పరిచయస్థులు-అపరిచితులు
పరిచయస్థులు-అపరిచితులు
-శృంగవరపు రచన
క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నేరం నుండి నేరస్థులను పట్టుకునేవరకు జరిగే ప్రక్రియ ముఖ్య కథగా నడుస్తూ, ఈ కథలో నేరం చేయడంలో నేరస్థుడు ప్రదర్శించిన తెలివితేటల స్థాయిని అనుసరించి ప్రేక్షకులకు ఆ థ్రిల్లర్ విరామం లేకుండా చూడగల సినిమాల కోవలో ఉండేలా చేస్తుంది. కానీ నేరస్థుడు తప్పించుకునే సినిమాలు కూడా క్రైమ్ థ్రిల్లర్ వర్గంలో ఓ భాగమే. ఆ కోవకు చెందిన సినిమానే 2007 లో వచ్చిన నియో నాయర్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘Perfect Stranger.’ హాల్ బెర్రి, బ్రూస్ విల్స్ నటించిన ఈ సినిమా ముగింపులో కొత్త ఆరంభంతో ముగుస్తుంది. అదే ముగింపు ఎప్పటికీ ముగియని కథ అని కూడా పరోక్షంగా స్పష్టం చేస్తుంది. ఇలాంటి కథల్లో ఉండే రిపిటీటివ్ సీక్వెన్స్ నేర మూలానికి బలాన్ని ఇస్తుంది.
రౌనా అనే జర్నలిస్ట్ డేవిడ్ షాన్ పేరుతో ఆర్టికల్స్ రాస్తూ, ఓ మీడియా సంస్థలో పని చేస్తూ ఉంటుంది. ఆమె ఓ సెనేటర్ చేసిన స్కాండల్ మీద సాక్ష్యాలతో సహ చేసిన ఇన్వెస్టిగేషన్ ను ఆ సంస్థ ఆమోదించదు. రౌనాతో కలిసి పని చేసే వ్యక్తి మైల్స్. మైల్స్ హ్యాకింగ్ చేయడంలో నిపుణుడు. మైల్స్ కు రౌనా మీద ప్రేమ ఉన్నప్పటికి ఆమె అప్పటికే ఇంకో వ్యతితో డేటింగ్ లో ఉండటం వల్ల మౌనంగా ఉంటాడు.
రౌనా తన బాల్య స్నేహితురాలు అయిన గ్రేస్ ను అనుకోకుండా కలుస్తుంది. గ్రేస్ తనకు ప్రసిద్ధి చెందిన అడ్వర్టైజింగ్ సంస్థ అధిపతి హారిసన్ హిల్ తో సంబంధం ఉందని,దానిని నిరూపించే మెయిల్స్ తన దగ్గర ఉన్నాయని చెప్తుంది.కానీ ప్రస్తుతం హిల్ తనను దూరం పెట్టాడని చెప్తుంది. ఇది జరిగిన కొన్ని రోజులకు గ్రేస్ శవం దొరుకుతుంది. గ్రేస్ మరణానికి కారణం హిల్ అయ్యి ఉండవచ్చని భావించి,అమ్మాయిల బలహీనత ఉన్న హిల్స్ ఆఫీసులో ఉద్యోగిగా చేరుతుంది.ఆన్లైన్ లో ఓ ప్లాట్ ఫార్మ్ ద్వారా అతనితో సన్నిహితంగా ఉంటూనే,ఆఫీసులో కూడా అతనికి సన్నిహితంగా ఉంటుంది.
