అనేక కోణాల్లో స్త్రీ జీవితం

అనేక కోణాల్లో స్త్రీ జీవితం
-శృంగవరపు రచన



జీవితంలో ప్రతి స్త్రీ అనేక సందర్భాల్లో ఎదుర్కునే సంశయాలు, భయాలు, వివాహం తెచ్చే మార్పులు, ఆమె అనుకోకుండానే తనకు తెలియని యాంత్రికతలో జీవించడం, తనకు కావాల్సింది ఏమిటో తెలియక అటూ ఇటూ పరుగులు తీస్తూ చివరకు మామూలు జీవితాన్నే ఎంచుకోవడం, స్త్రీ జీవితం లోని అనేక కోణాలను స్పష్టం చేసే కథలే చిత్ర బెనర్జీ దివాకరుని గారి 'Arranged Marriage.' ఈ పుస్తకం లోని 11 కథలు ఎమోషన్స్ ని ఎంతో చక్కగా అక్షరీకరించిన జీవితాలు.
ఇందులో మొదటి కథ 'Bats.' ఈ కథలో ఓ స్త్రీ వివాహమయ్యాక భర్తతో బ్రతకలేక, అతను పెట్టే శారీరక హింస తాళలేక తన కూతురితో సహా తన బంధువు అయిన బాబాయి దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఆమె కూతురు ఎంతో సంతోషంగా ఉంటుంది. కొత్త తాతయ్యతో కబుర్లు చెప్తూ, ఆయనతో రోజు పొలానికి వెళ్తూ ఉంటుంది. ఓ రోజు తాతయ్య తోటలో గబ్బిలాలు ఎక్కువవ్వడంతో వాటిని చంపే మందు పెడతాడు. రోజు కొన్ని చనిపోతూనే ఉన్నా, మిగిలినవి మాత్రం అక్కడి నుండి పారిపోయినట్టు ఉన్నా మరలా వస్తూనే ఉంటాయి. అప్పుడు తాతయ్య వాటికి వెళ్ళడానికి ఇంకో చోటు లేక చనిపోతామని తెలిసినా వస్తున్నాయని చెప్తాడు. ఇక ఆ పాప తల్లి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అర్ధరాత్రుళ్ళు ఏడ్చేదో ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఆమె తన భర్తకు తాను ఎక్కడ ఉంది లేఖ రాసి తెలియజేస్తుంది. ఆ తర్వాత కూతురితో సహా మళ్ళీ భర్త దగ్గరకు వెళ్ళిపోతుంది.
మరలా అక్కడి బాధలకు ఆమె అలవాటు పడిపోతుంది. రెండో సారి ఆమె అలా అర్ధరాత్రి వెళ్లిపోయే ప్రయత్నం చేసి భర్తకు పట్టుబడి దెబ్బలు తింటుంది. దీనితో కథ ముగుస్తుంది. తన వైవాహిక జీవితంలో తనకు సంతోషం లేదని తెలిసి పారిపోయినా మరలా అక్కడికే చేరుకునే ఆ స్త్రీ మనస్తత్వం, ఈ కథలో గబ్బిలాలు చావు వస్తుందని తెలిసినా తిరిగి రావడంతో సమానమైనదని రచయిత్రి స్పష్టం చేయడానికే ఈ శీర్షిక పెట్టారని అనిపిస్తుంది.
