కొడుకు భవిష్యత్తు

 కొడుకు భవిష్యత్తు

-శృంగవరపు రచన




క్రైమ్ థ్రిల్లర్స్ ఎన్ని రకాలుగా వచ్చినా చదవడమో, చూడటమో ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది. దానికి కారణాలు ఆలోచిస్తే సహజంగానే నేర ప్రవృత్తిలో ఉండే తెలివి తేటలను, మోటివ్ లను కల్పనలో అయినా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం వల్లనెమో!చదివిన అన్ని పుస్తకాలు మాస్టర్ పీసెస్ అని అయితే చెప్పలేము. ముఖ్యంగా క్రైమ్ సిరీస్ రాసే రచయితలను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రైమ్ సిరీస్ రాసే ఆంగ్ల, బ్రిటన్ రచయితలు ఎంతో మంది. ఫ్రెడ్రిక్ ఫోర్ సిత్ లాంటి రచయిత ఈ సిరీస్ కు సమకాలీన ప్రపంచ రాజకీయాలను ఎన్నుకుంటే, జేమ్స్ పాటర్సన్, లీ చైల్డ్, కిల్ లాంటి వారు కేవలం Crime &Circumstances కి పరిమితమై రాసినా ఇన్ని ఎలా రాస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య అంటే 2010 నుండి రాస్తున్న హార్లాన్ కోబెన్ లో కథ చెప్పడంలో ఓ వినూత్న శైలి ఉందని ఓ నవల చదివాక, రెండు సిరీస్ చూసాక అనిపించింది. పాపం ఆ రచయిత కూడా మామూలు మనిషే కదా, ఓ నేరం-నేరస్తుడు-మోటివ్ ను 350పేజీల వరకు లాగడం అంటే కష్టమే. అందుకే 'Drop Shot'లో ఇన్వెస్టిగెషన్ టెక్నీక్ తో లాగేసాడు అలా.
ఓ మాజీ టెన్నిస్ ప్లేయర్ సింప్సన్ ను టెన్నిస్ స్టేడియంలో ఎవరో షూట్ చేసి చంపేస్తారు.ఈ నవలలో నాయకుడు అయిన మైరాన్ డ్యూరాన్ అనే టెన్నిస్ ప్లేయర్ కు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడు.సింప్సన్ చనిపోయే ముందు మైరాన్ ను కలిసే ప్రయత్నం చేసింది. అందుకని ఈ మర్డర్ మీద మైరాన్ ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంటాడు.
సింప్సన్ 16ఏళ్లకే ప్రసిద్ధి పొందిన టెన్నిస్ ప్లేయర్ గా పేరు పొందినా, ఒత్తిడి తట్టుకోలేక ఆమె బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆమె కెరియర్ మధ్యలోనే అంతమైపోయింది. ఇకపోతే చనిపోయే ముందు సింప్సన్ ఆఖరి కాల్ డ్యూరాన్ కు చేసింది. డ్యూరాన్ తనకు ఆమె తెలియదని స్పష్టం చేస్తాడు.
సింప్సన్ మరణించిన ఆరేళ్ళ ముందు సెనేటర్ కొడుకు అలెగ్జాండర్ ను కూడా ఇద్దరు బ్లాక్ యువకులు అదే టెన్నిస్ స్టేడియం లో హత్య చేయడం, ఆ ఇద్దరిలో ఒకరిని అక్కడిక్కడే పోలీసులు షూట్ చేయడం, రెండో అతను పారిపోవడం, పారిపోయిన అతన్ని సెనేటర్ ఆపాటికే చంపించి ఉంటాడని అందరూ అనుకోవడం జరుగుతుంది.
