వివేకవంతమైన నిర్ణయం

 వివేకవంతమైన నిర్ణయం

-శృంగవరపు రచన



పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి ‘ధృవ తార’ నవల కథ ఏమిటో,రచయిత ఏమి చెప్పదల్చుకున్నారో అన్న అంశం ముగింపు వరకు అర్ధం కాలేదు.ముగింపు నుండి ఆరంభాన్ని మరలా ఆవలోకనం చేసుకునేలా చేసే నవల ఇది. మనిషి ఓ బాధ్యత విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు అతను ఎన్ని కోణాల్లో ఆలోచించాలో, ఆ ఒక్కో కోణాన్ని ఒక్కో పాత్రలో పరకాయ ప్రవేశం చేయించి ఆ పాత్రల నిర్మాణం సమాజంలోని ఒక్కో ప్రవృత్తికి నిదర్శనంలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ నవలను రాసారని నవల మొత్తం చదివాకే పాఠకులకు స్పష్టమవుతుంది. కథ చెప్పే శైలిలో సందిగ్దత ఉన్న పాత్రకు అది పోగొట్టడానికి కథను ఎన్నో పాత్రలకు విస్తరిస్తూ ముగింపుకు వచ్చే సరికి ఆ పాత్రల మనస్తత్వాల నుండి సందిగ్దతను పోగొట్టే ప్రయత్నం చేయడం ఈ నవల కథాంశంలోని విశిష్టత.
కథలోకి వెళ్తే కాళిదాసు ఉపాధ్యాయుడు. అతనికి వివాహమైన రెండేళ్లకే భార్య మరణిస్తుంది. ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో ఉన్న అతను రెండో వివాహం చేసుకునే ఆలోచనలో లేడు. ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడు కూడా. అతని దగ్గర మురళి,రుబెన్ అనే విద్యార్ధులు ట్యూషన్ కు వస్తూ ఉంటారు.
కథ ప్రారంభంలోనే కాళిదాసు ఇంటి ముందు ఎవరో అప్పుడే పుట్టిన బాబును ఆ ఇంటి ముందు వదిలేసి వెళ్తారు. మొదట ఆ బిడ్డను అనాధాశ్రమంలో అప్పజెప్పుదామని అనుకున్నప్పటికి అతను ఆ పని చేయలేడు. అతని ఇంట్లో పని చేసే పున్నమ్మ తన కూతురు బాలింత అని,తాను రోజు ఆ పిల్లవాడిని చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో ఆ పిల్లవాడిని ఇంట్లో ఉంచినా అతని బాధ్యతను పూర్తిగా తీసుకునే విషయంలో అతని మనసు ఓ మేరకు డోలాయమానంగానే ఉంది.
ఇక పాఠశాలలో అతని సహ ఉపాధ్యాయులు పట్టాభి,శంకర శాస్త్రి. శంకర శాస్త్రి పెద్ద కూతురు రుక్మిణి. కాళిదాసుకు తండ్రి లేడు.తల్లి,అక్క ఉన్నారు.కూతురు దగ్గర ఉండటానికి వెళ్తుంది తల్లి. తండ్రి మరణించేటప్పుడు తన ఆస్తిని సేవ కార్యక్రమాలకు రాసినా ఏ మాత్రం బాధ పడకుండా తండ్రి నిర్ణయాన్ని ఆమోదిస్తాడు కాళిదాసు.
ఇకపోతే ఈ కథలో ఇంకో పాత్ర నిరంజనశర్మ. వృద్ధాప్యంలో ఉన్నాడు. లాయర్ గా ప్రాక్టీస్ చేసి బాగానే సంపాదించాడు. అతని కూతురు వర్ధిని బాల్యంలో కాళిదాసుతో కలిసే చదువుకుంది. ఆమెకు వివాహమైంది. ఆమె ప్రసవానికి పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టాడన్న శుభవార్త తెలియగానే ఆమె భర్త వస్తున్న సమయంలో యాక్సిడెంట్ లో మరణిస్తాడు.ఆ సమయంలో చుట్టుపక్కల వారు కొడుకు నష్టజాతకుడు అనడంతో,తన భర్త చావుకు కారణం కొడుకు అనే ఆలోచనను మనసులో ఉంచుకుని కడుపున పుట్టిన కొడుకు మీదే కోపంతో ఉన్నది.