ఇంకో కథ 'Clothes.' కలకత్తాలో పుట్టిన ఓ సుమిత్రకు అమెరికాలో ఉండే వ్యక్తితో వివాహమైంది. అమెరికాలో భర్త సోమేశ్ , అత్తమామలతో సంసారం. ఆమె వెస్టర్న్ బట్టలను ఇష్టపడుతుంది. ఆమీకోసం భర్త తెచ్చిన ఆ బట్టలను ఆమె రాత్రుళ్ళు అత్తమామలకు తెలియకుండా వేసుకుంటుంది. ఆమె భర్త ఓ కిరాణా షాప్ ఓ స్నేహితుడితో పార్ట్నర్ షిప్ మీద నడుపుతున్నాడు. అతను ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల రాత్రుళ్ళు సోమేశ్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇల్లు చిన్నది అవ్వడం వల్ల ఇంకో సంవత్సరం కష్టపడితే మంచి అపార్ట్మెంట్ లోకి మారవచ్చని భర్త చెప్తాడు. తాను కూడా భర్త స్టోర్ లో త్వరలో భర్తను ఒప్పించి ఉంటానని, తమ జీవితం బావుంటుందని అందమైన ఊహలతో జీవిస్తూ ఉంటుంది సుమిత్ర. కానీ ఓ రాత్రి సోమేశ్ స్టోర్ లో ఉన్నప్పుడు కొందరు దుండగులు అతని మీద దాడి చేసి అతన్ని హత్య చేస్తారు. ఎంతో మంచి జీవితం గురించి కలలు కన్న సుమిత్ర జీవితం వైధవ్యo తో ముగుస్తుంది. ఈ కథలో ఆమె కోరుకున్న బట్టలు, జీవితం, ఆశలు అన్ని భర్తతో ముడిపడి ఉన్నవే. ఆ ఆశలు అతనితోనే అంతమైపోయాయి.
స్త్రీ వివాహంతో తన జీవితాన్ని భర్తతో కలుపుకుని ముందుకు సాగుతుంది. ఆమె జీవితంలోని ఈ ఎమోషనల్ డిపెండెన్సీ కొన్నిసార్లు ఆమెను కృంగదీయవచ్చు కూడా.
ఇంకో కథ 'Silver Pavements, Golden roofs.' ఈ కథలో కలకత్తాలో పెరిగిన జయంతి తన పిన్ని భర్తతో సహా అమెరికాలో ఉండటంతో అక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుందని వారితో కలిసి ఉండటానికి అమెరికా వెళ్తుంది. అమెరికాలో ఇల్లు అంటే o స్థాయిలో ఊహించుకున్న ఆమెకు కలకత్తాలోని తన ఇల్లు దీనికన్నా మెరుగ్గా ఉందన్న భావన కలుగుతుంది. పెళ్ళి అయ్యి అమెరికా వచ్చేటప్పుడు ఒంటి నిండా బంగారంతో వచ్చిన పిన్ని మెడలో చిన్న గొలుసు మాత్రమే ఉండటం గ్రహిస్తుంది జయంతి. దానితో పాటు ఓ ఆటోమొబైల్ కంపెనీకి యజమాని అనుకున్న బాబాయి o మెకానిక్ మాత్రమే అని కూడా తెలుస్తుంది. బాబాయి పిన్నిని ఇల్లు దాటి వెళ్లనివ్వకపోవడం చూసి బాబాయి భార్యను తన అధీనంలో ఉంచుకోవడానికి అలా చేస్తున్నాడని భావిస్తుంది.
ఓ సాయంత్రం పిన్నిని ఒప్పించి వాకింగ్ కు తీసుకువెళ్తుంది. తిరిగి వస్తున్న సమయంలో కొందరు యువకులు వారిని నిగ్గర్స్ అని ఏడిపించడమే కాకుండా వారి మీద బురద కూడా చల్లుతారు. అలానే ఇంటిగి తిరిగి వస్తారు ఇద్దరు. అప్పటికే బాబాయి ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇది తెలిసే తాను బయటకు వెళ్లనివ్వలేదని చెప్తాడు. కొన్నేళ్ల క్రితం భారత దేశం నుండి వచ్చిన తమను రేసీజంతో షాపును తగులపెట్టడమే కాకుండా, దాడి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడతాడు. తన భార్యను ఎంతో బాగా చూసుకోవాలనుకున్నా అది సాధ్యం కాలేదని వ్యధ చెందుతాడు. అప్పటి వరకు అమెరికా అంటే మధురమైన కలలు కన్నా జయంతికి జీవితంలో మనుషులు ఎదుర్కునే అసమానతలు, బాధలు, ఇబ్బందులు ప్రదేశంతో మారిపోవని, అమెరికా మొగుడు అంటే కోటీశ్వరుడు అయ్యి ఉంటాడన్నది నిజం కాదని స్పష్టమవుతుంది.
జీవితం గురించి దూరం నుండి చూసి కలలు కనేవారు యదార్ధకోణాన్ని చూడాల్సిన అవసరాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.
