పాత కథ

 పాత కథ

-శృంగవరపు రచన





స్త్రీ జీవితంలో,ఆలోచనా దృక్కోణంలో సమాజంలో ఉన్న వివాహ సంస్కృతి ప్రభావిత పాత్రను పోషిస్తుంది. జన్మించినప్పటి నుండి తాను ఇంకొకరికి నచ్చాలంటే ఎలా ఉండాలి,ఎలా అలంకరించుకోవాలి,ఎలా ఆలోచించాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు వివాహంలో భర్త ఆశించే ప్రాధాన్యతల నుండి వెతుక్కోవడంతో ఆమె తన జీవితంలో భవిష్యత్తులో తలెత్తబోయే అభద్రతల గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. మొదట ప్రేమ కోసం,తర్వాత స్వేచ్చ కోసం స్త్రీ చేసే పోరాటమే కొన్ని సార్లు ఆమె జీవితంగా పరిణమిస్తుంది. అటువంటి ఓ స్త్రీ జీవితం గురించి స్పష్టం చేసేలా మంజు కపూర్ రాసిన నవలే ‘A Married Woman.’
ఈ నవలలో ప్రధాన పాత్ర ఆస్తా. ఆమె ఢిల్లీలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ముప్పైల్లో పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమె తల్లికి తన భర్త రిటైర్ అయ్యేలోపు కూతురి జీవితం సెటిల్ అవుతుందో లేదో అన్న బెంగ ఉండేది. యవ్వనంలో ఉన్న ఆమె బంటి అనే పొరుగింటి అతన్ని ప్రేమించినప్పుడు,కేవలం ఉత్తరాల ద్వారా ప్రేమను తెలియజేసుకున్న ప్రేమ కాస్తా,ఆస్తా తల్లి చేతుల్లో ఆ ఉత్తరాలు పడటం వల్ల బంటి తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. ఆ తర్వాత కాలేజీలో ఉన్నప్పుడూ ఆమె ప్రేమించి,రహస్యంగా కలుసుకుని ముద్దులు పెట్టుకున్న ప్రేమికుడు కూడా అమెరికాలో చదువు కోసం వెళ్ళిపోవడంతో ఆ ప్రేమ కూడా ముగిసిపోయింది. అలా ప్రేమలు ముగిసిపోయిన తర్వాత ఆమె జీవితంలో పెళ్ళికి ముందు ప్రేమల పట్ల నమ్మకాన్ని ఓ మేరకు కోల్పోయింది.
ఈ సమయంలో ఆమెను వెతుక్కుంటూ ఓ పెళ్ళి సంబంధం రావడం,వారు స్థితిమంతులు కావడం,తనను వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇష్టపడి పెళ్ళి ప్రతిపాదనతో రావడంతో వెంటనే ఒప్పుకుంటుంది ఆస్తా. అలా ఆస్తా వివాహం హేమంత్ తో అవుతుంది. హేమంత్ తో ప్రేమలో మునిగిపోయి,ఆ ప్రేమ మాత్రమే మొదట జీవితం అనుకుంటుంది ఆస్తా. ఆస్తా తండ్రి రిటైర్ అయిన కొంతకాలానికి మరణిస్తాడు. ఆ తర్వాత ఆస్తా తల్లి ఋషికేష్ లోని ఓ స్వామీజీ ఆశ్రమంలో జీవితం గడుపుతుంది. అప్పటి వరకు ప్రతి విషయం గురించి ఆలోచించి,బెంగపడి అన్నింటి పట్టించుకునే తల్లి ఒక్కసారిగా ఏది పట్టని వ్యక్తిగా మారడం ఆస్తాను ఆశ్చర్యపరుస్తుంది. తర్వాత అనురాధ,హిమంషు పుడతారు. అప్పటి వరకు భర్త ప్రేమ మాత్రమే జీవితం అనుకున్న ఆస్తా తన స్వేచ్చ గురించి ఆలోచించి ఓ స్కూల్ లో టీచర్ గా చేరుతుంది.
