నిస్సహాయత -పైశాచికత్వం

నిస్సహాయత -పైశాచికత్వం
-శృంగవరపు రచన



నేరంతో ముడిపడిన సినిమాలు క్రైమ్ లేదా హారర్ లేదా రెండు సమ్మిళిత వర్గాల్లోకి వస్తాయి. సినిమాలో నేరం చేసే పద్ధతిని బట్టి అది క్రైమ్ లేదా హారర్ వర్గాల్లోకి చేరిపోతుంది.నేరం సైలెంట్ గా జరిగిపోయి నేరస్తుడిని పట్టుకోవడం అయితే క్రైమ్ థ్రిల్లర్ వర్గంలోకి చేరిపోతే, జరిగే లేదా జరుగుతున్న హత్య లేదా హత్యల్లో హింసతో ఉంటే హారర్ క్రైమ్ కిందకు వస్తాయి. శ్లాషర్ హారర్ అన్నది హారర్ సినిమాల్లో ఓ వర్గం. అంటే ఈ రకం సినిమాల్లో ఒక వ్యక్తి లేదా ఎక్కువమందిని హంతకుడు స్టాక్ చేస్తూ వెంటపడుతూ హింసా పద్ధతిలోనే చంపుతాడు. ఈ శ్లాషర్ లో కూడా స్ప్లాటర్ మరియు సైకలాజికల్ హారర్ వర్గాలుగా సినిమాలు ఉన్నాయి. శ్లాషర్ వర్గానికి చెందిన సినిమానే 2016 లో వచ్చిన ఆంగ్ల సినిమా ‘హుష్.’ ఈ సినిమాను భారతదేశంలో 2019 లో తమిళ్ లో ‘కొలియాతిర్ కాలం ‘సినిమాగాను,హిందీలో ‘కామోషి’ గాను రీమేక్ చేశారు.
మాడి యంగ్ అనే హారర్ రచయిత్రికి 13 ఏళ్ళ వయసులో మెనింజైటీస్ సోకడం వల్ల వినికిడి శక్తిని మాట్లాడే శక్తిని కోల్పోతుంది. ‘మిడ్ నైట్ మాస్’ రచనతో ప్రసిద్ధి పొందిన ఈ రచయిత్రి తల్లిదండ్రులను,సోదరిని న్యూయార్క్ లో వదిలి ప్రశాంతంగా రాసుకోవడం కోసం ఓ అడవి ప్రాంతంలో పెంపుడు పిల్లితో నివసిస్తూ ఉంటుంది.ఆమె స్నేహితురాలైన సారా ఆమె పుస్తకం చదివి తిరిగి ఇవ్వడానికి వస్తుంది. ఆ రాత్రి సారా మాడి నుండి బయల్దేరి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ మాస్కు ధరించిన వ్యక్తి ఆమెను విల్లు లాంటి ఆయుధంతో చంపడానికి వెంబడిస్తూ ఉంటే ఆమె మాడి ఇంటికి చేరుకుని అరిచినా మాడికి వినబడకపోవడం వల్ల ఆమెకు తెలియకుండా ఉంటుంది. ఆ తర్వాత సారాను ఆమె ఇంటి తలుపు దగ్గరే ఆ హంతకుడు చంపేస్తాడు. ఆ తర్వాత మాడి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. తన ఫోన్ ను టేబుల్ మీద పెట్టి ఆమె రాసుకుంటున్న సమయంలో ఆమె ఫోన్ ను తీసుకుంటాడు ఆ కిల్లర్.
ఆమె ల్యాప్ టాప్ లో తన సోదరితో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుండి ఫోటోలు తీసి ఆమెకు పంపిస్తాడు. ఆమె ఆ ఫోటోలను చూసి షాకవుతుంది.ఆమె ఫోన్ కోసం వెతికితే ఆమెకు కనిపించదు. ఆ సమయంలో ఇంటి బయట ఆమె ఫోన్ పట్టుకుని నిలబడి ఉన్న కిల్లర్ ను చూసి ఆమె భయపడి తలుపు వేస్తుంది. ఆ తర్వాత ల్యాప్ టాప్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పటికే ఆ కిల్లర్ ఇంటర్నెట్ వైర్ కట్ చేస్తాడు.