ఇక నాలుగో కథ 'The Word Love.'ఈ కథలో పాత్రలకు పేర్లు ఉండవు. ఈ కథలో ఓ స్త్రీ కలకత్తాలో పుట్టి పెరుగుతుంది. ఆమెకు తండ్రి లేడు. తల్లి ఆచార వ్యవహారాలను బాగా పట్టించుకునే స్త్రీ. కూతురు అమెరికాకు వస్తుంది ఉద్యోగ రీత్యా. ఓ పురుషుడితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటుంది. అతని అపార్ట్మెంట్ లోకి తన నివాసం మార్చుకుంటుంది. తల్లి దగ్గర ఈ విషయం రహస్యంగా ఉంచుతుంది. ఇంట్లో ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేయకూడదని అతని దగ్గర మాట తీసుకుంటుంది. ఓసారి అతను ఫోన్ ఎత్తడం, తల్లికి విషయం అర్ధమయిపోవడం జరుగుతుంది. అప్పాయి నుండి తల్లి ఆమెతో మాట్లాడదు. క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరాన్ని తీసుకోకుండా కూతురికే తిరిగి పంపిస్తుంది. ఇంటి నంబర్ కూడా మార్చేస్తుంది. దీని వల్ల అతనితో ఉన్న బంధం కూడా దెబ్బ తింటుంది. బాగా ఆలోచించిన ఆమె అతన్ని, తల్లిని వదిలి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. ఎవరో తెలియని అపరిచితుడితో ఆమె ఉన్నా, తనను తిరస్కరించిన తల్లి కోసం తపించినా దానికి కారణం ఆమె నమ్మిన ప్రేమ. దానిని గుడ్డిగా నమ్మి పయనించకూడదని అర్ధం చేసుకున్న ఆమె కొత్త జీవితం కోసం అడుగులు వేయాలనుకుంది. తరచి చూసుకుంటే మనం కూడా అనేక సార్లు ఏదో ఒక భావొద్వేగానికి కట్టుబడి ఉండేవారిమేమో అని కూడా అనిపిస్తుంది.
ఇక ఐదో కథ 'A Perfect Life.'ఈ కథలో మీరా కలకత్తా నుండి వచ్చి అమెరికాలో స్థిరపడింది. అవివాహిత. ఆమె రిచర్డ్ తో లివ్ ఇన్ లో ఉంది. ఆమెకు వెంటనే పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన లేదు. రిచర్డ్ జెలసీ ఫీల్ అవ్వకపోవడం, తనకు స్వేచ్చను ఇవ్వడంతో అతను ఆమెకు నచ్చాడు.
ఓ రోజు ఆమె అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఓ ఏడేళ్ల పిల్లవాడు ఆమెకు తారసపడతాడు.అతన్ని అలా వదిలెయ్యలేక తన ఇంట్లో ఉంచుకుంటుంది. అతన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ పిల్లవాడు ఏమి మాట్లాడేవాడు కాదు. ఆ పిల్లవాడి గురించి రిచర్డ్ కు, ప్రాణ స్నేహితురాలైన షర్మిలకు చెప్తుంది. కాలిఫోర్నియాలో ఆడాప్షన్ చేసుకోకుండా అలా పిల్లవాడిని ఉంచుకుంటే ఇల్లీగల్ అని షర్మిల, రిచర్డ్ గట్టిగా చెప్పడంతో ఆడాప్షన్ కు అప్లై చేసి, వారం రోజుల్లో ఆ పిల్లవాడిని ఆడాప్ట్ చేసుకునేలా ఫోస్టర్ పేరెంట్స్ ట్రెయినింగ్ కూడా తీసుకుని సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ పిల్లవాడిని అప్పగించిన నాలుగో రోజునే అతను తప్పించుకున్నాడని తెలుస్తుంది. అతని కోసం ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. రిచర్డ్ ను పిల్లలు కనని షరతు మీద పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. మీరా ఆ పిల్లవాడి కోసం వెతుకుతూనే ఉంది ఇంకా.
జీవితంలో దేనికి దూరంగా పారిపోతామో అదే ఒక్కోసారి మనం ఊహించని వేగంతో జీవితాన్ని తాకి వెనక్కి మరలుతుంది.
పిల్లలను కనడానికే ఇష్టపడని మీర ఆ పిల్లవాడితో పెంచుకున్న అనుబంధం వల్ల ఇంకెవరిని పిల్లలుగా అంగీకరించలేని స్థితికి తీసుకువెళ్ళింది. కొన్ని విచిత్ర అనుభూతులకు అర్ధాలు ఉండవు, అనుభవాలే వాటిని స్పష్టం చేస్తాయి.
