ఆశల రూపం

 ఆశల రూపం

-శృంగవరపు రచన




పాఠకుల, ప్రేక్షకుల అభిరుచుల వైవిధ్య విస్తీర్ణం రోజు రోజుకు వైశాల్య రీత్యా ఎన్నో కోణాల్లో విస్తరిస్తూనే ఉంది. ఫ్యాంటసి, వ్యాంపైర్-వర్ ఊల్ఫ్, సర్వయివల్ డ్రామాలు నేడు టాప్ సెల్లింగ్ పాయింట్లుగా అటు సాహిత్యంలోనూ, ఇటు సినిమాలోనూ నిలుస్తూ ఉన్నాయి. కొన్ని నవలలను సినిమాలుగా మార్చడం తెలికైన విషయం కాదు. ముఖ్యంగా నాన్ లీనియర్ గా నడిచే కథల విషయంలో ఇంకా కష్టమవుతుంది. అటువంటి ప్రయత్నంలో ఓ మేరకు ప్రేక్షకులకు సంతృప్తిని ఇచ్చే సిరీస్'Behind Her Eyes.' ఈ సిరీస్ సారా పిన్ బరో రచించిన బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తీసినది.
డేవిడ్ ఓ సైకియాట్రిస్ట్. అతని భార్య అడిల్. లూయస్ సింగిల్ పేరెంట్. ఆమెకు ఓ ఏడేళ్ల కొడుకు.ఆమె ఓ సారి పబ్ కు వెళ్ళినప్పుడు ఆమెకు అపరిచితుడైన డేవిడ్ ను కలుస్తుంది. వారిద్దరూ అక్కడ ముద్దు పెట్టుకుంటారు. తర్వాతి రోజు ఆఫీసుకు వెళ్లేసరికి లూయిస్ కి తన కొత్త బాస్ డేవిడ్ అని తెలుస్తుంది. తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడుతుంది.
అడిల్ లూయస్ ను ఓ సారి అనుకోకుండా కలుస్తుంది. లూయస్ ఆమెతో కూడా స్నేహంగా ఉంటుంది. ఆ విషయం డేవిడ్ దగ్గర రహస్యంగా ఉంచుతుంది. అడిల్ తో స్నేహం పెరిగే కొద్ది లూయస్ కు డేవిడ్ ఆమెకు స్వేచ్చ లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే డేవిడ్ అడిల్ తల్లిదండ్రులు ధనవంతులు కావడం, వారు అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడం, ఆ సమయంలో డేవిడ్ ఆమెను కాపాడటం, ఆమెను వివాహం చేసుకోవడం గురించి తెలుసుకున్న లియాస్ ఆమెను డేవిడ్ ఆస్తి కోసం వివాహం చేసుకున్నట్టు అనిపిస్తుంది.
ఆ సమయంలో లూయస్ కు పీడకలలు వస్తున్నట్టు చెప్పడం, దానికి పరిష్కారంగా అడిల్ ఆమెకు ఓ జర్నల్ ఇవ్వడం జరుగుతుంది. అందులో అడిల్ అగ్ని ప్రమాదం తర్వాత రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో కొన్నాళ్ళు ఉండటం, అక్కడ ఆమెకు రాబ్ అనే స్నేహితుడు ఉండటం జరుగుతుంది. ఆ జర్నల్ రాబ్ ది. రాబ్ ఓ డ్రగ్ ఎడిక్ట్.
డేవిడ్ కు లూయస్ కు అడిల్ తెలుసన్న విషయం తెలియడం, ఆమెను ఉద్యోగంలో నుండి తీసి వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డేవిడ్ మీద ఉన్న కోపం వల్ల అడిల్ తో ఇంకా సన్నిహితంగా ఉంటుంది లూయస్. ఆమె భర్త ఆమె అనుకుంటున్నట్టు మంచి వాడు కాదని చెప్తుంది. అడిల్ తాను పిచ్చి దానినని చెప్పడానికి అతని దగ్గర ఫైల్ ఉందని చెప్తుంది అడిల్. ఆఫీస్ తాళాలు ఉండటం వల్ల ఓ రాత్రి ఆ ఫైల్ దొంగతనం చేసి దానిని అడిల్ కు ఇస్తుంది లూయస్.అడిల్ రాబ్ ను కూడా డేవిడ్ చంపి ఉంటాడని లూయస్ కు చెప్తుంది. అదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తూ ఉత్తరం రాస్తుంది లూయస్.
