విద్య-ధనదాస్యం
విద్య-ధనదాస్యం
-శృంగవరపు రచన
విద్య వ్యాపార ఉత్పత్తిగా మారుతున్న కాలం దాదాపు రెండున్నర దశాబ్దాల ముందు నెమ్మదిగా మొదలై ఇప్పుడు కాలంతో పాటు వేగం పెంచుకుంది. అసలు విద్యా అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కనీస కుతూహలం కూడా నశించేలా దానిని వ్యాపారపు ముడిసరుకుగా మార్చేసి,కేవలం హోదా,భద్రత,సుఖ జీవనంకు మాత్రమే మార్గం వేసే ఓ బాటలా విద్యను భావించే ఆలోచనను తల్లిదండ్రుల మనసుల్లో నింపేశారు విద్యా వ్యాపారులు.ఇటువంటి పరిస్థితులకు,యదార్ధంగా విద్యా మాఫియాగా మారిన వాస్తవికతను,చారిత్రక సత్యాలతో,కల్పించిన పాత్రల ఆధారంగా స్పష్టం చేసే నవలే సింహాప్రసాద్ గారి ‘ధిక్కారం.’ ఈ నవలకు నవ తెలంగాణ వారి దాశరధి రంగాచార్య స్మారక నవలల పోటీలో 2017 లో ద్వితీయ బహుమతి లభించింది.
ఈ నవల ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో గణిత లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించి,ఉపాధ్యాయుడిగా మొదలై,ఆర్థికంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ విద్యా విలువల విషయంలో పది మెట్లు కిందకు పడిపోతూ ఉన్న వెంకట రమణ పాత్ర ముఖ్యుడిగా కథ నడుస్తుంది.గణితంలో ఎమ్మెస్సీ చేసి అప్పుడే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సమయంలో రమణకు అప్పుడే విజయవాడలో కొత్తగా పెట్టిన భూషణం విద్యాసంస్థలో గణిత లెక్చరర్ అవుతాడు. ఆ కాలేజీ స్థాపించిన భూషణం విద్యావేత్త కాదు,ఓ వ్యాపారి.అంతకు ముందు కోళ్ళ వ్యాపారం నుండి అన్ని రకాల వ్యాపారం చేసి విద్యా వ్యాపారాన్ని కొత్త వ్యాపారంగా ఎంచుకున్న ఓ వ్యాపారి.
కొత్తగా ప్రారంభించిన కళాశాల అవ్వడం వల్ల లెక్చరర్లే విద్యార్ధుల ఇళ్ళకు వెళ్ళి అడ్మిషన్లు తీసుకురావడం కూడా బోధనతో పాటు వృత్తిలో ఓ భాగంగా మారిపోయింది. రమణను మొదటి నుండే విద్యార్ధులు ఇష్టపడటం,అతను అంకితభావంతో పని చేయడం వల్ల అతని మీద భూషణానికి గురి ఏర్పడుతుంది.విద్యార్ధులు రాకముందే భూషణం ఊరికి దూరంగా కళాశాల మాత్రమే కాకుండా హాస్టళ్లు కూడా నిర్మిస్తాడు.ఆ తర్వాత అక్కడ ఎంసెట్ శిక్షణ మొదలుపెట్టించి విద్యార్ధులను పెంచుకుంటూ పోతూ మొత్తానికి తన కళాశాల నిలబడటమే కాకుండా ఇంకేన్నో బ్రాంచిలు తెరుస్తాడు భూషణం.
ఇక రమణ వ్యక్తిగత జీవితానికి వస్తే రమణకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న లలితతో వివాహం అవుతుంది. రమణ తండ్రి బ్రహ్మం మాస్టారు.ఆయన ఒకప్పుడు గొప్ప ఉపాధ్యాయుడు.ఇప్పటికీ ఆయనకు ఊర్లో గురువుగా ఉన్న గౌరవం చెక్కు చెదరలేదు. తండ్రి ప్రభావం వల్లే గొప్ప ఉపాధ్యాయుడు కావాలనే ఆశయం రమణలో బలపడింది.
