అజ్ఞాత క్రోమోజోమ్

 అజ్ఞాత క్రోమోజోమ్

-శృంగవరపు రచన




ఆదర్ సి క్లార్క్ పురస్కారం పొందిన భారతీయ రచయిత అమితావ్ ఘోష్ నవల ‘కలకత్తా క్రోమోజోమ్’ మలేరియా మీద పరిశోధన చేసి నోబుల్ పురస్కారం పొందిన బ్రిటిష్ శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జీవితం గురించి కల్పనతో మూడ నమ్మకాలను,గతాన్ని –భవిష్యత్తులోకి ఒకేసారి పయనించే కథతో అమితావ్ ఘోష్ రాసిన ఈ నవల నాన్ లీనియర్ నరేటివ్ తో పాఠకులపై ఓ మ్యాజిక్ ను చేస్తుంది.
ఈ కథలో మూడు అంతుపట్టని అంశాలు ఒకేసారి కథలో భవిష్యత్తులో,గతంలో ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఈ మూడు కలిసి ఒక కథగా ముగిసిపోవడమే ఈ నవల. ఒక నమ్మకాన్ని ఆశ్రయించిన సంఘటనలు ఆ కాలంతో అంతం కాకుండా కాలంతో పాటు విభిన్న శరీరాలలోకి పయనిస్తూ క్రోమోజోమ్ లా ఆ శరీరంలో భాగమైపోయి,తర్వాతి వారికి ఆ నమ్మకం మిగిలిన వారితో కలిసి పయనిస్తుంది ఈ నవలలో.
మొదట ఈ నవల భవిష్యత్తులో న్యూయార్కులో మొదలవుతుంది.న్యూయార్క్ లో ‘లైఫ్ టెక్నాలజీస్’ లో అంటార్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు.అతని దగ్గర సూపర్ జెనరేషన్ కంప్యూటర్ అవా ఉంటుంది. ఓ రోజు అతని అవాలో ఓ పాత ఐడి కార్డు స్క్రాప్ కనబడటం,అది తనతో గతంలో పని చేసిన మురుగన్ అనే అతనిది అని తెలియడం జరుగుతుంది. తన దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్ సాయంతో అతను ఎప్పటి నుండో కనబడకుండా పోయాడని తెలుస్తుంది.
ఇప్పుడు కథ మురుగన్ కనబడకుండా పోయిన రోజులోకి పయనిస్తుంది. మురుగన్ కు రోనాల్డ్ రాస్ చేసిన మలేరియా పరిశోధన గురించి ఉన్న కుతూహలం అతన్ని కలకత్తా వచ్చేలా చేస్తుంది. ఆగస్ట్ 20 న మురుగన్ కలకత్తా వస్తాడు. రోనాల్డ్ రాస్ ఆ పరిశోధన చేసేలా కొన్ని సంఘటనలు జరిగేలా కొందరు చేశారని మురుగన్ నమ్ముతాడు. ‘కలకత్తా క్రోమోజోమ్’ అనే పేరును కూడా మురుగన్ పెడతాడు. ఈ క్రోమోజోమ్ మిగిలిన క్రోమోజోమ్స్ లా కాదని,అది ఏ శాస్త్రీయ పద్ధతుల్లో కనిపెట్టలేని విధంగా ఉంటుందని,అది రిజనరేట్ అవ్వలేని ప్రక్రియ నుండి,విచిత్రమైన రికాంబినేషన్ ద్వారా అది పుడుతుందని,అది మెదడుకు సంబంధించిందని,మలేరియా ద్వారా అది వ్యాప్తి చెందుతుందని నమ్ముతాడు.
