నాలుగు తరాల స్త్రీల కథ

 

 

                                                  నాలుగు తరాల స్త్రీల కథ



                                           


 మాలతీ చందూర్ గారి నవలల్లో ఆవిడకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చిన ‘హృదయనేత్రి’ కన్నా కూడా నాకు ఎంతగానో నచ్చిన నవల ‘శతాబ్ది సూరీడు.’ ఈ నవలలో నాలుగు తరాల స్త్రీల జీవితాలను, వారి ఆలోచనలు-మారే సమాజం-పరిస్థితులు వాటిని ప్రభావితం చేసిన తీరు, భౌతిక-మానసిక స్థాయిల్లో వారు అనుభవించిన సంఘర్షణ, వారిలో ఉన్న లోపాలు, గొప్ప లక్షణాలు, మార్పును ఏ మేరకు అంగీకరించగలిగారో, వాటిని ఏ అంశాలు ప్రభావితం చేసాయో, వారి మనోభావాలు ఎలా కాలంతో పాటు మారిపోతూ ఉన్నాయో, స్త్రీ పురుష సంబంధాలపై వారి ఆలోచనలు-ప్రవర్తనలు ఎలా ఉన్నాయో వంటి ఎన్నో అంశాలను ఈ నవలలో స్పష్టం చేశారు.

 ఇరవయ్యో శతాబ్దపు మొదటి దశకంలో సూరమ్మ కథతో నవల ఆరంభమవుతుంది. ఆమె తండ్రి అయిదేళ్ళకు పురుగు ముట్టి మరణించాడు.ఆ తర్వాత ఆమెకు ఎనిమిదో ఏట వివాహం చేశారు. ఆ పై సంవత్సరానికి ఆమె భర్త మరణిస్తాడు. తెల్ల బట్టలు, బొట్టు,పూలు దూరమవుతాయి ఆమెకు తొమ్మిదేళ్ళకే. తల్లి తండ్రి మీద ప్రేమతో అలా ఉందని ఆమెకు చెప్పేవారు తల్లికి వైధవ్యం ప్రాప్తించినప్పుడు. కానీ భర్త అంటే అర్ధం కూడా తెలియకుండా,అతను ఎలా ఉంటాడో జ్ఞప్తిలో కూడా లేకపోయినా అతని కోసం తనకు ఇష్టం లేకుండా అలా ఉండాల్సి రావడం సూరమ్మకు నచ్చలేదు. ఆమెకు ముగ్గురు అన్నలు. పెద్ద అన్న వకీలుగా చేస్తున్నాడు. అతను వేరు కాపురం పెట్టుకున్నాడు.ఇక రెండో అన్న చిన్నన్నయ్య ఆ ఇంట్లో తండ్రి బాధ్యత తీసుకున్నట్టు భావిస్తూ సాంప్రదాయప్రకారం అన్నీ ఉండాలని భావించేవాడు. ఇక మూడో అన్నయ్యను సూరమ్మ బుల్లన్నయ్య అని పిలిచేది. సూరమ్మను ప్రేమించే అన్నయ్య అతనే. ఇక ఆ ఇంట్లో ఆమె పనులు చేస్తూ, ఇంట్లో ఎవరికి నలతగా ఉన్నా, ఏ అశుభం జరిగినా ఆమె వల్లే అన్న అపఖ్యాతిని భరిస్తూ ఆమె మెదడు,మనసు పనిచేయకుండా కేవలం భయంతో జీవితం గడపసాగింది.ఆమె ఆ తర్వాత కొన్నాళ్ళకు రజస్వల అయినప్పుడు కూడా ఆమెనే నిందించారు. ఆమె అత్తామామలు ఆమెను తమ దగ్గర ఉంచుకుంటామని,ఆమె ఓ కొడుకును దత్తత తీసుకుంటే బావుంటుందని సూచించడం ఆ పైన సూరమ్మను అక్కడ దింపేయడం జరిగిపోయింది.