ఇక ఆరో కథ 'Meeting Mrunal.'ఈ కథలో కూడా ముఖ్య పాత్రలు కలకత్తా నుండి అమెరికాలో స్థిరపడ్డవే. ఆశ, మహేష్ భార్యాభర్తలు. వారి కొడుకు దినేష్. దినేష్ టినేజ్ లో ఉన్నాడు. మహేష్ తన సెక్రటరీ కోసం ఆశకు డైవోర్స్ ఇచ్చాడు. కొడుకు దినేష్ కూడా ఈ మార్పు వల్ల అసహనంగానే ఉన్నాడు. ఆశ బాల్య స్నేహితురాలు మృణాళిని. ఆమె పెళ్ళి చేసుకోలేదు. బాల్యం నుండి స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్య్రం ఉండాలని బలంగా నమ్మే స్త్రీ. ఆమెకు స్వేచ్చ, డబ్బు, ఎవరికో నచ్చినట్టు బ్రతకాల్సిన అవసరం లేని జీవితం ఉంది. భర్త మహేష్ తో విడిపోయాక ఆశ చాలా అసహనంగా ఉంది. పార్టీలకు, ఫంక్షన్లకు దూరంగా ఉంది.
ఓ రోజు మృణాలిని ఫోన్ చేస్తుంది. తాను బ్రిటన్ నుండి అమెరికా వస్తున్నానని చెప్తుంది. భర్త మహేష్ to విడిపోయిన విషయం ఆమెకు చెప్పకుండా ఇంకా అతనితో కలిసే ఉన్నట్టు మాట్లాడుతుంది ఆశ. ఇద్దరూ ఓ హోటల్ లో కలుసుకుంటారు. పెళ్ళి లేకుండా మృణాలిని సంతోషంగా ఉందని భావించిన ఆమె కూడా అసంతృప్తిగా ఉందని ఆశకు స్పష్టమవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె స్నేహితురాలికి అబద్ధం చెప్పడం, తనను తానే మోసం చేసుకోవడం గురించి బాధ పడుతుంది.బాధలో ఉన్న తల్లిని కొడుకు అర్ధం చేసుకుని ఆసరాగా ఉంటాడు. మర్నాడు మృణాలికి నిజం చెప్పాలని ఆశ నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది.
వివాహం అయిన స్త్రీ తన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సరే వివాహ బంధం అనేది తనకు సామాజిక రక్షణను కల్పించే ఆయుధంగా భావిస్తుంది. ఆ రక్షణ లేని రోజు తనకు గౌరవం ఉండదని భావిస్తుంది. అది కొంతమేరకు నిజమే అయినా స్త్రీ వ్యక్తిగత ధైర్యం, ఆత్మవిశ్వాసాల ధృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథలో తాను సుధ కన్నా మంచి జీవితం కలిగి ఉన్నానని భావించిన మృణాలిని సుధ దగ్గర తాను వైవాహిక అనుబంధం లేదనే అసంతృప్తితో ఉన్నానని స్పష్టం చేస్తుంది. వివాహంలో పిల్లలు, భర్త, కుటుంబం అనే బలం ఉన్నా, అది వ్యక్తిగత గౌరవం గాయపడనంత వరకే వివాహ విలువ నిలిచి ఉంటుంది.
ఈ పుస్తకంలో ఏడో కథ 'The Disapperance.' ఈ కథలో స్త్రీ మానసిక శున్యతను రూపం లేని క్రమంలో అస్పష్టంగా స్పష్టం చేసే ప్రయత్నం ఉంది. పెళ్లయిన ఆమె సంప్రదాయ భార్యగా కొన్నాళ్ళు భర్తతో ఉండి, ఓ కొడుకును కని, అతన్ని కూడా బాగా చూసుకుంటూ సవ్యంగా జీవితంతో సాగిపోతూ ఉంది. ఓ రోజు ఆమె మాయమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియని భర్త ఆమెను వెతికించే ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు.