ఈ రెండు హత్యలకు ఏదో సంబంధం ఉందని మైరాన్ భావిస్తాడు. తర్వాత తెలీది ఏమిటంటే ఆ ఇద్దరు బ్లాక్స్ లో ఒకరు కర్టెన్, ఇంకొకరు అతని కజిన్. కర్టిన్ ఎంతో తెలివైన వాడు. చదువులో ముందున్నాడు. టెన్నిస్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న అతను స్టేడియం లో ప్రాక్టీస్ చేయడానికి ఆ రోజు స్టేడియం కు వెళ్లారు. అదే సమయంలో ఆ స్టేడియం లో సెనేటర్ ఇస్తున్న ఫంక్షన్ లో ఉన్న అలెగ్జాండర్ తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకుని ఉండటం, స్టేడియం కు బ్లాక్స్ రావడం పట్ల ఉన్న అసహనంతో అతను వారిద్దరితో గొడవ పడటం, ఆ గొడవలో కజిన్ అలెగ్జాండర్ ను పొడిచి చంపడం, అది పక్కన నుండి సింప్సన్ చూడటం జరుగుతుంది. అక్కడ నుండి పారిపోతున్న ఆ ఇద్దరు కారులో వెళ్తున్న సమయంలో పోలీసులు వెంబడిస్తూ కజిన్ ను దూరం నుండి కాల్చడం,ఆపాటికే అక్కడ ఉన్న కర్టెన్ తల్లి తన కొడుకును కాపాడుకోవడం కోసం కజిన్ ను దగ్గర నుండి రెండో సారి కాల్చడంతో అతను మరణిస్తాడు. కర్టెన్ ను అజ్ఞాతంగా దాస్తుంది ఆ తల్లి. దగ్గగరగా కాల్చడం వల్ల అతని ముఖం గుర్తు పట్టలేకుండా ఉంది. అతనే తన కొడుకు అని అందరిని నమ్మిస్తుంది ఆ తల్లి. కజిన్ పారిపోయాడని అందరిని నమ్మిస్తుంది.
అలా ఐదు సంవత్సరాలు అజ్ఞాతంగా ఉన్న కర్టెన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని డ్యూరాన్ గా మారాడు. అయినా ఎవరైనా గుర్తు పడతారేమో అన్న భయంతోనే ఉన్నాడు. సింప్సన్ డ్యూరాన్ ను గుర్తించింది. ఆ విషయం చెప్పడానికే డ్యూరాన్ ను కలిసే ప్రయత్నం చేసింది. డ్యూరాన్ కు కాల్ చేసింది.
మ్యాచ్ జరుగుతున్న రోజు సింప్సన్ ఆఫీసులో మైరాన్ ను కలవడం కుదరకపోవడం వల్ల అక్కడ కలుద్దామని అనుకుని వచ్చింది. డ్యూరాన్ మ్యాచ్ లో ఉన్నాడు. అతని తల్లి ఆమెను ఎవరూ గమనించకుండా కాల్చి తన కొడుకు భవిష్యత్తును కాపాడుకుంది. ఈ విషయం మైరాన్ కనుక్కున్నాక డ్యూరాన్ తల్లి తాను బ్రతికి ఉంటేనే తన కొడుకు భవిష్యత్తు బావుండదని అనుకుని షూట్ చేసుకుని మరణిస్తుంది. అలా చనిపోయి కూడా కొడుకు భవిష్యత్తును కాపాడింది ఆ తల్లి.
చాలా సార్లు థ్రిల్లర్స్ తో ఉండే సమస్య ఏమిటంటే రచయిత మీద పాఠకులకు ఉండే అంచనాలు. డ్రై ఏరియాలను ఎంచుకోకుండా ఉండటమే హార్లాన్ ప్రత్యేకత. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ స్పోర్ట్స్ కు సంబంధించింది కనుక స్పోర్ట్స్ రాజకీయాలు, కోచ్ లు ఆడపిల్లలతో ప్రవర్తించే తీరు వంటి సీరియస్ అంశాల చుట్టూ కూడా తిరగడం కథను కాస్త డ్రైగా చేస్తుంది. కానీ తన థ్రిల్లర్ ముగింపులో ఎమోషనల్ టచ్ ఉండేలా చూసుకోవడం కూడా హార్లాన్ మార్క్. పర్లేదు అనిపించే నవల.
*    *   *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!