 ఆమె మావయ్య ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోవడం, అది భరించలేక సూరమ్మ మరలా పుట్టింటికే చేరుకోవడం,ఆమె మావయ్య గురించి చెప్పలేకపోవడం, తాను మాత్రం అక్కడకు మరలా వెళ్లనని చెప్పడంతో, ఆ మామయ్య ఆమెనే నిందించడం జరిగిపోయాక మొత్తానికి మరలా అక్కడే ఉండిపోయింది సూరమ్మ. సూరమ్మను అందరూ సూరీడు అని పిలిచేవారు. ఆ తర్వాత ఆమె తల్లి మరణించింది. అన్నలు అందరూ వేరు కాపురాలు పడ్డారు. ఇద్దరక్కలకు పెళ్లయిపోయి పిల్లలు కూడా. సూరమ్మకు తల్లి నగలు,కొంత ఆస్తి దక్కేలా చేసి వాటిని తన దగ్గరే ఉంచి వడ్డీలకు తిప్పుతూ, ఆమెకు ఓ ఇల్లు ఏర్పాటు చేయాలని బుల్లన్నయ్య తాపత్రయం. తల్లి మరణించాక సూరమ్మ జీవితం పూర్తిగా మారిపోయింది.ఆమె తోబుట్టువుల్లో ఎవరికి ఏ పని ఉన్నా సరే సూరమ్మను పిలిపించుకుని పనులు చేయించుకునేవారు. ఆమెను మంచి చేసుకుని ఆమె దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలనే ఆలోచనల్లో వారు ఉన్నా బుల్లన్నయ్య వల్ల ఆ ఆటలు సాగలేదు. సూరమ్మను పనికి తప్ప దేనికి గుర్తించేవారు కాదు.

 ఇప్పటి వరకు జరిగిన సూరమ్మ జీవితాన్ని గమనిస్తే ఆమె మేలు కోరెవాడు బుల్లన్నయ్య మాత్రమే. అప్పటికే కందుకూరి వీరేశలింగం గారు వితంతువు వివాహాలు చేయించడం గురించి ఆయనకు తెలుసు. కానీ చెల్లెలి విషయంలో అది ఆయన ఆలోచించలేకపోయారు.ఆమెకు ఏదో ఒక ఏర్పాటు ఉంటే చాలు అనుకున్నారు. ఇక్కడ కాలంతో పాటు సమకాలీనంగా వచ్చే మార్పును ఆ కాలంలో అంగీకరించే వారు అరుదు.అది కాలం ముందుకు వెళ్ళే కొద్ది సాధారణ విషయంగా మారుతుంది. కానీ స్త్రీ పవిత్రత,పాతివ్రత్యం వంటి అంశాలు మాత్రం నేటికీ సమకాలీన సాధారణత్వాన్ని సంతరించుకోవడం అరుదైన అంశమే. సూరమ్మ జీవితం చాకిరిగా మారిపోయింది.ఆమెకు ఇష్టాలు,ఆలోచనలు ఉంటాయని ఎవరూ అనుకోలేదు.ఆమెను ఎన్నడూ వాటి గురించి అడగలేదు. ఆమె ఊహల్లో అప్పుడు వీరేశలింగం గారు తనకు మరలా వివాహం చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉండేది.తనకు అందరి ఆడపిల్లల్లా ఎటువంటి సరదాలు తీరలేదనే అసంతృప్తి ఆమెకు ఉండిపోయింది.

