నచ్చడం-నచ్చకపోవడం

నచ్చడం-నచ్చకపోవడం
-శృంగవరపు రచన




మనిషి ఎప్పుడు జీవితంలో ఏదో ఒకదాని కోసం అన్వేషిస్తూనే ఉంటాడు.రోజు ఓ కొత్త అవకాశమో,సంతోషమో,సంతృప్తో మనిషితో కలిసి పయనిస్తూ ఉంటే ఆ అన్వేషణ విస్తరిస్తూనే ఉంటుంది.ఆ విస్తృతి మనిషి లక్ష్యాల పరిధి మేరకు ఉంటే అది చర్చనీయాంశం కాదు,కానీ అది మనుషులకు వర్తిస్తేనే వివాదాలకు కేంద్రంగా మారుతుంది.అటువంటి వివాదాస్పద వ్యక్తే ఎలిజబెత్ టేలర్.ఎనిమిది వివాహాలతో ప్రేమ మీద తనకున్న దృక్కోణాన్ని విభిన్నంగా స్పష్టం చేసిన ఆమె జీవితంలో 16 సంవత్సరాలు ప్రేమ-పెళ్లి బంధంతో కలిసి ఉన్న వ్యక్తి అమెరికన్ నటుడు రిచర్డ్ బర్టన్.వీరిద్దరి ప్రేమ,పెళ్ళికి నాడు జాతీయ సమస్యల కన్నా కూడా వార్తాపత్రికలు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవంటే అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ-పెళ్ళి-విడిపోవటాల మధ్య వారి జీవితం ఎలా ఉందో ప్రముఖ రచయిత శ్రీధర గారు 1985 లో సితార పత్రికకు ‘ఎలిజబెత్-బర్టన్ ల ప్రణయగాధ’ పేరుతో నవల రాశారు.ఇందులో ప్రేమ మాత్రమే లేదు,మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేసే మనస్తత్వాలు,ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఎలిజబెత్ టేలర్ క్లాసిక్ హాలీవుడ్ ను ఏలిన నటి.అప్పటికే ఆమె నాలుగో భర్త మరియు గాయకుడు అయిన ఎడ్డి ఫిషర్ తో ఉంది.1961 సెప్టెంబర్ లో క్లియోపాత్ర సినిమాలో సహనటుడిగా పరిచయమైన రిచర్డ్ బర్టన్ తో ఆమె ప్రేమలో పడింది. ఇక్కడ వీరిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి,పిల్లలు ఉన్నారు.
రిచర్డ్ బర్టన్ కు స్త్రీల వ్యసనం ఉంది.అతని భార్య సిసిల్ కూడా ఓ నటి.బర్టన్ ఎందరు స్త్రీలతో తిరిగినా అతన్ని అర్ధం చేసుకుని తల్లిగా కూడా ఎంతో ఓర్పుగా అతనితో ఆమె వ్యవహరించేది.ఆమె అంటే బర్టన్ కు ప్రాణం.ఎలిజబెత్ ది ఓ రకమైన మనస్తత్వం.ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతం కావాలి అనుకుంటుంది,అంతకుముందు తన జీవితంలో ఉన్న వ్యక్తులను అంతే బలంగా తన జీవితంలోనుంచి బయటకు నెట్టేస్తుంది.
సిసిల్ చెప్పించాల్సిన వారి చేత చెప్పించి చూసింది.సిసిల్ ను వదులుకోవాలని ఎన్నడూ బర్టన్ అనుకోలేదు.కానీ ఎలిజబెత్ ఈ విషయం మీదే రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.ఎలిజబెత్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చిన బర్టన్ ఆమె కోసం భార్యకు విడాకులు ఇచ్చాడు.సిసిల్ మీద ఉన్న ప్రేమతో తన ఆస్తులు కూడా ఇచ్చాడు.ఇక ఎడ్డి ఫిషర్ కు ఎలిజబెత్ కూడా విడాకులు ఇచ్చింది.ఇద్దరూ వివాహం చేసుకున్నారు.కానీ వీరు పెళ్ళికి ముందు ప్రేమించుకున్న తీరును ఎలా సమాజం వ్యతిరేకించిందో,పెళ్ళిని కూడా దాదాపు అంతే వ్యతిరేకించింది.అవేమీ ఆ జంట పట్టించుకోలేదు.