ఓ సారి రౌనా హిల్ తో కలిసి డేట్ కు వెళ్ళిన సమయంలో ఆమె ఫోన్ లో మెసేజ్ ద్వారా రౌనా తన ప్రత్యర్ధి కంపెనీకి స్పై గా పనిచేస్తుందని భావించి ఆమెను ఫైర్ చేస్తాడు గ్రేస్.ఆన్లైన్ లో హిల్స్ లా రౌనా తో చాటింగ్ చేసేది మైల్స్. మైల్స్ అపార్ట్మెంటుకు వెళ్ళిన రౌనాకు గ్రెస్,మైల్స్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపిస్తాయి.గ్రేస్ ను కలవలేదని మైల్స్ అబద్ధం చెప్పాడని రౌనాకు అర్ధమవుతుంది. ఆ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన మైల్స్ రౌనా కోపం తగ్గించడం కోసం హిల్ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ బెల్లడోనా ను కంటి చికిత్స కోసం ఉత్పత్తి చేస్తున్నారనే అంశాన్ని స్పష్టం చేసే సాక్ష్యం రౌనా కు ఇస్తాడు. గ్రేస్ బెల్లడోనా విశాం ద్వారా మరణించడం,హిల్ కు ఆమెకు మధ్య ఉన్న చాట్స్ సాక్ష్యాలుగా మొత్తానికి హిల్ నేరస్థుడు అని నిరూపించి మొత్తానికి అతనికి శిక్ష పడేలా చేస్తుంది రౌనా.
మైల్స్ రౌనా దగ్గరకు వచ్చి ఆ హత్య చేసింది గ్రేస్ అని తెలివిగా దానిని హిల్ మీదకు ప్లాన్ ప్రకారం నెట్టిందని తనకు అర్ధమయ్యిందని చెప్తాడు మైల్స్. రౌనా కు తన గతం గుర్తుకు వస్తుంది. బాల్యంలో లైంగికంగా వేధించే తండ్రి బారి నుండి కూతురిని కాపాడుకోవడానికి రౌనా తల్లి తండ్రిని హత్య చేస్తుంది. ఆ శవాన్ని వారిద్దరు పాతిపెట్టడం పక్కింటి కిటికీ నుండి చూసిన గ్రేస్ ఆమెను అప్పటినుండి ఆ విషయంతో బెదిరించేది. అందుకనే ఆమెను కలిశాక అక్కడి నుండి తీసుకువెళ్లి తానే బెల్లడోనా విషంతో హత్య చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మైల్స్ ను కూడా రౌనా హత్య చేస్తుంది. పోలీసులకు ఫోన్ చేసి గ్రేస్ అసలు హంతకుడు మైల్స్ అని అతను తనను చంపబోతే ఆత్మరక్షణ కోసం చేశానని చెప్పి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.ఇదంతా ఆ ఇంటికి ఎదురింటి వ్యక్తి కిటికీ నుండి చూడటంతో సినిమా ముగుస్తుంది.
ప్రతి మనిషికి రహస్య జీవితం ఉంటుంది. వారు అది రహస్యంగా ఉంచడానికి కారణాలు,పరిస్థితులు ఉంటాయి. ఆ రహస్యం రహస్యంగా ఉండటానికి కారణం దానిని ఆమోదించే పరిస్థితి సమాజంలో ఉండకపోవడం లేదా ఆ రహస్యం ఓ తప్పు లేదా నేరం అయ్యి ఉండవచ్చు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాలు గోప్యతకు దూరంగానే ఉంటాయి. కానీ ఈ రహస్య జీవితంలో ఎవరైనా అడుగు పెట్టి దానిని రహస్యంగా ఉంచనివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తే ఆ రహస్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ మనిషి ఎంత దూరం అయినా వెళ్ళవచ్చు. పరిచితులైనా,అపరిచితులైనా సరే మనిషి జీవితంలో చూడకూడని పార్స్వాలను చూసే ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. గ్రేస్ రౌనా తండ్రి మరణాన్ని నేరంగా భావించి ఫిర్యాదు చేయలేదు.కేవలం దాని ద్వారా రౌనా రహస్యం తెలుసు అన్న భావనతో పాటు ఆమె తనకు భయపడాలి అనే మనస్తత్వంతో ప్రయత్నించడమే ఆమె మరణానికి కారణం. మనిషి తన మనుగడ సాఫీగా సాగిపోవడంలో వచ్చే అల్లకల్లోలాన్ని తప్పించుకోవడం కోసం చేసేవి వారికి సమంజసంగానే అనిపిస్తాయి. ఎదువారి తప్పులనో,నేరాలనో వాడుకుని వారిని తమ అధీనంలో ఉంచుకోవాలనుకోవడం ఎప్పటికీ ప్రమాదకరమే!
* * *
Comments
Post a Comment