిపే శైలి,క్రైమ్ మోటివ్ ను సమన్వయపరచడానికి వినూత్న శైలిలో కథను నడపటం ఆ నవలను చదివింపజేస్తాయి.
ఈ నవలలో ప్రధాన పాత్ర మాయ.ఆమె స్పెషల్ ఆపరేషన్స్ పైలెట్. ఈ నవల ఆరంభంలో మాయ భర్త జోను ఎవరో మాయ ముందే హత్య చేయడం,ఆమెకు ఆ జ్ఞాపకాలు వస్తూ ఉండటం,ఆమె భర్త ఫ్యూనరల్ లో ఉండటం జరుగుతుంది. జో కుటుంబం పెద్దది.ఎన్నో వ్యాపారాలు ఉన్న కోటీశ్వరుల కుటుంబం.అత్తింటి వారు రమ్మని పిలిచిన మాయ వద్దని సున్నితంగానే స్పష్టం చేస్తుంది. జో మరణించక ముందు మాయ అక్క క్లెయిరీ కూడా హత్యకు గురవుతుంది.ఆ సమయంలో మాయ యుద్ధంలో ఉంటుంది. మాయ యుద్ధ సమయంలో సైనికులను కాపాడే క్రమంలో ఇద్దరు పౌరులను కాపాడలేకపోతుంది. ఆ పశ్చాత్తాప భావన ఆమెను వెంటాడుతూ ఉంటుంది.
జో తల్లి జుడిత్. తమ్ముడు నీల్ ,చెల్లెలు కరోలిన్.ఇది మాయ అత్తింటి కుటుంబం. ఇక క్లెయిరీ భర్త ఎడ్డి,కూతురు అలెక్సా, కొడుకు డేనియల్. మాయ కూతురు లిల్లీని ఇసాబెల్ అనే ఆయా చూసుకుంటూ ఉంటుంది. ఇసాబెల్ కుటుంబం అంతా కూడా జో కుటుంబంతో పని చేసిన వారే. మాయ స్నేహితురాలు ఈలిన్. ఆమె మాయ ఇంట్లో ఉండదు కనుక జాగ్రత్త కోసం నానీ కెమెరా ఆమె ఇంట్లో పెడుతుంది.
ఇక నవలలో ఎన్నో మలుపులు ప్రతి పేజీలోని పాఠకుల కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. జో తమ్ముడు యాండ్రు కూడా 16 ఏళ్ల క్రితం ఓ పార్టీ సమయంలో సముద్రంలోకి పడి మరణించాడు. అంతే కాకుండా క్లెయిరీ,జో ఒకే గన్ లోని బులెట్స్ వల్ల మరణించారు. కనుక వీరిద్దరిని చంపింది ఒకరే అని భావిస్తారు.
క్లెయిరీ చనిపోయే ముందు ఇంకో ఫోన్ ద్వారా చేసిన కాల్ ద్వారా కోరికి ఆ కాల్ చేసిందని కనుక్కుంటుంది. కోరి రహస్యాలను సాక్ష్యాలతో సహ బయట పెట్టే వెబ్ సైట్ నడుపుతున్నాడు. మాయ ఆడియో రికార్డింగ్ లో ఆమె పౌరులను కాపాడలేకపోవడం ఉన్న టేపు సగం విడుదల చేస్తాడు. మిగిలిన సగం సమయం వచ్చినప్పుడు విడుదల చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో క్లెయిరీ అతన్ని కలిసి ఆ సగం విడుదల చేయవద్దని అడుగుతుంది. జో కంపెనీలో జరుగున్న వైద్య మాఫియా గురించి వివరాలు సంపాదించమని అడుగుతాడు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే ఆమె హత్యకు గురైందని మాయకు స్పష్టమవుతుంది. దానితో పాటు ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కు, యాండ్రు హత్య జరిగినప్పుడు ఉన్న కోస్టల్ ఆఫీసర్ కు కూడా జుడిత్ కుటుంబం డబ్బులు పంపినట్టు తెలుసుకుంటుంది.
ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలోనే మాయకు తన మీద జుడిత్ కుటుంబానికి అనుమానం ఉందని నానీ కెమెరా లో ఈశాబెల్లా ప్రవర్తన ద్వారా అర్ధం చేసుకుంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో మాయకు మరికొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. యాండ్రు,జో ఇద్దరూ చదువుకుంటున్నప్పుడు వారితో పాటు థియో మారా అనే ఇంకో విద్యార్ధి కూడా ఉండేవాడని,అతను యాండ్రు క్లాస్ మేట్ అని,ఈ ముగ్గురు ఫుట్ బాల్ టీం అని ,ఈ ముగ్గురు మరణించారని తెలుసుకుంటుంది. థియో మారాను తమ్ముడు యాండ్రూ సాయంతో ర్యాగింగ్ చేసిన జో అతనికి విషం కలిపిన మద్యం తాగించి హత్య చేశాడని,తర్వాత అది యాక్సిడెంట్ గా చిత్రీకరించబడిందని స్పష్టం అవుతుంది.
ఆ తర్వాత ఆ విషయం పట్ల ఎంతో బాధ పడుతున్న తమ్ముడు వల్ల ఆ నిజం బయటకు వస్తుందని భావించిన జో యాండ్రును కూడా సముద్రంలో నుంచి తోసేసి హత్య చేశాడని తెలుసుకుంటుంది. ఆ తర్వాత తన కంపెనీలో పని చేస్తున్న క్లెయిరీ మరియు భార్య అక్క తన కంపెనీలో అవకతవకలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుందని తెలుసుకున్న జో ఆమెను మాయ యుద్ధంలో ఉన్న సమయంలో ఆమె గన్ తో షూట్ చేసి హత్య చేస్తాడు.
తన అక్కను హత్య చేసింది భర్త అని తెలుసుకున్న మాయ అతన్ని పార్కుకు ఆహ్వానించి అతన్ని హత్య చేసి,ఆ హత్య ఎవరో ఆగంతకులు చేసినట్టు నమ్మిస్తుంది. మాయ తన కూతురు లిల్లీని చూసుకోమని ఎడ్డికి,తన స్నేహితుడైన షాన్ కు అప్పగిస్తుంది. ఆ తర్వాత నిరాయుధురాలిగా జుడిత్ ఇంటికి వెళ్తుంది. అంతకు ముందే ఆ ఇంట్లో కెమెరా ఫిక్స్ చేసిన మాయ, వారు చెప్పిన నిజాలు రికార్డ్ అయ్యేలా చేస్తుంది.తానే జోను హత్య చేశానని ఒప్పుకుంటుంది.జో సోదరుడు నీల్ ఆమెను షూట్ చేస్తాడు. తాను మరణిస్తానని సిద్ధపడే ఆ నిజాలు తెలియడానికి అక్కడికి వెళ్ళిన మాయ అలా మరణిస్తుంది.కానీ తన మరణంతో జో కుటుంబంలో వ్యాపారం పేరుతో చేస్తున్న మోసాలను బయట పెడుతుంది. 25 ఏళ్ళ తర్వాత లిల్లీ వివాహం అవ్వడం,పిల్లలు పుట్టడం,డేనియల్ ,అలెక్సా లకు కూడా మంచి కుటుంబాలు ఉండటంతో ఈ నవల ముగుస్తుంది.
కోబెన్ నవలల్లో థ్రిల్లర్ ఎలా ఉండాలో అలానే ఉంది అన్న భావన ప్రతి పేజీ తిప్పుతున్నప్పుడు అనిపిస్తుంది. దాదాపు ఎన్నో కోబెన్ నవలలు ఫ్రెంచ్ సినిమాలుగాను,ఆంగ్ల మరియు స్ప్యానిష్ సిరీస్ గాను వచ్చాయి. థ్రిల్లర్ ఎలిమెంట్ లో ఎక్కడా బోర్ కొత్తకుండా రాయగల సమకాలీన రచయిత కోబెన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!