అతని తల్లి కొడుకును, మనవడిని చూసుకోవడానికి వస్తుంది. అతనికి రెండో పెళ్ళి సంబంధం చూస్తూ ఉంటుంది. అతను కూడా దాని పట్ల సుముఖంగా ఉంటాడు. ఓ రోజు అతను బ్యాంక్ లాకర్ లో చూస్తే భార్య బంగారం ఉండదు. భార్య బంగారంతో సహా వెళ్ళిపోయిందని అతనికి అర్ధమవుతుంది. అతను తాను రెండో పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండాలని ధృడంగా అనుకోవడంతో కథ ముగుస్తుంది. అతను భార్య వెళ్ళిపోయాక ఇంకో పెళ్ళి కి సిద్ధంగా ఉన్నా భార్య మాత్రం అలా చేసుకుంటుందేమో అన్న ఆలోచనను భరించలేని భర్త అతను.
ఈ కథలో ఆమె తన జీవితంలో వ్యక్తిగత సర్దుబాట్లలో ఉన్న అసంతృప్తుల వల్లే వెళ్ళిపోయి ఉండవచ్చని పాఠకులకు రచయిత్రి భర్త ఆమెతో ఉండే ఉదాసీన ప్రవర్తన ద్వారా స్పష్టం చేసింది. ఆమె అలా మాయమైపోయి ఉండటంలో ఆమె బాధ, వ్యధ ఏ మేరకు ఆమెను ప్రేరేపించి ఉంటాయో అన్నది పాఠకులకే వదిలివేయబడిన అంశం.
ఎనిమిదో కథ 'The Ultrasound.'అరుంధతి, అంజలి స్నేహితురాళ్ళు. ఇద్దరూ కలకత్తాలో ఉండేవారు.ఇద్దరికి వివాహలవుతాయి. అరుంధటు కలకత్తాలోని ఓ పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద కోడలు అవుతుంది. అంజలి పెళ్ళి చేసుకుని భర్తతో అమెరికా వస్తుంది. ఇద్దరూ ఒకేసారి గర్భం ధరిస్తారు.ఇంటర్ నేషనల్ కాల్స్ ను ఎంతో ఖరీదైనవిగా భావించే ఆ రోజుల్లో వారానికి ఓ రోజు అంజలి అరుంధతికి కాల్ చేసేది. అరుంధతి పెళ్లయ్యాక ఒక్కసారి ఆమె అత్తవారింటికి వెళ్ళింది అంజలి.పెద్ద కుటుంబం, వంటలు-బాధ్యతలు ఎక్కువని అర్ధం చేసుకుంది అంజలి. ఎప్పుడూ వారిద్దరూ మాట్లాడుకుంటున్న వారి మీద అరుంధతి అత్త చూపు నిలిపేదని స్పష్టం అయ్యింది అంజలికి. ఆ తర్వాత అమెరికాకు వచ్చాక కూడా అరుంధతి అంతా బాగున్నట్టే మాట్లాడేది.
అంజలికి ఆల్ట్రా స్కానింగ్ చేయడం మగ పిల్లవాడు అని తెలియడం జరుగుతుంది. అదే సమయంలో అరుంధతికి ఫోన్ చేసినా ఆమె సరిగ్గా మాట్లాడకపోవడం ఆమెలో అనుమానాన్ని కలిగిస్తుంది.
ఆ తర్వాత రోజు అరుంధతి కాల్ చేస్తుంది. తన కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలియడంతో తనకు గర్భస్రావం చేయించాలని నిర్ణయించుకున్నారని, తన తల్లి కూడా ఏమైనా అత్తవారింటిని వదిలి రావద్దని చెప్పిందని స్పష్టం చేస్తుంది అరుంధతి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు నచ్చనిది చేయవద్దని, కొన్ని రోజులు తల్లి దగ్గరకు వెళ్ళమని చెప్తుంది అంజలి. ఒకవేళ తనకు ఆడపిల్ల అయితే తన భర్త కూడా అలానే ప్రవర్తించే వాడేమోనని అనుకుంటుంది అంజలి. ఆ తర్వాత ఎలా అయినా భర్తను ఒప్పించి అరుంధతిని అమెరికా వచ్చేలా చేసి ఏదైనా ఆధారం ఉండేలా చేయాలని అనుకోవడంతో కథ ముగుస్తుంది.