భూషణంకు విద్యార్ధులు,వారి భవిష్యత్తులు లాంటి అంశాలతో సంబంధం లేదు.కేవలం ఏం చేయడం ద్వారా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తూ తన వ్యాపార లాభాలు పెంచుకోవాలి అన్నదే అతని తపన. ఎంసెట్ అప్పట్లో ఎంత డబ్బు సంపాదనకు మార్గం అయ్యిందో ఆలోచించి,వ్యాపారవేత్త లానే తన ప్రత్యర్ధ సంస్థలైన శేషారెడ్డి,భాగ్యశ్రీ సంస్థల బోధనా విధానాల గురించి తెలుసుకుని అడ్మినిస్ట్రేషన్,మార్కెటింగ్ వంటి అంశాలలో ఆ సంస్థలు మెరుగ్గా ఉన్న అంశాలను తన సంస్థల్లోనూ అమలు పరుస్తాడు. భూషణం సంస్థ ఎంపిసీలో ర్యాంకులు సాధించడంలో గట్టిగా ఉంటే బైపిసిలో శేషారెడ్డి సంస్థ ముందంజలో ఉంది.
విద్యా వ్యాపారంలో మార్కులు,ర్యాంకులే ఫలాలు. వాటి కోసం ఏ మార్గాన్ని అయినా సరే అనుసరించడానికి వెనుకాడని మనస్తత్వం కలవాడు భూషణం.మొదటి సంవత్సరాల్లో ఎంసెట్ ర్యాంకులు మొదటివి రావడం కష్టం అయిపోయేది.వ్యాపారం ఎదగడం ముఖ్యం,దానికి విలువలు ఉంటాయని భావించని వ్యక్తి భూషణం. ఎంసెట్ లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్ధిని కొనేసి,అతను భూషణం విద్యాసంస్థలలో రమణ శిష్యుడు అని అతని వల్లనే విజయం సాధించానని చెప్పించి మొత్తానికి మొదటి ర్యాంకును తన కళాశాల సాధించేలా చేశాడు. ఈ పని పట్ల ఓ రకమైన అపరాధ భావనను రమణ అనుభవించినా ఆ ఉద్యోగం వల్ల వచ్చే ఆర్థిక భద్రత అతని అంతరాత్మ నోరును నొక్కేసింది.
ఈ రకంగా నైతిక పతనం చెందడమే కాకుండా ఓ సారి ఎంసెట్ పేపర్ ను ముందే రమణకు తెచ్చి ఇచ్చి,దాని ద్వారా మోటానికి ర్యాంకులు సాధించినా ఆ తర్వాత ఆ పేపర్ ముందే లీక్ అయ్యిందని గుప్పుమనడం,ఆ తర్వాత రమణను అనుమానం మీద అరెస్ట్ చేసినా అతను బయటపడటంతో ఆ ఆపద నుండి గట్టెక్కుతాడు.
రమణ కూతురు అక్షర.మొదటి నుండే ఆదర్శ భావాలు పుణికిపుచ్చుకుంది.అన్యాయాన్ని ఎదిరించడం బాల్యం నుండే ఆమెలో బలపడిన లక్షణం.రమణ భార్య లలిత కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస అవసరాలు కూడా లేకపోవడం వల్ల డ్రాపవుట్ రేట్ ఎక్కువ ఉండటం,ఆమె కూడా జీతం సౌకర్యాల కోసం ఆ ఉద్యోగం చేయడం జరిగిపోతూ ఉంటుంది.బాల్యం నుండి తల్లిదండ్రులను గమనిస్తున్న అక్షర తల్లిదండ్రులకు డబ్బే ప్రధానం అని గ్రహిస్తుంది. రమణను చూడటానికి వచ్చిన తండ్రి అతనిలో వచ్చిన మార్పును చూసి దుఃఖిస్తాడు. ఆ తర్వాత ఆ బెంగతోనే మరణిస్తాడు.
రమణ దగ్గర ట్యూషన్లు చెప్పించుకోవడానికి కూడా ఎందరో విద్యార్ధులు వచ్చేవారు.అలా అదనంగా సంపాదించవచ్చు అనుకుని మొదలుపెట్టినా ఆ తర్వాత భూషణం దృష్టికి ఆ అంశం రావడంతో రమణ ఆ పని విరమించుకోక తప్పదు.