కాళిదాసు చదువుకునేటప్పుడు జానకిరామయ్య అనే స్నేహితుడు ఉండేవాడు.అందరిలో ఎంతో తెలివైన వాడు,ఫిల్మ్ కెమెరాల వంటి వాటితో ప్రయోగాలు బాల్యంలోనే చేసే అతన్ని చూసి అందరూ అతను అందనంత ఎత్తుకు భవిష్యత్తులో ఎదుగుతాడని అనుకునేవారు. కానీ అతను దొంగ నోట్లు అచ్చు వేసి, ఆ యంత్రం పోలీసులకు దొరికిపోవడంతో ఆ సమయంలో కాళిదాసు ఇంటికి వస్తాడు.అతను చేసింది తెలియని కాళిదాసు ఎంతో ఆదరంగా అతన్ని చూసుకుంటాడు.తాను చేసిన పనికి పశ్చాత్తాప పడి అర్ధరాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా బయటకు వచ్చి అతని కోసం గస్తీ తిరుగుతున్న పోలీసులకు లొంగిపోతాడు. మర్నాడు ఆ విషయం కాళిదాసుకు తెలుస్తుంది.
ఓ సారి మిత్రుడైన పట్టాభితో కలిసి అమ్యూజ్మెంట్ సెంటర్ కు వెళ్తాడు కాళిదాసు. అక్కడ ఎందరో విద్యార్ధులు జూదాన్ని తలపించే ఆటలు ఆడుతూ ఉంటారు. నృత్యం పేరుతో దాదాపుగా వివస్త్రలైన స్త్రీలు నీచ అభిరుచిని రేకెత్తించే రీతిలో నృత్యం చేయడం వంటివి ఆ ఇద్దరికీ జుగుప్స కలిగిస్తాయి. ఆ నృత్యం మధ్యలో ఓ పాతికేళ్ళ స్త్రీ,ఓ ఐదేళ్ల పాప కూడా వచ్చినప్పటికి ,వారు చేసే సంప్రదాయ నృత్యం అక్కడ ఉన్న వారికి నచ్చదు. ఆ స్త్రీ పట్టాభి చదువుకునే రోజుల్లో స్నేహితురాలు. మధ్యలోనే అక్కడి నుండి వచ్చేస్తారు ఆ ఇద్దరు స్నేహితులు.
ఈ నవలలోని సంఘటనలు అన్నీ కూడా మనిషి నైతికత,దిగజారిపోతున్న విలువలు వంటివైపే కేంద్రీకరించబడి ఉన్నాయి. కాళిదాసు శిష్యుడు మురళి చురుకైన వాడు. ఏ విషయాన్ని అయినా వెంటనే పట్టేసే నేర్పు ఉన్నవాడు. కానీ చదువు మీద ఎక్కువ శ్రద్ధ లేదు. ఇక రెండో విద్యార్ధి రూబెన్. అతని తండ్రి కొలిమిలో ఇనుముతో పని చేస్తాడు.ఎంతో కష్టపడతాడు. రూబెన్ తెలివి లేకపోయినా కష్టపడి చదివే మనస్తత్వం కలవాడు.అతని తండ్రి కొడుకు కోసం పైసా పైసా కూడబెట్టి ఇరవై రూపాయలు చేసి కొడుకు అడిగిన గడియారం కొనిపెట్టడానికి ఆ డబ్బు కాళిదాసుకు ఇస్తాడు.ఆ తండ్రి కష్టార్జితమైన ఆ డబ్బును పవిత్ర ధనంగా భావించి దానిని దాచి పెడతాడు కాళిదాసు. ఆ డబ్బును గోవిందు దొంగతనం చేసి అమ్యూజ్మెంట్ సెంటర్ కు వెళ్తాడు. ఆ విషయం గ్రహించిన కాళిదాసు గోవిందు తండ్రికి విషయం తెలియజేసి గోవిందును ఇంటికి తీసుకువచ్చి,అతను దొంగతనం చేసిన డబ్బు రూబెన్ తండ్రి ఎంత కష్టపడి సంపాదించిందో చెప్తాడు.నాటి నుండి గోవిందు తన మార్గం మార్చుకుని బుద్ధిగా చదువుకుంటాడు.
నిరంజనశర్మకు పక్షవాతం వస్తుంది. ఆ సమయంలో వర్ధిని కాస్త సన్నిహితంగా కాళిదాసుతో వ్యవహరించే శైలిలో మసులుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె కిరసనాయిలు పోసుకుని తనను తానే కాల్చుకుని మరణిస్తుంది. ఈ మరణం కాళిదాసును బాధిస్తుంది.
