కొత్త టీచర్

 కొత్త టీచర్

-శృంగవరపు రచన





బాల్యంలో, యవ్వనంలో పిల్లలుగా, విద్యార్థులుగా ఉండే సమయంలో కొన్ని బలమైన అభిప్రాయాలు ఉండటం సహజం. మనిషి వ్యక్తిగా ఎదిగే క్రమంలో కొన్ని సార్లు ఆ అభిప్రాయల దగ్గరే వివిధ స్థాయిల్లో నిలబడవచ్చు లేకపోతే దానిని దాటి ఎదగవచ్చు. ఈ దశల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవం,భయం, వారికి అన్ని తెలుసునన్న భావన, నేటి అంతర్జాల ప్రపంచ జ్ఞానం వల్ల ఓ మేరకు నిర్లక్ష్యం వంటి అనేక మిశ్రమ భావాలతో ఉన్న తరగతి గదిలో ఓ టీచర్ బాధ్యత అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఓ టీచర్ ని ఇష్టపడిన విద్యార్థులు లేదా ఇష్టపడని వారు ఎవరైనా సరే హఠాత్తుగా ఆ టీచర్ మరణించడం, ఆమె స్థానంలో కొత్త టీచర్ రావడం వంటి పరిస్థితుల్లో ఆ టీచర్ పట్ల ఎలా స్పందిస్తారో అన్న అంశం కేంద్రంగా వచ్చిన టీన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'The mess you leave behind.'
అప్పటి వరకు ఓ హై స్కూల్ లో లిటరేచర్ టీచర్ గా ఉన్న విరుకా మరణించడంతో ఆమె స్థానంలో రేఖేల్ అనే కొత్త టీచర్ వస్తుంది.ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు ఓ మేరకు రెబెల్ ధోరణితో ఉంటారు.వారిలో ఇయాగో, రియో అనే విద్యార్థులకు విరుకాతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు ప్రేక్షకులకు కథ ద్వారా తెలియజేస్తాడు దర్శకుడు. ఈ సిరీస్ లో విరుకా కథ ఓ వైపు, రేఖేల్ కథ ఇంకోవైపు అంటే గతం, వర్తమానం ఒకేసారి జరుగుతూ ఉంటాయి. విరుకా భర్త మారో అదే స్కూల్ లో ఇంకో టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. అందరూ విరుకాది ఆత్మహత్యగా భావించినా అతను మాత్రం తన భార్యను ఎవరో హత్య చేసారని భావిస్తాడు.
ఇక రేఖేల్ వ్యక్తిగత జీవితంలో భర్త మిత్రుడితో సన్నిహితంగా ఉన్న వీడియోను ఆ క్లాసులోని ఓ విద్యార్థి రేఖేల్ కు పంపిస్తాడు. తను చెప్పిన ప్రశ్నలు పరీక్షా పత్రంలో లేకపోతే ఆ వీడియో ఆమె భర్తకు పంపిస్తానని మెసేజ్ రావడంతో అవే ప్రశ్నలు పరీక్షలో ఉండేలా చూస్తుంది రేఖేల్.విరుకా కూడా అదే ప్రశ్నలు ఇచ్చిందని ఆమె భర్త మారో చెప్తాడు. ఆమె చనిపోయినట్టు తాను కూడా మరణిస్తానేమోనని భావించిన రేఖేల్ విరుకా చావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఇక విరుకా కథకు వస్తే ఆమె భర్త మారో ఇద్దరూ విడిపోయినట్టు నటిస్తారు. అలా నటించి ఒంటరిగా ఉంటున్నట్టు నమ్మించి పారిశ్రామిక వేత్త మరియు రాజకీయ పలుకుబడి ఉన్న ఇయాగో తండ్రితో విరుకా సంబంధం పెట్టుకుంటుంది. విరుకాను ఇయాగో ఇష్టపడతాడు. అతనితో కూడా సంబంధం పెట్టుకుంటుంది విరుకా. ఇయాగో కు అతని తండ్రిని కలవనని మాట ఇచ్చిన విరుకా తన అవసరాల రీత్యా ఆ పని చేయలేకపోతుంది. విరుకా తనతో ఉండాలనుకున్న తన తండ్రి వల్లే ఉండలేకపోతుందని భావించిన ఇయాగో కొన్ని వీడియోలు ఆమెకు పంపిస్తాడు. వాటిని చూసి తన తండ్రి ఎంత క్రూరూడో తెలుసుకోమని చెప్తాడు ఇయాగో. ఆ వీడియోల ద్వారా ఇయాగో తండ్రి తన కొడుకు ఇయాగోతో వ్యభిచారం చేయిస్తున్నాడని తెలుసుకున్న విరుకా, ఆ విషయం ద్వారా ఇయాగో తండ్రిని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఆమెను హత్య చేస్తాడు ఇయాగో తండ్రి. ఆ హత్యలో తప్పని సరి పరిస్థితుల్లో ఇయాగో కూడా భాగం అవుతాడు.
ఈ విషయాలన్నీ తెలుసుకున్న రేఖేల్ ను కూడా చంపే ప్రయత్నం రేఖేల్ తండ్రి చేసినప్పుడు ఇయాగో ఆమె పారిపోయే ఏర్పాటు చేస్తాడు. అలా విరుకా హత్య మిస్టరిని కనుక్కున్న రేఖేల్ ఆ పని చేసేలా చేయడానికే అంతకు ముందు విరుకాకు పంపినట్టే ప్రశ్నలు పంపుతాడు.విరుకా గురించి తెలిసేలా చేస్తాడు.
కొన్ని బంధాల్లో కొన్ని కోణాలకే పరిమితం అవ్వడం మంచిదని చెప్పడం సులభమే కానీ ఉపాధ్యాయులు లేదా ఆరాధించే వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి కలిగి ఉండటం సహజం. ఈ సహజత్వ ధోరణిలో వారిని సామాన్యులుగా భావించకుండా ఉండటం వల్ల వారి జీవితంలోని కొన్ని విషయాలు అసాధరణాలుగాను, కొన్ని తప్పులుగాను కనిపిస్తాయి. ఏది ఏమైనా ఎవరి మీద గౌరవం అయినా సరే వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడనంత వరకు మాత్రమే. టీన్ సిరీస్ లో మంచి సిరీస్. జీవితంలో ఓ దశకు పయనించి వచ్చిన అనుభూతి కలుగుతుంది ఈ సిరీస్ వల్ల.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!