మచ్చిక కాకపోతే ?

 మచ్చిక కాకపోతే ?

-శృంగవరపు రచన




ఇంగ్లాంగ్ రాజుల్లో హెన్రీ -8అరాచకాలు చరిత్ర చూసినవే. ఓ నియంతగా తనకు నచ్చని అంశాలను,నచ్చని వారిని ఏ విచారణ లేకుండానే హత్య చేసే క్రూరత్వం అతని జీవితాల్లోని అన్నీ కోణాలకు విస్తరించింది. దానికి అతని భార్యలు మినహాయింపు కాదు.హెన్రి-8చేసుకున్న ఆరు వివాహాలు వివాదాస్పదమైనవే.అందులో మొదటి భార్య క్యాథరిన్ అతని అన్న భార్య.అన్న మరణించాక ఆమెను తన మొదటి భార్యను చేసుకున్నాడు.ఆమె వల్ల అతనికి మగ సంతానం కలగలేదు.మేరీ అనే అమ్మాయి మాత్రమే వారి సంతానం.ఆమెతో వివాహాన్ని చర్చ్ ద్వారా రద్దు చేసుకున్నాడు.ఇక్కడే అతనికి,చర్చి అధికారానికి మధ్య ఘర్షణ ఏర్పడింది.అప్పటి వరకు చర్చిలకు ఉన్న అధికారాన్ని నియంత్రిస్తూ,ఆ దేశానికి సర్వాధికారి తానే అని ప్రకటించుకున్నాడు.అతని రెండో వివాహం అన్ని బొలిన్ తో జరిగింది.ఆమె ఎన్నో గర్భస్రావాలు అనుభవించడం వల్ల,ఆమె చదువుకున్నది అవ్వడం వల్ల,అతని ముందు ఆమె తల ఒంచుకోకపోవడం వల్ల ఆమె బిడ్డ కోసం క్షుద్ర విద్యలు చేసిందని,ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించి ఆమెకు మరణ శిక్ష విధించాడు. ఆ తర్వాత భార్య జేన్ సీమర్.ఆమె ద్వారా మాత్రం ఎడ్వర్డ్ అనే కొడుకును పొందగలిగాడు.కానీ ఆమెను ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలివేయడం ఆమె మరణించడం జరిగింది.తర్వాత అన్ని ని చేసుకున్నాడు.అభిప్రాయ భేదాల వల్ల ఆమెతో వివాహాన్ని కూడా రద్దు చేసుకున్నాడు.ఇక తర్వాతి భార్య క్యాథరిన్ హోవర్డ్ ను చేసుకున్నాడు.ఆమె వల్ల ఎలిజబెత్ పుట్టింది.కానీ ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించి ఆమెకు కూడా మరణ శిక్ష విధించాడు.
ఇకపోతే హెన్రీ 8 రాజ్యంలో ఈ వివాహాలతో పాటు వచ్చిన బంధుత్వాలు మాత్రం ఆ భార్యలు మరణించినా కొనసాగుతూనే ఉన్నాయి.క్యాథరిన్ కుటుంబానికి చెందిన హోవర్డ్స్,జేన్ కుటుంబానికి చెందిన సీమర్స్ ఈ రాజ్యంలో రాజుకు ముఖ్య అనుచరులుగా ఉన్నారు.ఇక హెన్రీ 8 భార్యలకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్న రోజులు అవి.హెన్రీ 8 తనకు రాణి పట్ల మోజు తీరగానే ఏదో ఒక సాకుతో ఆమెకు మరణ శిక్ష విధిస్తాడని అందరికి బాహాటంగానే తెలిసిన రోజులవి.హెన్రీ 8 వల్ల ఆరోగ్యవంతవమైన బిడ్డ పుట్టకపోయినా అది గండమే అని కూడా అందరికీ తెలిసిపోయిన పరిస్థితులు అవి. ఇవన్నీ తెలిసినా,నిస్సహాయ పరిస్థితుల్లో అతని ఆఖరి మరియు ఆరవ భార్యగా వచ్చిన క్యాథరిన్ పార్ హెన్రీ 8 భార్యగా నాలుగు సంవత్సరాలు ఉన్న కాలాన్ని ‘The Taming Of the Queen’ పేరుతో ఆంగ్ల రచయిత్రి ఫిలిప్పా గ్రెగరి నవలగా మలిచారు. ఫిలిప్పా గ్రేగరి ట్యూడర్ వంశపు రాణుల గురించి ఎన్నో నవలలు రాశారు.మిగిలిన భార్యల గురించి కూడా నవలలుగా మలిచారు.చావును వెంట్రుకవాసిలో హెన్రి 8 నుండి తప్పించుకున్న ఏకైక భార్య మాత్రం క్యాథరిన్ పార్.