శంకర శాస్త్రి గారి కూతురు రుక్మిణికి పెళ్లి సంబంధం కుదురుస్తాడు కాళిదాసు. స్కూల్ లో పరీక్షలు పూర్తవుతాయి. సెలవులకు కాళిదాసు అక్క ఇంటికి వెళ్తాడు.అతను వచ్చేవరకు ఆ దొరికిన బాబును ఆ ఇంటి పనిమనిషి చూసుకుంటానని మాట ఇస్తుంది. అతను రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో తోటి ప్రయాణికురాలిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆమె తాను అమ్యూజ్మెంట్ సెంటర్ లో చూసిన పట్టాభి స్నేహితురాలని గుర్తుకు వస్తుంది.
కాస్త చదువు,సంగీతం వచ్చిన తాను భర్త మరణించాక ఏదో సాధిద్దామని వచ్చినప్పటికి ఇక్కడ అవేమీ సాధ్యం కాదని,శరీరాన్ని అమ్ముకోలేక తన బాబాయి రమ్మంటే అక్కడ జీవించడానికి వెళ్లిపోతున్నానని,తనకు సంతోషంగా ఉందని, అదే విషయం పట్టాభికి కూడా చెప్పమని చెప్తుంది.
అక్క దగ్గరకు వెళ్ళిన కాళిదాసు తనకు బాబు దొరికిన విషయం చెప్తాడు. వారు కాస్త కలవరపడినట్టు ఉన్నా సర్దుకుంటారు. ఆ పల్లెటూరిలో అతనికి ఏమి తోచదు. ఆ సమయంలో అతనికి అక్క ఇంటికి దగ్గరలో ఉన్న ఇల్లు పాడుబడటం గమనించి అడిగితే ఆ ఇంట్లో ఉండే తల్లీకూతుర్లలో తల్లి మరణించిందని ఆ తర్వాత ఆ కూతురు ఎవరితోనే లేచిపోయిందని చెప్తారు.ఆ అమ్మాయితో తాను చిన్నప్పుడు ఆడుకున్నట్టు జ్ఞాపకం ఉంటుంది కాళిదాసుకు.
ఇక ఆ పల్లెటూరిలో ఉండలేక గర్భవతి అయిన అక్కను చూసుకోవడానికి తల్లిని అక్కడే వదిలి ఇంటికి బయల్దేరతాడు కాళిదాసు. అతను ఇంటికి వచ్చాక అతనికి తన ముందు ఓ స్త్రీ తచ్చాడుతూ ఉందని మురళి,రూబెన్ చెప్తారు. ఆ తర్వాత ఆ స్త్రీ క్షయ ఆఖరి దశలో ఉందని,ఆమె తాను అక్క గారింటికి వెళ్లినప్పుడు లేచిపోయిందని చెప్పిన అమ్మాయని అర్ధమవుతుంది. ఆమె కాళిదాసును కలవాలని అనుకుంటుందని తెలియడంతో వెళ్తాడు.తాను మోసపోయానని గర్భవతిగా ఉన్నప్పుడూ వదిలేస్తే తనకు క్షయ ఉందని అందుకే తాను ఎక్కువ రోజులు బ్రతుకను గనుక ఆ బిడ్డను కాళిదాసు ఇంటి ముందు వదిలానని చెప్పి కన్ను మూస్తుంది ఆ స్త్రీ.
ఆ బిడ్డకు చిరంజీవి అని పేరు పెడతాడు కాళిదాసు.తన జీవితంలో తాను చూసిన అందరి జీవితాలను గుర్తు తెచ్చుకుని తాను చిరంజీవిని ధ్రువతారలా వెలిగేలా పెంచాలని నిర్ణయించుకోవడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో చిరంజీవిని పెంచి గొప్పగా తీర్చిదిద్దుతాడనే పాఠకులు ముందు ఊహిస్తారు.కానీ ఆ బిడ్డను ఎలా పెంచాలి అనే నిశ్చయానికి రావడానికి ఉపాధ్యాయుడిగా ఎందరో పిల్లలను తీర్చిదిద్ది,ఎందరి జీవితాలనో దగ్గరగా చూసిన కాళిదాసు ఎలా ఓ మనిషి బ్రతకాలో,దానికి తాను ఆ బిడ్డను ఎలా పెంచాలో అన్న అంశాన్ని గురించి నిర్ణయించుకోవడమే ఈ నవల ముగింపు అవ్వడం నవలా శైలిలో ఓ వినూత్నత.
*        *        *   

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!