రోనాల్డ్ రాస్ కన్నా ముందు అక్కడ డాక్టర్ గా ఉన్న ఇంకో ఇంగ్లండ్ డాక్టర్ కన్నింగ్ హామ్ మలేరియా మీద పరిశోధన చేశాడు.ఆ రోజుల్లో భారత దేశంలో ముఖ్యంగా కలకత్తాలో మలేరియా అంతా వ్యాప్తి చెంది ఉంది. ఆ సమయంలో పనిలేని ఎందరో రైల్వే స్టేషన్ దగ్గరే ఉండేవాళ్ళు. అలా కన్నింగ్ హామ్ మంగళ అనే స్త్రీని అక్కడే తన దగ్గర పని చేయడానికి తీసుకువస్తాడు. ఆమెకు ఆ డాక్టర్ మలేరియా పరిశోధనలో ల్యాబ్ టెస్టింగ్ నేర్పిస్తాడు. ఆ తర్వాత మంగళ అక్కడికి తనకు పరిచితుడైన లక్మన్ ను తీసుకువచ్చి అక్కడ పనిలో చేర్పిస్తుంది.
మంగళ మలేరియా రక్తంతో సిఫిలిస్ వ్యాధిని నయం చేస్తుందనే నమ్మకం కొందరు ప్రజల్లో బలపడటం వల్ల అప్పట్లో కొందరు ఆమెను దేవతను చేశారు. కలకత్తాలో ఫుల్బోర్న్ అనే రచయితకు ఏ రోజు అయితే మురుగన్ కలకత్తాకు వచ్చాడో అదే రోజు సన్మానం జరుగుతూ ఉంటుంది.అక్కడికి రాస్ గురించి మరింత తెలుసుకోవడానికి అక్కడికి వచ్చిన మురుగన్ ఆ పురస్కార ఉత్సవానికి వచ్చిన ఊర్మిళను,సోనాలిని కలుసుకుంటాడు. ఊర్మిళ కలకత్తా పత్రికలో రిపోర్టర్. సొనాలి కూడా కలకత్తా మ్యాగజైన్ లోనే పని చేస్తుంది.సోనాలి తల్లి ఓ రంగస్థల నటి.ఆమె కూతురు అయిన సోనాలి కూడా కొన్ని సినిమాల్లో నటించి తర్వాత ఓ పుస్తకం రాసి సంచలనం సృష్టిస్తుంది. ఆ తర్వాత కలకత్తా మ్యాగజైన్ వారు ఆమెను ఆహ్వానించి మరి ఉద్యోగం ఇవ్వడం,ఆమె అక్కడ చేరిపోవడం జరిగిపోయింది.
ఊర్మిళకు,సోనాలి కి తెలిసిన ఇంకో వ్యక్తి ఓటనిమాన్ .ఆమె నర్సరీ నడుపుతూ ఉండేది. రిటైర్ అయిన ఆమె తన ఇంట్లో ఉంటుంది. సొనాలికి వ్యక్తిగతంగా సన్నిహితుడు రొమేన్ హాల్డర్. మురుగన్ ఓటనిమన్ ఇంట్లో గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. రొమేన్ హోల్డర్ కనస్ట్రక్షన్ లో ఉన్నాడు. ఊర్మిళకు ఓ రోజు ఇంటికి చేపలు అమ్మే ఒకతను వస్తాడు. తాను అక్కడ ఉండే అందరికి అమ్ముతానని చెప్తాడు.అప్పుడు ఆ చేపలతో పాటు వచ్చిన పేపర్ లో మలేరియా రీసెర్చ్ మీద ఉంటుంది. ఆ చేపలు బాగోలేకపోవడంతో ఆమె అతన్ని అడిగి తన డబ్బులు తీసుకోవచ్చని అతని కోసం వెతుకుతున్న సమయంలో ఆమెకు మురుగన్ కనిపిస్తాడు.ఆమె దగ్గర ఉన్న పేపర్ చూస్తాడు.తామిద్దరూ ఇలా కలవడానికే ఇలా జరిగిందని చెప్తాడు.
సోనాలి రోనాల్డ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.అతను ఎంతకూ రాకపోయేసరికి ఆమె అతని కనస్ట్రక్షన్ సైట్ కు రాత్రి వెళ్తుంది.అక్కడ ఆమె అక్కడ కొంతమంది ఓ స్త్రీని దేవతగా చూస్తూ ఓ శవం చుట్టూ చేరి ఏదో చేయడం ఆమె గమనిస్తుంది.అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది.