వాస్తవానికి మనుషుల మంచితనం వారు వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితులు ఏర్పడినప్పుడే స్పష్టం అవుతాయి. అంజలికి మగపిల్లవాడు అని తెలియడo వల్ల ప్రవర్తన సానుకూలంగా మారి ఉండవచ్చు. ఆమె అరుంధతికి కాల్ చేస్తే ఆ ఖర్చు గురించి అయిష్టం వ్యక్తం చేసే భర్తను ఒప్పించి స్నేహితురాలికి ఆసరా కల్పించాలి అనుకోవడం ఆమెకు స్నేహితురాలి మీద ఉన్న ప్రేమ వల్ల అనిపించినా వాస్తవంలో సాధ్యాసాధ్యాలు అస్పష్టమే.
మనిషికి నైతికత అన్నది వ్యక్తిగత జీవిత విలువలను అనుసరించి ఉంటుంది. స్త్రీ ఏర్పరుచుకునే అభిప్రాయాలు, వైవాహిక బంధం మీద ఉండే నమ్మకం వంటి అంశాలు చాలా వరకు ఆమె తన అసంతృప్తులను సైతం పట్టించుకోకుండా ఆ బంధాన్ని నిలుపుకుంటున్నాను అన్న భావన మీద నిర్మించబడి ఉంటుంది. ఆ అసంతృప్తులు ఉన్న ఇంకో స్త్రీ తన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మొదట్లో దానిని విమర్శించినా అందులో ఉన్న ధైర్యాన్ని గుర్తించే స్పష్టత తమ జీవితంలో అది కూడా వర్తించే పరిస్థితులు ఏర్పడినప్పుడే వస్తుంది.అటువంటి పరిస్థితుల్లో స్త్రీ ప్రవర్తన ఎలా ఉంటుందో స్పష్టం చేసే కథే 'Affair.'
అబా, మీనా స్నేహితురాళ్ళు. అబా భర్త అశోక్. మీనా భర్త సురేష్. మీనా తనకు నచ్చినట్టు జీవించాలని భావించే వ్యక్తి. అందమైన స్త్రీ.వస్త్రాధారణలో కూడా ఆమె ట్రెండ్ తో నడుస్తుంది.మీనా భర్త సురేష్ నెమ్మదస్తుడు. మీనాకు ఎవరితోనో సంబంధం ఉందని, అది స్వయంగా మీనా తనతో చెప్పిందని చెప్తాడు అశోక్. మీనా, అబా కుటుంబాలు ఎప్పుడూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ ఉండేవి.
ఎప్పుడూ కలిసినా అశోక్, మీనా సన్నిహితంగా ఉండేవారు. తనతో ఎంతో సన్నిహితంగా ఉండే మీనా తనతో కాకుండా తన భర్తతో ఆ విషయం చెప్పడం అబాకు కోపాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత ఓ పార్టీలో ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి. ఆ పార్టీలో అశోక్, మీనా కలిసి డ్యాన్స్ చేయడం, సన్నిహితంగా ఉండటం బట్టి అశోక్ తోనే సంబంధం ఉండి ఉండవచ్చని భావిస్తుంది అబా.
ఆ రోజు నుండి అబా కూడా మారుతుంది. తన భర్త అశోక్ కు తన మీద ఆసక్తి తగ్గిపోవడం, తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి డ్రస్సింగ్ మార్చుకుంటుంది. అప్పటి వరకు తాను ఫ్రీ లాన్సింగ్ చేసే కుకింగ్ రిసీపీస్ పత్రిక లో సీనియర్ అయిన సురేన్ తో రెస్టారెంట్ కు వెళ్తుంది.