ఇకపోతే ఈ విద్యావ్యాపారంలో ఉన్న ఇంకో అంశం పోటీ అని గ్రహిస్తాడు భూషణం.ముఖ్యంగా పేరు వచ్చిన కళాశాల నుండి లెక్చరర్లను ప్రత్యర్ధి కళాశాలలు ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాయి.దానికి విరుగుడుగా భూషణం మిగిలిన పేరు పొందిన శేషారెడ్డి సంస్థ మరియు మిగిలిన వాటితో ఓ ఒప్పందం చేసుకుంటాడు. దాని ప్రకారం పోటీగా ఉన్న కళాశాలలో లెక్చరర్లను తీసుకోకపోవడం. ఇలా కష్టం తనది కాకపోయినా తన దగ్గర పని చేసే ఉద్యోగులను తనను దాటి వెళ్ళకుండా చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాడు భూషణం.
భూషణం తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తిగా ఆ కళాశాలల్లో ఎదిగినవాడు చిట్టిబాబు. చిట్టిబాబు భూషణం దూరపు చుట్టం. భూషణం కొడుకు రాజ్ విదేశాల్లో ఎమ్ బి ఏ పూర్తి చేసుకుని భూషణం తర్వాత ఆ సంస్థలను నడపటానికి వస్తాడు.భూషణం సంస్థల అధినేత భూషణం కొడుకు రాజ్ కు,శేషారెడ్డి సంస్థ అధినేతలైన ఆ దంపతుల కూతురు లవ్లీకి వివాహం జరుగుతుంది. అలా ఆ రెండు సంస్థల మధ్య పోటీ బయటకు ఉన్నట్టు కనిపించినా రెండు ఒకటైపోతాయి.
ఇక ఎంసెట్ శిక్షణా సంస్థలు,ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వచ్చేస్తూ ఉండటంతో ఐఐటీ మీద దృష్టి పెడతాడు భూషణం.దానికి రమణను నాయకుడిగా ఉంచి ఓ టీంను అతనికి ఇస్తాడు. ఆ తర్వాత ఆ వ్యాపారం అయిపోయాక,దానిని విస్తరించడానికి ఇక పాఠశాలలు కూడా స్థాపిస్తాడు.అలా విద్యావ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతాడు. ఈ మార్గంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధులను అతను ఎప్పుడూ పట్టించుకోలేదు. అది వ్యాపారంలో ఓ భాగం మాత్రమే అనుకున్నాడు.
రాజ్ రాకతో ప్రాధాన్యత తగ్గిన చిట్టిబాబు తానే భూషణం సంస్థల నుండి తప్పుకుని సొంత విద్యా సంస్థ స్థాపిస్తాడు.చిట్టి బాబు మీద కేసులు పెట్టించి,మొత్తానికి అన్ని వైపుల నుండి ఒత్తిడి పెంచి అతన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు భూషణం. రమణ భార్య లలిత కూడా భూషణం నడిపే ఓ స్కూల్ కి ప్రిన్సిపాల్ అవుతుంది.
అక్షర టెన్త్ లో స్టేట్ ర్యాంక్ సాధించి కూడా ఆర్ట్స్ తీసుకోవడం తల్లిదండ్రులకు నచ్చకపోయినా అక్షర పట్టుదల తెలిసి ఏమి అనలేకపోతారు. ఆ తర్వాత ఇంటర్ నుండే ఆమె విద్య ఆవశ్యకతను అందరికి తెలిసేలా మారుమూల గ్రామాల్లో తన బృందంతో కలిసి పాటల ద్వారా అవగాహన కల్పించడం,విద్యార్ధి సంఘంలో చురుకైన పాత్ర పోషించడం చేస్తూ ఉంటుంది.