పెళ్ళి,ప్రేమ రెండు వేరైన అంశాలు.పెళ్ళయ్యాక ఎలిజబెత్ కు ఎక్కువ వేతనం ఉండటం బర్టన్ లో న్యూనతను కలిగించింది.తాను నటించే సినిమాల్లో నటీమణులతో బర్టన్ సంబంధాలు పెట్టుకోవడం ఎలిజబెత్ కు నచ్చలేదు.ఎంత కాపలా పెట్టినా ఎంత చేసిన బర్టన్ తీరు మారేలా లేదు.సిసిల్ రెండో వివాహం చేసుకుంది.తాగుడుకు బర్టన్ బానిస అయిపోయాడు.ఎక్కడికి వెళ్ళిన తాగి రభస చెయ్యడం,స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు.ఎలిజబెత్,బర్టన్ ఒకరినొకరు భరించలేని స్థితికి వచ్చాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు.ఒకసారి పెళ్ళి చేసుకున్న ఈ జంట రెండో సారి కూడా పెళ్ళి చేసుకోవడం అప్పట్లో సంచలనమే.రెండు సార్లు వివాహం చేసుకున్నా వారి బంధం నిలబడలేదు. ఇద్దరు మరో వివాహం చేసుకున్నారు.
జాన్ వార్నర్ అనే రిపబ్లికన్ అభ్యర్ధిని వివాహం చేసుకుంది. జాన్ వార్నర్ సెనేటర్ గా ఎన్నికల్లో గెలిచాడు.ఆ తర్వాత బర్టన్ మరణించడం జరిగింది.
ఎలిజబెత్ జీవితం ఓ విచిత్రం.గొప్ప నటి,సౌందర్య రాశి అయిన ఆమె అప్పట్లో ఎందరికో ఆరాధ్య దేవత.ఆమె ప్రేమలో,ఇష్టాల్లో ఓ వైపరీత్యం ఉంది.సాధారణంగా అందరి జీవితాల్లో నచ్చిన వ్యక్తులు ఎప్పుడు ఎదురైనా సరే తమ జీవిత పరిధిని ఆ వ్యక్తులు ప్రభావితం చేయకుండా తమకు తామే ఆ మనుషులతో సున్నితంగా మెలుగుతారు.కానీ ఎలిజబెత్ దృష్టిలో వ్యక్తి మీద ప్రేమ అంటే ఇంకో వ్యక్తి మీద ఆమెకు ప్రేమ పుట్టనంతవరకు ఉండే కాల పరిధి మాత్రమే.స్థిరంగా ఓ వ్యక్తిని ప్రేమించాలని ఆమె ఎప్పుడు అనుకోలేదు.ఉప్పెనలా ముంచెత్తే ప్రేమతో మనసును మార్చుకునే ఆమెలో మానవీయ కోణం ఉంది.
తాను అభిమానించే వారి కోసం ఏమైనా చేసే మంచితనము ఉంది. కానీ వివాహ బంధాల్లో పిల్లలను చూసుకోలేని అశక్తత ఉంది.ఆమె జీవితం మనిషి మనసులో క్షణం క్షణం జరిగే నచ్చడం అనే భావనకు,మనిషి ఊగిసలాటకు మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధం ఫలితం ఏదైనా సరే దానిని ధైర్యంగా ఎవరికి భయపడకుండా అంగీకరించే స్వభావం ఉంది కనుకే ఎలిజబెత్ ఎప్పుడు వివాహాల విషయంలో స్థిరపడలేదు. ఈ నవలలో వారిద్దరి జీవిత చిత్రాలను,నాటి పరిస్థితులను,వారి బలహీనతలను,మనిషి మారిపోయే ప్రలోభాలను కూడా జోడించి ఎంతో చక్కగా రాశారు శ్రీధర గారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఎలిజబెత్ జీవితం ఆమెకు ‘నచ్చడం-నచ్చకపోవడం’అనే వృత్తం,అంతే!

* * * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