  ఆ సమయంలో ఆమె చిన్నక్క కూతురు ప్రసవంలో ఓ కూతుర్ని కని కన్ను మూస్తుంది.ఆ పిల్లను ఎవరూ పెంచుకోవడానికి ముందుకు రాకపోవడంతో సూరమ్మ ఆ పాపను తన బిడ్డగా పెంచుకుంటుంది. ఆ పాపకు కమల అని  పేరు పెడుతుంది. బుల్లన్నయ్య ఆమెకో ఇల్లు కొనిపెడతాడు.కమలతో సహా ఆ ఇంట్లోకి మారిపోతుంది. అప్పటివరకూ అమాయకంగా అందరికి చాకిరీ చేస్తూ, నోరు లేకుండా ఉన్న సూరమ్మలో కమల వల్ల ఎంతో మార్పు వచ్చింది. ఆమెను ఎంతో అల్లరుముద్దుగా పెంచుకుంది.చదువు చెప్పించింది. సూరమ్మ మనస్తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. అప్పటి వరకు ఎవరు లేని ఒంటరితనంతో తనకంటూ ఓ జీవితం లేదని భావించిన సూరమ్మ ఎవరిని ఓ మాట అనేది కాదు, తన ఇష్టాయిష్టాలను పట్టించుకునేది కాదు. కానీ కమల వచ్చాక కమల కోసం ఆమె స్వార్ధపరురాలిగా మారింది.ఆమెకు అన్ని సరదాలు తీరేలా చేసేది. ఎంతో శ్రద్ధ తీసుకునేది. ఆమె ద్వారా తన బాల్యంలో ఉన్న అసంతృప్తిని పోగొట్టుకోవాలన్న స్వభావం ఆమెలో ఉండేది. ముద్దుగా చూసిన కమలా ఎంతో నెమ్మదిగా ఉండేది. థర్డ్ ఫారం చదువుతూ ఉంది. ఆ సమయంలో ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టింది సూరమ్మ.కానీ పుట్టగానే తల్లి మరణించడం, ఆమెది నష్ట జాతకం అని ఎవరూ ముందుకువచ్చేవారు కాదు. అదే సమయంలో ఆమె చిన్నక్క మరియు కమల అమ్మమ్మ  కమలను తన చిన్న కొడుకు సత్యానికి ఇచ్చి చేయమని అడుగుతుంది. సత్యం సరిగ్గా చదవడని, మందు తాగుడు లాంటివి ఉన్నాయని తెలిసిన సూరమ్మకు ఆ పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ కమలకు అమ్మమ్మగా ఆమెకు హక్కు ఉంది, కుటుంబంలోని తోబుట్టువులతో మంచిగా ఉండి ఈ పెళ్ళికి వారందరి మద్ధతు కూడగట్టింది. ఇష్టం లేకపోయినా కమలకు సత్యంతో వివాహం జరిగిపోయింది. సత్యం దృష్టిలో భార్య భర్త తన గొప్పతనం చాటుకునే ఓ వస్తువు మాత్రమే. సత్యం మొరటు ప్రవర్తన, చదువుకున్న కమలను నియంత్రించాలన్న భావన, వారిద్దరి మధ్య సఖ్యత లేని పరిస్థితులలో కమల గర్భవతి అయ్యింది.ఆమెకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఇక నిజం చెప్పినా పోయేది లేదనుకుని సత్యం తనకు అప్పటికే తనకు పెళ్లి అయిపోయిందని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్తాడు. ఈ విషయం తెలిసి కూడా అమ్మమ్మ తనకు అతనితో వివాహం చేసిందని అర్ధం అయిన కమల ఆమెనే ధైర్యంగా ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత భర్తతో తెగతెంపులు చేసుకుంటుంది. తనకు పుట్టిన కూతురికి పద్మావతి అని పేరు పెట్టుకుంటుంది. అప్పుడు చదువు పూర్తి చేసి టీచర్ గా ఉద్యోగం చేస్తుంది. అప్పటి వరకు నెమ్మదిగా ఉండే కమలా ఈ సంబంధంలో ఉన్న అపసవ్యత వల్ల పూర్తిగా మారిపోతుంది.సూరమ్మకు పెళ్లిళ్లు, వేడుకలు,బంధువులు ఇదే లోకం అయితే, కమలకు స్త్రీగా తన జీవితాన్ని తానే నిలబెట్టుకోవాలని, ఎవరి మీద ఆధారపడకూడదని అనే నిశ్చయం. ఆమె వేషబాషల్లో సాంప్రదాయంగానే ఉంది. భర్త లేకపోయినా స్త్రీయే అన్ని బాధ్యతలు నిర్వహించుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండాలని ఆమె తన జీవితం నుండి నేర్చుకుంది. ఉన్న డబ్బుతో గదులు వేయించి విద్యార్ధులకు అద్దెకు ఇచ్చింది. దాని ద్వారా ఆమెకు జీతం కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేది. ఆమె కూతురు పద్మావతి బాల్యం నుండే కాలంతో పాటు వస్తున్న అన్ని మార్పులకు ప్రతీకగా ఉండేది. బట్టలు కూడా మోడ్రన్ వి ధరించేది. సూరమ్మ చిన్నక్క భర్త మరణించడం ఆ తర్వాత పిల్లలు సరిగ్గా చూడకపోవడంతో సూరమ్మ దగ్గరే ఉండిపోతుంది.