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు ఇవ్వాల్సినవి వారికి ఇవ్వని ప్రైవేట్ పాఠశాలపై ధ్వజమెత్తుతుంది అక్షర.మొదట భూషణం స్కూల్స్ లోనే ఉద్యమం చేసి మొత్తానికి కోర్టు ద్వారా కొందరికి అయినా సీట్లు వచ్చేలా చేయగలుగుతుంది. ఆ తర్వాత ఆమె ఆదివాసుల జీవన విధానం మీద పి.హెచ్.డి చేయాలని నిర్ణయించుకుంటుంది.
తెలంగాణ ఉద్యమం జరిగి,ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం జరిగింది.ఇక అక్కడ కొత్తగా విద్యా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్న ఓ సంస్థ వారు రమణ ఇంటికి వచ్చి కోటి రూపాయల ప్యాకేజీ ఆఫర్ చేస్తారు.అప్పటికప్పుడే 25 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తారు.రాత్రికి రాత్రే తమతో పాటు హైదారాబాద్ తీసుకువెళ్తారు.తన రాజీనామాను కూడా భార్యను ఇవ్వమని చెప్తాడు రమణ. తనకు కూడా కొత్త చోట ఆఫర్ ఉంది కనుక ఇక డబ్బుకు ఢోకా ఉండదని భావించిన లలిత కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది.
ఉదయం నిద్ర లేచేసరికి టీవీలో రమణ కిడ్నాప్ అయ్యినట్టు,ఎవరో దుండగులు అర్ధరాత్రి అతన్ని తీసుకుపోయినట్టు లలిత ఫిర్యాదు చేసిన వార్త వస్తుంది.లలిత రమణను తిరిగి వచ్చెయ్యమంటుంది.భూషణం బెదిరించాడని అర్ధమవుతుంది రమణకు.రమణ మీద ఆగంతకులు దాడి చేస్తారు.అప్పుడే భూషణం నుండి వారికి ఫోన్ వస్తుంది.రమణ నాలుక కోసేయ్యమని చెప్తాడు భూషణం ఫోన్లో. ఈ లోపు ఎవరో చూడటం,మొత్తానికి ఆ పెద్ద ప్రమాదం నుండి రమణ బయటపడినా హాస్పటల్ పాలవుతాడు.అప్పుడే రమణలో మార్పు వస్తుంది.
విద్యార్ధుల స్వేచ్చను,అధ్యాపకుల విలువలను హతమారుస్తున్న ఈ విద్యావ్యాపారంపై తనదైన నిరసనను కొత్త మార్పు కోసం తెలియజేయాలని నిర్ణయించుకుని కూతురు అక్షర స్నేహితులతో కలిసి చేస్తున్న విద్యా వ్యాపారం పై విప్లవంలో భాగమవుతాడు.
ఈ నవల కథాంశంలో ఊహ లేదు. విద్యా ప్రయోజనం విజ్ఞానం,విశ్లేషణను పెంచుకోగల సమన్వయ సామర్ధ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలు మాయమై కేవలం డబ్బు సంపాదించే మరమనిషిని ఉత్పత్తి చేసే కార్పొరేట్ కబంధ హస్తాలు నేటికి విద్యారంగంలో బలంగా చొచ్చుకుపోయే ఉన్నాయి. ఈ నవలలో చెప్పిన సంఘటనలు అన్ని జరిగినవే.పాఠకులు సమకాలీన చరిత్రతో ఈ నవల ద్వారా కనక్ట్ అవ్వగలరు.
విద్య వ్యాపారం అవ్వడంలో ఉన్న ఇంకో కోణం విద్యార్ధి దశ నుండే మనిషిని తనకు నచ్చేలా బ్రతికే హక్కును నియంత్రించడం కూడా. మనిషి ఆలోచనలు డబ్బు పరిధి దాటి విస్తరించకుండా అడ్డుకోవడం కూడా.ఎక్కువ డబ్బు వల్లే చదువుకోగలిగాము అన్న భావనా విద్యార్ధుల్లో ఆ డబ్బును సంపాదించడమే లక్ష్యంగా మార్చే జీవితంలోకి పరుగులు పెట్టిస్తుంది,దానితో పాటు మనిషికి ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తుంచుకునే అవసరాన్ని కూడా విస్మరించేలా చేస్తుంది. మనిషిని ధన దాస్యం వైపు నడిపిస్తుంది.
* * *
Comments
Post a Comment