అప్పటి వరకు ఎవరిని కలవకుండా ఉండిపోయి అదే భార్య నీతి అని భావించిన అబా ఎప్పుడైతే అశోక్ మీనాతో డ్యాన్స్ చేయడం చూసిందో అప్పటి నుండే తన ఆలోచనా ధోరణిని మార్చుకుంది. ఓ రోజు సురేష్ అబా ఇంటికి వస్తాడు. తాను, మీనా విడాకులు తీసుకోబోతున్నామని ఆ విషయం తల్లికి చెప్పడానికే తాను కలకత్తా వెళ్తున్నానని చెప్తాడు. వెళ్లే ముందు అబాను నువ్వు ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. అలా అడిగే సరికి అశోక్ తోనే సంబంధం ఉందన్న విషయాన్ని నిశ్చయం చేసుకుంటుంది అబా. ఆ తర్వాత మీనా ద్వారా తనకు సంబంధం ఉందని చార్లెస్ అని తనతో పని చేసే కొలీగ్ తో అని చెప్తుంది. తాను ప్రత్యక్షంగా చెప్పి అబాను ఎదుర్కొలేక అశోక్ కు చెప్పానని చెప్తుంది.చార్లెస్ ఫోటో చూసిన అబా అతను సురేష్ లానే అందగాడు కాదని గ్రహిస్తుంది అబా.కానీ సురేష్ కన్నా తనను బాగా అర్ధం చేసుకుంటాడని చెప్తుంది. అప్పుడు సురేష్ ప్రశ్న అర్ధమవుతుంది అబాకు. అశోక్ మనస్తత్వానికి సరిపడని అబా ఏం చేయబోతున్నదని అడిగాడని అర్ధం చేసుకుంటుంది.అశోక్ తో విడిపోవాలని తనకు నచ్చినట్టు జీవించాలని అబా నిర్ణయించుకుంటుంది. మనిషి తనకు సంతోషం ఇవ్వని నైతికతను సమాజాన్ని సంతృప్తి పరచడానికి పాటించనవసరం లేదని స్పష్టం చేసే కథ ఇది.
వివిధ నేపథ్యాల్లో పెరిగిన వారు భార్యాభర్త లైతే ఎటువంటి స్పర్ధలు వారి మధ్య తలెత్తుతాయో స్పష్టం చేసే కథే 'Doors.'
ప్రీతి 12 ఏళ్ళ వయసు నుండే అమెరికాలో ఉంటున్న అమ్మాయి. దీపక్ కలకత్తాలో పుట్టి, పెరిగి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లిన అబ్బాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. వివాహం చేసుకుంటారు. కానీ బాల్యం నుండి కలకత్తా లో పెరిగిన దీపక్ అమెరికాలో స్థిరపడిన అమ్మాయితో ఏ భేదాలు లేకుండా జీవించగలడని ఎవరూ అనుకోరు. కానీ మూడేళ్లు అన్యోన్యంగా ఉంటారు.
వారి సఖ్యతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దీపక్ కు తలుపులు తెరిచి పడుకోవడం ఇష్టం. కానీ ప్రీతికి మూసి పడుకోవడం ఇష్టం. ఈ ఒక్క విషయంలో కూడా సర్దుకుపోతారు. ఆ సమయంలో దీపక్ స్నేహితుడు రాజ్ దీపక్ ఇంటికి వస్తాడు. అతను ఓ సంవత్సరం పైనే చదువు కోసం అక్కడే ఉంటాడని చెప్తాడు దీపక్. రాజ్ ఏ మాత్రం ప్రీతికి ప్రైవసీ లేకుండా అన్ని విషయాల్లో చొచ్చుకుపోవడం ప్రీతికి నచ్చదు. ప్రీతి కోసం రాజ్ ను ఇంటి నుండి పంపేసినా ఆ రోజే దీపక్ బెడ్ రూమ్ గెస్ట్ రూమ్ కి మారిపోతుంది.
వ్యక్తిగతంగా స్త్రీ పురుషులు వారి స్వేచ్ఛకు ఎవరూ ఆటంకం కలిగించనంతవరకు వారి మధ్య అన్యోన్యత నిలిచి ఉండవచ్చు. స్వతంత్ర భావాలు ఉన్న ఒకరితో ఆ భావాలతో ఒక్క భావం ఏకిభవించని వ్యక్తి తో జీవితం అయినా విచ్చిన్నం అవ్వవచ్చు.
జీవితంలో అనుభవాలను తమ జీవితంలో నేర్చుకునే అంశాలుగా భావించాలని స్పష్టం చేసే కథే 'The Maid Servants Story.'
మనీషా బాగా చదువుకుని, అమెరికాలో స్థిరపడింది. అక్కడ బిజాయ్ అనే ప్రొఫెసర్ ను ఇష్టపడింది. అతన్ని వివాహం చేసుకునే విషయం ఇంట్లో చెప్పి ఒప్పించడానికి కలకత్తా వచ్చింది.మనీషా పిన్ని దీపా ఆమె సాఫ్రాన్ రంగు చీర ఎన్నుకుంటున్నప్పుడు ఆ రంగు మాత్రం వద్దని, ఓ కథ చెప్తుంది.