 సూరమ్మ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వారి భార్యలు మరణించడం ఆమె చేతుల మీదే జరిగిపోయింది. వారు పిల్లల కోసం కూడబెట్టినా వారు మాత్రం వారిని పట్టించుకోకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇక బుల్లన్నయ్య భార్య కూడా మరణించింది.భార్య మరణించిన తర్వాత ఊరికి వెళ్ళిన బుల్లన్నయ్య ఓ పడచు పిల్లను రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె నగలతో సహా లేచిపోతుంది.ఆ అవమానంతో బుల్లన్నయ్య మంచాన పడి మరణిస్తాడు. ఆ కుటుంబానికి అండగా ఉండి ఎంతో మంచిగా ఉండే అన్నయ్య ఇలా చేయడం సూరమ్మకు,ఆమె చిన్నక్కకు నచ్చలేదు. కానీ ఈ విషయానికి వారు బుల్లన్నయ్యను కాకుండా ఆ రెండో భార్యను నిందించేవారు. పురుషుడి మనస్తత్వం, ఒకప్పుడు చెల్లెలికి పునర్వివాహం తప్పనుకున్న ఆయన వృద్దాప్యంలో మరలా వివాహం చేసుకోవడం అన్నది మనిషి స్వభావంలో తన సౌఖ్యం కోసం సాంప్రదాయాన్ని ఎలా పట్టించుకోకుండా ఉంటారో అన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది.

 మొదట కమలకు, ఆమె అమ్మమ్మకు పడేది కాదు. కానీ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. సత్యం మొదటి భార్య పిల్లలను పెంచడానికి అందుకు దోహదంగా ఉండే క్రైస్తవ మతంలోకి మారిపోయిందని, ఆ భార్యాభర్తలు విడిపోయారని, ఇప్పుడు సత్యం తిండి కూడా లేకుండా ఉన్నాడని కమలకు చెప్తుంది అమ్మమ్మ. భోజనం కోసం రావచ్చని, రెండు జతల బట్టలు కూడా కుట్టిస్తుంది కమల. కానీ మేనమామగా తిండి,బట్టా ఇస్తాను కానీ, భర్తగా మాత్రం తన మీద అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తే బాగుండదని హెచ్చరిస్తుంది. పద్మావతికి సత్యంతో స్నేహ సంబంధం ఉంటుంది. ఇంట్లో అన్ని పనులకు సహాయకారిగా ఉండేవాడు సత్యం. ఆ తర్వాత పద్మావతి డిగ్రీ దాటి వచ్చేసరికి ఆ పై చదువులకు ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటుంది. దానికి ఎలా సర్దాలో కమలకు అర్ధం కాదు. ఆ సమయంలో అమ్మమ్మ తాను బాల్యంలోనే పద్మావతి పుట్టినప్పుడే ఆమె మేజర్ అయ్యే సమయానికి డబ్బు వచ్చేలా ఇన్సూరెన్స్ చేశానని చెప్పి ఆ కాగితాలు ఇచ్చి పద్మావతి చదువుకు దోహదపడుతుంది. కమల జీవితం నాశనం చేశానన్న బాధ ఆమెలో స్త్రీలు బాగా చదువుకోవాలన్న భావనను ధృడ పడేలా చేసింది. అందుకే పద్మావతి బాగా చదువుకోవాలని ఎంతగానో కోరుకుంది ఆమె. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో మరణించే సమయంలో సత్యాన్ని చూసుకోమని చెప్పి కన్ను మూస్తుంది. సత్యం తల్లి ఆఖరి రోజుల్లో ఎంతో సేవ చేస్తాడు. ఒకప్పుడు తాను చూసిన సత్యానికి ఇప్పటి సత్యానికి పోలిక లేకపోవడం కమలను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది.

 పద్మావతి చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు ఆమెకు రామశేషుతో వివాహం జరుగుతుంది.పద్మావతికి ఇద్దరు పిల్లలు. సుధీర్, సౌజన్య. సత్యం ఆ పిల్లలను ఎంతో బాగా చూసుకుంటాడు.ఆ పిల్లల కోసం అతన్ని పద్మావతి దంపతులు తమ ఇంటికి తీసుకువెళ్తారు.అప్పటికే సూరమ్మ గారికి మతి సరిగ్గా ఉండటం లేదు. ఇంట్లోకి అపరిచితులు ఏదో ఒక పేరుతో వస్తువులు దొంగతనం చేస్తున్నారు. సత్యం తిరిగి వచ్చాక కమలకు ధైర్యంగా ఉంటుంది. సత్యం తమ ఇంట్లో ఉన్నప్పుడూ ఎందరో అతని ద్వారా కాలేజీలో సీట్లు పొందామని చెప్తూ, ఎన్నో సాయాల కోసం వచ్చామని కూతురు కమలకు చెప్తుంది.అతను ఇంట్లో వారికి బట్టలు కుట్టేవాడు. టైలర్ దగ్గర కూడా పని చేశానని చెప్తాడు. అసలు సత్యం గురించి తనకు ఏం తెలియదని అనుకుంటుంది కమల. కమలకు క్షమాపణ చెప్పాలని వచ్చిన అతన్ని కమల అపార్ధం చేసుకుని అవమానిస్తుంది. ఆ తర్వాత ఓ రాత్రి మాసివ్ హార్ట్ ఎటాక్ తో అతను మరణిస్తాడు.