కథ ప్రారంభం నాటికే క్యాథరిన్ కు రెండు వివాహాలు అయ్యాయి.ప్రస్తుతం రెండో భర్త మరణించడం వల్ల వైధవ్యం అనుభవిస్తుంది.హెన్రీ 8 ఇంగ్లండ్ దక్షిణ భాగంలో ఉంటే,ఇంగ్లాండ్ ఉత్తరంలో ఉన్నా ఆమెకు ఈ దక్షిణ భాగం కొత్తే.కానీ ఆమె అక్క నాన్ మాత్రం హెన్రి 8 మొదటి భార్య నుండి ఐదవ భార్య వరకు అందరి దగ్గర చెలికత్తెగా ఉంది.క్యాథరిన్ అప్పటికే హెన్రీ 8 మూడవ భార్య అయిన జేన్ సీమర్ అన్న థామస్ సీమర్ తో ప్రేమలో ఉంది.హెన్రీ 8 ఆమెను తన ఆరవ భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.అతనికి థామస్ విషయం గురించి తెలియదు.థామస్ సీమర్,అతని అనన్ ఎడ్వర్డ్ సీమర్ వారి సోదరితో రాజు వివాహం అయినప్పటి నుండి రాజ్యంలో బలంగానే ఉన్నారు. క్యాథరిన్ కు ఇష్టం లేకపోయినా హెన్రీ 8 ని ఎదిరించలేక అతన్ని వివాహం చేసుకుంటుంది.
క్యాథరిన్ అక్క నాన్ ఆమెకు కాంట్రాసేప్టివ్ హెర్బ్స్ ఇస్తుంది.హెన్రీ 8 వల్ల ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టే అవకాశం లేదని,అతనికి అప్పటికే యాభై పైన వయసు ఉండటం,అతని మిగిలిన భార్యల బాధలు చూసిన నాన్ తన చెల్లిని కాపాడుకోవటానికే ఆ పని చేస్తుంది.అలా క్యాథరిన్ పార్ ఇంగ్లాండ్ రాణి అయ్యింది.
హెన్రీ 8 కు తిండి,మగువ,మందు,అధికారం అంటే పిచ్చి.క్యాథరిన్ కొత్త భార్య కనుక ఆమె అన్న విలియం కు కూడా మంచి పదవి ఇవ్వబడుతుంది.ఇక క్యాథరిన్ ను పంపిన కిరీటం,నగలు,బట్టలు అన్నీ ఆమెకన్నా ముందు రాణులు ధరించినవి అని తెలిసినప్పుడు ఆమెకు మరణించిన వారి జీవితాలు వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి.
హెన్రి 8 కు ఓ స్థిర అభిప్రాయం,స్థిర మనస్తత్వం లేవు.అతను ఓ సారి ఆమోదించిన అభిప్రాయాన్ని అతనే తర్వాత తిరస్కరిస్తాడు.తాను గొప్పవాడిని అందరికన్నా అనే విషయాన్ని నిరూపించుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడే రాజు అతను.క్యాథరిన్ కు పక్షులు ఇష్టమని వాటిని బహుమతులుగా తెప్పిస్తాడు హెన్రీ.అంతకు ముందు బైబిల్ ల్యాటిన్ లో ఉండటం వల్ల దానిని సామాన్యులు అర్ధం చేసుకోలేకపోతున్నారని అందుకోసం సామాన్యులు కూడా అర్ధం చేసుకునేలా ఇంగ్లీష్ లో ఉండాలని ఇంగ్లీష్ బైబిల్ ను ప్రజలకు ఇచ్చిన హెన్రీ 8,వారు అర్ధాలు తెలుసుకుంటే తనను కూడా ప్రశ్నిస్తారని భావించి మరలా వారి నుండి వాటిని వెనక్కి తీసుకుని అవి చదవడం కూడా నేరమని ప్రకటిస్తాడు.
హెన్రీకు దేని మీద ఓ స్థిరత్వం లేదు.తన అధికారాన్ని కాపాడుకోవటానికి విరుద్ధ అభిప్రాయాలూ ఉన్న ఇద్దరినీ తన దగ్గర ఉంచుకుని,ఇద్దరికీ వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టే భావనా కలిగించి,వారిద్దరు కొట్టుకునేలా చేస్తాడు.
ఒక్కో వివాహం నుండి కొన్ని రకాల లాభాలను ఆ వివాహం ద్వారా రాజ్యంలోని అధికారులు ఆశిస్తారు. చర్చ్ లో మార్పులు రావాలని అందరికీ దేవుడి మాటలు అర్ధం కావాలని మధ్యలో స్వార్ధం కోసం ప్రవర్తించే చర్చి అధికారులు ఉండకూడదు అని భావించే రిఫార్మ్ మనస్తత్వం నాన్ కుటుంబంది.చెల్లెలు రాణి అయితే ఆమె ద్వారా ఆ విజయం సాధించే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారు.
కానీ రాజ్యంలో అప్పటి వరకు ఏ రాణి కూడా చేయనటువంటి విధంగా హెన్రీ 8 కు వివిధ భార్యల ద్వారా జన్మించిన మేరీ.ఎడ్వార్డ్.ఎలిజబెత్ లను ఒక కుటుంబంలా చేసి వారిలో కలిసిపోతుంది క్యాథరిన్.ఆ తర్వాత ఆమె హెన్రీ అనుమతితోనే రోజు వివిధ పండితుల నుండి మతం-దేవుడు మీద ప్రసంగాలు వింటూ ఉండేది.హెన్రీ 8 ఆమెను ప్రోత్సహిస్తూ రిఫార్మ్స్ గురించే ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడేవాడు.అప్పటికే ప్రజలకు అర్ధం కావడానికి ఓ పుస్తకం అనువాదం చేసింది క్యాథరిన్.రాజు ఫ్రాన్స్ మీద యుద్ధానికి వెళ్లినప్పుడు క్యాథరిన్ ను రేజెన్ గా చేసి వెళ్తాడు.అలా రాజు లేని సమయంలో ఆమె రాజ్యాన్ని కూడా పరిపాలించింది.
హెన్రీ 8 ప్రోత్సాహం వల్ల రిఫార్మ్ గురించి మాట్లాడటం మరియు తనను రెజెంట్ గా చేయడంతో తన పట్ల హెన్రీకి ప్రేమ ఉందని భావిస్తుంది క్యాథరిన్.అన్నీ అనే యువతి ఆ సమయంలో రిఫార్మ్ ప్రసంగాలు ఇవ్వడానికి రాణి దగ్గరకు వస్తుంది.అప్పటికే క్యాథరిన్ కు పిల్లలు లేరన్న అసంతృప్తి రాజుకు ఉంది.అదే సమయంలో రాజు మిత్రుడైన బ్రాండన్ మరణిస్తాడు.అతని భార్య పట్ల హెన్రీ ఆసక్తి చూపించడం గురించి కూడా అందరికీ తెలిసిపోతుంది. ఇక క్యాథరిన్ కూడా త్వరలో ఏదో ప్రమాదానికి గురవ్వబోతుందని రాజ్యానికి అర్ధమై పోతుంది.
ఆ సమయంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడుతూనే,ఆ భయాన్ని కనబడనివ్వకుండా ధైర్యాన్ని నటిస్తూ జీవిస్తూ ఉంటుంది క్యాథరిన్. అదే సమయంలో హోవర్డ్స్ మరియు సీమర్స్ కు మధ్య బంధుత్వం కలపడానికి థామస్ సీమర్ కు,హోవర్డ్ కుటుంబంలోని ఇంకో కూతురైన మేరికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నా,ఆ వివాహం హోవర్డ్స్ కుటుంబం ఒప్పుకోకపోవడం వల్లే ఆగిపోతుంది.
హెన్రీ మనస్తత్వాన్ని సూచించే ఓ సంఘటన ఈ నవలలో ఉంది.కుటుంబ చిత్రాన్ని గీయించడానికి చిత్రకారుడిని పిలిపించి ఎడ్వర్డ్,ఎలిజబెత్,మేరీ,క్యాథరిన్,కింగ్ ఫూల్స్ ,రాజు లను వ్యక్తిగతంగా స్కేచెస్ వేయిస్తాడు. ఆ తర్వాత చిత్రంలో క్యాథరిన్ బదులు మరణించిన జేన్ ఉంటుంది. అంటే అప్పటికే రాణిగా క్యాథరిన్ కు స్థానం లేదని రాజు పరోక్షంగా స్పష్టం చెయ్యడమే.ఆ రాజ్యంలోనే తెలివైన మరియు గొప్ప మేధావిగా క్యాథరిన్ కు పేరు ఉంటుంది.