తర్వాత ఓ రాత్రి పడుకున్న లూయస్ ఆమె కొడుకు ఎంత లేపినా నిద్ర లేవదు.ఆ తర్వాత ఎప్పటికో నిద్ర లేచిన ఆమెకు అది ఎలా జరిగిందో అర్ధమవుతుంది. అడిల్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా ఎప్పుడు తన గురించి తెలుసుకుంటూనే ఉందని, ఆమె తన ఇంటి దగ్గరకు, ఆఫీసుకు వస్తూనే ఉందని, అన్ని తెలిసే ఆమె తన భర్త మీద తనకు విముఖత కలిగేలా చేసిందని స్పష్టమవుతుంది. అదే సమయంలో డేవిడ్ అంతకు ముందు ఓ కేఫె యజమాని అయిన వృద్ధురాలితో మాట్లాడితే ఆమెను కూడా అనుమానించి, బెదిరించి, భయపెట్టిందని ఆమెను కలిసి తెలుసుకుంటుంది లూయస్. దానిని బట్టి అడిల్ రాబ్ ను హత్య చేసి ఉంటుందని అనుకుంటుంది లూయస్. వెంటనే డేవిడ్ కు జరిగింది చెప్తుంది.
తర్వాత అడిల్ ను తలచుకోగానే ఆమె ఫోన్ చేస్తుంది. ఆమె రాబ్ ను చంపిందని తనకు తెలుసునని, ఆమె గురించి తనకు తెలుసునని, అమాయకుడైన డేవిడ్ ను కాపాడమని చెప్తుంది లూయస్.తర్వాత రాబ్ చావుకు, డేవిడ్ కు సంబంధం లేదని, తానే కారకురాలినని ఉత్తరం రాసి, అగ్ని ప్రమాదంలో ఆత్మ హత్య చేసుకుంటూ అదే విషయం తెలియజేస్తూ లూయస్ కు మెసేజ్ చేస్తుంది అడిల్. అడిల్ ను కాపాడటానికి వెళ్తుంది లూయస్.
ఇక్కడ మనకు అసలు జరిగింది అర్ధమవుతుంది. అడిల్ రాబ్ ను స్నేహితుడిగా భావిస్తుంది. పెళ్ళి అయ్యాక తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. డేవిడ్ కూడా అతన్ని స్నేహితుడిగా చూస్తాడు. అడిల్ అతనికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ నేర్పిస్తుంది. ఆ తర్వాత ఓ రోజు బాడీ స్వాపింగ్ (అంటే మన వాతావరణంలో పరకాయ ప్రవేశం)ఓ సారి ఇద్దరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో రాబ్ తన జీవితం కన్నా అడిల్ ఐశ్వర్యం నచ్చి, ఆమె రూపంతో ఆమె జీవితాన్ని గడపటానికి రాబ్ రూపంలో ఉన్న అడిల్ ను హత్య చేసి బావిలో వేస్తాడు. అప్పటి నుండి రాబ్ అడిల్ గా చలామణి అవుతున్నాడు.
ఇక చివరిలో అడిల్ ను కాపాడటానికి వచ్చిన లూయస్ లోకి బాడీ స్వాపింగ్ చేసుకుని లూయస్ గా మారిపోతాడు. లూయస్ గా మారిన అతను అడిల్ లో ఉన్న లూయస్ ను హత్య చేస్తాడు.
డేవిడ్ తో కొత్త లూయస్ తో వివాహం జరగడం, అలా బాబ్ ఇంకో కొత్త శరీరంలోకి కొత్త వ్యక్తిగా జీవితం ఆరంభించడంతో సిరీస్ ముగుస్తుంది.
సైకిక్ పవర్స్ మలుపుతో సాధారణ కథను అసాధారణంగా మలచడం నేటి కథల కొత్త ముగింపుల్లో ఎక్కువ మలుపులకు ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి కథను కాంప్లెక్సీటి లేకుండా చెప్పడం, రాయడం రెండు కష్టమే అయినా, ఎంతో ఆసక్తి కలిగించే సిరీస్ అనే చెప్పుకోవచ్చు.

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!