 కమల అతను మరణించాక పూర్తిగా మారిపోతుంది. బొట్టు,గాజులు,పూలు తనకు తానే తీసి వేస్తుంది. తల్లి ప్రవర్తన గురించి పద్మావతికి అర్ధం కాదు. వారిద్దరూ కలిసి ఉన్నది కూడా లేదు. కానీ అమ్మ అలా ఎందుకు చేసిందో అర్ధం కాక భర్తకు చెప్తుంది. రామశేషు ద్వారా రచయిత్రి కమల మనస్తత్వాన్ని ఎంతో చక్కగా చెప్పించారు. “మీ అమ్మ ద్వేషాన్ని ప్రేమించింది. అందులోనే తన వ్యక్తిత్వం ఉందని అనుకుంది. మీ నాన్న తన ద్వేషాన్ని త్యజించాడు. అందుకే అంతా ప్రశాంతంగా చివరి రోజులు గడిపాడు”, అంటాడు భార్యతో రామశేషు.

 భర్త మరణించాక సర్వం కోల్పోయిన వ్యక్తిలా మారిపోయిన కమల లివర్ క్యాన్సర్ తో మరణిస్తుంది. ఇక ఆ సమయంలో సూరమ్మ గారి బాధ్యత పద్మావతి మీద పడుతుంది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా గడచిపోయిన వారి జీవితాల్లో సూరమ్మ గారి వల్ల అశాంతి మొదలవుతుంది. సూరమ్మ ఒక్కొక్కప్పుడు ఒక్కోలా ప్రవర్తించేది. ఆమె కోసం ఆరేళ్ళల్లో ఆరు ఇల్లులు మారాల్సి వచ్చింది.ఆమె వల్ల పద్మావతి అనారోగ్యం పాలవుతుంది. వైద్యుల సలహా మేరకు ఆమె ఓ నెల పాటు ఆశ్రమంలో చేర్పిస్తారు. ఈ లోపు పద్మావతి కుదురుకుంటుంది. తీసుకువద్దామని అనుకున్న రోజే అంతకు ముందు రోజే ఆమె మరణించిందని, ఆలస్యం అయిపోవడంతో దహన సంస్కారాలు అయిపోయానని చెప్పడంతో ఎంతో బాధ పడుతుంది పద్మావతి.అన్నేళ్లు చూసిన తను చివరి నెలలో దగ్గర ఉంచుకోలేనందుకు ఎంతో బాధ పడుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఈ తరం సౌజన్య చదువుల కోసం విదేశాలకు పయనం అవ్వడంతో నవల ముగుస్తుంది.

 వాస్తవానికి భార్యాభర్తల మధ్య ఒకరినొకరు, ఒకరి గురించి మరొకరు తెలుసుకునే రీతిలో బంధ స్వరూపం లేదని, ఒకరి నుండి ఇంకొకరు కోరుకునే అంచనాల నుండే ఈ బంధం వృద్ధి చెందుతుందని, అందుకే భార్యాభర్తల మధ్య కొంత గ్యాప్ ఎప్పటికీ ఉండిపోతుందని ఈ నవల చదువుతూనే అనిపిస్తుంది. సూరమ్మ, కమలా,పద్మావతి, సౌజన్య ఈ నాలుగు పాత్రల జీవితాలతో నాలుగు తరాలలో మారిన స్త్రీలను, వారి ఆలోచనల్లో వచ్చిన మార్పులను, వారు తమ గురించి తాము ఆలోచించుకోవడం మనిషిగా తమ హక్కు అనుకోవడం వరకు ఈ నవల పయనం సాగింది.ఈ నవలలో సుఖం కన్నా ఎవరిని ఎవరూ అర్ధం చేసుకోలేనితనం వల్ల వచ్చే దుఃఖమే ఎక్కువ కనబడుతుంది. ప్రతి స్త్రీ తప్పకుండా చదవాల్సిన నవల ఇది.

    *                  *                  

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష