చాణక్యుడు -నేటి భారతం

 చాణక్యుడు -నేటి భారతం

-శృంగవరపు రచన




ఆంగ్ల సాహిత్యంలో అంశాల వైరుధ్యం,కథా వాతావరణం,రచనా పరిశోధన పాఠకులకు ఆ సాహిత్యాన్ని దేశంతో సంబంధం లేకుండా దగ్గర చేయడమే కాకుండా, విశ్వ సాహిత్యంలో దాదాపు 75 శాతం ఆంగ్ల సాహిత్యమే ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది. భారత రచయితల్లో ఎంతో మంది కూడా ఆంగ్ల రచనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. ఆశ్విన్ సాంఘి,అమితావ్ ఘోష్,అరవింద్ అడిగా, అమిష్ త్రిపాఠి,ఆనంద్ నీలకంఠన్ ,అరుంధతి రాయ్, అనితా దేశాయ్, చిత్రా బెనర్జీ దివకారుని,ఇందు సుందర్శన్ ,కవితా కేన్ వంటి భారతీయ రచయితలు ఆంగ్ల రచనలు చేయడంలో తమదైన శైలిని స్పష్టం చేయడంలో విజయం సాధించారనే చెప్పాలి. చరిత్ర,ఇతిహాసాలు,రాజకీయాలు,సైన్స్ ఫిక్షన్ వంటి లోతైన అంశాలను ఎన్నుకుని భారత సాహిత్యం విశ్వ సాహిత్య ప్రాధాన్యతను సంతరించుకోవడంలో భారతీయ ఆంగ్ల రచయితల పాత్ర విశిష్టమైనది. వీరిలో అశ్విన్ సాంఘి విలక్షణమైన రచయిత. ఆంగ్లంలో డాన్ బ్రౌన్ ‘డావిన్సీ కోడ్’ తో పోలికలు ఉన్న ‘రోజాబెల్ లైన్’ నవలతో ఆయన తన సాహిత్య ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రాసిన రెండో నవల ‘చాణక్యాస్ చాంట్ ‘ తో ప్రపంచ ప్రసిద్ధ రచయితగా మారాడు. ప్రస్తుతం అమెరికన్ ఆంగ్ల రచయిత జేమ్స్ పాటర్సన్ తో కలిసి ప్రైవేట్ సిరీస్ రాస్తున్న ఈ రచయిత రాసిన ‘చాణక్యాస్ చాంట్’’ ఎందరో రాజకీయవేత్తలను,రచయితలను ఆలోచనలో పడెయ్యడమే కాకుండా ఆశ్విన్ ను బెస్ట్ సెల్లర్ రచయితగా కూడా మార్చింది.
భారత రాజకీయ గురువు చాణక్యుడు. చంద్రగుప్తుడును తీర్చిదిద్ది అటు కింగ్ మేకర్ గాను, అర్ధశాస్త్ర వంటి గ్రంథాన్ని రచించి ఇటు ఆర్థికవేత్తగాను భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. చాణక్యుడు –చంద్రగుప్తుడు కథతో పాటు, అది జరిగిన 2300 సంవత్సరాల తర్వాత భారత దేశంలో కాన్పూర్ లో జరుగుతున్న అటువంటి ఇంకో కథను ప్యారలల్ గా నడుపుతూ అశ్విన్ రాసిన నవలే ‘చాణక్యాస్ చాంట్.’ చాణక్యుడు చంద్రగుప్తుడును తయారు చేయడానికి ప్రేరేపించిన నాటి పరిస్థితులు,నాడు మగధ రాజ్యంలో నెలకొని ఉన్న అస్థిరత,మగధ చుట్టూ ఉన్న రాజ్యాల్లో మగధను ఎలా అయినా తమ సొంతం చేసుకోవాలనే తపన,విద్యావంతులై ప్రశ్నించే వారిని నానాయాతనలు పెట్టే రాజులు ఉన్న నాటి భారత చిత్రంలో చాణక్యుడి ఆవశ్యకతను,అతను అవలంభించిన నీతిని, ఆ నీతిలో లక్ష్య సాధన కోసం దేనినైనా పక్కన పెట్టగల ధృడ సంకల్పాన్ని కొంత కల్పనతో చక్కగా రాశాడు అశ్విన్. నాటికి,నేటికి చాణక్యుని నీతి,వ్యూహాలు రాజకీయ చదరంగంలో వర్తింపదగినవే అని రచయిత ఈ రెండు కథల ద్వారా స్పష్టం చేస్తాడు.
ఈ కథ 2300 సంవత్సరాల ముందు జరుగుతూ ఉన్న కథ.మగధ రాజ్యం రాజధాని పాటలీపుత్ర. ధనానందుడు రాజుగా ఉన్న కాలమది. మంత్రిగా విద్యావంతుడు అయిన షక్టర్ వ్యవహరిస్తున్నాడు.రాజ్యంలో స్త్రీలకు భద్రత ఉండకపోవడం,ఇంకెన్నో సమస్యలు ఉండటం గురించి మంత్రి రాజుతో నిర్మొహమాటంగా చెప్తున్న సమయంలో,అది నచ్చని రాజు అతన్ని చెరసాలలో వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పటికే రాజు బాధ్యతారాహిత్యంతో విసిగిపోయి ఉన్న ప్రజలను జాగృతపరచడానికి షక్టర్ మిత్రుడు మరియు ఆచార్యుడు అయిన చణక్ మహామంత్రి చెరసాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో రాజు అతన్ని చంపేయ్యమని ఆదేశిస్తాడు. అది కూడా క్షణాల మీద జరిగిపోతుంది.
మగధ రాజ్యంలో షక్టర్ మరియు చణక్ లకు మిత్రుడు మరియు ఆ రాజ్యంలో ఓ మంత్రి అయిన కాత్యాయునుడు చణక్ కొడుకైన విష్ణుగుప్తుడును అక్కడిని నుండి తక్షశిల విశ్వవిద్యాలయానికి పారిపొమ్మని చెప్తాడు. అలా విష్ణుగుప్తుడు తన కుటుంబాన్ని,తాను ఎంతగానో ప్రేమించిన షక్టర్ కూతురు అయిన సువాసినిని, తన ప్రాంతాన్ని విడిచి పారిపోతాడు. కాత్యాయునుడి మిత్రుడు ఆ విశ్వవిద్యాలయంలో ఉండటం వల్ల విష్ణుగుప్తుడుకు ఆ విశ్వవిద్యాలయంలో మొత్తానికి చదివే అవకాశం లభిస్తుంది.విష్ణు గుప్తుని తెలివితేటలు అక్కడి ఆచార్యులను సైతం అబ్బురపరుస్తాయి. కానీ ఆ విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్ధులు దాదాపుగా రాజ్య వంశీయులే. విష్ణుగుప్తుని ఆకారం అతన్ని అవహేళనలకు గురయ్యేలా మొదట్లో చేసినా అతను పట్టించుకునేవాడు కాదు. మగధ రాజ్యంలో రాక్షసాస్ రాజుకు ప్రధానమంత్రిగా నియమించబడతాడు.
విష్ణుగుప్తుడు చణక్ కొడుకు కనుక చాణుక్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడి విద్య పూర్తి చేసుకుని విద్యార్ధి స్థాయి నుండి అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడి స్థాయికి ఎదిగాడు. తిరిగి మగధకు వచ్చిన చాణక్యుడు ధనానందుడును అతని సామ్రాజ్యం నాశనం చేస్తానని,మొత్తం భారత దేశాన్ని మగధ కింద ఒక్కటిగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు ప్రతిఫలంగా అతనికి కూడా చెరసాల శిక్ష విధిస్తాడు రాజు. కాత్యాయుని సాయంతో ఆ చెరసాల నుండి బయటపడతారు చాణక్యుడు,షక్టర్.
మగధ రాజ్యానికి ఆ సమయంలో సేనాధిపతిగా ఉన్న సేనాపతి మౌర్యుడు కూడా ధనానందుడికి వ్యతిరేకంగా చాణక్యుడు బయటపడటానికి సాయం చేస్తాడు. సేనాపతి మౌర్యుడు ఒకప్పటి మగధ రాజ్యం రాజైన మహానందిన్ అనే రాజు కొడుకు. సేనాపతి మౌర్యుడికి ఆ రాజ్యానికి రాజయ్యే వారసత్వం ఉన్నప్పటికి అతని కన్నా ముందే రాజుకు ఎందరో కొడుకులు ఉండటం వల్ల రాజు అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ కాలక్రమేణా వారెవ్వరూ కూడా ఆ రాజ్యానికి యోగ్యులయ్యే వారసులుగా పరిణమించలేదు. ఆ సమయంలో రాజుకు సన్నిహితుడిగా మెలిగిన మంగళి మహాపద్మ రాజు నిర్ణయాలను సైతం ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాడు. రాణిని వలలో వేసుకున్న అతను మెల్లగా ఆ రాజ్యానికి ఉన్న వారసులను అడ్డు తొలగించడమే కాకుండా,తానే రాజు అయ్యాడు.మహాపద్మ తండ్రి క్షత్రియుడు మరియు తల్లి శూద్రురాలు.
మహాపద్మ సేనాపతి మౌర్యకు ఉన్న తెలివితేటలు గుర్తించి అతన్ని తన రాజ్యానికి సేనాధిపతిగా చేసుకున్నాడు. సేనాపతి మౌర్య,చాణక్యుడు,షక్టర్,కాత్యాయునుడు,జీవసిద్ధి కలిసి మగధ రాజ్యపు కోశాగారంలో కొంత దొంగతనం చేసి దానితో ప్రత్యేక సైన్యాన్ని,గుర్రాలను ఏర్పాటు చేసే బాధ్యత సేనాపతి మౌర్యకు అప్పగిస్తాడు. సేనాపతి మౌర్య కొడుకు చంద్రగుప్తుని తెలివితేటలు గుర్తించిన అతన్ని మగధ రాజ్యానికి రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు చాణక్యుడు. అతన్ని తనతో పాటు తక్షశిల విశ్వవిద్యాలయానికి శిక్షణ ఇవ్వడానికి తీసుకువెళ్తాడు.
భారత దేశంలో అతి పెద్ద రాజ్యమైన మగధ తర్వాత ఓ మేరకు ప్రాధాన్యత సంతరించుకున్న రాజ్యాలు గాంధార రాజ్యం,కైకేయి రాజ్యం. గాంధార రాజ్యం రాజు వృద్ధుడు అవ్వడం అతని కొడుకు అంబి అన్ని నిర్ణయాలు తండ్రికి తెలియకుండా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటికే అలెగ్జాండర్ భారత దేశాన్ని ఆక్రమించడానికి దండెత్తే ప్రయత్నంలో ఉన్నాడు. అలెగ్జాండర్ తో కలిసి పోయే ప్రయత్నంలో ఉన్నాడు అంబి. అంతే కాకుండా కైకేయి రాజ్యానికి అర్ధరాత్రుళ్ళు మారువేశాల్లో కొందరు సైనికులను పంపి వారి పశు సంపదను హతమార్చేలా చేశాడు. దీనితో కైకేయి రాజు గాంధారపై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.కైకేయి రాజ్యపు ప్రధానమంత్రి ఇంద్రదత్త చాణక్యుడి మిత్రుడు. ఈ యుద్ధం వల్ల ప్రయోజనం ఉండదని దాని వల్ల అంబి అలెగ్జాండర్ తో ఇంకా బాగా కలిసిపోతాడని చెప్తాడు చాణక్యుడు.అయినా అతని సలహాను వినకుండా గాంధార రాజ్యంపై కైకేయి రాజ్యం యుద్ధం ప్రకటిస్తుంది. గాంధార రాజ్యం లొంగిపోయినా ఆ యుద్ధం వల్ల ఏ ప్రయోజనం ఉండకుండా పోతుంది. ఆ తర్వాత అంబి తన తండ్రిని హత్య చేసి అలెగ్జాండర్ తో కలిసిపోతాడు. అలెగ్జాండర్ తో ఎదురుతిరిగి కైకేయి రాజు పురుషోత్తముడు పోరాడతాడు.అతని ధైర్యాన్ని ప్రశంసించిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చి తన సామంతుడిగా చేసుకుంటాడు. మగధ రాజ్యం మీదకు అలెగ్జాండర్ దండెత్తలేదు. ఆ సమయంలో అలెగ్జాండర్ ఫిలిప్పోస్ ను,సెలుషియస్ ను ఇక్కడి రాజ్యాలను చూసుకునే బాధ్యతను అప్పగించి తిరిగి వెళ్ళిపోతాడు.అలెగ్జాండర్ కు ఇక్కడ అనువాదకుడిగా వ్యవహరించింది శశిగుప్త.
మొత్తానికి అలెగ్జాండర్ మధ్యలోనే అనారోగ్యంతో మరణిస్తాడు. అప్పటికే చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడితో గొడవ పడినట్టు నాటకమాడి మొత్తానికి ఆ సింహాసానికి పోటీగా ఉన్న ధనానందుడిని తెలివిగా బహిష్కరించేలా చేసి చంపిస్తాడు. ఆ తర్వాత పోటీగా ఉన్న కైకేయి రాజు పురుషోత్తముడికి, గాంధార రాజుకు మధ్య ద్వంద యుద్ధం ప్రకటించి గెలిచిన వారిది సింహాసనం అని చెప్తాడు. మొత్తానికి గెలిచిన పురుషోత్తముడిని విషకన్య ద్వారా హత్య చేయిస్తాడు. అలా చంద్రగుప్త మౌర్యుడిని రాజును చేస్తాడు.
ఇక సువాసినికి మాట ఇస్తాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరికైనా సరే తన జ్ఞానం ఉపయోగపడుతుందని కానీ అది కేవలం స్త్రీ ఉన్నతికే పనికి వస్తుందని చెప్తాడు.
ఇది జరిగిన 2300 సంవత్సరాల తర్వాత కలకత్తాలో గంగాసాగర్ మిశ్రా అదే తెలివితో ఓ స్త్రీని ప్రధాన మంత్రిని చేస్తాడు. గంగాసాగర్ మిశ్రా తానున్న ప్రదేశంలో గుండా అయినా ఇక్రమ్ ను మేయర్ అయ్యేలా చేస్తాడు. అలాగే అక్కడ ఉన్న పాన్ షాప్ యజమాని కూతురు చాందిని గుప్తాను అమెరికా వెళ్ళి చదువుకునే ఏర్పాటు చేస్తాడు.
అక్కడ ఆమె ప్రేమలో పడి గర్భవతి అయితే అలా చేసిన వ్యక్తిని చంపించడమే కాకుండా ఆమెను చూసుకోవడానికి ఇంకో అమ్మాయిని, ఆమె తండ్రిని ఉంచుతాడు. చాందిని కి బిడ్డ చనిపోయిందని చెప్పి ఆమెకు పుట్టిన కొడుకును ఆమె స్నేహితురాలు పెంచేలా చేస్తాడు. కలకత్తా తిరిగి వచ్చిన చాందినిని మాత్రమే ఇక కేంద్ర స్థాయి పదవుల్లో ఉండేలా చేయాలనుకున్న గంగాసాగర్ దానికి ఇక్రమ్ ఒప్పుకోడని తెలిసి అతని మీద ఉన్న పాత కేసులు తవ్వించి మొత్తానికి భయపెట్టి అతన్ని చాందినిని దత్తత తీసుకునేలా చేసి అతని రాజకీయ వారసురాలిని చేస్తాడు.
ఆ తర్వాత ఆమె కోసం కేంద్ర ప్రభుత్వంలో అల్లకల్లోలo సృష్టించి మొత్తానికి ఆమెను ప్రధానమంత్రిని చేసి మరణిస్తాడు క్యాన్సర్ తో.
ఆ తర్వాత మూడు సార్లు ప్రధాని గా చేసిన చాందిని తన కొడుకును కలుసుకోవడం, ఇక తనకు కొడుకే ముఖ్యం అనుకోవడంతో నవల ముగుస్తుంది.
శత్రువును పూర్తిగా అంతం చేయడం, లక్ష్యానికి అడ్డుగా ఉన్న దేనినైనా తొలగించడం, నిరంకుశంగా వ్యవహరించడం వంటి లక్షణాలే చాణక్యుడు ఈ నవలలో విజయాన్ని సాధించాడానికి వాడిన అస్త్రాలు. తాను ఏం చేయబోతున్నానో ఎవరూ ఊహించలేకుండా ప్రవర్తించడం కూడా ఈ విజయానికి మూలం.
భారతీయ ఆంగ్ల రచయితల్లో అశ్విన్ సాంఘి రచన ఏదైనా సరే భారతీయ మూలాలను పరిపూర్ణ కోణాల్లో, సమకాలీన పరిస్థితులకు అన్వయించేలా రాస్తారు.
*    *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!