ఊర్మిళ,మురుగన్ ఇద్దరూ కలిసి తమకు రాస్ మెమోరియల్ దగ్గర దొరికిన ఓ బొమ్మను చూసి ,బొమ్మలు తయారు చేసే చోటుకు వెళ్తారు.అక్కడ ఓ పాప ద్వారా ఆ రాత్రి అక్కడ ఓ పూజ జరగబోతుందని మంగళ పూజ అని చెప్తుంది.సోనాలి తల్లి ఫుల్బోర్ అనే రచయితకు సన్నిహితురాలు.అతను మొదట్లో లక్మన్ గురించి కొన్ని కథలు రాశాడు. ఆ విషయం గురించి సొనాలికి తెలియవచ్చని ఓటనిమాన్ సూచించడంతో ఆమెను అడిగినప్పుడు ఆమె ఓ విషయం చెప్తుంది. ఫుల్బోర్న్ యవ్వనంలో రేణుపూర్ కు వెళ్తాడు.అక్కడ రెల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ చెప్పిన వినకుండా ఉంటాడు.అక్కడ ఓ లాంతర్న్ ఉండటం,అది శుభ్రంగా ఉండటం గమనిస్తాడు. అతను అర్ధరాత్రి లేచి చూసేసరికి ఆ లాంతర్న్ దీపం ఎవరో తీసుకువెళ్తున్నట్టు వెళ్ళడం గమనించి దానిని అనుసరిస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. ఈ లోపు ఉదయం రైల్ వచ్చే సమయంలో పట్టాల మీద ఉన్న అతన్ని ఎవరో తప్పించడంతో ప్రాణాలతో బయట పడతాడు.
అక్కడ ఉన్న గార్డ్ అక్కడ అసలు స్టేషన్ మాస్టర్ కొన్ని సంవత్సరాల నుండి లేడని చెప్తాడు. కొన్నేళ్ళ క్రితం అక్కడకి లక్మన్ అనే అతను అక్కడ పనులు చేస్తూ సిగ్నల్ రూమ్ లో ఉండేవాడని ,అతను అంటే అక్క్ది స్టేషన్ మాస్టర్ కు పడేది కాదని ఆ తర్వాత అతన్ని అక్కడి నుండి గెంటేయ్యడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలోనే అతను ఆ పట్టాల మీద నుండి తప్పించుకోవడం, ఆ తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ ఆ పట్టాల మీద పడి మరణించడం జరుగుతుంది. అప్పటి నుండి అక్కడ స్టేషన్ మాస్టర్ లేరు. ఆ లక్మన్,మంగళ దేవతలుగా పూజించబడటం జరుగుతుంది. అప్పటి నుండి ఫుల్బోర్న్ కథల్లో అది ఉంది.అప్పటి నుండి అతను పూర్తిగా మారిపోయాడని సోనాలీ ఊర్మిళకు చెప్తుంది. ఇదంతా మురుగన్ కు చెప్పిన ఊర్మిళ సొనాలికి ఫోన్ చేస్తే కలవకపోవడంతో ఆమె కూడా కనిపించకుండా పోయిందని మురుగన్ కు చెప్తుంది.
మురుగన్ అంతకు ముందు రోజు రాత్రి సోనాలి హోల్డెన్ సైట్ లోకి వెళ్ళడం తాను చూశానని చెప్తుంది. ఆమె కోసం ఇద్దరూ అక్కడకు వెళ్తారు. సోనాలిని కలుస్తారు. ఆమె ఆ రాత్రి తాను అక్కడ కొందరు జనం ఓ స్త్రీని దేవతలా కొలవడం,ఆమె ముందు ఓ శవం ఉండటం చూశానని చెప్తుంది. ఆ స్త్రీ ఓటానిమాన్ ,ఆ శవం హోల్డన్ ది అని చెప్తుంది. సోనాలి ఫుల్బోర్న్ తన తండ్రి అని కూడా చెప్తుంది. ఆ తర్వాత వారంతా ఓటనిమాన్ ఇంటికి వెళ్తారు. వారు వెళ్ళేసరికే ఆమె ఇంటిని అమ్మేసిందని చెప్తుంది.కానీ తన వస్తువులు కూడా అమ్మడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్తాడు మురుగన్. కానీ ఆమె అమ్మకాన్ని సంవత్సరం క్రితమే అగ్రిమెంట్ గా చేయడం,అందులో మురుగన్ వస్తువులు కూడా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓటనిమాన్ మంగళ అవతారంగా,లుక్మన్ అవతారం గా హోల్డన్ ఉన్నట్టు వారికి అర్ధమవుతుంది. ఇది ఎప్పటికీ కొనసాగే ప్రక్రియ అని మురుగన్ స్పష్టం చేస్తాడు.మిగిలినవి అర్ధం అవ్వాలంటే రేణుపూర్ వెళ్ళాలని చెప్తాడు మురుగన్. ఒకవేళ తాను తిరిగి రానని అంటే మాత్రం తనని తీసుకురమ్మని ఊర్మిళను అడుగుతాడు.అక్కడితో ఈ కథ ముగుస్తుంది.