కలకత్తాలో ఓ ధనవంతుల కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భర్త, భార్య, భర్త మేనత్త, ఆమె కూతురు. ఆ దంపతుల చిన్న కూతురు, పని వాళ్ళు ఉండేవారు. ఆ ఇంటి యజమానురాలు మరలా గర్భవతి అవుతుంది. ఆ సమయంలో తన చెల్లిని పిలిపించుకుంటుంది. ఆ చెల్లి ఆమెను బాగా చూసుకుంటుంది. ఆ సమయంలో ఆ ఇంటికి ఓ స్త్రీ తనకు ఏదైనా పని ఇప్పించమని వస్తుంది. ఆమెను దయతో తన ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేసి ఆమెకు పని ఇస్తుంది ఆ యజమానురాలు. ఆమె చేసిన ఆ పని ఆ ఇంట్లో ఎవరికి నచ్చదు.
కానీ అతి కొద్ది సమయంలో ఆ పనిమనిషి సరళ ఆ యజమానురాలికి నమ్మకస్తురాలిగా మారిపోతుంది. ఆమెకు చదవడం, రాయడం కూడా నేర్పిస్తుంది యజమానురాలు. ఆమెకు తన సాఫ్రాన్ రంగు చీర బహుమతిగా ఇస్తుంది. ఓ రోజు ఆ ఇంటి యజమానురాలు జబ్బున పడుతుంది. అదే సమయంలో సరళ తల్లి తన కూతురిని తన దగ్గర వదలమని అడుగుతుంది.సరళ తనను పంపవద్దని, తన దగ్గరకు మగవాళ్ళని తల్లి, భర్త పంపుతారని చెప్తుంది సరళ. యజమానురాలు ఏమైనా సరే సరళను పంపనని చెప్తుంది. తర్వాత రోజు యజమానురాలు జబ్బున పడటంతో ఆమెను హాస్పటల్ లో చేరుస్తారు. ఓ రాత్రి ఆ ఇంటి యజమాని సరళను బలవంతం చేయడం ఆమె నిరాకరించడం చూస్తుంది చెల్లి. కానీ ఏమి చేయలేదు.తన అక్కకు సరళను కాపాడతానని మాట ఇచ్చినా తర్వాత రోజు సరళ తల్లి జనంతో వచ్చి గొడవ చేయడంతో సరళను ఆ సాకు మీద ఇంటి నుండి గెంటుతాడు యజమాని.
యజమానురాలు ఇంటికి వచ్చాక జరిగింది తెలుసుకున్నా ఏమి చేయలేకపోతుంది.
ఆ తర్వాత ఓ రోజు తన చెల్లి, భర్త, కొడుకు, కూతురుతో ఆ యజమానురాలు కారులో వెళ్తున్న సమయంలో ఓ వీధిలో సరళ వేశ్యలా అలంకరించుకోవడం చూసి ఆమెను గుర్తు పట్టిన యజమానురాలు ఆమెను పిలుస్తుంది. సరళ ఆమె చేతి మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక సరళ వదిలివేసిన సాఫ్రాన్ రంగు చీరను కాల్చేస్తుంది యజమానురాలు.అప్పటి నుండి ఆమె మారిపోతుంది.
కథ పూర్తయ్యే సరికి ఆ యజమానురాలు తన తల్లి అని మనీషాకు అర్ధమవుతుంది. తన తండ్రి, తమ్ముడు కలరాతో మరణించడం, ఆస్తులు పోయి చిన్న ఫ్లాట్ లో ఉండటం అన్ని గుర్తుకు వస్తాయి. ఈ కథ ద్వారా పిన్ని తనను వివాహ విషయంలో జాగ్రత్త గా ఉండమని పరోక్షంగా సూచిస్తుందని అర్ధం చేసుకుంటుంది మనీషా.
ఈ కథల్లో స్త్రీ ఆలోచనలు, భయాలు, అభ్యంతరాలు, వారి స్పందనలు, అనుభూతులు అన్ని ఉన్నాయి.వారి జీవితాల్లోకి తరచి చూడాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

*      *      * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