హేమంత్ మొదట బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేసినా తర్వాత టీవీల వ్యాపారంలోకి అడుగుపెడతాడు. ఆ వ్యాపారంలో బిజీ అయిపోయిన హేమంత్ ఆస్తాతో అంతకు ముందున్న తీరులో ఉండలేకపోతాడు.ఆస్తా కు ఓ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా ఓ థియేటర్ ఆర్టిస్ట్ మరియు టీచర్ అయిన అయిజాజ్ తో పరిచయం ఏర్పడుతుంది. అయిజాజ్ ఓ డ్రామా ఆస్తా పని చేస్తున్న స్కూల్ లో ప్రదర్శించడం వల్ల ఏర్పడిన ఈ పరిచయం వల్ల బాబ్రీ మసీదు,రామ జన్మభూమి వివాదం గురించి ఓ నాటకం వేయబోతున్నానని,అందులో స్క్రిప్ట్ కోసం తనకు సాయం చేయమని అడుగుతాడు.అందుకోసం ఆ అంశం మీద పూర్తిగా తెలుసుకున్న ఆస్తా ఆలోచనల్లో తెలిసిన విషయం పట్ల ఆమెకు ఉన్న స్పందనను ఆమె తనకు అప్పటికే పరిచయం ఉన్న పెయింటింగ్ ద్వారా స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత అయిజాజ్ ను ఆ మాత్రం పరిచయానికే అతన్ని ఇష్టపడుతుంది ఆస్తా.ఆమె తన ఇష్టాన్ని తెలియజేయకముందే అతను ఇంకో స్త్రీని ఇష్టపడ్డాడని తెలుసుకుని ఆ ప్రేమను అంతం చేసుకుంటుంది తనతోనే.
ఆస్తా తల్లి తన భర్తతో ఉన్నప్పుడూ ఉన్న ప్రాపర్టీని అమ్మి తన అవసరాలకు ఉంచుకుని,మిగిలింది తన అల్లుడు హేమంత్ కు ఇస్తుంది. డబ్బు మగవాళ్ళ వ్యవహారమని భావించిన తన తల్లి తన భర్తకు ఇవ్వడం తర్వాత తెలియడంతో ఆశ్చర్యపడిన ఆస్తా ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలో అన్న అంశం పట్ల తనకు కూడా అధికారం ఉంటే బావుండు అని భావించి ఆ ప్రస్తావన హేమంత్ దగ్గర తీసుకువచ్చినా అతను దానిని పట్టించుకోడు.
పీపీలిక ఈ నవలలో ఇంకో ముఖ్య పాత్ర. తండ్రి బాల్యంలోనే మరణిస్తాడు. ఆమె తల్లి కేంద్రీయ విద్యాలయంలోపని చేస్తూ కొడుకు అజయ్ ను,ఆమెను చదివిస్తుంది. ఎంతో పోటీగా చదివిన అజయ్ అమెరికాలో స్థిరపడిపోతే,పీపీలిక మాత్రం తల్లి కోసం ఇక్కడే ఉండిపోయి ఎన్ జి ఓ లో స్లమ్ ఏరియాలో ప్రజల కోసం పని చేస్తుంది. ఆమె అయిజాజ్ ను ఇష్టపడటం,ఇద్దరి మతాలు వేరైనా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అది జరిగిన కొన్నాళ్లకే బాబ్రీ మసీదు-రామ జన్మ భూమి వివాదం మీద ఓ నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో అయిజాజ్ తో ఇంకో తొమ్మిది మందిని ఓ వ్యాన్ లో పెట్టి తగులబెడుతారు. అతని మరణం తర్వాత అతని స్మృతిలో ఏర్పాటు చేసిన నిరసనలో భాగం అవుతుంది ఆస్తా. అప్పటి నుండి పెయింటింగ్స్ ను వేస్తూ ఉంటుంది. సమాజంలో జరుగుతున్న అంశాలకు తన పెయింటింగ్స్ ద్వారా స్పందిస్తూ ఉంటుంది. ఆమె వేసిన పెయింటింగ్ ను ఛారిటీ కి ఇస్తుంది. అది అమ్ముడు పోవడంతో ప్రోత్సాహంగా భావించి పెయింటింగ్స్ సీరియస్ గా తీసుకుని వేస్తుంది. అయిజాజ్ మరణంతో క్రుంగిపోయిన పీపీలిక తెరుకుంటుంది.