మాడి తన లిప్ స్టిక్ తో మొహం చూడలేదు,ఎవరికి చెప్పాను,బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడు అని తలుపు మీద రాస్తుంది. ఆ కిల్లర్ తన మాస్క్ తొలగిస్తాడు. ఆ తర్వాత సారా శవం కనిపించేలా చేస్తాడు.సారా శవం జేబులో మాడి ఫోన్ పెడతాడు. కార్ అలారం మోగించి అతని దృష్టిని మరల్చి ఆ ఫోన్ తీసుకునే ప్రయత్నం చేసి విఫలం అవుతుంది మాడి. ఆ తర్వాత మాడి పిల్లిని చంపే ప్రయత్నం చేస్తుంటే బయటకు వచ్చిన ఆమె మొత్తానికి ఎలానో అతని నుండి తప్పించుకుని లోపలికి వస్తుంది. ఆ సమయంలోనే ఆమె తలుపు ముస్తున్నప్పుడు ఆమె చేతిని గాయపరుస్తాడు కిల్లర్.
ఆ తర్వాత సారాను వెతుక్కుంటూ ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కిల్లర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. జాన్ ను అనుమానం వస్తుంది. సారా ఇయర్ రింగ్ అతని దగ్గర ఉండటం గమనించి జరిగింది అర్ధం చేసుకున్న జాన్ అతన్ని రాయితో కొట్టే ప్రయత్నం చేయబోతున్నప్పుడు మాడి తలుపు మీద శబ్దం చేయడంతో అటువైపు జాన్ తిరగడంతో ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు కిల్లర్. తనను చంపుతున్నప్పుడు కూడా ఫైట్ చేస్తూ మాడి తప్పించుకోవడానికి కాస్త సమయం చిక్కెలా చూస్తాడు జాన్. జాన్ మరణిస్తాడు.
ఇక తాను తప్పించుకునే అవకాశం లేదని అతని చేతిలో మరణించడం లేదా అతన్ని చంపదమే మార్గం అని నిశ్చయించుకున్న మాడి అతన్ని చంపడానికే నిర్ణయించుకుంటుంది. ఇంటి ముంది నుండి వచ్చే ప్రయత్నం విఫలం అవ్వడంతో అతను బాత్ రూమ్ వెంటిలేషన్ ద్వారం గుండా వస్తాడని ఊహించిన మాడి ఆ బాత్ రూమ్ లో కూర్చుంటుంది.ఆమెను హతే చేయడానికి ఆమె వెనుక కూర్చున్న హంతకుడు ఆమెను చంపే ముందే అతని శ్వాస ఆమె మెడ మీద తగలడంతో అతన్ని మోకాలి దగ్గర పొడుస్తుంది.
హంతకుడు ఆమెను వంటగదిలోకి వెంబడిస్తే అక్కడ ఉన్న పురుగుల మందు అతని మీద చల్లి ఆ సమయాన్ని వినియోగించుకుని అతన్ని హత్య చేస్తుంది. తర్వాత అతని దగ్గర నుండి తన ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండటంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో ముఖ్య పాత్రలు రెండే. మాడి,కిల్లర్. మిగిలిన పాత్రలైన సారా,జాన్ లవి పది నిమిషాల నిడివి ఉన్న పాత్రలే. అందులోనూ ఈ సినిమాలో మాడి,కిల్లర్ ల మధ్య డైలాగ్లు ఉండవు.మాడికి వినబడదు,మాట్లాడలేదు.అయినా ఆమెను నిస్సహాయంగా చంపాలని ఆమె ఇంటి బయట ఉండి,ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తే బయట చంపుదామని లేదా ఈ లోపు ఇంట్లోకి ప్రవేశించి చంపుదామని ప్రయత్నంలో ఉన్న కిల్లర్ నుండి మాడి మొదట తప్పించుకునే ఆలోచన,దానికి వీలు లేనప్పుడు అతన్ని ఎదుర్కునే ఆలోచన, ఈ రెండు నిర్ణయాల మధ్య ఆమె భయం,బాధ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. థ్రిల్లర్ లో విభిన్న అనుభూతి పొందాలంటే తప్పక ఈ సినిమా చూడండి.

*     *    *   

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!