ఇక క్యాథరిన్ కు సంబంధించిన అందరినీ విచారించడం,రిఫార్మ్ గురించి మాట్లాడితే దానిని శిక్షగా పరిగణించడానికి,ఎలా అయినా ఈ సాకుతో క్యాథరిన్ ను వదిలించుకోవాలని హెన్రీ నిర్ణయించుకున్నాడు.అన్నీ ను అరెస్ట్ చేశారు.ఆమెను చిత్రవధ చేశారు.అయినా ఆమె రాణి పేరు చెప్పలేదు. ఆ తర్వాత ఆమెను అందరి ముందు మంటల్లో కాల్చి చంపారు.ఇక క్యాథరిన్ ను కూడా అరెస్ట్ చేయడానికి వారంట్ రాజు ఇచ్చాడన్న విషయాన్ని క్యాథరిన్ ను గౌరవించే వారు జాగ్రత్త పడుతుందని ముందే చెప్తారు.
ఆ సమయంలో ఇక వేరే మార్గం లేక అనారోగ్యం నటించి రాజును పిలిపించుకుని,ఆంతరంగిక గదిలో తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అతని హింస భరించి అతని ముందు తల వంచుకుని తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది క్యాథరిన్.హెన్రీ భార్యల్లో వారంట్ విడుదల అయ్యాక ప్రాణాలు నిలుపుకున్న భార్య క్యాథరిన్ పార్ ఒక్కరే.
ఇక ఆ తర్వాత అన్నీ ను చంపడం రాజ్యంలో వ్యతిరేకత సృష్టించడంతో మరలా రిఫార్మ్ వైపు మరలినట్టు ప్రవర్తిస్తాడు హెన్రీ. ఆ తర్వాత హోవర్డ్స్ కుటుంబం చేసిన కుట్ర బయటపడుతుంది. థామస్ సీమర్ కు మేరీ హోవర్డ్ తో వివాహం చేయడం వెనుక ఓ కుట్ర ఉందని,ఆ వివాహం ద్వారా రాణి పరిచారికల్లో ఒకరిగా ప్రవేశించి,రాజుకు దగ్గరై,తర్వాతి రాణి అయ్యి, రాజు మరణించాక తర్వాత రాజు అయ్యే ఎడ్వర్డ్ ద్వారా రాజ్యాన్ని తమ అధికారంలోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారని అర్ధమైన హెన్రీ హోవర్డ్ కుటుంబంలో మిగిలిన తండ్రికొడుకులకు మరణ శిక్ష విధిస్తాడు.
అప్పటికి ఎప్పుడు తన వరకు మరణం వస్తుందో అన్న భయంతో గడుపుతున్న క్యాథరిన్ కు హెన్రీ మరణించిన వార్త తెలుస్తుంది. ఆ తర్వాత వైధవ్యంలో మరలా స్వేచ్చను ఆమె పొందినట్టు భావించడంతో నవల ముగుస్తుంది. ఆ తర్వాత థామస్ సీమర్ రాజవ్వడం,అతను క్యాథరిన్ ను వివాహం చేసుకోవడం,మొదటి బిడ్డకు జన్మ ఇవ్వడంలో క్యాథరిన్ మరణించడం,ఆ తర్వాత దేశ ద్రోహం నేరం మీద సీమర్ కూడా సంవత్సరం తర్వాత మరణిస్తాడు.
రాణివాసంలో మచ్చిక అవ్వగల పెంపుడు జంతువు మనస్తత్వం ఉన్న స్త్రీలే రాణులుగా జీవించగలుగుతారు.మొదట తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండి,తన రెండు వివాహల్లో తనదైన వ్యక్తిగత ఉనికిని నిలుపుకున్న క్యాథరిన్ పార్ హెన్రీ 8 తో వివాహం తర్వాత కొంతమేరకు స్వేచ్చగా ఉండే ప్రయత్నం చేసినా,ప్రమాదం సంభవించే పరిస్థితుల్లో మచ్చిక అయ్యే జంతువుగా మారిపోతుంది. చట్టం,న్యాయం ఏది లేని అరాచక రాజ్యంలో పెంపుడు జంతువులు మాత్రమే బ్రతకగలవు. చరిత్రను ఎంతో చక్కటి నవలగా రాసిన ఫిలిప్పా గ్రేగరి రచనలు దొరికితే తప్పక చదవండి.ఇంగ్లీష్ రాజ్యంలో స్త్రీల జీవితాలు మీ కళ్ల ముందే ఈ రచనల్లో ప్రత్యక్షం అవుతాయి.
* * *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