అయోధ్య వివాదం గురించి ఓ ప్రసంగం ఇవ్వడానికి రామ జన్మభూమికి వెళ్ళిన ఆస్తా అక్కడ పీపీలికను కలుస్తుంది. అక్కడి నుండి వారిద్దరి మధ్య లెస్బియన్ సంబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆస్తా వేసిన ఓ పెయింటింగ్ అమ్ముడుపోవడం దానికి వచ్చిన డబ్బును,కుటుంబం అంతా గోవా టూర్ వెళ్ళడానికి వినియోగించడానికి హేమంత్ నిర్ణయం తీసుకోవడం,వారు గోవా వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయంలో ఆస్తాకు ఓ వెండి బాక్స్ నచ్చడం,దాని ఖరీదు ఎక్కువని దానిని కొనడానికి హేమంత్ ఒప్పుకోకపోవడం ఆస్తాను బాధిస్తుంది. తన ఉనికి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
పీపీలికతో ఈ సమయంలో ఏర్పడిన అనుబంధంలో తాత్కాలికంగా ఓ మేరకు ఊరటను చెందిన ఆస్తా పీపీలికకు అమెరికాలో పిహెచ్ డి చేసే అవకాశం రావడంతో వెళ్ళిపోవడంతో ఒంటరి అవుతుంది. పెయింటింగ్స్ అమ్ముడు పోవడం వల్ల ఆర్థికంగా స్థిరపడిన ఆస్తా మానసిక ఆలంబన లేకపోవడం వల్ల అశాంతితో మిగిలిపోవడంతోనే నవల ముగుస్తుంది.
మొదట స్త్రీ తనను ప్రత్యేకంగా గుర్తించడం జీవితంలో భాగంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకు ప్రేమ మార్గమని భావించి యవ్వనంలో ప్రేమించి విఫలమై,పెళ్ళి తర్వాత ప్రేమలో తనను తానుగా ప్రేమించే వ్యక్తి కాకుండా భార్య హోదాకు మాత్రమే ఆపాదించే ప్రేమను పొంది,నిర్ణయాధికారం లేని స్థితి నుండి పొందిన బాధతో చిన్న పరిచయానికే అయిజాజ్ ను ఇష్టపడే దశలో ఉన్న ఆస్తా, మానసిక ఆలంబన కోసం పీపీలికతో ఒకటైనా ఆ తర్వాత అక్కడ కూడా ఆమె కోసం కుటుంబాన్ని ఒదులుకోలేక పీపీలికను కూడా కోల్పోయింది. కుటుంబం కోసం రాజీపడిపోతూ బ్రతకడమే జీవితమని ఆస్తా అర్ధం చేసుకుంటూ,బాధ పడుతూ జీవితం కొనసాగిస్తూ ఉండటమే కొన్ని సార్లు వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుందని రచయిత్రి ఈ ముగింపుతో స్పష్టం చేస్తుంది. ఈ ముగింపును సంపాదించగల దశ కూడా మార్చలేకపోవడం గమనార్హం. ఇదే ఎందరో వివాహితులైన స్త్రీల కథ. కొత్త మలుపులు లేని పాత కథ. ఇది ఆర్థిక స్వావలంబనకు సంబంధించినది కాదు,మానసిక స్థితికి సంబంధించినది. ఇలా ఉండిపోవడంలో సంతృప్తిని పొందుతూ,దీనికి వ్యతిరేకంగా ఉంటే అపరాధ భావన కలుగుతుందన్న భయంతో ఇలా మిగిలిపోవడమే ఈ జీవిత కథా వలయం.
*     *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!