ఇక భవిష్యత్తులోని అంటార్ దగ్గరకు వస్తే అతని స్వదేశం ఈజిప్ట్. రోజు పెన్ స్టేషన్ కు వెళ్ళడం అతనికి అలవాటు. అక్కడ ఈజిప్ట్ లో లా టీ పెట్టడం వల్ల అక్కడకి రోజు వెళ్తూ ఉంటాడు. అక్కడ అతనికి పరిచయమైన మేరీ ద్వారా ఆమె స్నేహితురాలు తార కూడా పరిచయమవుతుంది. తార భారత దేశం నుండి వచ్చిందని ఆమె బేబీ సిట్టర్ అని ఆమెకు ప్రస్తుతం ఉండటానికి చోటు,ఉద్యోగం లేవాణి మేరీ చెప్తుంది. అంటార్ అపార్ట్మెంటులో ఖాళీ ఫ్లాట్ ఉందని తనకు తెలిసిందని అది తారకు ఇప్పించమని అడుగుతుంది.తార అలా అంటార్ ఉండే అపార్ట్మెంటులో ఉంటుంది.
మురుగన్ అంటార్ మీద పరిశోధన చేస్తూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తార ఇంటికి వచ్చాక ఒకతను ఆమె కాళ్ళకు మొక్కడం చూస్తాడు. దీని ద్వారా తార మంగళ అవతారం అని పాఠకులకు ఓ ఊహ ఏర్పడుతుంది. అంటార్ ఇంట్లో ఓ రూపం కనిపిస్తుంది. మురుగన్ గురించి జరిగింది తెలుసుకుంటే అది అతని చావుకు దారి తీస్తుందని చెప్పి జరిగింది చూపిస్తూ ఉన్న సమయంలో మురుగన్ ఊర్మిళ,సొనాలిని కలవడం చూస్తాడు అంటార్. ఊర్మిళ తార అని, సోనాలి మేరీ అని అతనికి అర్ధమవుతుంది. అంతే కాకుండా మురుగన్ భారత దేశంలోని కలకత్తాకు వెళ్లింది కూడా సిఫిలిస్ వైద్యానికి అని,అది చెప్పుకోలేక అతను ఆ మలేరియా రీసెర్చ్ మీద చెప్పాడని కూడా పాఠకులకు అర్ధమవుతుంది.
ఇలా కాలంతో పాటు లుక్మాన్,మంగళ క్రోమోజోమ్స్ అంటే అవతారాలు అలా ఇంకొకరికి బదిలీ అవుతూ ఉండటం అన్నది అంతు పట్టని అంశంలా అలా కొనసాగుతూనే ఉంటుందని, రచయిత పరోక్షంగా స్పష్టం చేస్తూ ఈ నవల ముగిస్తాడు. దీనిని కనుక్కోవడానికి వెళ్తున్నామని అనుకునేవారు నిజానికి ఇందులో భాగం అవ్వడానికే ఇందులోకి పయనించి మాయమవుతారని కూడా అర్ధమవుతుంది.
ఈ నవలలో నాన్ లీనియర్ నరేటివ్ లో మ్యాజిక్ ఉంది.కథ అర్ధం కాకుండా ఒక్కో సంఘటనను సమన్వయం లేకుండా చెప్తూ,అన్నింటిని చివరిలో కలపడమే ఈ నవలలో ప్రత్యేకత. ఈ నవల చదివినా కొంత సేపటివరకు ఈ కథ నుండి బయటకు రాలేము.
*        *         *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